Main Menu

Bathuku Seadyam – Okapittapaatakatha | బతుకు సేద్యం – ఒక పిట్టపాట కథ

Author: Sri Sannapu Reddy Venkata Rami Reddy was born on 16th February 1963 in Balarajupalle(v), Kadapa(dt). More…

  • Bathuku Seadyam: A book comprising 15 short stories of villages in their own native slang.
  • Published Date: September 2009.
  • Distributed by: Vishal Andhra Publications
  • పిట్టపాట | Audio Narration in Authors voice     
    MP3jPLAYLISTS.inline_0 = [ { name: "పిట్టపాట | Audio Narration in Authors voice", formats: ["mp3"], mp3: "aHR0cDovL2EzczMuZGVzaWJhbnR1LmNvbS90ZWx1Z3UtbGl0ZXJhdHVyZS9waXR0YXBhYXRhLm1wMw==", counterpart:"", artist: "", image: "", imgurl: "" } ]; MP3jPLAYERS[0] = { list: MP3jPLAYLISTS.inline_0, tr:0, type:'single', lstate:'', loop:false, play_txt:'     ', pause_txt:'     ', pp_title:'', autoplay:false, download:false, vol:75, height:'' };
Sri Sannapu Reddy Venkata Rami Reddy

Sri Sannapu Reddy Venkata Rami Reddy

బడి వదిలి ఇంటికొచ్చేసరికి పంచలో కసవూడుస్తూ ఏదో గొనుక్కొంటోంది ఇందిర.
దొడ్లోకి నడిచి కాళ్లు మొహం కడుక్కొని టవల్తో తడి తుడుచుకొంటూ వచ్చి మంచం మీద కూచున్నాను.
“యీ పిట్టల పోరు పల్లేకుండా వుండా. వీటె సరుకుదగల-సందూ విరామం లేకుండా కసువు రాల్చడమే…”
అంటూ పూడ్చిన కసువును చేటకెత్తి పేడగంప లో పోసింది.
“రోజూ ఉండే తంతే గాదూ! గొణిగితే తీరతాదా?” అన్నాను.
“నీకేం వంగి వూడ్చేవాల్లకు తెలస్చాది” అంటూ వంటింట్లోకెళ్లింది.తలెత్తి దూలం మీదుగా చూసాను. దంతెల సందుల్లోంచి రెండు చోట్ల కిచకిచలు వినిపించాయి.
ముక్కున గడ్డిపోచ కరుచుకొని నాకేసి తొంగి తొంగి చూస్తోంది ఓ పిచ్చుక.దంతెల సందు దూలం మీద గూటిలో కుదర్చబోయింది గాని పోచకాస్తా జారి నేలమీద రాలింది. దాని వెనకే పిట్ట కూడా
నేల పైకి వచ్చి మరోసారి నాకేసి అనుమానంగా చూసి ముక్కున కరచుకొని గాల్లోకి ఎగిరింది. మెల్లిగా లేచి మూలనున్న దోమతెర కర్ర అందుకున్నాను.
దూలం మీది గడ్డిపొచల కుదురును జాగ్రత్తగా కిందకు రాల్చసాగాను .
ఓ వైపు అనుమానంగానే వుంది-కుదురులో పిట్ట గుడ్లు వుంటాయేమోనని.మరోవైపు అనుభవం నొక్కి చెబుతోంది-గూడు పూర్తికాకుండా పిట్టలు గుడ్లు పెట్టవని . గడ్డిపోచలు , పొరకపుల్లలు,
చిన్న చిన్న పుడకలతో కుదురు ఏర్పాటు చేసుకోవాలి. దాని మధ్యన నారపీచు, దూది, దారం, మెత్తని ఈకలు వగైరాలను పేర్చి పొత్తిళ్ళు తయారు చేసుకోవాలి. అప్పుడు కదా గుడ్లు పెట్లేది. పొదిగేది.
పిల్లల్ని లేపేది.
గూడు పెరుగుతూ వుంటే కిటికీ వూచల మీద కూచుని దిగులుగా చుస్తున్నాయి పిచ్చుకలు.
రెండవ గూటికేసి కదులుతూ వుంటే కాఫీ గ్లాసుతో వచ్చింది ఇందిర.”వద్దొద్దు.. గూడుపీగ్గాకు..” అంది,
గ్లాసందుకొంటూ ఆమెకేసి వింతగా చూశాను.
“గుడ్లు పెట్టుకొనుంటాయేమో! కిందరాలితే పగిలిపోతాయి. పాపం కొట్టుకొంటది” చెప్పింది.
ఆమె మాటలు పట్టించుకోలేదు.
కాఫీ తాగింతర్వాత దంతెలసందు చెత్తనంతా తీసిపారేశాను.
రెండవ గూటిలో కూడా గుడ్లు లేనందుకు ఏదో గండం గడిచినట్లుగా “అమ్మయ్య” అంటూ గుండెలమీద చేతులు వెసుకొంది ఇందిర.
కసవులో అక్కడక్కడా దూదిపింజల్లాంటి పిచ్చుక ఈకలు కనిపించాయి. గుడ్ల కోసం మెత్తటి పొత్తిళ్ళను తయారు చేసి కొంటోందన్న మాట. అంతే-ఇవాలో రేపో గుడ్లు పెట్టొచ్చు.
నెల రోజుల్నించి మొదలైంది.ఈ గొడవ సంక్రాంతి పండక్కి అటు ఇటుగా అదనుకొస్తాయి. ఇళ్ళంతా కసవు రాల్చి రోత చేస్తాయి. పిట్టల్ని ఇంట్లోకి రానీకుండా చేయాలనీ ఎంత ప్రయత్నించినా సాద్యం
కాలేదు. గూఢు రాల్చితేనన్నా ఇల్లిఢుస్తాయని ఉపాయమెత్తితే అవి పూర్తిగా మొండికేసాయి. ఎన్నిసార్లు గూడు రాల్చితే అన్నిసార్లూ పునర్నిర్మించుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి.
మొన్న మొన్నటి దాకా అద్దం ముందు గోలజేస్తుండేవి. ఫ్రేం మీద వాలి అద్దంలోకి తొంగిచూస్తు తమ ప్రతిబింబాల్ని ప్రత్యర్థిగా భావించి అలసిపోయేదాకా ముక్కుతో పొడుస్తూ కోట్లాడేవి. అలుపు
తీర్చుకొని మళ్ళీ గొడవ కొనసాగించేవి. అక్కడే రెట్ట వేయటం, కాళ్ళతో తొక్కటం, అద్దం నిండా పాద ముద్రల్ని అంటించడం.. అద్దం మురికి మురికిగా, రోతరోతగా మారటం……
తమ ప్రతిబింబాలతో పిచ్చుకలు చేసే యుద్దాన్ని సెల్ కెమెరాతో చిత్రీకరించి మిత్రులకు చూపిస్తే ఎంత సంతోషించేవారని! సమస్య నాదిగాకుంటే నేను కూడా ఆహ్లాదంగా స్పందించేవాణ్ణే కదా!
ముప్పయేళ్ళ క్రితం మా నాన్న నిలేసిన దంతెల మిద్దెయిది. అప్పుడు వూరంతటికీ కలిపి ఐదారు పాతమిద్దెలు తప్ప మిగిలినవన్నీ బోదకొట్టాలే. రెండు తరాల కిందటి మట్టిమిద్దె వూడబెరికి
కొత్తమిద్దె కట్టించటం ఆ నాటికి మా నాన్న సాహసం చేసినట్లే. ఇరవై వేల లోపు ఖర్చుతో నిర్మించిన యీ మిద్దెకు ఇప్పుడు మరమ్మత్తులు చేయీంచాలన్నా లక్ష రూపాయలకు తగ్గేట్లు లేదు.
ప్రభుత్వ గృహాల పుణ్యమా అని ఊరంతా స్లాబు మిద్దెలయ్యాయి. మాలాంటి నాలుగైదు పాత దంతెల మిద్దెలు తప్ప ఒక్క బోదకొట్టం కూడా పిచ్చుకలకు మిగల్లేదు.కొట్టాలున్నప్పుడు వాటికి నివాస
సమస్య ఉండేది కాదు. మిద్దె దంతెల సందుల్లోకి కాపురం వచ్చే ఖర్మ లేదు. వచ్చినా ఒక్కసారి గూడు పెరికితే తిరిగి ఆ తావుకేసి చూసేవి కావు.
సాయంత్రంగా పొద్దు తిరుగడు చేలకేసి వెళ్ళాను.
కనుచూపు మేర సాగు చేసిన పొద్దు తిరుగుడు పంట బంగారు రంగు పూతలతో కన్నుల పండువుగా ఉంది. సాయంత్రపు ఎండలో మిలమిల మెరిసిపోతూ నేలంతా బంగారు దుప్పటి
పరచినట్లుంది. ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు ఆడుతున్నాయి.
మా పొలంలో పైరు చూడగానే నాకు కడుపు నిండినట్లయింది. కోరు రైతు తిరిపేలు చేలో మడవ కడుతున్నాడు.
నన్ను చూడగానే లేచి నిలబడ్డాడు.
“మొన్న నాలుగు చినుకులు రాలి, నిన్నా యియ్యాల మోడాలాడి పైరును దెబ్బగొట్టెగద మామా !” అన్నాడు.
నాకర్థం కాలేదు.
“ఇట్నె మోడాలాడ్తాంటే పంట సేతికొచ్చేది నమ్మకంలే..”
నొసలు ముడేసి అతనికేసి చూశాను.
పైరులో కళ తగ్గలేదు. కంకి రంగులో కాంతి మాసిపోలేదు. పొద్దు తిరుగుడు పంటకి సహజంగా వచ్చే వైరస్ తెగులు ఛాయలు కనిపించలేదు. కాండం నుంచి పువ్వుదాకా నల్లగా పేడలాగా
మారలేదు.
మరి.. ప్రమాదం ఎక్కన్నించి?
చూపుడువేలు చాపి రెండు కణుపుల కొలత చూపిస్తూ “ఇంత పొడవునా కంకికి ఒకటో రెండో పురుగులుండాయి. ఇట్టనే మోడాలాడ్తాంటే నాలుగైదు అయితాయి. గింజలన్నీ తిని కంకిని
గగ్గిజేస్తాయి.. సూజ్జూరా .. పురుగు పారాడినంత దూరం గింజవుందేమో!” అంటూ ఓ పువ్వును నా కేసి తిప్పి చూపించాడు.
జాగ్రత్తగా గమనిస్తే.. నిజమే! పురుగు నడిచిన దారి కనిపిస్తోంది. సుంకు కింద పాలగింజల మధ్యగా దాగి వున్న పురుగును కూడా పీకి చూపించాడు తిరిపేలు.
ఒళ్ళు జలదరించింది నాకు.
“ఎకరో అర్ధెకరో అయ్యింటే గోరింకలో, పిట్టలో ఏరి తినేటివి. ఇన్నిన్ని ఎకరాలు యానుంచొస్చాయి పిట్టలు?.. అస్సలు పిట్టలేడుండాయి?-తిండి గింజల పంటలు పండిస్తాంటే గాదూ.. “మడవ
వేసేందుకు వంగాడు అతను.
జరగబోతున్న నష్టం పూర్తిగా అర్థమైంది నాకు. మనస్సంతా విచారం అలముకొంది.
పైరు వాటం చూసి ఎకరాకు పది క్వింటాళ్ళ గింజలవుతాయని ఆశపడ్డాము. కోరు రైతుకు సగం పోయినా నాకు సగం మిగులుతాయి గదా!ఐదెకరాలకు ఇరవైదు క్వింటాళ్ళవుతాయి గదా! ఏ
పదేళ్ళకో ఒకసారి వచ్చే లాటరీలాంటి ఫలితాన్ని ఇప్పుడు కళ్ళ జూడబోతున్నామని ఆనందపడ్డాము.
వర్షాలు బాగా కురిశాయి.పైరు బాగుంది. తెగులు ఇంత మోసం చేస్తుందనుకోలెదు. ఇంత పెట్టుబడి పెట్టి ఇంతంతగా సేవలు చేయటం వ్యర్థమనిపించింది.నేనైతే మడవ కూడా కట్టే వాన్ని కాదు.
పంటకాలమంతా చేసిన కష్టం తెగులు రూపంలో ఆవిరవుతోందని స్పష్టంగా తెలుస్తోన్నా తిరిపేలు మాత్రం తనపని మానలేదు.
“యీ సారన్నా పదిరూపాయలు కండ్ల జూద్దామనుకొంటి” నిట్టూర్చాను.
“మనమనుకొంటే సరిపోతదా సోమీ! ప్రాప్తముండొద్దూ?” చెప్పాడు తిరిపేలు.
వాస్తవానికి నా పెట్టుబడి కంటే అతని శ్రమశక్తే ఎక్కువ. అయినా అతను బాధపడటం లేదు.. ఎందుకని?
బహుశా.. అతను నాలా ఎక్కువ ఫలితాన్ని వూహించి ఆశలు పెంచుకోలేదు కాబోలు . గరిష్ట ఫలితాన్ని లెక్కగట్టి దాన్నంతా నష్టంగా పరిగణించకుండా కేవలం పెట్టుబడిని మాత్రమే నష్టంగా
భావిస్తున్నాడేమో
“అదా ఆ పొదమీద దొండ తీగెకు ఎర్రగా మాగిన దొండపండ్లుండాయి సూడు.. అందకుంటే నేనొచ్చి కోసిస్చా..”
అతనికేసి అదోరకంగా చూస్తూ గట్టు వెంట ముందుకు సాగాను.
రెండు చేలకవతల చెరువులోంచి ఏవో గలగలలు, బురద గుంటల్లో చేపల కోసం దిగారు కాబోలు. దొరికిన చేపంతా కడుపు నిండా గుడ్డుతో రుచికరంగా వుంటుంది.
అయినా పైరంతా పురుగుల పాలవుతుంటే వీల్లకెవరికీ బాధ లేదా? దొండ పండ్ల మాధుర్యము, చేపల కూర కమ్మదనమూ వీళ్ళకెట్లా రుచొస్తోంది?
వెనుదిరిగి ఇంటిదారి పట్టేసరికి చీకటి పడింది.
ఎర్రగా మాగిన టొమాటోలను గంపనిండా కోసుకొని ఇంటికి వెళ్తూ వుంది ఒక ఆడమనిషి. కళ్ళంలో ఎండబోసిన పండు మిరపల్ని కుప్ప చేసి పట్టలు కప్పుతున్నాడు ఓ రైతు.
మా కళ్ళంలో చింతచెట్టును చుడగానే అమ్మ గుర్తు వచ్చింది పండు కాయల్ని రాల్పి అక్క గారికి ఇద్దరికీ చెరిన్నీ పంపమని పోడు చేస్తోంది.
కాయలు సంచికేసుకొని తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేందుకు ఎవరున్నారని? వాళ్ళొచ్చి తీసుకెళ్ళచ్చు కదా!
ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మ అంది వొణికే కంఠంతో “అక్క కాడికి పోయి రాగూడదు?” అని.
“పోతాలే..” చెప్పాను.
“ఎప్పుడు? నీకు సుట్టపక్కాలు కాబడ్తండారా! మా పానముండేదాకన్నా సుట్టాలను ఇంటికాడికి రానీ…”
“నేనొద్దాంటాండానా?”
“నువ్వొద్దనవు. వాళ్ళేం నీ యింటికి తిండి కొస్చారా! వాళ్ళు నాలుగు సార్లు వచ్చి నువ్వు ఒక్కసారన్నా పొతే గాదూ”
సమాధానం చెప్పకుండా లోపలికి నడిచాను.
కొంతసేపయింతర్వాత బయటకు వచ్చి మంచం మీద కూచున్నాను
“మొన్నెప్పుడో పెద్దాయమ్మి కొడుకు ఎదురయితే పలకరించలేదంటనే?” అరుగు మీంచి అదిగింది అమ్మ.
తలెత్తి చూశాను.
“పెద్దక్క కొడుకా?” అంటూ స్మృతుల్ని తవ్వుకోబోయే లొపలే గుర్తొచ్చింది. నేను మా సార్తో మాట్లాడతా వున్నె. వాడు పిల్చిండు గానీ మాటల సందట్లో కుదర్లే.. మల్ల పలకరించుదామనుకుంటే
అప్పుడే వెళ్ళిపొయిండు” చెప్పాను.
“అంత బలుపు పనికి రాదబ్బీ” అంది అమ్మ. “సావుకారినని మిడిసిపడగాకు.సుట్టపక్కాలను ఇప్పుడు పోగొట్టుకొంటే కావల్సినప్పుడు దొరుకుతారా?” చెపుతూ అరుగు దిగి ఇంట్లోకి నడిచింది.
నాకు నవ్వొచ్చింది- ఆమె కోపమూ, విసురూ చూసి.
వాళ్ళ దృష్టిలో నెలకు పదివేల రూపాయలు జీతం తీసుకొనే తను షావుకారే. కాదనేందుకు లేదు.
కానీ- తనకెప్పుడూ ఆ భావన లేదు.
ఏదేమైనా అమ్మ అన్నట్లు నాన్న గతించిన తర్వాత చుట్టాల రాకడ బాగా తగ్గింది. బహుశా తను వాళ్ళ ఇళ్ళకు అస్సలు పోకపోవటం కూడా ఒక కారణం కావచ్చు.
వెళ్ళేందుకు సమయం లేక కాదుగాని- సంక్రాంతికనీ, దసరాకనీ వేసవికాలమనీ కావలసినన్ని సెలవులున్నాయి.ఎందుకో వెళ్ళబుద్ధి కావటం లేదు. ఏ పనీలేకుండా వూరకే వెళ్ళిరావటం
నాకిష్టంగా లేదు. ఐనా ఏడాదికి ఒకటి రెండు సార్లు అక్కగారు వస్తుంటారు. అమ్మను చూసిపోయే నెపంతో కాయలు పండ్లు తీసుకొని.
మళ్ళీ రోజు చాలా మందితో చర్చించాను పురుగుల దాడి గురించి. కనిపించిన వాడికల్లా పంచిపెట్టాను మనస్సులో పెరిగే ఆవేదన గురించి, ఒక్కో పురుగును పట్టి ఏరివేయటం తప్ప మార్గాంతరం
లేదట. అది సాధ్యమయ్యే పని కాదు.
అత్యవసరంగా సర్వశిక్షా అభియాన్ వారి రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలకు కడప వెళ్ళవలసి వచ్చింది. మండల విద్యాశాఖాధికారి నేరుగా స్కూల్ వద్దకే వచ్చి ప్రాధేయపడటంతో తప్పలేదు.
రీసోర్స్ పర్సన్ గా వెళ్ళి అక్కడ శిక్షణ పొందటం. రేపు మండల పరిధిలో ఉపాధ్యాయులందరికీ అందివ్వటం.
రెండో రొజు రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చాను.
స్నానం చేసి బైటకొచ్చి నిల్చుంటే చావిడి వద్ద మర్రిచెట్టు నిండా మిణుగురు పురుగుల విన్యాసం చూపుల్ని లాక్కుంది. ఆకు ఆకూ మిణుగురు పురుగుల పుణ్యమా అని వెలిగిపోతోంది.
పొద్దు తిరుగుడు కంకుల మీది పురుగులు గుర్తొచ్చి ఇంట్లోకెళ్ళి ఇందిరను ప్రశ్నించాను.
రెండుకు నాలుగయ్యాయిట పురుగులు. ఇప్పటికే సగం పంట దిగుబడి పోయినట్లేనట. మరో రెండ్రోజులు పురుగు వదలకుంటే పాతిక పంట కూడా చేతికి రాదట. బాధగా చెప్పింది ఆమె.
ఒక యేడాది వానలు రాక బోరు బావుల్లో నీళ్ళు అందవు. ఇంకో యేడాది వానలు ఎక్కువై మెట్టపైర్లు నాశనమవుతాయి. అన్నీ బావున్న యేడు ఇదో యిట్లా ఏదొక అకాల మృత్యువు..
వ్యవసాయం జూదమైంది.
ఈ పొలం లేకుండా తను ఉపాధ్యాయునిగానే బతికి వుంటే అందరూ అనుకొంటున్నట్లు తన వద్ద డబ్బు దండిగానే వుండేది. ఎందుకంటే తను పొదుపరి గా జీవిస్తాడు కాబట్టి. బోరుబావి
తవ్వించడానికీ, కరెంటు కనెక్షన్ కూ, భూమి చదును చేసేందుకూ, కంపచెట్లు వెయ్యించేందుకూ దాదాపు రెండు లక్షల దాకా ఖర్చయింది. చీటీలు పాడో, లోను తీసికొనో పెట్టుబడి పెట్టాను.యేటా పైరు
కోసం మళ్ళీ పెట్టుబడులు.. దిగుబడి చూద్దామా అంటే వడ్డీలు కూడా రావటం లేదు. కోరు చేసే వాళ్ళకి చేతి కష్టానికి కూలి దొరుకుతుందేమో గాని నాకు పైరు పెట్టుబడులు రావటం గగనంగా వుంది.
మా అమ్మా నాన్నల హయాంలో కుటుంబాన్నంతటినీ పొలమే సాకేది. ఇప్పుడు పొలాన్ని కాస్తా నెలజీతంతో నేనే సాకుతున్నాను.
తెల్లారు జాము ఐదుగంటలకే మెలకువ వచ్చింది. ఇంట్లోకి జొరబడిన చలి దుప్పట్లోకి దూరేందుకు వెనుదీయలేదు. బైటకెళ్ళేసరికివీధిలో చలిమంట..చుట్టూ దుప్పట్ల ముసుగుతో జనం.
మంట వేడికోసం పానం పీకింది. వాళ్ళతో కలిసి చలికాపుకొనే దాకా శరీరం మాట వినలేదు.
ఆదివారం కాబట్టి ఇంటిదగ్గరే వున్నాను.
నేను లేని యీ రెండ్రోజుల్లో దూలం మీది దంతెల సందుల్లో నాలుగుచోట్ల పిట్టగూళ్ళు పూర్తవుతున్నాయి. నారపీచులు, గరికపోచలు దూలం మీంచి కిందకు వేలాడుతూ అసహ్యంగా
కనిపిస్తున్నాయి. కొత్తవాళ్ళెవరైనా వస్తే ఆ దృశ్యాన్ని చూసి ‘మొరటుకొంప’ అనుకోరు గదా అనిపించింది. పిచ్చుకల మీద కోపమొచ్చింది. దోమతెర కర్ర అందుకున్నాను.
అప్పటికే దంతెల సందుల్లోని పిచ్చుకలు ప్రమాదాన్ని కనిపెట్టాయి కాబోలు ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లుగా అటు ఇటు గాభరాగా తిరగసాగాయి.
బహుశా గుడ్లు పెట్టుకొన్నాయేమో!
మనస్సులో సంకోచం
కళ్ళకెదురుగా దూలం మీంచి అసహ్యంగా వేలాడుతూ కనిపించే చెత్తా చెదారపు దృశ్యం మరోవైపు విచక్షణను చంపేస్తోంది.
మనస్సు గట్టి జేసుకొని ఓ గూటికేసి కర్ర ఎత్తాను.
“అబ్బీ! ఒరే నాయినా! ఆసన్నపానాలు నేకేం అపకారం జేసె? యాన్నోపైనపైన తిరిగేటివి.. నీ కాల్లకడ్డమొచ్చెనా? సేతలకడ్డమొచ్చెనా?… గూడు రాలగొట్టగాకు నాయినా!…గుడ్లు
పెట్టుకోనుంటాయిరా!” ప్రాధేయపడింది అమ్మ.
ఆమె వేడికోలు, పిచ్చుకల ఏడుపుల మధ్య, తన్నుకొచ్చే అసహనాన్ని అదిమిపట్టలేక.. గూటిని మెల్లిగా సగం లాగేసరికి.. సన్నని రబ్బరు బంతిలా జారి నేలమీద బడి… ‘టప్’మని పగిలింది
బూడిద రంగులోని ఓ పిట్ట గుడ్డు.
అబ్బిళ్ళు కొరకటంలో భావోద్వేగాల్ని అణచుకొంటూ దానికేసి చూశాను. గుండెల్లోంచి ఎగదన్నుకొచ్చే జలదరింపుల్ని అదిమిపడుతూ పైకెగజూసి గూటిని నెమ్మదిగా లోనికి జరిపాను.
“పిట్టలు రాకుండా, సుట్టాలు అడుగు బెట్టకుండా ఇండ్లంతా ఒక్కనివే దొల్లుదామనుకొన్నావా? వాటి ఉసురు పోసుకుంటాండవే! ఇంగో పాపం మూటెగట్టుకొందామనేనా…?” అమ్మ కోపంగా
గొనుగుతోంది.
ఈలోపు ఇందిర వచ్చి చూసి “పాపం గాదూ!” అంటూ నా ఛేతిలోని కర్రను లాక్కుంది.
నాక్కూడా మనసులో ఏదో అపరాధ భావన రగులుతూ వుంది గాని, దాన్ని తొక్కిపట్టేందుకు ఏవేవో కారణాల్ని వెదుక్కొంటున్నాను.
పదిగంటల ప్రాంతంలో చేలకేసి వెళ్ళాను.
పురుగు పారాడిన జాడలతో తొర్రిపళ్ళ నోటిలా తయారైన పొద్దు తిరిగుడు పూలు అవే గాయాలతో కంకులుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మాచేని ఇవతల గట్టున్నే ఎదురయ్యాడు కోరు రైతు తిరిపేలు.
“చేలోకి పోవద్దులే మామా!” అన్నాడు.
ప్రశ్నార్థకంగా చూశాను.
“చేనంతా పిట్టలు వాలుండాయి..” అతని మొహం నిండా ఏదో ఆనందం.
కంకుల్లో మిగిలిన పాలగింజల్ని కూడా పొడిచి తినేస్తాయి గదా పిట్టలు! వాటిని అదిలించి తరమకుండా ఇక్కడెందుకున్నట్లు?
“కొండ పిట్టలు మామా! మందలు మందలు వచ్చి వాలినాయి. ‘పెడిసె’ అంటారు సూడు అవి…”
నేనెప్పుడూ చూడలేదు వాటిని.
“మారాజులు.. దేవతలట్లా వచ్చి పడినాయి. పురుగులన్నిట్ని యేరక తింటండాయి…
మనసేనంతా రెండుగంటలు పట్టదు… సూడు మామా! దేవుడు కన్ను దెర్సాలనగాని మనసుల్తో ఏమయితది? ఎన్ని మందులు చల్లితే మాత్రం ఒక్క పురుగును సంపుకుంటాం! ఇంగొక్క గంట
ఓపిక పట్టు.. సేనంతా ఒక్క పురుగు మిగుల్తే సూడు!” ఆనంద పరవశుడవుతున్నాడు అతను.
నాకయితే ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్లయింది.
“ఎప్పుడో వచ్చే సుట్టాలు మామా ఈ పిట్టలు. మేలుచేసే సుట్టాలు-మనల్నుచూసి పోదామని ఎక్కన్నో కొండల్లోంచి సుట్టపు సూపుగా వస్చాయి. మనం బాధల్లో వుంటే తీర్చిపోతాయి.” గట్టుమీద
కూచుని పరవశించిపోతూ చెపుతున్నాడు తిరిపేలు.
ఆహారాన్ని వెదుక్కొంటూ వచ్చిన యీ కొండపిట్టలు నిజంగా తమకు చుట్టాలే!
వెంటనే నా కళ్ళముందు వూరపిచ్చుకలు కదలాడాయి, మరెక్కడా తావు దొరక్క దంతెల సందుల్లో గుడ్లు పెట్టేందుకు అవి పడే అగచాట్లు కళ్ళముందు మెదిలాయి. పరిశుభ్రత పేరిట, నాగరికత
పేరిట వాటిని తరిమేందుకు తను అనుసరించిన పద్దతుల్లోని కారుణ్య రాహిత్యం ఇప్పుడు ఎదురుగా నిలబడి సిగ్గు కలిగిస్తోంది.
మిద్దె పంచలోని దంతెల కాండ్లకు జొన్న, కొర్ర, సజ్జ కంకుల్ని వేలాడేసి పక్షుల్ని ఇంట్లోకి ఆహ్వానించి మరీ ఆహారమందించే నాన్నతరం నుంచి పక్షులు ఇళ్ళల్లో గూడు కట్టుకోవటంలో పొరబాటున
రాలిపడే పుల్లా పుడకలు అశుభ్రతకు, అనాగరికతకు ఆనవాళ్ళుగా భావించే యీ తరానికి ప్రతినిధిగా ఉన్నందుకు లజ్జగా ఉంది.
కేవలం అవసరపడితేనే మనుషుల్ని కలవాలుకోవటంలో ఏం కోల్పోతున్నామో అర్థమవుతూ వుంది. చుట్టాలు బంధువుల్ని హృదయ సంబంధమైన వ్యాపారంగా అమ్మానాన్నలు భావించటంలో
వాళ్ళు పొందుతున్నదేదో తెలిసివస్తూ వుంది.
పిట్టల్ని గురించిన విషయం బడిలో అదనంగా చేర్చ వలసిన పాఠంగా అవగాహనకు వస్తూ వుంది.
ఇంటికి వెళ్ళేదాకా కంటిముందు ఏదో కలలాంటి దృశ్యం. మిద్దె చుంచులకూ, చెట్టుకొమ్మలకూ పనికిరాని డబ్బాలు, కుండల్లాంటివి వేలాడదీసి వున్నట్లూ, అందులో గూళ్ళు నిర్మించుకొని పిట్టలు
కిలకిలలాడుతున్నట్లు పిట్టలూ పిల్లలూ ఒకే యీనిఫాం తొడుక్కొని ఏవో పాటలు పాడుకొంటూ బడిలోకి అడుగులేస్తోన్నట్లూ… మా చుట్టాలూ, బంధువులూ, హితులూ, సన్నిహితులూ దూరంగా
నిల్చుని ఆనందంగా చప్పట్లు చరుస్తున్నట్లూ..

, ,

One Response to Bathuku Seadyam – Okapittapaatakatha | బతుకు సేద్యం – ఒక పిట్టపాట కథ

  1. Rajender reddy September 25, 2015 at 1:53 am #

    nee kathalu Enni

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.