Main Menu

Gollapudi columns ~ America “Karma” Sidhantham(అమెరికా “కర్మ” సిద్ధాంతం)

Topic: America “Karma” Sidhantham(అమెరికా “కర్మ” సిద్ధాంతం)

Language: Telugu (తెలుగు)

Published on: July 18, 2011

America Karma Sidhantham(అమెరికా కర్మ సిద్ధాంతం)     

అమెరికాలో అన్నిటికన్నా ఆకర్షించే విషయం- వ్యాపారం. సర్వకాలసర్వావస్థలలోనూ వీటిని అమ్మవచ్చా, వీటికి బేరం ఉంటుందా, యిలాకూడా వ్యాపారం చెయ్యవచ్చా అనిపించేరీతిగా నిత్యనూతనంగా- ఎప్పుడూ కొత్త కొత్త తాయిలాలను, వరాలను కురిపిస్తూ- ఎన్నటికీ అలసిపోని, ఎప్పుడూ సాగే కర్మకాండ వ్యాపారం.

ప్రతీ వస్తువూ ఒకే చోటు నుంచి కొనుక్కోడానికి కొన్ని బిగింపులుంటాయి. మీకొక సభ్యత్వం కార్డు యిస్తారు. ప్రతీసారీ మా దగ్గరే కొనుగోలు చేస్తున్నారా? అయితే మీకు కొన్ని రాయిఅతీలు. కొన్ని టోకు వ్యాపారాల “మాల్’లు ఉంటాయి. అక్కడా కార్డు పద్ధతి. పది దువ్వెనలు, పన్నెండు టూత్ పేస్టులు, 20 బిస్కెట్ పాకెట్లు, 30 మంచినీళ్ల సీసాలు, 20 పెన్నులు, 15 గోళ్లూడదీసే కత్తెరలు- మీయిష్టం. ఆ మాల్ లోనే ఉచితంగా ఏదో పానీయాన్ని యిస్తారు. ఇది అమ్మే సరుకు వరకు. సరుకుల వ్యాపారులు యిచ్చే వరాలు బోలెడు. అలాంటి సౌకర్యాలు, అంత సరసంగా యివ్వవచ్చునని మనం ఊహించలేం.

ప్రతీ వస్తువు ధరా చూడముచ్చటగా ఉంటుంది వినముచ్చటగానూ ఉంటుంది. వ్యాపారులకి 99 యిష్టమయిన సంఖ్య. 5 డాలర్లు అనరు. 4.99 డాలర్లు అంటారు. 500 డాలర్లు చెప్పరు. 499 డాలర్లు చెప్తారు. అలాగే చిన్న చిన్న వస్తువులు. ఒక్కొక్కటి డాలరు 99 సెంట్లు. మూడు డాలర్ల 99 సెంట్లు.

“ఇంకా ఎంత దూరం బాబూ?” అని అలసిపోతూ నడిచేవాడికి

“అదిగో- ఆ సందు మలుపే-” అంటే ఓదార్పుగా ఉంటుంది.

“ఇంకా రెండున్నర మైళ్లు” అంటే అలసటగా ఉంటుంది.

399 డాలర్లు చేతిలో అరటిపండు. నాలుగువందలు? అమ్మో! ఎక్కువ!

ఇక టీవీల్లో, పేపర్లలో చాలక యింటికి పంపే వందల ఉత్తరాల బంగీలలో ఊరింపులే ఊరింపులు.

“మీ పన్ను నొప్పిగా ఉందా? చూసే సౌకర్యం ఫ్రీ. మీ యింటికే వచ్చి చూసే విసులుబాటు ఉంది. రెండు పళ్లు పీకితే మూడో పన్ను ఫ్రీ.మీరు నాలుగు రకాలుగా నాలుగు

పీకించుకున్నారా? మీకు నాలుగు కూపన్లు వస్తాయి. వాటి మీద రేపు

మీ ఆవిడ పన్ను పీకినప్పుడు (మీ పళ్లు ఎలాగూ అయిపోయాయి కనుక) 25 శాతం రాయితీ వుంటుంది. అయితే ఈ సౌకర్యం మూడువారాల వరకే! మరి తర్వాత? అవిడ పళ్లూ అప్పటికి ఊడిపోవచ్చు. ఊడకపోతే కొత్త సౌకర్యం వస్తుంది. ఎదురుచూడండి. అమ్మే సరుకు ఖరీదులు- 3.99, 12.99 అంటారుకదా? ఆ సరుకుల మీద యిచ్చే రాయితీలు మాత్రం శాతాలలో ఉంటాయి. వాటిని పెద్ద పెద్ద అక్షరాలలో వేస్తారు. 40 శాతం తగ్గింపు! గమనించండి-39.99 శాతం కాదు. కొనేవాడికి అంకె హాయిగా కనిపించాలి. దక్కే విసులుబాటు డాబుగా ఉండాలి.

రకరకాల వస్తువుల అమ్మకం గురించి పెద్ద బొత్తి పోస్టులో వస్తుంది. ఆ బొత్తి విప్పి చదివినందుకే మీకు 3 కూపన్లు దక్కుతాయి. వాటివల్ల ఏమిటి లాభం? ఇలాంటివి 16 సంపాదిస్తే- మీకు ఒక పూల తొట్టి ఫ్రీ. ఆదిన్నీ రెండుకొన్నాక.

వర్షానికి మీ యిల్లు కారుతోందా? చూడడం ఫ్రీ. మీకు చూపడం ఫ్రీ. అలా పాడయిన వస్తువులకి ఇన్సూరెన్సు ఎలా రాబట్టాలో రాసే పద్ధతి ఫ్రీ. 1200 డాలర్లదాకా రాయితీలు. అయితే ఆగస్టు మొదటివారందాకానే ఈ సౌకర్యం. ఎందుకని? తొందరపెడితే విచక్షణకి అవకాశం ఉండదు. తర్వాత ఏమౌతుంది? వర్షాలు అగిపోవచ్చు. మీ యిల్లు కూలిపోవచ్చు. ఉంటే మళ్లీ కొత్త తాయిలాలు అమలులోకి వస్తాయి.

మరికొన్ని వరాలు-ఇంకా విచిత్రం. మీరు కెమెరాకొని 30 రోజుల్లో నచ్చకపోతే వాపసు యిచ్చెయ్యవచ్చు. తలగడకొని-పది రోజులు పడుకుని మెడ నొప్పిపెడితే మార్చుకోవచ్చు. రకరకాల వంట సామాన్లు- కొని, వంట చేసుకొని 30 రోజుల తర్వాత వాపసు యివ్వవచ్చు.

మీ కుక్క జుత్తు దువ్వే దువ్వెనలు నాలుగు కొంటే ఒకటి ఫ్రీ. కుక్క జబ్బుల వివరాలు, జాగ్రత్తలు చెప్పే పుస్తకం ఫ్రీ. దానికి పెట్టే రకరకాల ఆహారం మీద 30 శాతం రాయితీ. ప్రతి వస్తువు మీదా 4 కుక్క బిస్కెట్లు ఫ్రీ. కుక్క కూర్చునే రెండు రకాల కుర్చీలు- 20 రోజులు వాడి వాపసు యివ్వవచ్చు. ఖరీదు-17.99!

ఇక అమ్మే వస్తువులు- మనం ఊహించలేం. పంది కాలు, ఆవు చట్ట, కోడి తొడ, టీ బోన్ రొట్టెలు(?), రొట్టెలకి రాసే ఎర్ర నూనె, మూకుడు తుడిచే బ్రష్, వంటింట్లో నేల మీద నిలబడడానికి పరిచే ప్లాస్టిక్ చాప, ఫ్రీ కూపన్ ల్ మీద చెర్రీలు-2 డాలర్ల 99 సెంట్లు మాత్రమే.

ఇక సౌకర్యాలు- మీ తివాచీలు శుభ్రపరిచే సౌకర్యం- వారానికి ఒక రోజు తోట గడ్డిని కత్తిరించి శుభ్రం చేసే సర్వీసు- ఒక్కొక్క విడతకి గంటకి 90 డాలర్లు. నాలుగు గదులు తుడవాలా? 69 డాలర్లు. 5 గదులు తుడిపించుకుంటే మీ హాలు తుడవడం ఫ్రీ. 6 గదులు ఆయితే వంటగది, పాయిఖానా ఫ్రీ.

అన్నిటికన్నా టీవీలో నన్ను ఆకర్షించిన రెండు ప్రకటనలు- ఇద్దరు ముసిలిదంపతులు టీవీలో కనిపించారు. ముసలావిడ చెప్తోంది. “”గడ్డురోజులు వచ్చాయి. ఏ రోజెలావుంటుందో చెప్పలేం. రేపు మా ఆయన చచ్చిపోతే నాకేం బెంగలేదు. గవర్నమెంటు 200 డాలర్లు యిస్తుంది. కాని నేను 20,000 డాలర్లకి ఇన్సూర్ చేశాను”
ముసలాయన నవ్వాడు. “”నేనూ మా ఆవిడకదే చేశాను. ఆవిడ చచ్చినా నాకేం బాధలేదు”

మరొక ముసలాయన సూటులో ఉన్నాడు.””నా జీవితమంతా అన్నీ పరిశుభ్రమయిన వస్తువులే వాడాను. రేపు నేను పోతే తళ తళా మెరిసే శవం పెట్టెని యిప్పుడే బేరం చేసుకుని పెట్టుకున్నాను. తర్వాతి షాట్- మెరిసే అందమయిన కర్రపెట్టిలో మెరిసే అందమయిన సూటుతో- చిరునవ్వుతో ముసలాయన శవం. తళ తళామెరిసే మూత పడింది. ఆంకర్ గొంతు: త్వరపడండి. మూడువారాలలో నాలుగు రంగుల పెట్టెలు. ఇప్పుడే మీరు పోతారని కాదు. ఎప్పుడు పోయినా పెట్టెమీకు గ్యారంటే. మీ శ్రాద్ధం మీకు పెట్టడం గ్యారంటీ.

మా మిత్రుడొకాయన- ఓ విచిత్రమైన సందర్భాన్ని చెప్పారు. ఒకాయన 350 డాలర్ల ఫొటో స్కానర్ కొన్నాడు.అంటే దాదాపు 18 వేల రూపాయల సరుకు. నేను ఆశ్చర్యపోయాను. అలవోకగా ఎడం చేత్తో కొన్నాడు. కొనేముందు “నచ్చకపోతే 30 రోజుల్లో తిప్పి యిచ్చే సౌకర్యం ఉందా?” అని అడిగాడు అక్కడి మేనేజర్ని. ఉంది.

ఈ మిత్రుడితో మెల్లగా చెప్పాడు. ఇంట్లో బోలెడు ఫొటోలు స్కాన్ చెయ్యాలి. ఓ వారం రోజుల్లో పీకిపారేసి- 20 రోజుల తర్వాత వాపసు యిచ్చేస్తాను. అదిగో చూడండి- నాలాంటివాడే సరుకుని తెచ్చి యిచ్చేస్తున్నాడు- అంటూ డబ్బా విప్పిన బంగీతో వెళ్తున్న మనిషిని చూపించాడు.

మరి యిందులో షావుకారుకి ఏమిటి లాభం?

ఇలాంటి సౌకర్యానికి అలవాటుపడినవాళ్లు షాపు మీద ముసురుకుంటారు. సరుకులు చెల్లుతాయి. 30 రోజుల్లో సరుకు పాడయితే? యివ్వడం మరిచిపోతే? యిచ్చిందాన్లో లొసుగు ఉంటే? ఈలోగా మీమీద పిడుగు పడితే? ఒసామా దేశం మీద బాంబు వేస్తే?- యిలా ఏదో కారణానికి సరుకు మీ చేతుల్లోనే ఉండిపోతే? కొన్న 40 మందిలో 11 మంది ఇలాచేశారనుకుందాం. ఆ పదకొండు మంది వల్ల వచ్చే నష్టాన్ని, అరుగుదల ఖర్చుని, మీ గడుసుదనానికి రుసుమునీ సర్దుకోడానికి అమ్మే సరుకుమీదే 15 శాతం భరోసా సుంకం (వారంటీ) వేస్తారు. ఈ సిద్ధాంతాన్ని ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అంటారు.

అయ్యా, భారతీయ కర్మ సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న నికార్సయిన వ్యాపారం- అమెరికా జీవనం. నేను వ్యాపారాన్ని గురించి మాత్రమే చెప్పడం లేదు. జీవనం గురించి మాట్లాడుతున్నాను. గమనించాలి..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.