Main Menu

Gollapudi columns ~ Asupathriki Trova Etu?(ఆసుపత్రికి తోవ ఎటు?)

Topic: Asupathriki Trova Etu?(ఆసుపత్రికి తోవ ఎటు?)

Language: Telugu (తెలుగు)

Published on: July 27, 2011

Asupathriki Trova Etu?(ఆసుపత్రికి తోవ ఎటు?)     

ఈ మధ్య టీవీలో ఒక ఆలోచనాభరితమైన చర్చని చూశాను.

మందు ఆ చర్చకి ప్రాతిపదిక. మహారాష్ర్ట ప్రభుత్వం పిల్లలు మద్యం తాగే వయస్సుని 21 నుంచి 25కి పెంచారు. అమితాబ్ బచ్చన్ గారికి కోపం వచ్చింది. అలా పెంచడం అన్యాయమని ఆయన వాపోయారు. ఈ టీవీ చర్చ ముఖ్యోద్దేశం ఏమిటంటే – అలా పెంచడం ద్వారా పిల్లలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కుని కోల్పోతున్నారని పెద్దలు కొందరు వాక్రుచ్చారు. పెద్దల బుద్దులు ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మనం అనునిత్యం చూసి ఆనందిస్తున్నాం. జైల్లోనే డాక్టర్ సచాన్ హత్య, బీహార్ లో ధర్నా చేస్తున్న రైతును తొక్కి చంపిన పోలీసుల వీరంగం, కోట్ల ధనం దోపిడీ- ఇవన్నీ మనం రోజూ చూసే సుందర దృశ్యాలు. పాతికేళ్ళ లోపునే మందు తాగే విచక్షణ యువకులకు ఉన్నదని వీరి వాదన. టీవీలో ఈ చర్చ వీలయినంత అసహ్యంగా, అసందర్భంగా, ఆలోచనారహితంగా కనిపించింది నాకు.

ఒకాయన అన్నాడు: “ఈ దేశంలో 18 ఏళ్ళకి యువకులకి ఓటు హక్కు ఇచ్చారు. 21 సంవత్సరాలకు పెళ్ళి చేసుకునే హక్కు ఇచ్చారు. మరి 25 ఏళ్ళ దాకా తాగే విచక్షణ రాదని ఎందుకు ఎందుకు భావిస్తున్నారు?” అని.

సమాధానం ఎవరూ సరిగ్గా చెప్పలేదు. నేను చెప్పగలను. “అయ్యా! 18 ఏళ్ళకి ఓటు హక్కునిచ్చిన కారణంగానే రాజాలు, కల్మాడీలు, కనిమొళిలు, మాయావతులూ పదవుల్లోకి వచ్చే దరిద్రం ఈ దేశానికి పట్టింది. 21 ఏళ్ళు పెళ్ళి చేసుకునే విచక్షణ కారణంగానే రొట్టెల పొయ్యిలలో పెళ్ళాలు కాలుతున్నారు. ఈ మధ్య పెద్ద కుటుంబాలలో జరిగిన పెళ్ళిళ్ళు పెటాకులయి భార్యా భర్తలు విడిగా బతుకుతున్న సందర్భాలు నాకు తెలిసే – కోకొల్లలు. కనీసం తాగే దరిద్రాన్ని మరో నాలుగేళ్ళు దాచడం వల్ల – ఆ మేరకు ఈ దేశం సుఖంగా ఉంటుంది” అని.

ఈ చర్చలో పాల్గొన్న పెద్దలందరూ సూట్లు వేసుకుని, కనుబొమ్మలు చిట్లించి ఆవేశపడుతున్న చదువుకున్న మూర్ఖులు. ఇందులో ఓ కుర్రాడు కూడా ఉన్నాడు. అతనంటాడు: “మాకు ఆ మాత్రం విచక్షణ లేదని ఎందుకనుకుంటారు? ఏ బార్ వాళ్ళు మా వయస్సుని పరీక్షిస్తారు? ఈ ఆంక్షవల్ల దొంగతనంగా తాగే అవకాశాన్ని పెంచుతున్నారు” అని. వాళ్ళ నాన్న, అమ్మ ఎవరో తెలీదు కాని “నువ్వేం అనుకోవద్దు బాబూ! మీ అమ్మా నాన్నా ఎప్పుడో చెయ్యాల్సిన పని నేను చేస్తున్నాను. ఈసారికి నన్ను క్షమించు” అని ఆ కుర్రాడి చెంపని చాచి పగులగొట్టాలని అనిపించింది.

కేవలం 20-30 సంవత్సరాల కిందట “తాగడం తప్పుబాబూ” అని చెప్పే వ్యవస్థ ఉండేది. తాగి తందనాలాడి ఇంటికొచ్చే ప్రబుద్ధులూ, ఆ వీరంగం ఫాషన్ అయే రోజులు వచ్చాయి. సరే. పెద్దలు చేసిన పనిని పిల్లలు చేస్తారు. కాని చేసే పనిని కాస్త ‘ఆంక్ష’గా నయినా ఆపదం నేరమని టీవీల్లో చర్చ! ఈ దేశంలో ప్రజాస్వామిక మనే దురన్యాయాన్ని ఎంత ఘోరంగా, ఎన్ని అనర్ధాలకు సాకుగా వాడుతున్నారో ఊహించలేం.

ఇప్పుడు కొన్ని నిజాలు. రెండు పెగ్గులకోసం కక్కుర్తిపడి – రెండో పెగ్గునుంచి తన శరీరాన్ని మరిచిపోయి ఎదుటి వ్యక్తికి అప్పగించే ఓ సినీ పరిశ్రమ మనిషిని తెలుసునాకు. ఆ పిల్లని చూస్తే జాలి వేసేది. తల్లితండ్రులు ఆమెనేం చెయ్యాలో తెలీక అదుపులో పెట్టే ఆస్కారం లేక అమెరికా పంపేశారని విన్నాను. అమెరికాలోనూ అలాంటి పనే చేస్తే? అది అమెరికా కనుక పరవాలేదు. చేసినా మనకి తెలీదు. ‘అవనీతి’కి మడిబట్ట కట్టి కళ్ళు మూసుకునే దయనీయమైన ఆత్మవంచన ఇది.

నిన్నకాక మొన్ననే – ఇండోర్ లో పన్నెండేళ్ళ అమ్మాయిలు ఇంటినుంచి మంచినీళ్ళ సీసాలో వోడ్కా పోసుకుని తెచ్చుకుంటున్నారట. వోడ్కా? మిగతా మందు రంగు తెలుస్తుంది. వోడ్కా మంచినీళ్ళలాగే ఉంటుంది. స్కూల్లో మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఈ అమ్మాయి తాగుతోంది. ఒకమ్మాయి వాంతి చేసుకుంది. యాజమాన్యం ఆ ముగ్గురినీ స్కూలునుంచి బహిష్కరించింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తాగి తందనాలాడే దృశ్యాల్ని విరివిగా టీవీలో చూపించారు.

మన వివాహ వ్యవస్థలో వంశోద్ధరణకి వివాహం తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించడం ఆచారం. వంశాన్ని ఉద్దరించే ఇలవేలుపు, గృహలక్ష్మి, కుటుంబ వ్యవస్థకి మూలాధారం – ఇవన్నీ ప్రస్తుతం బూతుమాటలు. ఇప్పుడిప్పుడు పట్నాల్లో 45 శాతం మంది – ఆడపిల్లలు అనూహ్యమైన వయస్సులో మందు తాగుతున్నారు. ఇది అవినీతికి దగ్గర తోవ. తర్వాత పైన చెప్పిన అమ్మాయి స్థితికి వేరే ప్రయత్నం అక్కరలేదు. తర్వాత జరిగేది – ఆ పిల్ల పదిమందికీ చెప్పే అబద్దం, తల్లిదండ్రులు వేసే ముసుగు. ఆరాచకం. అవ్యవస్థ.

ఈ మధ్య సర్వే జరిపారు. 32 శాతం మంది ఏమీ తోచక, 42 శాతం మంది స్నేహితులతో తామూ చేయగలమన్న డాబుకి, గొప్పకి తాగుతున్నారట. ఈ దేశం తాగుడికి వయస్సుని నిర్ణయించే స్థితికి వచ్చింది.అది మేలు. ఆ నిర్ణయం తప్పని, తమకి తామే నిర్ణయించుకునే వెసులుబాటు, విచక్షణ తమకి ఉండాలని పెద్దలు పిన్నలకు అండగా నిలిచే

భయంకరమైన ‘ప్రజాస్వామ్యం’ వచ్చేసింది!

ఈ దేశానికి బాలమేధావుల్ని తెలుసు. బడిలో చదవకుండానే ‘హరికథ’ వంటి ప్రక్రియై ప్రాణం పోసిన ఆదిభట్ల నారాయణ దాసు వంటి మహనీయుల్ని తెలుసు. ఒక వీణ గాయత్రి, ఒక మాండలిన్ శ్రీనివాస్, ఒక బాలమురళీకృష్ణ ఇంకా మన మధ్య ఉన్నారు.

తాగడానికి 25 ఏళ్ళు ఆంక్ష అన్యాయమని, 18 ఏళ్ళకే దరిద్రపు నాయకుల్ని ఎన్నుకునే వ్యవస్థలో తాగే నిర్ణయాన్ని తీసుకునే విచక్షణ తమకున్నదని – 12 ఏళ్ళ ఆడపిల్ల బడిలో తాగి వాంతి చేసుకునే స్థితికి మనం పురోగమించాం.

‘విచక్షణ’ విషయంలో పెద్దలకి పాఠాలు చెప్పవలసిన దయనీయమైన రోజులు వచ్చాయి. 18 ఏళ్ళు వచ్చిన ఆడపిల్ల తోడబుట్టినదయినా పరాయి స్త్రీగా గౌరవించాలని ఈ వ్యవస్థలో పెద్దలు చెప్పిన మాట బూతుమాటలాగ వినిపించే రోజులొచ్చాయి.

నాకు వయస్సు మీదపడింది. ఈ జబ్బు కుదిర్చే ఆసుపత్రి పేరు చెప్పండి – మీకు పుణ్యముంటుంది..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.