Main Menu

Gollapudi columns ~ Ayyo! Aahoo (అయ్యో! ఆహా )

Topic: Ayyo! Aahoo (అయ్యో! ఆహా)

Language: Telugu (తెలుగు)

Published on: July 12, 2010

Source Credit: koumudi.net

Audio: Ayyo! Aahoo (అయ్యో! ఆహా)     

ఈ మధ్య చాలా చోట్ల చాలా రకాలయిన హత్యలు జరిగిపోతున్నాయి. వాటి గురించి వింటేనే గుండె బరువెక్కి వేదన కలుగుతుంది. మొన్నటికి మొన్న అజాద్ మరణం గురించి పేపర్లో చూశాం. అలాగే హేమచంద్ర అనే పాత్రికేయుడి మరణం. వారి తల్లిదండ్రులు, సమీప బంధువులు, స్నేహితులూ కార్చిన కన్నీరు, వారికి జరిగిన దుర్ఘటన, నిండు ప్రాణాలు బలయిపోయిన దైన్యత – ఇవన్నీ ఆయా పత్రికల పుణ్యమాంటూ తెలిశాయి. ఎన్నో వ్యాసాలు ఉదారంగా రాశారు. అవన్నీ జరిగిన దుర్ఘటన, జరగకూడని అన్యాయాన్ని వివరించాయి. పత్రికలు వారి తల్లిదండ్రులు, సానుభూతిపరులు ఫోటోలను చక్కగా ప్రచురించారు. ఇవన్నీ వారికి నిజమైన నివాళి. మనకూ బాధకలిగించిన సందర్భమది.

ఇంట్లో కూర్చుని పేపరు మాత్రమే చదువుకుంటున్న నాలాంటివాడికి అనిపిస్తుంది. ఆ మధ్య దంతెవాడలో చచ్చిపోయిన 83 మందికీ ఏ ప్రత్యేకత లేకపోయినా వాళ్ళకీ పెళ్ళాం, పిల్లలూ, తల్లులూ, తండ్రులూ ఉండరా? జీతం చేతికొస్తే ముందు జీవితాన్ని కాస్త మెరుగు పరుచుకుందామని ఆశపడే ఒక్క “మామూలు మనిషి”లేడా? జీతం రాళ్ళతో త్వరలోనే చెల్లెలి పెళ్ళి చేయాలని కలలు కనే ఓ వ్యక్తి కథయినా ఈ పత్రికలు రాస్తే బాగుండు అనే 83 కథలు, 116 మంది తల్లిదండ్రులు, కనీసం 300 మంది కుటుంబ సభ్యులు – వాళ్ళు బొత్తిగా నేలబారు మనుషులయినా వాళ్ళున్న ఊరిలో, వాళ్ళ వాడలో సానుభూతిపరులను లెక్కపెట్టినా 1200 మంది తేలవచ్చుకదా? పత్రికలకు ఒక్క ఫోటో కూడా దొరకలేదా?

ఆ మధ్య మొండెం ఒకచోట, కాలొక చోట, చెయ్యి ఒకచోట పడిన పోలీసు శవాన్ని రోడ్డు మీద చూశాం. అతని పేరు చంద్రయ్య అనుకుంటే – చంద్రయ్యకు తల్లిదండ్రులులేరా? అన్నలూ చెల్లెళ్ళూ ఉండరా? వీరి గురించి పత్రికలు వివరాలు సంపాదించి రాస్తే బాగుంటుంది. కొన్ని ఫోటోలు కూడా వెయ్యగలిగితే బాగుంటుంది. అంత్యక్రియల్ని చూపగలిగితే ఇంకా స్పందన కలుగుతుంది.

కాశ్మీరులో తొమ్మిదేళ్ళ కుర్రాడు చచ్చిపోయినందుకు పెద్ద ఊరేగింపు చేశారు. జవాన్ల మీద రాళ్ళేశారు. ఒక జవానుని చావబాదిన దృశ్యాన్ని ఒక ఛానల్ చూపించింది. వారి శిబిరాల మీద ఈ ఉద్యమ కారులు దండయాత్ర చేశారని చెపుతున్నారు. కనీసం పదిహేనుమందయినా చచ్చిపోయేదాకా అల్లర్లు జరగాలని ఈ ఉద్యమానికి పెట్టుబడిని పెట్టినవారి గొంతుని నిన్న ఛానల్ లో వినిపించారు. ఏ సానుభూతి బలమైనదో, ఏ వ్యాసం నిజమైనదో పత్రికలు చదివేవాళ్ళకి తెలియడంలేదు.

ఎన్నోసార్లు ఈ విషయం రాశాను. అయినా మరోసారి. రాజీవ్ గాంధీతోపాటు 18 మంది చచ్చిపోయారు. వాళ్ళకి – రాజీవ్ గాంధీ చేసిన “అన్యాయం”తో గాని, ఆయన్ని చంపినవారి లక్ష్యంతో గాని సంబంధం లేదు. వాళ్ళపేర్లేమిటి? వాళ్ళ కుటుంబాలు ఇప్పుడేమయాయి? వ్యవస్థ వల్ల దిక్కుమాలిన చావు చచ్చిన వారికేమయినా ఓదార్పు లభించిందా? ఎవరికయినా తెలుసా? వాళ్ళు రాజీవ్ గాంధీ అంత గొప్పవారు కాకపోవచ్చు. కాని వారి కుటుంబానికి వారే ఉపాధి కదా? వాళ్ళావిడ కార్చే కన్నీటికీ, సోనియాగాంధీ కార్చే కన్నిటికీ తేడా ఉండదు కదా? ప్రియాంక వందలాది కెమెరాల ముందు కన్నీరు కార్చింది. ఆనాడు చెయ్యని నేరానికి రాజీవ్ గాంధీతో పాటు మరణించిన “మారెప్పన్” కూతురు కన్నీటిని ఎవరయినా చూసారా?

స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక సమ్మె జరిగింది. “ఎక్కడా గొడవలు జరగలేదు బాపూజీ! సమ్మె సక్సెస్! కేవలం ఆరుగురే చచ్చిపోయారు!” అంటారు పటేల్ – గాంధీతో – చాలా తృప్తిగా. మహాత్ముడు దిగాలుగా “ఆ మాట ఆ చచ్చిపోయిన ఆరు కుటుంబాలకూ చెప్పి ఒప్పించు” అంటారు.

చచ్చిపోయిన కారణం – కొందరి చావుని ఉదాత్తం చెయ్యవచ్చు. కాని చావు కలిగించే దూఃఖం ఒకటే. చావు – ఒక జీవితానికి నిర్దాక్షిణ్యమైన ముగింపు. ఆ విషాదం అతని చుట్టుపక్కల ప్రపంచాన్ని కకావికలు చేస్తుంది. రోడ్డు మీద దిక్కులేని చావు చచ్చిన మొండానికీ ఆ నిజం వర్తిస్తుంది. అతనికి ఉద్యోగమేకాని, ఉద్యమం లేదు కద! అలా పత్రికల్లో సానుభూతి పలికే మరణాల కన్న – ఈ దిక్కులేని మరణం మరింత దయనీయమైనది. “అయ్యో” అనిపించేదీను.

సిద్దాంతాల జోలికి బొత్తిగా పోని, ఓ నేలబారు వ్యక్తి – కేవలం మానవతా దృక్పధంతో, పత్రికలు మాత్రమే ఇచ్చే కథనాలు వింటున్నప్పుడు ఇలా అనిపిస్తుంది. కొందరి చావులకి పత్రికలు ఇచ్చే “ఫోకస్” ఏ దిక్కూ లేకుండా చచ్చిపోయిన వాడి చావుని మరింత దీనంగా, నిజానికి ఉదాత్తం చేస్తాయి. మీడియా హోరు – పేరు కూడా తెలియకుండా గుంపులో ప్రాణాలు పోగొట్టుకున్న 83 మంది చావు గురించి ఆలోచించేటట్టు చేస్తుంది. Lack of focus makes it more cruel – by default.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.