Main Menu

Gollapudi columns ~ Aḍavari maṭalaku….(అభినవ కీచకులు)

Topic: Aḍavari maṭalaku…. (అభినవ కీచకులు )

Language: Telugu (తెలుగు)

Published on: Dec 10, 2012

Abhinava Keechakulu(అభినవ కీచకులు)     

రాబిన్ పాల్ 23 ఏళ్ళ అమ్మాయి. న్యాయంగా ఆమె మీద ఈగవాలడానికి కూడా వీల్లేదు. కారణం ఆమె అమృతసర్ లో పోలీసు అసిస్టెంటు సబ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ పల్ సింగ్ కూతురు. కానీ హెడ్ కానిస్టేబుల్ గారి కొడుకే ఆమెని ఏడిపిస్తూంటే? అదే స్టేషన్ లో పనిచేస్తున్న గుర్ బీర్ సింగ్ బీరా కొడుకే వెంటబడుతున్నాడు. ఆ అమ్మాయి – 20 రోజుల కిందట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఎవరూ పట్టించుకోలేదు. నిన్న తన కూతుర్ని ఏడిపిస్తున్నవాళ్ళకి తండ్రి అడ్డుపడ్డాడు. ఏడిపిస్తున్నవారికి తుపాకీ చూపించాడు. అమృతసర్ అకాళీదళ్ జనరల్ కార్యదర్శి రంజిత్ సింగ్ రాణా రివాల్వర్ లో బులెట్లు అయిపోయాయి. అందుకని ఇంటికి వెళ్ళి బులెట్లు నింపుకుని వచ్చి పట్టపగలు నట్టనిడిరోడ్డుమీద అందరూ చూస్తూండగా రవీందర్ పల్ సింగుని కాల్చిచంపాడు. రాజకీయ దురహంకారం తలకెక్కిన – ఈ మధ్యకాలపు డజన్ల కథలలో ఇది ఇటీవలిది.
పార్టీ ముసుగులో ఏం చేసినా చెల్లిపోతుందనే ధీమా ఈ మధ్య కలంలో రాజకీయ దురహంకారికి తెలుసు. అదే మన వ్యవస్థకి పట్టిన దరిద్రం.

మొన్ననే తను ఉంటున్న కాలనీలో అమ్మయిని కొందరు పోకరీ యువకులు పీడిస్గ్తున్నప్పుడు సంతోష్ విచివారా అనే కుర్రాడు ఆ అమ్మాయికి బాసటగా నిలిచి వారిని ఎదిరించాడు. అంతే. ఆ దుండగులు అతన్ని పొడిచి చంపేశారు. సంతోష్ తండ్రి రెండేళ్ళ కిందటే కన్నుమూశాడు. అతనే ఆ కుటుంబానికి ఆధారం. ఇప్పుడు ఆ కుటుంబం వీధిన పడింది.

మరో చక్కని కథ. ప్రస్తుతం ప్రజాహితం గురించి ఆవేశంగా కబుర్లు చెప్పే పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య సజావయిన కారణానికే పోలీసులు అదపులోకి తీసుకున్న తన పార్టీ కార్యకర్తలను స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, పోలీసు చెంపపగలగొట్టి మరీ విడిపించుకు వచ్చారు.
ఈ దేశంలో న్యాయవ్యవస్థ కూడా పాలక వ్యవస్థకి తలవొంచుతున్న భయంకరమైన దుశ్శకునాలివి. ఇంకా భయంకరమైన హత్య అక్టోబరు 20 న జరిగినది. ముంబైలో హోటల్లోంచి వస్తూండగా తమతో ఉన్న అమ్మాయిల్ని ఆటపట్టిస్తున్న 17 మందిని ఇద్దరు కుర్రాళ్ళు ధైర్యంగా ఎదిరించారు. ఆ 17 మందీ వెళ్ళి ఇరవై మందితో కత్తులతో, కొడవళ్ళతో వచ్చి – ఆ ఇద్దర్నీ – కీనన్ (24), రూబెన్ (29) దారుణంగా పొడిచి చంపారు.

ఈ సందర్భంలోనే గుర్తుచేసుకోవలసిన మరో అరాచకం – ఉత్తర ప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు – డి.పి.యాదవ్ సుపుత్రుల భాగోతం. తమ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడనే కారణానికి యాదవ్ గారి పుత్రులు – వికాశ్ యాదవ్, విశాల్ యాదవ్ లు నితీష్ కటారా అనే యువకుడుని దారుణంగా హత్యచేసి – న్యాయస్థానానికి దొరకకుండా తమ చెల్లెలు భారతిని విదేశాలకు పంపేశారు. నితీష్ తల్లి – నీలం కటారా అనే వీరవనిత – పుత్రశోకాన్ని దిగమింగి, సంవత్సరాల తరబడి పోరాడి ఆ సోదరులకు శిక్ష పడేటట్టు చూసింది. ఇది అవినీతిలో మొదటి భాగం మాత్రమే. సదరు వికాశ్ యాదవ్ అనారోగ్యం అనే మిషమీద సంవత్సరంలో కేవలం 66 సార్లు మాత్రమే అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో గడిపారు. గమనించాల్సిన విషయం – ఇందులో న్యాయవాదుల, డాక్టర్ల, జైలర్లకీ వాటా ఉంది. రాజకీయ నాయకులు శిక్షలకు కూడా ప్రత్యామ్నాయాన్ని ఈ దేశంలో సాధించగలరనడానికి ఈ ఉదాహరణ తలమానికం.

ఈ దేశంలో చట్టానికి అధికార దురహంకారులు గాజులు తొడగ గలరన్న వాస్తవాన్ని ఈ కథలన్నీ నిరూపిస్తాయి. ఎప్పుడో – 1869 లో – అంటే బ్రిటిష్ వారికాలంలో రూపుదిద్దుకున్న చట్టాలే ఇప్పటికీ మన దేశంలో వర్తిస్తున్నాయి. ఇప్పటికీ అమ్మాయిల్ని ఆట పట్టించే శృంగార రాయుళ్ళను శిక్షించే చట్టం మన దేశంలో లేదు. హత్యదాకా వెళ్ళింది కనుక ఈ కథని మనం వింటున్నాం కాని – అంధేరీలో అమ్మాయిల్ని ఆటపట్టించడంతో ఆగిపోతే వారిని శిక్షించే చట్టం మనకు లేదు.

దుశ్శాశునుడి కథ భారతకాలం నాటిది. ఈ అభినవ దుశ్శాశనుల నిస్సిగ్గు వీరంగం మూడు నిజాల్ని మన ముఖం మీద కొట్టినట్టు చెపుతోంది. అనుమానం లేదు – చట్టం గాజులు తొడుక్కుంది – లేదా యాదవ్, పోలీసుని చంపిన రంజిత్ సింగ్ రాణా వంటి గూండాలు చక్కని గాజులు తొడిగారు. న్యాయస్థానం శిక్షించినా శిక్షలు అమలు జరగకుండా తప్పించుకునే సౌకర్యం మరే దేశంలో దొరుకుతుంది? ఇక రెండో నిజం – కూతురు పరువుని కాపాడుకోడానికి – మాములు మనుషులకు సరే – పోలీసు ఆఫీసరయినా దిక్కులేదు. మూడు: రాజకీయ పార్టీ ముసుగు ఉంటే – ఏ నేరమయినా – ఆఖరికి హత్య అయినా – ఈ దేశంలో చెల్లిపోతుంది.

మన కళ్ళముందే ముసిలి కంట్రాక్టరు చెంప పగులగొట్టిన ముంబై కార్ఫొరేటరూ, తప్పుడు నేరాలకి అరెస్టయినా పోలీసుల చెంప పగులగొట్టి విడిపించుకురాగల ముఖ్యమంత్రులూ, కూతురుకి అడ్డుపడిన పోలీసు తండ్రిని నడి రోడ్డుమీద చంపిన ఓ పార్టీ కార్యదర్శి ఈ నిజాల్ని నిరూపిస్తున్నారు.

ఆ మధ్య ఒక వృద్దుడిని అమెరికాలో అడిగాను – ఇక్కడెందుకున్నారని. కొడుకు బాగా సంపాదిస్తున్నాడని చెప్తాడనుకున్నాను. “మన దేశంలో అవినీతి విశ్వరూపానికి బ్లడ్ ప్రెజర్ ఎక్కవవుతోందండి. ఆరోగ్యాన్నీ, మనశ్శాంతినీ కాపాడుకోడానికి” అన్నాడు. ఏ రోజు పేపరు తెరిచినా ఆ పెద్దమనిషిమీద నాకు ఈర్ష్య కలుగుతోంది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.