Main Menu

Gollapudi columns ~ Cell is Hell(సెల్ ఈజ్ హెల్)

Topic: Cell is Hell(సెల్ ఈజ్ హెల్)

Language: Telugu (తెలుగు)

Published on: March 21, 2011

Cell is Hell(సెల్ ఈజ్ హెల్)     

పీవీ నరసిం హారావుగారి ధర్మమాంటూ టెలిఫోన్ డిపార్ట్ మెంట్ వారి నిరంకుశత్వం అణగారి ప్రజలకి స్వేచ్ఛ లభించింది. ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం ఒక ఆస్తి సంపాదనలాగా తయారయి – ఎంతో భయంకరమైన అవినీతి ఎన్నో దశల్లో ఆవరించుకోవడం చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇవాళ ఆ డిపార్ట్ మెంట్ రకరకాల రాయితీలతో ప్రజల్ని దేబిరించే స్థితికి వచ్చింది. అది దాని ఖర్మ. అక్కసుతోనే ఈ నాలుగు మాటలూ అంటున్నాను.

సెల్ ఫోన్ పెద్ద సమాచార విప్లవం. కోట్ల మంది చేతుల్లో ఆ సౌకర్యం ఉంది. అయితే ఇప్పటికీ సెల్ వినియోగదార్లు దాన్ని సరిగా అవగాహన చేసుకోని సందర్భాలు లక్షలు.

అయితే ఇంత విస్తృతమయిన వినియోగంలో ఇంత పెద్ద అవగాహనని ఆశించడం అన్యాయమేమో!

నాలాటి ఎందరికో ఇది హింస. నరకం. కొన్ని ఉదాహరణలు. ఫోన్ మోగుతుంది. తీస్తాను.

“గొల్లపూడిగారేనాండీ?”

“ఆ”

“నిజంగా గొల్లపూడి గారేనాండీ?”

“అవును బాబూ”

“నేను నమ్మలేకపోతున్నానండి”

“నమ్ముబాబూ”

“అయ్ బాబోయ్ – నాకు చిన్నప్పట్నుంచీ మీరంటే చచ్చేంత అభిమానమండి” – ఇక ఫోన్ ఆగదు.

కొందరు ఫోన్ చేస్తారు. ఉపోద్ఘాతం ఉండదు. “రంగా! ఏట్రా? ఇంకా బయల్దేరలేదురా తప్పుడునా కొడకా?”

మరి కొందరు సరాసరి విషయం లోకి వచ్చేస్తారు: “మీరిక కాదనకండి బాబూ – ఏభైకి బేరం తెగ్గొట్టెయ్యండి. మావోడు ఏడుత్తున్నాడండి”

అసలు సెల్ ఫోన్ తిప్పే వాళ్ళకి అర్ధం కావలసిన మొదటి విషయం – అవతలి మనిషి గెడ్డం చేసుకుంటున్నాడా? కాఫీ తాగుతున్నాడా? కడుపు నొప్పితో బాధపడుతున్నాడా? పెళ్ళాం తిట్లను భరిస్తున్నాడా? ముక్కుపొడుం దొరక్క ఇబ్బంది పడుతున్నాడా? కక్కసులో ఉన్నాడా? బదిలీ అయి భయంకరమైన డిప్రెషన్ లో ఉన్నాడా? సెల్ ఫోన్ ఎప్పుడయినా, ఎక్కడయినా హఠాత్తుగా మోగుతుంది.అవతలి వ్యక్తిని అదాటుగా పట్టుకుంటుంది. అవతలి వ్యక్తి అప్పటి పరిస్థితి మనకి తెలీదు. కాని తెలుసుకోవలసిన అవసరం ఇవతలి వ్యక్తికి ఉంది. అది మొదటి షరతు. అవతలి వ్యక్తి హక్కు.

“రంగయ్యగారా?” అని అడిగితే తప్పేముంది.

లేదా – “నేను వెంకట్రావునండి. విజయనగరం పాల డిపో వెంకట్రావునండి. ఒక్క నిముషం మాట్లాడవచ్చునాండి?” అన్నారనుకోండి.

“అయ్యో – తప్పకుండా -” అన్నాడనుకోండి. అంతే. ఇద్దరికీ సయోధ్య ఏర్పడినట్టు.

లేదా –

“నేను వీరభద్రాన్ని -” అని పలకరిస్తే –

“ఏరా, బాగున్నావా? ఎన్నాళ్ళయ్యింది నీ గొంతువిని -” అని సమాధానం వచ్చిందనుకోండి. ఇద్దరూ ఒక వేవ్ లెంక్త్ లో ఉన్నట్టు.

ఒకప్పుడు: “నేను ఫలానా.” అని ఫోన్ వస్తుంది.
మెల్లగా “సభలో ఉన్నాను. పదినిముషాల్లో మాట్లాడుతాను..” అంటే ఒక సమన్వయం. ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్ధం చేసుకోవడం. ఒక మర్యాద.

మరో రకం హింస: “నేను రాజునండి. నిన్న వస్తానని రాలేదేమండి?”

రాజు, శర్మ, శాస్త్రి, రావు – ఇవన్నీ వెంటనే గుర్తుకురాని పొడి పేర్లు. మరేదో పనిలో ఉంటున్న వారికి ఏ రాజు, ఏ పనో వెంటనే స్ఫురించి చావదు. కాని ఆలోచించరు. ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు, రాజు అనగానే ఇటుపక్క అతని ముఖం సినిమా స్కోపులో కళ్ళముందు దర్శనమిస్తుందనీ, రాజు మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ ఇటు ఫోన్ ఎత్తినవారి మనస్సుల్లోనూ అంతే ఉధ్రుతంగా తోసుకువస్తాయనీ నమ్ముతారు. ఇది హింస.

నేను కథ రాసుకుంటూ ఉంటాను. లేదా నెలసరి లెక్కలు చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ రాజు ఫోను. ఏ రాజు? ఎక్కడికి వస్తానన్నాను? ఎందుకు? నా రచన ఆలోచన

తెగిపోతుంది. లెక్కలు గాడి తప్పుతాయి. మనస్సులో విసుగు. నిస్త్రాణ. ఇప్పుడీ ఫోన్ ఏమిటని – చిరాకు.

“నేను వీర్రాజునండి. మీ పొలాల గురించి దస్తావేజులు రాయమని నాకు అప్పగించారు కదండి?” అని చెపితే –
వెంటనే ఆలోచనకి ఆలంబన దొరుకుతుంది. మెదడు – ఆ విషయాన్ని ముందుకు తోస్తుంది. రాజు మనస్సులో నిలుస్తాడు. అప్పుడు మనకి తీరిక లేకపోతే “పనిలో ఉన్నాను. పది నిముషాల్లో మాట్లాడుతాను రాజుగారూ” అనే అవకాశం దొరుకుతుంది. హఠాత్తుగా చేతిలో మోగిన ఫోన్ కి – ఫోన్ చేసే వ్యక్తి ఊతం ఇవ్వగలిగాలి. తప్పులేదు. తప్పదు. విధిగా చెయ్యాల్సిన పని. నిజానికి ఇప్పటికీ నేనా పని చేస్తాను.

“నేను గొల్లపూడి మారుతీరావుని బాబూ – రచయితని, సినిమా నటుడిని” అని చెప్పుకుంటాను.

“అయ్యో, మిమ్మల్ని తెలియని వారెవరుంటారండీ” అని అటునుంచి సమాధానం వస్తే మంచిదే. కాని ఒక్కొక్కప్పుడు – రాదు. రాకపోతే తప్పులేదు. “మీరు ఫోన్ చేశారని మా డాడీతో చెపుతానండి” అంటుంది నన్ను గుర్తుపట్టని గొంతు. మర్యాదే. నేను సర్వాంతర్యామిని ను. కాని ఇక్కడ గజిబిజిలేదు. మర్యాదలోపం లేదు.

ఆఖరుగా సెల్ ఫోన్ లో క్షమించలేని, భరించరాని, అతి దుర్మార్గమయిన, అతి క్రూరమైన, ఆలోచనారహితమైన, రాక్షసత్వం – ఒకటి ఉంది. ఇప్పటికీ చాలామంది ఈ పని చేస్తూంటారు. ఎంతో నిర్దయతో, బొత్తిగా sensitivity లేని పని ఇది. ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడూ ఫోన్ మోగుతుంది. “ఏరా?” అంతే పిలుపు.
నిస్సహాయంగా, పనిలో ఉన్న మనం “ఎవరు?” అన్నామనుకోండి.

“ఆ మాత్రం పోల్చుకోలేవా?” అని సవాలు.

ఇటు బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. మనం ఏదో సభలో ఉంటాం.

“ఎవరో చెప్పండి” అంటాం, అక్కడికి కోపాన్ని తట్టుకుని.

అటు పక్క వ్యక్తి సరదాగా మన నిస్సహాయతకి ఆనందిస్తూంటాడు – పక్కవాడిని సూదులు గుచ్చి కితకితలు అనుభవించే శాడిస్టులాగ.

“నీ ఫ్రెండు. పోల్చుకో చూద్దాం..”

ఇంతకంటే హింస లేదు. అటు పక్క స్నేహితుడి మూడ్ లో మనం ఉండం. తలకెక్కిన పనిలో ఉంటాం అతని మూడ్ తన స్నేహితుడి నిస్సహాయతతో ఆడుకునే ప్రసన్నత. మన బాధ – ఇటు భరించలేని కడుపునొప్పి కావచ్చు. దుర్భరం. అటు పక్క వ్యక్తికి అర్ధం కాదు. ఇంకా ఆ ఆకతాయి, అల్లరి, క్రూరమయిన ఆటని కొనసాగిస్తాడు. ఇది చాలా దరిద్రమయిన prank. ఎవరూ – అతను నీ ప్రాణ మిత్రుడయినా హర్షించడు.

నేను – ఒకసారి – కావాలనే – ఈ నరకాన్ని బరించలేక – అవతలి వ్యక్తికి బుద్దిచెప్పాలనే ఆ జోక్ ని అతి దారుణంగా కొనసాగించాను.

“ఒరేయ్, నువ్వట్రా దరిద్రం నా కొడకా! ఇన్నాళ్ళకి ఫోన్ చేస్తావా? నిన్ను చెప్పు తీసి కొట్టాలిరా. నేనిప్పుడు జ్నాపకం వచ్చానా? ఈ మాటు కల్సినప్పుడు – నిన్ను జుత్తు పట్టుకు చావగొట్టకపోతే నీ మీద ఒట్టు, పెంట వెధవా!” అన్నాను.

అటు పక్క గొంతు కంగారుపడిపోయింది.

“అయ్యా అయ్యా – నేను గంగాధరరావుని. మనిద్దరం – 1996 లో హౌరా మెయిల్ లో నిడదవోలుదాకా ప్రయాణం చేశాం” అని తడబడ్డాడు.
వెంటనే నేనూ తడబాటుని నటించాను. “అరెరె! మీరా? మీ గొంతు అచ్చు మా ఆంజనేయులు గొంతులాగ ఉందండీ. వాడెప్పుడూ వస్తానంటాడు. రాడు – పింజారీ వెధవ. సారి. మా

వాడేమో అనుకున్నాను – బాగున్నారా?”

అక్కడితో ఆ క్రూరమయిన ప్రహసనానికి తెరపడింది.

దయచేసి ఒక్కటి గుర్తుంచుకోండి. సెల్ ఫోన్ ఎదుటి వ్యక్తిని అదాటుగా, హఠాత్తుగా, ఉన్నట్టుండి పట్టుకునే క్రూరమయిన ఆయుధం కాదు. కేవలం ఒక సౌకర్యం. సెల్ ఫోన్ లో మొదటి వాక్యం – అటు మీ పెళ్ళాం ఉన్నా – తప్పనిసరిగా – మీరెవరో చెప్పేదిగా ఉండాలి.

“భారతీ – నేను శీనూని” అనడంలో మీ మర్యాదకి భంగం రాదు.

మీరు దేవుడయినా – మీరెవరో, ఎందుకు ఫోన్ చేస్తున్నారో చెప్పాలి. అందుకు వ్యవధి – పది సెకన్లు. అది మర్యాద. పద్ధతి. మీ కాల్ ని – తీసుకుంటున్న అవతలి వ్యక్తి హక్కు. అన్నిటికీ మించి – మీ చేతిలో ఉన్న సౌకర్యం యొక్క పరిమితి. పరిధి. ముఖ్యంగా పాటించాల్సిన రూలు. .

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.