Main Menu

Gollapudi columns ~ Chattam Balavanthudi Thothu (చట్టం బలవంతుడి తొత్తు )

Topic: Chattam Balavanthudi Thothu (చట్టం బలవంతుడి తొత్తు )

Language: Telugu (తెలుగు)

Published on: Aug 02, 2010

Chattam Balavanthudi Thothu (చట్టం బలవంతుడి తొత్తు )     

చాలా సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్థాన్ ల మధ్య యుద్ధం ముగిసాక దూరదర్శన్ లో ప్రతి ఆదివారం అద్భుతమయిన సీరీస్ ని ప్రసారం చేశారు. యుద్ధంలో మరణించిన జవాన్ల కథలు. ప్రతీవారం అంత గొప్ప యువత దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడి, అంత గొప్ప బిడ్డని పోగొట్టుకున్నందుకు ఆ కుటుంబంతో కంటతడి పెట్టుకోని వారం ఉండేది కాదు. దూరదర్శన్ చరిత్రలో ప్రసారం చేసిన గొప్ప సిరీస్ లో అవి ఒకటి.

బిల్లా, రంగా అనే ఇద్దరు దుడగుల్ని చంపి తాము చచ్చిపోయిన బిడ్డల పేరిట భారత ప్రభుత్వం ఏటేటా సాహసం చూపిన పసివారికి బహుమతులిస్తుంది. ఆ కథలూ కళ్ళు తిరిగిపోఏటంత ఆర్ర్ధమైనవి. పసివారి అమాయకమైన సాహసానికి మచ్చుతునకలు.

ఇప్పుడు కాలం మారింది. గూండాలు, హంతకులు ప్రజాస్వామ్యం ధర్మమంటూ – అధికారాల్లోకి వచ్చి – మద్దతు లేని, చాలని చాలామంది వ్యక్తుల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. కళ్ళముందు జరిగిన ఈ హత్యల్ని రుజువులతో నిరూపించలేని దుస్థితిని ఈ పెద్దలు కల్పిస్తున్నారు. వివరాలు చెప్పడానికి ఈ కాలం చాలదు. ప్రియదర్శిని మట్టూ కేసులో అప్పటి పోలీసు అధికారి కొడుకు సంతోష్ సింగ్ ప్రియదర్డర్శినిని రేప్ చేసి, హెల్మెట్ తో కొట్టి దారుణంగా చంపాక న్యాస్థానం ఇచ్చిన తీర్పుని గురించి హైకోర్ట్ చేసిన సమీక్ష – ఒక్క వాక్యం – నేను తెలుగులో వ్రాయలేకపోతున్నందుకు క్షమించాలి. The Trial judge acquitted the accused amazingly taking a perverse approach. It murdered justice anD shocked judicial conscience.

నితిష్ కటారా అనే 24 ఏళ్ళ కుర్రాడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అన్నలు – ఒక గూండా, పార్లమెంటు సభ్యుడు డి.పి.యాదవ్ పిల్లలు. ఆయన మద్దతుతో నితీష్ ని సుత్తితో కొట్టి చంపి, పెట్రోల్ పోసి శవాన్ని తగలెట్టి రోడ్డు పక్క పారేశారు. ఆ కుర్రాడి తల్లి నీలం కటారా బిడ్డపోయినందుకు గుండె పగిలి మంచం పట్టాల్సిందిపోయి ధైర్యాన్ని కూడదీసుకుని ఆరు సంవత్సరాలు తిరగని చోటు లేదు. వెళ్ళని ఆఫీసు లేదు. కలవని అధికారి లేడు. నితీష్ ప్రియురాలిని గూండా తండ్రి లండన్ పంపేశాడు. ఆమె ఎక్కడుందో తనకు తెలియదని న్యాయస్థానంలో చెప్పాడు. ఆమె పాస్ పోర్ట్ కాలదోషం పట్టి, లండన్ లో ఉండే వీసా గడువు దాటి, కోర్టు ఆమె చట్టాన్ని తప్పించుకు పారిపోయిన నేరస్తురాలిగా ప్రకటించే దశ వచ్చేసరికి – తప్పనిసరిగా కోర్టుముందు నిలబెట్టారు. నితీష్ తో తనకేం సంబంధం లేదని అబద్ధం చెప్పించారు. ఎట్టకేలకు న్యాయమూర్తి ‘హత్య జరిగిందని నాకు తెలుస్తోంది. కాని దురదృష్టం – డిఫెన్స్ సాక్ష్యాలతో నిరూపించలేకపోయింది. ముద్దాయిని నిస్సహాయంగా విడుదల చేస్తున్నాను’ అన్నారు. టీవీలు, ప్రజలు ఈ దురన్యాయాన్ని నెత్తికెత్తుకున్నారు. దేశం మేలుకుంది. న్యాయస్థానం కళ్ళు విప్పింది. 42 రోజుల్లో కేసుని తిరగతోడి వికాస్ యాదవ్, విలాస్ యాదవ్ లకు యావజ్జీవ కారాగార శిక్షని విధించింది.

ఇది కేవలం మొదటి భాగం. ఈ ‘యాదవ్’ సోదరులను తమరు చూడాలి. అమీర్ ఖాన్ కంటే గ్లామరస్ గా ఉంటారు. జైల్లో వీరు ఖైదీల యూనిఫారాలు ధరించకుండా, రోజూ జైలర్ గారి గదిలో కూర్చుని పేపర్లు చదువుకుంటూ కాలక్షేపం చేస్తారట. ఇంకా కడుపునొప్పి, నడుం నొప్పి కారణాలకి గత రెండు సంవత్సరాలలో వీరిద్దరూ కేవలం 66 సార్లు మాత్రమే దేశంలో కల్లా పెద్ద ఇన్ స్టిట్యూట్కి వచ్చి అక్కడ ఎయిర్ కండిషన్ గదుల్లో గడుపుతున్నారట. జైలుకెళ్ళినప్పటినుంచీ ఇలా కేవలం 85 సార్లు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందారు! ‘ఇలాంటి నొప్పులకి మిగతా ఖైదీలు ఎన్నిసార్లు ఏయే ఆసుపత్రులకి వెళుతున్నారో చెప్పమనండి’ అని సుప్రీం కోర్టు న్యాయవాది హరీష్ సాల్వే ప్రశ్నించారు.

1935 నాటి బ్రిటిష్ పాలనలో భరత దేశమనే ‘వలస దేశం’ బ్రిటన్ నమూనాతో ఏర్పరుచుకున్న బూజు పట్టిన చట్టాలు 2010లో ఇంకా పీడకలలాగ – మనల్ని వెంటాడుతూంటే డబ్బున్న బలవంతుల అరాచకానికి అవి కొమ్ముకాస్తున్నాయి.

కొడుకుని పోగొట్టుకుని కృంగిపోక, నడుంకట్టి, న్యాయం జరగాలని కసి పెంచుకుని, అధికారంలో ఉన్న గూండా నాయకుల కుతంత్రాలను ఎదిరించి, కాలదోషం పట్టిన చట్టాల గుడ్డితనాన్ని భరించి, మాధ్యమాల, ప్రజల సానుభూతిని సంఫాదించి, నేరస్థులను జైలుకి పంపించి, జైలుని అధికార బలంతో గెస్ట్ హౌసులుగా మార్చుకున్న ఈ గూండాల ఆటని (ఆర్.టి.ఐ. సమాచారాన్ని పొందే హక్కుద్వారా) బయట పెట్ట్టిన 65 ఏళ్ళ తల్లి ఇప్పటికి అలిసిపోయింది.ఇంకా కంట తడిరాని కళ్ళతో నిన్న ఒకమాట అంది. ‘ఎంతకాలం ఒంటరిగా నేనీ పోరాటాన్ని సాగించను? ఎవరైనా నాకు తోడవండి’ అని. నాకు కన్నీళ్ళు రాలేదు. గుండె పగిలింది. ఆ తల్లి కళ్ళల్లో ‘అగ్నిని’ని చూడాలి. గాయపడిన మాతృత్వం తిరగబడిన ‘ఆదిశక్తి’ ఆమె.

అడ్డమయిన కారణాలకీ అన్ని రకాల గౌరవాల్నీ ఖరీదు చేయగల ఈనాటి వ్యవస్థలో – ఒక మంజునాధ్ ని, ఒక అమీత్ జెత్వాని (అహ్మదాబాద్ గనుల మాఫియా కుతంత్రాలను బయటపెట్టినందుకు హత్యకి గురయిన వ్యక్తి), ఒక నీలం కటారాని – వ్యవస్థ చేతకాని తనాన్ని, గూండాల నిరంకుశత్వాన్ని ఎదిరించి నిలబడినందుకు – జాతీయ బహుమతినిచ్చి – ఇంకా ఈ దేశంలో మన జాతీయ పతాకంలో ‘అశోక చక్రం ‘ ప్రాధాన్యం చచ్చిపోలేదని నిరూపించాలి.

అంతేకాదు. దిక్కుమాలిన, అర్ధం లేని, అర్ధంకాని, కేవలం డబ్బు చేసుకునే ‘అభిరుచి దారిద్ర్యా’న్ని ప్రసారం చేసే ఈ టీవీ ఛానళ్ళు – ఈ కాలం మొదట్లో చెప్పిన ‘దూరదర్శన్ ‘ సిరీస్ లాగ – ఒక నితీష్ కటారా, ఒక జెస్సికాలాల్, ఒక సంజీవ్ నందా, ఒక రెజ్వానూర్ రెహమాన్, ఒక జె.పి.యస్ రాధోడ్ (రుచికా గిర్హోత్రా మానభంగం, ఆత్మహత్య) కథలని సీరీస్ గా ప్రసారం చేస్తే – రెండు జరుగుతాయి.ఆయా ఛానల్స్ చేస్తున్న పాపం ప్రక్షాళన అవుతుంది. ఈ దేశంలో కరుడుగట్టిన ‘అవినీతి ‘ని ఇంకా ఇంకా ఛేదించి న్యాయాన్ని జరిపే అవకాశాలు లేకపోలేదన్న ‘ఆశ’ నేలబారు మనిషికి మిగులుతుంది. డ్రాయింగు రూముల్లో కొలువు తీర్చిన మాధ్యమాలు ఈ కారణంగానయినా తమ శక్తిని చాటగలుగుతాయన్న ‘కొనవూపిరి ‘ ఆశ ప్రజలకి కలుగుతుంది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.