Main Menu

Gollapudi columns ~ Cheppudu Maata( చెప్పుడు మాట)

Topic: Cheppudu Maata( చెప్పుడు మాట)

Language: Telugu (తెలుగు)

Published on: October 24, 2011

Cheppudu Maata( చెప్పుడు మాట)     

ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నేనూ మా రెండో అబ్బాయీ వేసుకునే పడికట్టు ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

”ఈ పని వల్ల వచ్చే నష్టం ఏమిటి?”

”దాన్ని తట్టుకునే శక్తి మనకి ఉన్నదా?”

”లేకపోతే ఈ సమస్యకి మొదటి ప్రత్యామ్నాయం ఏమిటి?”

”రెండో ప్రత్యామ్నాయం ఏమిటి?”

”వీటిలో ఏది మంచిది?”

ఏ సమస్యకీ వీటికి భిన్నంగా పర్యవసానాలుండవు.

ఉదాహరణకి. కాలుకి ఆపరేషన్‌ జరపాలి. పర్యవసానాలు: 1. కాలు బాగుపడుతుంది. మంచిదే. ఉద్దేశం అదే. 2. మూడు నెలలు కుంటిగా నడవక తప్పదు. మూడు నెలలు మన పని చెడకుండా తట్టుకోగలమా? 3. అస్సలు కాలు బాగుపడదు. ఇప్పుడున్న సమస్య అదే కదా? ఇవీ ఆలోచనలు. ఇంతవరకూ మేమిద్దరం ఈ విచికిత్సలో పరాజయం పొందలేదు

-అన్ని పర్యవసానాలూ మా కళ్ల ముందున్నాయి కనుక.

విచిత్రమేమిటంటే మాకంటే గొప్పగా, సునిశితంగా ఇలాంటి ఆలోచనలు చేసే యంత్రాంగం ఒకటి ఉన్నదని మాకు ఈ మధ్యనే అర్థమయింది.

అసలు కథ ఇది. అన్నా హజారే, ఆయన మనుషులూ అవినీతిని తుదముట్టించాలంటున్నారు. యంత్రాంగం ఆలోచనలు: 1. అది అసాధ్యం. మనకి తెలుసు. అన్నాకి తెలీదు.

తెలియజెప్పడం సాధ్యం కాదు -ఆయన వీధిన పడ్డాడు కనుక.

2. అన్నా ఉద్యమం వల్ల మన ప్రతిష్ట మంటగలుస్తుంది. కనుక ఆయన్ని ఒప్పించడమో, తలవొంచడమో చెయ్యాలి. (తలవొంచే పని దిగ్విజయ సింగ్‌ సమర్థవంతంగా సాగిస్తున్నారు. ఒప్పించే ప్రయత్నం కపిల్‌ సిబల్‌ చేస్తున్నారు) రెండూ సాధ్యం కాకపోతే?

3. అన్నా కొంపముంచుతాడు. ఈలోగా అతని కొంప మనం ముంచగలమా? బాబా రాందేవ్‌ కొంపముంచాం. రాజకీయమైన ‘మతలబులు’ తెలియని వాళ్లని రొచ్చులోకి దించి గజిబిజి చెయ్యడం సుళువు. అప్పుడే అన్నా హజారేకి ఈ రొచ్చు అర్థమయి మౌనవ్రతంలో పడ్డాడు. మనిషి అలిసిపోయి, మన పన్నాగాలకి తలవొంచుతున్నాడనడానికి ఇది సూచన. ఈ లోగా ఒక అనుచరుడిని కొందరు కొట్టారు. మరొకరిమీద చెప్పులు వేశారు. మరో ఇద్దరు ఉద్యమం లోంచి తప్పుకున్నారు. మన ప్రయత్నంలో ప్రాథమిక విజయం మనదే.

రాజకీయ నాయకులకి తెలుసు -అవినీతి లేకుండా వాళ్లకి ఉనికి లేదని. ఈ దేశంలో ఇంతమంది నాయకులు -కేవలం దేశాన్ని ఉద్ధరించడానికే కంకణం కట్టుకుని కృషి చేస్తూంటే దేశం ఇలా ఎందుకు ఏడుస్తుంది? కేవలం దేశసేవకే రాజకీయాల్లోకి దిగే అసమర్థులెవరూ ఈ రోజుల్లో లేరు. కనుక అన్నా హజారే డిమాండ్‌ చేసే బిల్లుని చెడగొట్టే ప్రయత్నం ఒకపక్క చేస్తూ, ఒకవేళ బిల్లు చేసినా -మన పనులు చెడకుండా ఉండే లొసుగులు సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి. వీలైనంత వరకూ ఈ బిల్లు -మహిళా రిజర్వేషన్‌ బిల్లులాగ అటకెక్కించడానికి లేదా 2014 దాకా వాయిదా పడేటట్టు చూడడానికీ ప్రయత్నించాలి.

అన్నా ఉద్యమం మీద ప్రజలకి నమ్మకం సడలితే ఆయన మరో బాబా రాందేవ్‌ అవుతాడు. ఈ దేశంలో దేన్నయినా భ్రష్టు పట్టించాలంటే రెండు మూడు సాకులున్నాయి. ఇవి గొప్ప ప్రచార సాధనాలు. అవి మాయావతి, దిగ్విజయసింగ్‌, లల్లూ వంటి నాయకులకు కొట్టినపిండి. 1. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉంది. 2. నా ప్రత్యర్థులు నామీద పన్నుతున్న కుట్ర ఇది. 3. ఇదీ అదీ కాకపోతే -ఇందులో విదేశీ హస్తం ఉంది.

ఈ దేశంలో అవినీతిని అరికట్టడానికి దిక్కుమాలిన చట్టాలు బోలెడు ఉన్నాయి. ప్రభుత్వాలకి అరికట్టే మనసే లేదు. అరికడితే వారికి గతిలేదు. అరికడితే ఈ బోడి పదవులెందుకు? (ఏ చట్టం దయానిధి మారన్‌ అనే మంత్రిగారింట్లో 300 టెలిఫోన్‌ లైన్లను ప్రతిష్టించే అవినీతిని ఆపగలిగింది? ఎవరైనా గమనించారా? రాజ్‌కుమార్‌ అనే కన్నడ హీరోగారిని వీరప్పన్‌ అనే వీరుడు అప్పుడెప్పుడో పదేళ్లకిందట ఎత్తుకుపోయాడు. ఈ పదేళ్లలో వీరప్పన్‌ చచ్చిపోయాడు. రాజ్‌కుమార్‌ కూడా వెళ్లిపోయారు. నిన్ననే ఆ కేసు విచారణ ప్రారంభమయింది! ఇది ఈ దేశంలోని న్యాయానికి సంబంధించిన పెద్ద జోక్‌!)సరే.

అసలు విషయానికి వస్తే -ఈ దేశంలో నిజాయితీపరుడికి ఒకే తోవ -రాజమార్గం. కాని అవినీతి పరుడికి ఎన్నో సందులు. చక్కని రాజమార్గములుండగ సందులు ఎందుకు వెదకాలి అన్నారు త్యాగరాజస్వామి. తిరువయ్యూర్‌లో పాటలు రాసుకునే పెద్దమనిషి పెద్దకల ఇది. ఢిల్లీలో వుంటే ఆయనకి ఆ అవసరం తెలిసొచ్చేది. అన్నా హజారేకి ఇంతవరకూ అర్థంకాని, ఇప్పుడిప్పుడే అర్థమవుతున్న, ముందు ముందు బాగా వంటబట్టే ‘కనువిప్పు’ ఒకటి ఉంది.

లోగడ ఆయన జిల్లా స్థాయిలోనో, నగర స్థాయిలోనో, మునిసిపాలిటీ స్థాయిలోనో -బెంచి క్లర్కునీ, పంచాయతీ ప్రెసిడెంటునీ, ఓ చిన్న సూపర్నెంటునీ నిలదీసి ఉద్యోగాల్లోంచి బర్తరఫ్‌ చేయించడం సుళువు. మాలేగాంలో అన్నా మహా పర్వతం కావచ్చు. కాని ఢిల్లీలో ‘అవినీతి’కి పట్టాభిషేకం చేసి నిలదొక్కుకున్న ఎవరెస్టు శిఖరాలున్నాయి. వాటిని కదపబోయిన వారి పునాదులు కదపడం వారికి వెన్నతో పెట్టిన విద్య.

నిజాయితీ పరుడి చిత్తశుద్ధి అతని బలం కావచ్చు. కాని అతనిమీద బురదజల్లే మహానుభావులకి ఆయన మనసు గాయపరచడం తేలిక. అవినీతి పరుడి ‘ఆత్మరక్షణ’ ఆయుధాలు మరీ బలమైనవి. వెయ్యిమంది నిజాయితీ పరుల్ని ఊచకోత కోసే పదునైన ఆయుధాలు వారి పొదిలో ఉంటాయి.

పాపం, అన్నా మౌనవ్రతంలో ఒక నిజాయితీపరుడి విసుగు ఉంది. కాని సుప్రీం కోర్టులో న్యాయవాదిని కొట్టిన ముష్కరత్వంలో, కేజ్రీవాల్‌ మీద చెప్పువిసిరిన కుసంస్కారంలో రాజకీయ నాయకుల తొలి విజయం ఉంది..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.