Main Menu

Gollapudi columns ~ Dharmaraajula Kaalam (ధర్మరాజుల కాలం)

Topic: Dharmaraajula Kaalam (ధర్మరాజుల కాలం)

Language: Telugu (తెలుగు)

Published on: Dec 20, 2010

Source Credit: koumudi.net

Dharmaraajula Kaalam (ధర్మరాజుల కాలం)     

‘నిజం’కు ఒక్కటే సమాధానం. అబద్దానికి ఆరు రకాల సమాధానాలు . రెండు రెళ్ళు ఎంత? నిజం చెప్పాల్సి వస్తే – నిద్రలో లేపినా ఒక్కటే సమాధానం. నాలుగు. మరి ‘రెండు రెళ్ళు ఎంత? ‘ కి అబద్దపు సమాధానం? ఆరు కావచ్చు. ఏడు కావచ్చు. అరవై కావచ్చు. ఏదీ కాకపోవచ్చు. అతి స్తూలంగా ఒకనాటి నా నాటిక ‘రెండు రెళ్ళు ఆరు ‘కి ముడి ఇదే. నిజాయితీ పరుడికి ఒకటే దారి. ఆత్మవంచన చేసుకునేవాడికి అరవైదారులు. అందుకే ప్రముఖ రచయిత సోమర్సెట్ మాం అన్నాడు hypocracy is a full time job అని.

“రెండు రెళ్ళు ఎంత?”

అబద్దం చెప్పేవాడు “కిందటిసారి ఏం చెప్పాను?” అని భుజాలు తడువుకోవాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ‘తప్పు’లో కాలేస్తాడు.

నాకనిపిస్తుంది – భారత సైన్యంలో ‘అశ్వద్ధా ‘ అనే ఏనుగు ప్రసక్తి లేదు – అవసరమొచ్చినప్పుడు తప్ప. నాకింకా చిలిపి ఆలోచనలు చాలా వస్తాయి. “ఏ భీముడో, ఏ నకులుడో, ఏ సహదేవుడో చెపితే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు ఎందుకనలేదు? చెల్లదు. అబద్ధానికి ధర్మరాజే లాయకీ.

అలాంటి అధ్బుతమైన కథే ప్రస్తుతం మన దేశంలో జరుగుతోంది. ముందుగా కథ కాళ్ళూ చేతులూ చూద్దాం. ఒకప్పటికి టెలికాం మంత్రి ఏ.రాజాగారికి వాళ్ళ ఊళ్ళో కొందరు స్నేహితులున్నారు. ఓ హత్య జరిగింది. అందుకు సంబంధమున్న ఓ తండ్రీ కొడుకుల్ని వారు అర్ధించారు. రాజాగారి పాలన రెండు స్కాంలూ, మూడు స్పెక్ర్టంలుగా సాగుతోంది. ఆయన అధికార గర్వానికి అడ్డూ ఆపూలేని రోజులు “ఎవడ్రా ఆ న్యాయమూర్తి?” అని హుంకరించారు రాజావారు.

“రఘుపతి అనే న్యాయమూర్తి హుజూర్” అని చెప్పి ఉంటారు చంద్రమోహన్ అనే లాయరుగారు.

“ఆయనతో చెప్పు నేను బెయిల్ ఇవ్వమన్నానని. లేదా ఫోన్ ఆయనకియ్యి. నేను మాట్లాడతాను” అని నిప్పులు కక్కారు రాజావారు.

చంద్రమోహన్ అనే ఓ సాదా సీదా లాయరుగారు న్యాయమూర్తి రఘుపతి గారి గదిలోకి వెళ్ళి ఆ పని చేశారు. “ఫలానా రాజావారు మీతో మాట్లాడుతారు” అంటూ.

ఇక్కడ అసలు కథ ప్రారంభమయింది. న్యాయమూర్తి రఘుపతి కొరకరాని కొయ్య మాట్లాడకపోగా రాజావారు తమ పాలనాధికారాన్ని తన మీద చూపబోయాడని అప్పటి మద్రాసు ప్రధాన న్యాయమూర్తి గోఖలేగారికి లేఖ ద్వారా తెలియజేశాడు.

ఇక్కడినుంచీ కథ పాకాన బడింది. ఫలానా రాజావారు ఇలా చేశారని రఘుపతిగారు చెప్పారని గోఖలే గారు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ గార్కి ఉత్తరం రాస్తూ రఘుపతిగారి లేఖని జతచేశారు. బాలకృష్ణన్ ధర్మరాజు మార్కు నిజాయితీ పరుడు కాదు. నకులుడి మార్కు నిజాయితీ పరుడు. న్యాయంగా ఆయనే చర్య తీసుకోవచ్చు. కాని తీసుకోలేదు. ఎందుకు? తెలియదు.

ఇప్పుడా విషయం అడిగితే ఆయనకి విషయమే జ్నాపకం రాలేదు. క్రమంగా ఉత్తరం గుర్తొచ్చింది కాని అందులో ‘రాజా’వారి పేరున్నట్టు గుర్తులేదు. ఆయనేం చేశారు? కేంద్ర న్యాయమంత్రికి ఆ విషయం తెలియజేశారు.

ఇప్పుడు రంగంలోకి మరో ధర్మరాజు ప్రవేశించారు. వీరప్ప మొయిలీ అనే మంత్రిగారు. వారికి ఈ ఉత్తరం జ్నాపకం ఉంది. మరి ఆ ఉత్తరానికి ఫలానా జస్టిస్ రఘుపతిగారితో ఫలానా రాజావారు మాట్లాడదలిచినట్టు జస్టిస్ రఘుపతి రాసిన ఉత్తరం, ఆ ఉత్తరాన్ని పంపుతూ మద్రాసు న్యాయమూర్తి జస్టిస్ గోఖలే రాసిన ఉత్తరం – ఇవన్నీ జతచేసి ఉండాలి కదా? కాని విచిత్రంగా మెయిలీ ‘ధర్మరాజు ‘గారికి బాలకృష్ణన్ రాసిన ఉత్తరంలో (వీటన్నిటినీ జతచేసినా) రాజా వారి పేరు లేదట. పోనీ లేదనుకుందాం. “మీ పాలనలో ఒక మంత్రి ఇలాంటి అఘాయిత్యానికి పూనుకున్నాడు” అంటే ఆ మంత్రి ఎవరో ఆరా తీయాలికదా? కాని మంత్రి పేరులేని ఆ ఉత్తరాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలియజేసి ఆ ఫైలుని అటకెక్కించేశారట. బాబూ, అబద్దం చెప్పినా అతికినట్టుండాలి. అందుకే అడ్డమయిన వాళ్ళూ ధర్మరాజులు కాలేరు.

ఇప్పుడు భేతాళుడి ప్రశ్న. వీరిలో ఏ ధర్మరాజు నిజమైన ధర్మరాజు? బాలకృష్ణన్ గారా? మొయిలీ గారా? గోఖలే గారా? రఘుపతిగారా? చంద్రమోహన్ గారా? అందరూ ఈదేశ న్యాయ వ్యవస్థకి భుజం పట్టే పల్లకీ బోయీలు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే మీ బుర్ర వెయ్యి చెక్కలవుతుంది.
తెలియకపోతే? మీ ఖర్మ.

(ఈ ముగ్గురినీ – రాజా, బాలకృష్ణన్, వీరప్ప మొయిలి – నిజం పేరిట ఈ సమాజం హింసిస్తోందని వారనడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. వారు ముగ్గురూ దళితులే. ఇలాంటి అన్యాయాలని లోగడ కొందరు ఎత్తి చూపారు. ఈ దేశపు క్రికెట్ కెప్టెన్ గా దేశమంతా నెత్తిన పెట్టుకుని ఊరేగిన అజారుద్దిన్ గారు మాచ్ ఫిక్సింగ్ కారణంగా ‘వెలి ‘ అయినప్పుడు ఒక మాట అన్నారు: నేను మైనారిటీ వర్గం వాడిని కనుక అన్యాయం చేశారు – అని. అలాంటి మాటే ఈ దేశంలో సీనియర్ రాజకీయ వేత్త కరుణానిధి గారు రాజా విషయంలో అన్నారు – ఆయన దళితుడు కనుక ఆయన్ని బోనులో నిలబెడుతున్నారు – అని. అయ్యా, చావుకి పెడితే లంఖణానికి వస్తుందని సామెత. ఏ నిజం ఎప్పుడు కొంగుబంగారమవుతుందో, ఏ అబద్దం ఎలా కలిసొస్తుందో ధర్మరాజులకే ఎరుక!)

***

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.