Main Menu

Gollapudi columns ~ Eela Vese Vallu (ఈల వేసే వాళ్ళు!)

Topic: Eela Vese Vallu (ఈల వేసే వాళ్ళు! )

Language: Telugu (తెలుగు)

Published on: Sep 17, 2012

Eela Vese Vallu(ఈల వేసే వాళ్ళు!)     

తెలుగులో ఈ మాట లేదు కానీ -ఇంగ్లీషులో ఓ అందమైన మాట ఉంది -ఈల వేసేవాళ్లు (విజిల్‌ బ్లోయర్స్‌). తమ చుట్టూ జరిగే వ్యవహారాల్లో అన్యాయాన్ని ధైర్యంగా బట్టబయలు చేసేవాళ్లు. దీనికి ప్రధానంగా మూడు కావాలి. మొక్కవోని నిజాయితీ. నిజాన్ని చెప్పి నిలవగల దమ్ము, రెంటినీ సాధించే చిత్తశుద్ధి. వీటిలో ఏదిలోపించినా ఈల గోల అవుతుందేతప్ప -అసలు అవినీతికీ వీరి ప్రత్యేకమైన అవినీతికీ తేడా కనిపించదు. నాకెప్పుడూ ఏసుప్రభువు, మేరీ మాగ్డలీన్‌ కథ గొప్పగా కనిపిస్తుంది. ఈ కథని పాటని చేసి ”నేరం నాదికాదు ఆకలిది” అనే చిత్రంలో వాడాం. ఎన్టీఆర్‌ నాయకుడు. పతితురాలయిన స్త్రీని కొందరు రాళ్లేసి కొడుతున్నారు. ఏసుప్రభువు అడ్డుపడ్డారు. ”చేసేది మంచిపనే బాబూ. కాని మీలో ఏ తప్పూ చెయ్యనివారెవరో మొదటిరాయి విసరండి” అన్నారు. ఈల వేసేవారికి ముందు అర్హత అది. ఈల నిప్పు. గోల పోకిరీతనం. ఈల వేసేవాళ్లు అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సత్యదేవ డూబే. 2003లో వాజ్‌పేయిగారి హయాంలో దేశమంతటా నాలుగు రోడ్ల రహదారి (గోల్డెన్‌ క్వాడ్రీలేటరల్‌) రూపుదిద్దుకుంటున్న వ్యవహారంలో అవినీతిని బయట పెట్టబోయిన డూబేని మాఫియా దారుణంగా హత్య చేయించింది. అలాగే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కి చెందిన ఎస్‌.మంజునాథ్‌ ఘోరంగా హత్యకు గురయాడు. ఇంకా ఐయ్యేయస్‌ల అవకతవకల్ని బయట పెట్టబోయిన ఎమ్‌.ఎన్‌.విజయకుమార్‌, ఎస్‌.పి.మహతేష్‌ యిలాగే ఈల వేసి నేలపాలయారు. ఇది ఒక విధంగా సాహసం, త్యాగం -అంతకుమించి అవినీతిమీద పోరాటం. ఈ మధ్యనే గిరిప్రసాద్‌ శర్మ అనే ఓ హెడ్‌ కానిస్టేబులు లక్ష్మీనారాయణ అనే ఎస్పీగారిని ఓ గదిలో బంధించి, కుర్చీకి చేతులు కట్టి, గదిలో నలభై లీటర్ల పెట్రోలు గుమ్మరించి ఆయన్ని విడిపించబోతే నిప్పెట్టేస్తానని చక్కని బూతులతో బెదిరించాడు. ఈయన కోరిక పోలీసు రవాణా సంస్థలో అవకతవకల్ని సవరించాలని. హోంగార్డ్స్‌నే డ్రైవర్లుగా నియమించాలని. ఇవన్నీ మంచి ఆలోచనలే. కాని చెప్పుచ్చుకు కొట్టి నమస్కారం పెట్టడం ‘వినయం’ అనిపించుకోదు. ఈ శర్మగారు ఇప్పటికే నాలుగుసార్లు ఉద్యోగంలో సస్పెండు అయాడట. అవినీతికి లోనయిన వ్యక్తి నీతికోసం పోరాడడం -అదిన్నీ -డిపార్ట్‌మెంటుని బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం వ్యభిచారి భగవద్గీత వల్లించడం లాంటిది. మరో ఈల గోల. తూర్పుగోదావరి రంపచోడవరంలో పనిచేసే అసిస్టెంట్‌ పోలీసు సూపరింటెండెంట్‌ నవీన్‌ కుమార్‌గారు -తన పై ఆఫీసరు త్రివిక్రమ్‌గారు గంజాయి అక్రమ రవాణాదారులతో లాలూచీ పడుతున్నారని, తనమీద హత్యాప్రయత్నం చేశారని పత్రికలవారిముందు ప్రకటించారు. అదే నిజమైతే ఆ ఆఫీసరు శిక్షార్హుడే. సందేహం లేదు. కానీ ఈ విధంగా ఒక జూనియర్‌ ఆఫీసరు పత్రికలకెక్కడం రుజువయిన నేరం. డిపార్టుమెంటులో పనిచేసే ఐపీఎస్‌ ఉద్యోగికి ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి తెలియకుండా ఉండదు. ఏ కారణానికయినా ఏ ఆఫీసరయినా పత్రికలకెక్కడం నిషిద్దం. కాగా తన పై ఆఫీసరుమీదే అభియోగం బహిరంగంగా చేయడం -ఒకవేళ అది నిజమైనా -అది నేరం. ఈ ఆఫీసరు విచక్షణారాహిత్యానికి అందరూ షాకయారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఈ నవీన్‌ కుమార్‌ని సస్పెండు చేసింది. అది సబబు. ఈల వేసే వ్యక్తిలో చిత్తశుద్ధి ఆ ఈలకి బలాన్నిస్తుంది. సత్యదేవ డూబేని హర్షించడానికీ, నవీన్‌ కుమార్‌ని గర్హించడానికీ అదే తేడా. ఏ ఉద్యమానికయినా -ఆ ఉద్యమకారుని వ్యక్తిత్వమే నిలువుటద్దం. అలనాటి మహాత్ముడు, పొట్టిశ్రీరాములు, నిన్నటి అన్నా హజారే -యిందుకు నిదర్శనాలు.

ఇంకా విశేషమేమంటే -హైదరాబాద్‌లో కొందరు తెలంగాణా న్యాయవాదులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి -నవీన్‌ కుమార్‌ సస్పెన్షన్‌ ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ఆయన తెలంగాణా ఆఫీసరు కనుక దురుద్దేశంతో ఆయన్ని బలిపశువును చేశారని అన్నారు. విశేషమేమిటంటే ఈ మంత్రిగారు తెలంగాణా ప్రాంతీయురాలు. లోగడ -పిఎస్‌ఆర్‌ ఆంజనేయులనే ఎస్పీ ఇలాగే పత్రికలవారికి ప్రకటనలిస్తే చూపిన అలసత్వమే నవీన్‌ కుమార్‌కీ చూపాలని వీరన్నారు. ఒక తప్పు మరో చర్య రద్దుకి మార్గదర్శి కావాలని వారి ఉద్దేశం. పైగా వీరంతా న్యాయవాదులు. ఈ మధ్య ఈలని గోలగా మార్చే ప్రయత్నాలు బోలెడు జరిగిపోతున్నాయి. దేశంలో అవినీతిని రూపుమాపాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ గొంతు విప్పగానే ఆయన గొంతు నొక్కడానికి అప్పుడెప్పుడో ఆయన సర్వీసులో ఉండగా జరిగిన స్కాలిత్యాన్ని బయటికి లాగింది ప్రభుత్వం. లక్షల కోట్ల కుంభకోణం బొగ్గు తవ్వకాలలో జరిగిందని రాజ్యాంగం మద్దతు ఉన్న కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ సహేతుకంగా నిరూపిస్తే ప్రధానమంత్రే స్వయంగా పార్లమెంటులో ఆ వ్యవస్థనే తప్పుపట్టారు. మరొకపక్క -దోపిడీ జరిగిందంటూ కొన్ని కాంట్రాక్టులు రద్దుచేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సంస్థాగతమైన ఆత్మవంచనకి దగ్గరతోవ. ఈ దేశంలో ఈల వేసే నిజాయితీపరుల అవసరం ఎంతయినా ఉంది. అయితే వారు సత్యదేవ్‌ డూబే కావడమూ దురదృష్టమే. నవీన్‌ కుమార్‌ కావడమూ దురదృష్టమే. మరొక్కసారి ఈల నిప్పు. గోల పోకిరీతనం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.