Main Menu

Gollapudi columns ~ Gāndhīlu puṭṭina dēśaṁ (గాంధీలు పుట్టిన దేశం)

Topic: Gāndhīlu puṭṭina dēśaṁ (గాంధీలు పుట్టిన దేశం)

Language: Telugu (తెలుగు)

Published on: May 10, 2010

Source Credit: koumudi.net

Audio: Gāndhīlu puṭṭina dēśaṁ (గాంధీలు పుట్టిన దేశం)     

దాదాపు పాతికేళ్ళ కిందట నేను “అభిలాష” అనే సినిమాలో నటించాను. ఉరిశిక్ష రద్దుచేయాలన్న ఆదర్శాన్ని చాటే చిత్రమది. చివరలో చిరంజీవి వాదనని నేనే రాశాను. ఓ నిరపరాధికి శిక్షపడితే శిక్షించకుండాకాపాడే స్థితికి ‘అభిలాష’ తత్వాన్ని వంటబట్టించుకున్న తరంలో మనం జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది.

నిన్న “అమ్మయ్య, కసాబ్ కి ఉరిశిక్ష పడింది” అని నిట్టూర్చినవారున్నారు. ‘అసలు ఈ ఉరిశిక్ష ఎప్పటికైనా అమలు జరుగుతుందా?’ అని వాపోయేవారు బయలుదేరారు.కసాబ్ ని ఉరితీయాలన్న విషయంలో చాలామందికి అభిప్రాయబేధాలు లేవు. మొన్న ఒక టీవీ ప్రోగ్రాంలో గొంజాలిస్ అనే ఓ మానవ హక్కుల సంఘ ప్రతినిధి కసాబ్ వంటి కుర్రవాడిని రక్షించి అతని మనస్సు మార్చడంలోనే సంస్కారం ఉంది, అతన్ని ఉరి తీయడం కేవలం మన పగని చాటుకోవడం, మానవాళి – ముఖ్యంగా మనం – మన చేతికి రక్థం కాకుండా చూసుకోవాలని వాక్రుచ్చారు. మిగతావారంతా కసాబ్ ని ఉరితీయాల్సిందేనన్నారు. చనిపోయిన ముంబై కమీషనర్ గారి భార్య కసాబ్ ని నడిరోడ్డుమీద ఉరితీయాలని ఆవేశపడ్డారు.

162 మంది చావుకి కారణమయి,మరికొంతమందిని చంపలేనందుకు బాధపడి, 154 కోట్ల నష్టానికి కారకుడయిన 21 సంవత్సరాల కుర్రాడికి సుమతీశతకం, వేమన శతకం నేర్పి సంస్కరించవలసిందే. కాదనను. ఓ నేరస్తుడిని 28 సంవత్సరాలు బంధించకుండా ఆ రోజే చంపేసి ఉంటే దక్షిణాఫ్రికాకి మొదటి రిపబ్లిక్ అధ్యక్షుడు నెల్సన్ మండేలా – ఉండేవాడు కాదు.కసాబ్లో మారే లక్షణాలు చాలావున్నాయి. జైల్లో ఉన్ననాటికే అతను ఉర్దూ పేపర్లు చదువుకోవాలని ఉత్సాహం చూపించాడు. బిరియానీ తినాలన్న కోరిక కలిగింది. విక్టోరియా టెర్మినస్ లో మారణ హోమం జరిగినప్పుడు తను సినిమా హాలులో సినిమా చూస్తున్నానని చెప్పే చిన్న చిన్న అబద్దాలతో సరిపెట్టుకున్నాడు. ఇవన్నీ గొంజాలిస్ ద్రుష్ట్యా ఆలోచిస్తే మంచి పరిణామం కిందే లెక్క.

ఇక్కడొక చిన్న మెలిక ఉంది. కొందరి జీవహింసని భరించలేరు – గాంధీ పుట్టిన దేశంలో పుట్టిన వారు కనుక. కొందరు నేరస్తుడిని శిక్షించాలని అన్నా, మనస్సులో “అహింస” పరమార్ధంగా భావించే నాయకులుంటారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. ఒకరు చెప్పి చేయాలంటారు. మరొకరు చేసి చూపిస్తారు. అదిగో. ఆ రెండో తరంవారే మన దేశనాయకులంతా.

ఈ విషయాన్ని తమకు సోదాహరణంగా నిరూపిస్తాను. గత 20 సంవత్సరాలలో – అంటే ‘అభిలష ‘ తర్వాత ఉరిశిక్షలు పడిన ఎవ్వరినీ – మన ప్రభుత్వాలు – యుపిఏ కానివ్వండి, ఎన్ డి ఏ కానివ్వండి ఒకే మాటమీద నిలబడి ఇంతవరకూ ఎవరికీ శిక్షలు అమలు జరపలేదు. 1991 లో పార్లమెంటు మీద దాడిచేసిన వారిలో నేరార్హుడని సుప్రీం కోర్ట్ నిర్దారణ చేసిన అఫ్జల్ గురు దగ్గర్నుంచి, అలనాటి రాజీవ్ గాంధీ హంతకుల దాకా అందరూ జైళ్ళలో హాయిగా ఉంటున్నారు. వీళ్ళు చివరలో తమ మీద దయ చూపి శిక్షతగ్గించమని రాష్ట్ర పతికి పెట్టుకున్న 51 మంది దరఖాస్తులు అక్కడే ఉంచేశారు. ఇంతకన్నా మనదేశంలో గాంధీ తత్వం నిలదొక్కుకున్నదనడానికి మంచి ఉదాహరణ లేదు.

కాగా, వీరి వల్ల కొన్ని లాభాలున్నాయి. ఎప్పుడేనా తాలిబన్లు వంటి ముష్కరులు మన విమానాల్ని ఎత్తుకుపోతే 150 మందిని రక్షించుకోవడానికి మసూద్ అజర్ లాంటి వారు ఉపయోగపడతారు. అలాగే ఏ కాశ్మీర్ ముఖ్య మంత్రిగారి అమ్మాయినో (ఉదా: రుబియా సయీద్) ఎవరేనా ఎత్తుకుపోతే వీరు అవసరానికి ఉపయోగపడతారు. మనం అన్యాయంగా మసూద్ అజర్ ని పాకిస్థాన్ కి అప్పగించేశామని జుత్తు పీక్కొనేవారి మీద నాది ఒకటే సమీక్ష. అది వారి దృష్టి బేధమని. సగం నిండిన పాలగ్లాసులో ఒకరికి సగం ఖాళీగా ఉండడమే కనిపిస్తుంది. మరొకరికి సగమయినా పాలుండడం కనిపిస్తుంది.మసూద్ అజర్ని అప్పగించామని బాధపడవద్దు.150 మందిని రక్షించుకున్నాం అని సంబరపడదాం.

పైగా మనకి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా వంటి ఆడగాంధీలున్నారు. తన తండ్రిని చంపిన వారిమీద తనకు కసిలేదని ఆ పిల్ల చక్కని చిరునవ్వుతో టీవీ కెమెరాల ముందు చెప్పగలదు. కాని చెయ్యని నేరానికి వాళ్ళ నాన్నతో పాటు ప్రాణాలను పోగొట్టుకున్న 18 మంది ఏం పాపం చేశారో, వారి పిల్లలూ అంత ఉదారంగా ఆమెను క్షమించగలరో లేదో ఎవరూ అడగరు.

మన దేశం కర్మభూమి. కష్టాల్ని చూసి కరిగిపోతాం. కథలు చెప్పుకుని ఆనందిస్తాం. ఎవరేనా బాధపడితే అయ్యో అంటాం. అన్యాయమయిన 162 మంది కంటే, ప్రస్తుతం కసాబ్ కార్చిన కన్నీరు మంచి రుచికరమైన కథలాగ కనిపిస్తుంది. పండులాంటి ఇటలీ – భారత దొరసాని ప్రియాంక వాళ్ళ నాన్న హంతకిని సుప్రీం కోర్ట్ శిక్షించినా క్షమించే పెద్ద మనస్సు చేసుకోగలగడం మంచి మెలోడ్రామా. తన కొడుకుని పెద్ద చదువులు చదివించుకోవాలని కలలుగన్న ఓ కానిస్టేబులు ఆ రోజు రాజీవ్ గాంధీ పక్కన నిలబడిన పాపానికి అతని కొడుకు భవిష్యత్తు, తన భార్య మంగళసూత్రం, రోగిష్టి తండ్రిని బతికించుకునే అవకాశం – ఇది ఆలోచించిన కొద్దీ భయపెట్టే మెలో డ్రామా. 30, 40 ఏళ్ళ క్రిందట హిట్లర్ కాలంలో మారణ హోమం చేసి ఎప్పుడో దశాబ్దాల తర్వాత దొరికిపోయిన నాజీలను విచారించి ఉరితీసినప్పుడు బాధతో ఆత్మహత్య చేసుకున్న కథలున్నాయి. మానవ స్వభావం గతాన్ని నెమరు వేసుకుంటుంది. వర్తమానంలో జీవిస్తుంది. 26/11 నాటి 162 మంది తల్లుల కథలు గుర్తు. ప్రస్తుతం కోర్టులో కసాబ్ కన్నీళ్ళు వర్తమానం.

26/11 సంఘటన వెనక 162 కథలున్నాయి. వినే మనసుంటే 162 గ్రంధాలవి. తల్లినీ తండ్రినీ పోగొట్టుకుని – ఆ నష్టం ఏమిటో తెలియక – ఇజ్రేలులో తాతగారింట్లో పెరుగుతున్న పసివాడి కథ చిన్న నమూనా మాత్రమే.

నా ఆనందమల్లా జైలులో అఫ్జల్ గురుకి ఇన్నాళ్ళకి తోడు దొరికింది – కసాబ్ రూపేణా. వారిద్దరూ మరో ఖాందహార్ విమానానికి ఎదురుచూసూ కాలం గడుపుతారు. మరో పదేళ్ళ తర్వాత కొత్త తరానికి వీళ్ళని జైళ్ళలో ఉంచడం అన్యాయమని తోస్తుంది. అప్పటికి బోలెడంతమంది గొంజాలిస్ లు పుడతారు. ఏతావాతా భారతదేశం “అహింసకి మరో విధంగా పట్టం కడుతుంది.

ఈ కేసులో తీర్పుని ఇస్తూ న్యాయమూర్తి తహల్యానీగారు ఓ మాట అన్నారు. ఇలాంటి నేరస్తులకి తగిన శిక్ష వెయ్యకపోతే ఈ దేశంలో నేలబారు మనిషికి న్యాయ వ్యవస్థమీద విశ్వాసం పోతుందన్నారు. అయ్యా, తమరు క్షమిస్తే ముందు పడిన 51 శిక్షలూ అమలు జరగని నేపథ్యంలో న్యాయవ్యవస్థ మీద 51 సార్లు నేలబారు మనిషి విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. శిశుపాలుడి వంద తప్పులాగ – ఆ విశ్వాసాన్ని పునరుద్దరించడానికి ఈ ప్రభుత్వం – పోనీ ఏ ప్రభుత్వమైనా – మొదట 51 చర్యలను తీసుకోవాలి. అప్పుడు ప్రజల విశ్వాసం మాట.

కిట్టని వాళ్ళు మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి ఈ అలసత్వం ఒక సాకని అంటారు. లేకపోతే ఇందిరా గాంధీని చంపిన సిక్కుని ఉరితీయగలిగిన ప్రభుత్వం 20 ఏళ్ళు 51 మందిని ఏమీ చెయలేక్పోతోందేం? ఏమైనా కిందటి తరానికి ఒక్కడే గాంధీ. ఈ తరానికి ప్రతీ ప్రభుత్వంలోనూ ఎందరో గాంధీలు!.

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.