Main Menu

Gollapudi columns ~ Gathamentho Ghanakeerthi (గతమెంతొ ఘనకీర్తి)

Topic: Gathamentho Ghanakeerthi (గతమెంతొ ఘనకీర్తి )

Language: Telugu (తెలుగు)

Published on: July 09, 2012

Gathamentho Ghanakeerthi(గతమెంతొ ఘనకీర్తి)     

ఈ మధ్య టీవీలో ఏదో ఛానల్‌లో ఓ సరదా అయిన కార్యక్రమాన్ని చూశాను. రామబాణం అణ్వస్త్రమా? ఆ విస్ఫోటనానికీ నిన్నకాక మొన్న (పోనీ 77 సంవత్సరాల కిందటి) విస్ఫోటనానికీ ఏమైనా పోలికలున్నాయా అంటూ ఎన్నో చిత్రాలు, రుజువులతో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇదేమిటి దేశం ఇంత వెనక్కు పోతోందా అని ఆశ్చర్యపోయాను. ఇంతలో ఈ ’దైవ కణం ’ ప్రసక్తి. వివరాలు మనకి చాలా అర్థం కావు. వద్దు. గత నలభై అయిదు ఏళ్లుగా కొన్ని వందలమంది పరిశోధనలు చేస్తున్న విషయానికి చిన్న తలా తోకా దొరికినందుకే పీటర్‌ హిగ్స్‌ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. దీనికి ’హిగ్స్‌బోసోన్‌ ’ కణం అని పేరుపెట్టారట. నాకాశ్చర్యం లేదు. ఇదే మన దేశంలో అయితే దీనికి ’సోనియోన్‌ ’ అనో, ’రాహులోన్‌ ’ అనో, ’రాజీవోన్‌’ అనో పేరు పెట్టాలని ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసేది. సిపిఐ, బిజెపి దీన్ని వ్యతిరేకించేవారు. అసలు విషయాన్ని వదిలేసి (అసలు విషయం ఎవరికయినా తెలిసి చస్తేకదా) 60 ఏళ్ల కిందటి కార్టూన్‌ని రాజకీయం చేసిన ’నవ్వుకోవడం ’ తెలీని రాజకీయ నాయకులున్న దేశం ఇది. ప్రతీవాడికీ పెద్ద భుజాలున్నాయి -తడువుకోడానికి.

సరే. హిగ్స్‌ మాటల్లో ’సృష్టిలో ఈ కణం సర్వాంతర్యామి ’ అన్నారు. The particle is omnipresent and imperceptible. It is likely to shed light on other mysteries of the universe. ఇవీమాటలు. ఒకాయన చాలా దశాబ్దాల కిందట ఈ మాటే చెప్పాడు: ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై. ఎవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు.. అంటూ. దీన్ని ఇంగ్లీషులో అనువదిస్తే హిగ్స్‌ ప్రకటన అవుతుంది.

అణ్వస్త్రాల రహస్యాలంటే బాంకుల్లోనో, కర్మాగారాల్లోనో దాచేవికావు. మేధస్సుతో దర్శించిన శాస్త్రీయమైన ప్రయోగాలు. మనకి నమ్మకం లేకపోతే పొరుగుదేశం ఐ.క్యూ. ఖాన్‌ని అడిగితే తెలుస్తుంది. ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి -ఒకాయన్ని 16వ యేటనుంచీ రుషులు అడవులకు తీసుకుపోయారు. మరో 14 ఏళ్లు ఈ అస్త్రాల రహస్యాలను ఆయనకి అప్పగించారు. లోకకళ్యాణం వారి లక్ష్యం. ఇరాన్‌కి అమ్ముకోవడం కాదు. దుష్టసంహారం ఆదర్శం. ఆ రుషుల్లో ఐ.క్యూ. ఖానుల్లేరు. ఇప్పుడిప్పుడు టీవీలకు ఈ అణ్వస్త్రాల వివరాలు అందుతున్నాయి.

ఏతావాతా, దీన్ని ’దైవకణం ’ అని ఎందుకన్నారు సృష్టిలో ఇంత సమగ్రమైనదీ ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైనదీ ఇంత బలమైనదీ మరొకటి లేదు కనుక. సృష్టిలో ఈ శక్తికి మరో పేరు అందదు కనుక. అతి ప్రాథమికమయిన -నా అనుభవంలోకి వచ్చిన ఒక ఉదాహరణని చెప్తాను. నేను సినీనటుడిని అయే తొలిరోజుల్లో -1981 ప్రాంతంలో తలమీద నుంచి నుదురు వరకూ పాకే సోరియాసిస్‌ ఉండేది. భయపడి -దేశంలోకల్లా పెద్ద చర్మవ్యాధి నిపుణుడు, డాక్టర్‌ బి.సి.రాయ్‌ బహుమతిని అందుకున్న డాక్టర్‌ తంబయ్య (పూనమల్లి హైరోడ్డులో దాశ్ ప్రకాష్‌ హోటల్‌కి ఎదురుగా ఆయన క్లినిక్‌) దగ్గరికి వెళ్లాను. ఆయన పరీక్ష చేసి తలకి నువ్వుల నూనె రాసుకుని పది నిముషాలు ఉదయం ఎండలో నిలబడి స్నానం చెయ్యమన్నాడు. ’చర్మవ్యాధులు రాకుండా ఉండాలంటే సరిగ్గా ఆ పనే చెయ్యరావెధవాః ’ అని మా అమ్మమ్మ చెప్పేది. మరి పది నిముషాలు ఏం చెయ్యాలి ’సూర్యనమస్కారాలు ’ చేసుకో అనేది. నేను ఇప్పుడు హిందూ పేపరు చదువుకున్నాను. మనం సింబల్స్‌ని వదిలి ’హిందూ పేపరు వల్ల చర్మవ్యాధులు పోతాయా ?’ అని నవ్వుకునే తెలివితేటల్ని పెంచుకున్నాం. రుషులు గుహల్లో సంవత్సరాల తరబడి యోగముద్రలో ఉంటారు. అన్ని రోజుల తాటస్థ్యాన్ని శరీరం తట్టుకోలేదు. కీళ్ల నొప్పులకీ, గుండె నొప్పికీ, గర్భకోశ సమస్యలకీ వారు హిమాలయాలనుంచి అపోలో ఆసుపత్రికి రాలేరు. రారు. మరెలాగ కేవలం కూర్చునే, సాగిలపడే, నిలబడే పద్ధతులలో -ఆసనాల ద్వారా తమ రుగ్మతల్నితీర్చుకుని ఏకాంతాన్ని కాపాడుకునే పద్ధతుల్ని శతాబ్దాల తరబడి నిర్దేశించుకున్నారు తమకు తామే. ఇవి ఎంపెరికల్‌ సాధనాలు. యోగాసనాలు. క్రమంగా అది శాస్త్రమయింది. వీటిని అమెరికా పేటెంటు చేశాక మనకి ఆసక్తి పెరిగింది. ఇది సైన్సుని తలదన్నే తాత. మనం చాలా చదువుకున్నాం. చదువులసారమేమిటో తెలియనక్కరలేనంత చదివాం. ఆడా మగా తేడా లేకుండా సంస్కారాన్ని మరిచిపోయి, రెచ్చిపోయి -మన తెలివితేటల కందని వాటిని ప్రశ్నించే ’కుహనా ’ తెలివితేటల్ని పెంచుకున్నాం. 45 సంవత్సరాల పైగా పరిశోధనలు జరిపి -ఫలితాలకు ’దైవం ’ పేరుతప్ప మరోమాట చెల్లదని ఓ విదేశీయుడు తేలిస్తే భుజాలు తడువుకుంటాం. పోతనకాక హిగ్స్‌ దొరగారు చెప్తే మనకి నచ్చుతుంది. మనం ప్రస్తుతం విషవృక్షాల ఛాయల్లో ఉన్నాం. ఒక చిన్న అలవాటుని పెంచుకోమని మన పెద్దలు ఏనాడో చెప్పిన మాటని మనం మరిచిపోయాం. ఆ మాట పేరు ’విశ్వాసం ’

అదొక్కటే ఉంటే ప్రపంచం మన కాళ్ల దగ్గర ఉండే వైభవం మన సంస్కృతిలో ఉంది. ప్రస్తుతం దొరగారు చెప్పే ’దైవకణం ’ దాకా మన తెలివి ప్రయాణం చేస్తోంది. శుభం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.