Main Menu

Gollapudi columns ~ Jaatheya Avineethi (జాతీయ అవినీతి)

Topic: Jaatheya Avineethi (జాతీయ అవినీతి)

Language: Telugu (తెలుగు)

Published on: Nov 22, 2010

Source Credit: koumudi.net

Jaatheya Avineethi (జాతీయ అవినీతి)     

అనగనగా ఒక గోపి. ఒక జర్నలిస్టుగా ఉద్యోగం కోసం ఢిల్లీలో ‘పయినీర్ ‘ పత్రిక ఆఫీసుకి వచ్చాడు. ఢిల్లీలో ఏనాడూ పనిచేసినవాడు కాడు కనుక, ఎడిటర్ చందన్ మిత్రా కాస్త సందేహించాడు. అయినా అడిగిన జీతం బొత్తిగా నేలబారు జీతం కనుక – మునిగిపోయిందేంఉందిలే అనుకుని మూడు నెలలు టెంపరరీ నౌఖరీ ఇచ్చాడు. ఢిల్లీ ఆనుపానులూ, పోకడలూ, గుట్టులూ తెలియని జర్నలిస్టు అక్కడ సాధించగలిగేదేముంటుంది. గోపీ ఏమీ సాధించలేదు. మూడు నెలలూ గడిచిపోయాయి.

గోపీ ఆసక్తి, ఏదో చెయ్యాలన్న తపన, శ్రద్ధ ఎడిటర్ గారిని ఆకర్షించాయి. కాగా, ఢిల్లీ లెక్కల్లో అతనికిచ్చే జీతం బొత్తిగా హాస్యాస్పదం. మూడు నెలల తరువాత ఉద్యోగం ఖాయం చేశారు. కాని అదే జీతాన్ని కొనసాగించారు. అతనికి టెలికాం వ్యవహారాల మీద, వామపక్ష పార్టీల మీదా ఆసక్తి ఉన్నట్టు ఎడిటర్ గారి చెవులదాకా వెళ్ళింది. అయితే ఆసక్తి వేరు. ఏదో సాధించడం వేరు. కాని…కాని… 2008 లో భూమి బద్దలయింది.

ఉన్నట్టుండి స్వాన్, యూనీ టెక్ సంస్థలు భయంకరమైన ధరలతో షేర్లు అమ్మడం గోపీ దృష్టిలోకి వచ్చింది. 4500 కోట్లు, 6200 కోట్లు చేతులు మారుతున్నాయి. కొనడానికి ఇచ్చింది గడ్డిపరక. లాభం గూబలు పగిలే బంగారం. ఏమిటిది! అక్కడినుంచి గోపీ అన్వేషణ ప్రారంభమయింది. క్రమంగా మంత్రి ఏ.రాజాగారివీ, మంత్రాలయంలో రకరకాల ఆఫీసర్ల లీలలు వెలుగులోకి వచ్చాయి. వస్తున్న కొద్దీ భూమి బద్దలయే నిజాలు. కొత్త కథలకి కాళ్ళూ చేతులూ మొలిచాయి. ఈ దేశానికంతటికీ సాలీనా ఖర్చయ్యేంత సొమ్ము దేశం నష్టపోయింది. మంత్రిగారి జేబులోకి వెళ్ళాల్సిన రొక్కం బినామీ కంపెనీల పేరిట ఎలా, ఎక్కడికి అడ్రసులు మారిందో తెలిసి వచ్చింది. ఇందులో కార్పోరేట్ సంస్థలు డబ్బు చిమ్మారు. రాజకీయ నాయకులూ, వత్తాసుదారులూ గడ్డి కరిచారు.

ఎన్నో కొత్త కొత్త రియలెస్టేట్ బినామీ సంస్థల గోత్రాలు బయటపడ్డాయి. మంత్రిగారు ఖజానా ఎక్కడుందో తెలిసింది. 2008 డిసెంబరు 11 న బ్రహ్మ ముహూర్తం. రాజాగారి బినామీ కంపెనీ గ్రీన్ హౌస్ ప్రమోటర్స్ కథ అచ్చయింది పయొనీర్ లో. అంతే. మంత్రిగారి మీద పిడుగు పడింది. చాలామంది పునాదులు కదిలాయి. రాజాగారు గోపీని పిలిపించారు. “ఈ వివరాలు, నా వ్యక్తిగతమయిన ఆదాయాల కథ నీకెలా తెలిసింది” అని కదిలిపోతూ అడిగారు. గమనించాలి. నిజం కాదని అనలేదు. ‘ఎలా తెలిసింది? ‘ అని వాక్రుచ్చారు. ఇక ముందు ఈ కథ రాయొద్దని వేడుకున్నారు. బతిమాలారు. మరొక పక్క కార్పొరేట్ సంస్థల పునాదులూ కదిలాయి. వాశ్ళ్ళూ గోపీ కాళ్ళు పట్టుకున్నారు. రాయొద్దని మొత్తుకున్నారు. గోపీ ఎన్నడూ కనీవినీ ఎరగనంత డబ్బిస్తామన్నారు.

అసలు కథ ఎడిటర్ దాకా వెళ్ళకుండా ప్రచురణ నిలిపేయమన్నారు. వాళ్ళని కలుస్తున్న విషయం ఎడిటర్ కి చెప్పే వచ్చానన్నాడు గోపీ. వాళ్ళ గగ్గోలు సంగతి చందన్ మిత్రాకి చెప్పాడు.

ఈసారి కొత్తరకం ‘నాటకం ‘ ప్రారంభమయింది. గోపీని తమకు బాగా తెలుసని, అతన్ని కొనడం ఎలాగో తమకు అవగాహన ఉన్నదని మంత్రిగారిని నమ్మించి మధ్యవర్తులు కొందరు పుష్కలంగా డబ్బు చేసుకున్నారు. నీచు ఉన్న చోటే పురుగులు ఉంటాయి. జీవిస్తాయి. కాగా, పాపపు సొమ్ము పదిమందికి లాయకీ. కొందరు – మరీ కొమ్ములు తిరిగిన మధ్యవర్తులు రెండువేపులా పదును ఉన్న కత్తులు.. రాజాగారు రంకుని గోపీకి చెప్పి గోపీ కథనాన్ని రాజాగారికి ‘దిమ్మ ‘తిరిగేలాగ చేరవేసి ఎక్కువ సొమ్ముని సొంతం చేసుకున్నారు. కొందరు శత్రువర్గం నాయకులు ‘కథ’ల్ని ప్రచురించమని గోపీని ఎగదోశారు. కొందరు ఆఫీసర్లు (లాభసాటి ఆఫీసర్లంటే కిట్టనివాళ్ళు, తమ జేబులు నిండలేదని క్రుంగిన వాళ్ళు), పోలీసు ఆఫీసర్లు గోపీకి కొమ్ము కాశారు. గోపీ లక్ష్యం పత్రికలో కథలే.

కాని లక్షల కోట్లు చేతులు మారే ఈ మహా యజ్నంలో ఇన్ని తిమింగలాలు, రాబందులూ ఉండగా – జె.గోపాల కృష్ణన్ వెరసి గోపీ అనబడే ఈ ‘చిన్న ‘ మేకుని ఏకులాగ ఎందుకు నేలమట్టం చేయలేదా అని. మూడు కోతులూ కథలాగ నిజం తెలిసినా, విన్నా చూసినా, చెప్పినా చంపడం – మన దేశంలో ఆనవాయితీ కదా? లోగడ సతీష్ శెట్టి, సత్యేంద్ర డూబే, రుద్రప్ప వంటి కథలు మనకు ఉన్నాయి కదా?
బహుశా తమ గల్లా పెట్టెలను – కనీ వినీ ఎరగని సొమ్ముతోనే అద్దుకునే యావలో ఇలాంటి ‘గడ్డిపోచ ‘ తలెత్తుతుందని ఎవరూ ఊహించి ఉండరు. రాజా వంటి అవినీతి పరులకీ, బీహారు, కర్ణాటక అవినీతి పరులకీ ఓ తేడా ఉంది. రాజా కేవలం సొమ్ము తింటాడు. మిగతా నాయకులు మనుషుల్ని తింటారు. ఈ యజ్నంలో సమిధ కానందుకు ఒక విధంగా గోపీ అదృష్టవంతుడు.

కాని ఎవరికీ అర్థంకాని ‘కొసమెరుపు ‘ ఈ కథలో ఉంది. మన్మోహన్ సింగు గారి వంటి మేధావి, సత్యసంధుడు, నిజాయితీ పరుడూ – కాళ్ళకింద భూమిని తొలిచేసే భూకంపం తన చుట్టూ ప్రబలుతూంటే – ఏమీ తెలియలేదా? తెలియకుండా తలపక్కకి తిప్పుకున్నారా? తెలిసినా ఏమీ చెయ్యలేనంత ‘పెద్ద ‘ మనుషులకి ఇందులో వాటా ఉందా?

అవినీతి రెండు రకాలు. చేతులకి మట్టి అయేటట్టు చేసేది. చెవుల దాకా వచ్చి ఆగిపోయేది. భీష్ముడు సత్యసంధుడే. కాని కళ్ళముందు ఓ మహిళ వస్త్రాపహరణం జరుగుతూంటే ఏమీ చెయ్యని తాటస్థ్యం కారణంగా ఆ అవినీతిలో ఆయనకీ వాటా ఉంది. తెలిసినా కళ్ళుమూసుకోవడం – ప్రస్తుతానికి – మన్మోహన్ సింగ్ గారు – రెండో విడత ప్రధానిగా గద్దె ఎక్కిన తర్వాత నేర్చుకున్న సుకుమారమైన భీష్మ చర్యగా మనం సరిపెట్టుకోవచ్చును.

ఖాండవ దహనానికి ఒక్క నిప్పురవ్వే మూలం. రాజావారు సపరివారంగా ‘తీహార్ ‘ చేరడానికి ఒక్క గోపీ చాలు. ముందుంది ముసళ్ళ పండగ.

***

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.