Main Menu

Gollapudi columns ~ Kalmadiki Boru Kodutondi(కల్మాడీకి బోరు కొడుతోంది)

Topic: Kalmadiki Boru Kodutondi(కల్మాడీకి బోరు కొడుతోంది)

Language: Telugu (తెలుగు)

Published on: June 06, 2011

Kalmadiki Boru Kodutondi(కల్మాడీకి బోరు కొడుతోంది)     

నన్నెవరయినా “మీరేం చేస్తూంటారు?” అనడిగితే – ” వెధవ్వేషాలు వేస్తూంటాను – సినిమాల్లో” అంటూంటాను. మరోసారి “ముఖాన్ని అమ్ముకుని బతుకుతూంటాను” అంటాను. నేనే వేషం వేసినా, మిత్రులు రావుగోపాలరావుగారూ నేనూ షూటింగులలో కలవక పోయినా ‘క్లైమాక్స్ లో కలుస్తాం లెండి ‘ అనుకునేవాళ్ళం. ఎందుకంటే తప్పనిసరిగా క్లైమాక్స్లో మా ఇద్దరినీ శిక్షిస్తే కాని కథ పూర్తికాదు. ఇద్దరం కనీసం రెండు రోజులయినా కోర్టు బోనులో నిలబడేవాళ్ళం. హీరో మమ్మల్ని దుయ్యబడతాడు. జడ్జిగారు మాకు శిక్షవేస్తాడు. అప్పుడు శుభం కార్డు. మా అదృష్టం బాగుంటే సినిమాలో ‘చావు’ ముందే వస్తుంది. ముంచుకొస్తుంది. మిత్రులు మోహన్ బాబుతో నేను విలన్ గా నటించిన సినిమా ‘పద్మవ్యూహం’. ఇప్పుడు టీవీ ప్రోగ్రాం చేస్తున్న ఆయన కుమార్తె లక్ష్మిని ఎత్తుకుని నటించిన గుర్తు కాంచీపురం ఆలయంలో. క్లైమాక్స్ లో నా మీద రకరకాల పాముల్ని విసురుతారు – నన్ను హింసించడానికి. పాములకి మనుషులంటే భయం. నాకు పామంటే చీదర. “ఇదంతా చూశాక ప్రేక్షకులకి విలన్ మీద సానుభూతి పెరిగిపోతుందయ్యా” అనేవాడిని.

ఇంత వివరంగా ఈ పూర్వాశ్రమాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం – నిజజీవితంలో రకరకాల ఆటలు ఆడించి – డబ్బుకోసం నానా నాటకాలూ ఆడి వందల కోట్ల ఫలహారం చెయ్యడానికి కారణమయిన క్రీడాకారులు సురేష్ కల్మాడీ గారు. మొన్నటి కామన్వెల్తు ఆటల్లో జ్యోతిని వెలిగించడానికి బ్రిటిష్ రాణి సరసన నిలిచారు. క్రీడలు అయాక బహుమతి ప్రధానానికి మన ప్రధాని సరసన నిలిచారు. ప్రస్తుతం తీహార్ జైలులో 10×12 అడుగుల జైలు గదిలో నిలిచారు. అవినీతికి చక్కని, తప్పుని ముగింపుని సినిమాల్లో 150 చిత్రాలలో నటించిన నాకు – నిజజీవితంలో మొదటిసారిగా కల్మాడీగారిని చూశాక కళ్ళు చెమర్చాయి.

వారికి ప్రస్తుతం జైలులో బోరుకొడుతోంది. కారణం – 27 ఛానళ్ళు చూపే టీవీని వారు ఏమీ తోచక చూస్తున్నారు. వారానికి రెండుసార్లు పెళ్ళాం, పిల్లలు వస్తారు. జైలుగదిగురించీ, దొంగ సొమ్ముగురించి వారు శ్రీమతితో మాట్లాడుకుంటారు. రోజంతా జైల్లో పచార్లు చేస్తారు. సాయంకాలం ఆరునుంచి ఉదయం ఆరుదాకా తప్పనిసరిగా జైలుగదిలో ఉండాలి. ఇదిగో, ఇక్కడ కల్మాడీగారికి బోరు కొడుతోంది. ఈ సందర్భంలో తనతో ఎవరయినా గదిలో ఉంటే బాగుండునని వారికనిపిస్తోంది. ఆ విషయాన్ని వారు జైలు అధికారులతో చెప్పారట. ఆయన అనుచరులు లలిత్ భానోత్, వి.కె.వర్మగారిని కానీ, లేదా ఇద్దరినీ తన గదిలోకి పంపమని కోరారట. రాత్రంతా ముగ్గురూ కామన్వెల్తు భాగోతాన్ని గురించి మాట్లాడుకోవచ్చు. దోచుకున్న డబ్బు ఎలా పంచుకోవాలో చర్చించుకోవచ్చు. తీరా జైలు నుంచి విడుదల అయాక ఏం చెయ్యాలో ఒక సమగ్రమైన ప్రణాళికని వేసుకోవచ్చు. అయితే కల్మాడీగారికి తెలియకుండా

ఫలహారం చేసిన సొమ్మును వారిద్దరూ సంప్రదించుకుని పంచుకోవలసిన కార్యక్రమంలో వారున్నారేమో!

ఏతావాతా, కల్మాడీగారికి ముందు చూపు తక్కువంటాను. ఇప్పుడూ అవినీతిపరులకి నా సలహా. తమరు నిజజీవితంలో వెధవ్వేషాలు వేసేటప్పుడూ – రేపు జైలుకి వెళితే మీతో తోడుగా గదిలో ఉండేవాళ్ళనే, ఉండడానికి ఇష్టపడేవాళ్ళనే సహచరులుగా ఉంచుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. రేపు మారన్ సోదరులు జైలుకి వచ్చారనుకోండి. దయానిధిగారినీ కళానిధిగారినీ ఒకే గదిలో ఉంచుతారని నమ్మకం లేదు. ఒక కడుపున పుట్టిన పిల్లలయినా, ఒకే పాపంలో పాలు పంచుకున్నా జైల్లో ఒకే గది దొరక్కపోవచ్చు. ఎవరి పాపం వారిది. ఎవరి గదివారిది. ఎవరి ఏకాంతం కోసం హిమాలయాల్లో గుహల్ని ఆశ్రయించిన వైభవం ఈ దేశానిది. అప్పనంగా తీహార్ జైలులో సాయంత్రం ఆరునుంచి ఉదయం ఆరుదాకా లభించిన ఏకాంతం – ‘బోరు’గా ఉండడం కల్మాడీ స్థాయి మనుషులకి సహజం.

ఏకాంతం అంతర్ముఖులకి వైభవం. గోముఖ వ్యాఘ్రాలకి నరకం. ఒంటరి తనం తనని తాను తెలుసుకోడానికి చక్కనివకాశం. నేరస్తులకి తమ నేరాలు తమని హింసించే నరకం.
చేసుకున్నవాడికి చేసుకున్నంత..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.