Main Menu

Gollapudi columns ~ Keerti (కీర్తి)

Gollapudi column Index

Topic: Keerti (కీర్తి)

Language: Telugu (తెలుగు)

Published on: Sep 27 , 2018, Sakshi (సాక్షి) Newspaper
Source Credit: koumudi.net

Audio: Keerti (కీర్తి)     

ప్రముఖ అమెరికన్ రచయిత్రి ఎమిలీ డికిన్సన్ కీర్తి గురించి అతి చిన్న కవిత రాసింది. కవిత చిన్నదయినా కవితా హృదయం ఆకాశమంత ఉన్నతమయింది. ఆవిడ అంటుంది: “కీర్తి తేనెటీగలాంటిది. పాట పాడి లాలిస్తుంది. కాటువేసి జడిపిస్తుంది. ఆఖరికి రెక్కలు విప్పుకు ఎగిరిపోతుంది” అని.

మనం సంపాదించుకున్న కీర్తికి అతి పరిమితమయిన, క్రూరమైన ఎల్లలున్నాయి. మొన్న మా అబ్బాయి చెన్నై నుంచి హైదరాబాదు వచ్చి నాకీ కథ చెప్పాడు. అతని ముందు వరసలో – అంటే విమానం మొదటి వరసలో కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ కూర్చున్నారట. సాధారణంగా ప్రముఖుల సీటు పక్క సీటుని ఖాళీగా వదిలేస్తారు. కానీ ఆయన పక్క సీటులో ఓ రాష్ట్ర మంత్రి (పేరు అనవసరం) కూర్చున్నారట. చెన్నైలో విమానం సర్వీసు వారికి గులాం నబీ అజాద్ అనే కేంద్రమంత్రి అని తెలుసు. ఆ పక్కన కూర్చున్న వ్యక్తి తెలీదు. అజాద్ గారికి ఎయిర్ హోస్టెస్ ఉచితంగా కాఫీ ఫలహారాలు ఇవ్వబోయింది. ఆయన మంచినీళ్ళు చాలునన్నారు. పక్కనున్న రాష్ట్ర మంత్రిగారు నాకూ మంచినీళ్ళు కావాలన్నారు. ఎయిర్ హోస్టెస్ ముక్తసరిగా “మంచినీళ్ళకి మీరు డబ్బు చెల్లించాలి” అంది. మంత్రిగారు కంగారు పడిపోయారు. ఆయన పరపతి ఆంధ్రదేశపు ఎల్లలు దాటలేదు. అజాద్ గారి పరపతి దాటింది. మంత్రిగారి ఇబ్బంది కనిపెట్టి అజాద్ గారు చిన్న రాజీసూత్రాన్ని ప్రయోగించారు. “నేను సమస్యని పరిష్కరిస్తాను” అంటూ ఒక గ్లాసు ఇవ్వమన్నారు ఎయిర్ హోస్టెస్ ని తన సీసాలో నీళ్ళు పోసి రాష్ట్ర మంత్రి గారికిచ్చారు. ఇబ్బంది సర్దుకుంది. ఇది రాష్ట్ర పరపతి కథ.

అజాద్ గారు రాష్ట్ర మంత్రిగారితో తన అనుభవం ఒకటి చెప్ఫారు “ఇంతకన్నా విచిత్రమైన సంఘటన నాకు ఎదురైంది” అంటూ. ఓసారి విదేశీ విమానంలో విదేశాలకు వెళ్తున్నారట. విదేశీ విమనాల్లో అజాద్ గారు ఎవరో ఆయా విమానాల ఎయిర్ హోస్టెస్ లకు తెలియకపోవచ్చు. (అమెరికలో షారూక్ ఖాన్ పరపతికే దిక్కులేదు!) ఇలాగే మంచి నీళ్ళు అడిగారట. ఎయిర్ హోస్టెస్ తెచ్చి ఇస్తూ డబ్బు ఇవ్వాలందట. ఆయన ఫలనా వెనుక వరసలో ఇద్దరు ఏషియన్ మహిళలు కూర్చున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోమన్నారట. ఎయిర్ హోస్టెస్ వెళ్ళి అంతలో చటుక్కున తిరిగి వచ్చింది. “అక్కడ ఎవరూ కనిపించలేదు” అంటూ ఆయన చేతిలోంచి మంచినీళ్ళ సీసా లాక్కుందట. దేశీయ స్థాయి పరపతి విదేశాల్లో వీగిపోయిన సందర్భమిది.

రాజకీయ పరపతికి – చాలా చిన్న తెర – ముందు రోజు రాజాగారు కేబినెట్ మంత్రి మరునాడు తీహార్ జైల్లో ఖైదీ. “కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ..”
మరో పరపతి కథ. దాదాపు 22 ఏళ్ళ కిందట నేనూ, జే.వీ.సోమయాజులు (శంకరాభరణంలో శంకర శాస్త్రి), పద్మనాభం, తులసి – అంతా కలిసి అమెరికా వెళ్ళాం. శ్రీలంక నుంచి పారిస్ కి విమానం ఎగిరింది. సిగరెట్లు లేక సోమయాజులుగారు ఇబ్బంది పడుతున్నారు. ఏం చెయ్యాలో తెలీక అందరూ తెల్లమొహం వేశాం.

మరో రెండు గంటల తర్వాత – పక్క వరసలో సోమయాజులుగారు కనిపించలేదు. విమానం ఎగురుతోంది. ఎక్కడికి వెళ్ళారు? వెదుక్కుంటూ విమానంలో నడిచాను. ఆఖరి వరుసలో ఇద్దరు మలేషియా ప్రయాణీకులతో కూర్చుని విలాసంగా సిగరెట్లు కాలుస్తున్నారు సోమయాజులుగారు. ఆశ్చర్యపోతున్న నన్ను చూసి నవ్వారు. “మరేమిటి? శంకరాభరణం దెబ్బ” అన్నారు. అదీ ఓ విమాన ప్రయాణంలో – ఓ సినీమా ఓ సినీనటుడికి చేసిన ఉపకారం.
ఇంకో గొప్ప సంఘటన. తిరుగు ప్రయాణంలో మా విమానం ఉదయం ఏడున్నరకి కొలంబో చేరింది. చెన్నై వెళ్ళే విమానం రాత్రి ఎనిమిది గంటలకి. అంతవరకూ విమానాశ్రయంలో పడిగాపులు పడాలి. అమెరికా నుంచి వచ్చిన ప్రయాణంలో – జెట్ లాగ్ తో అలసిపోయి ఉన్నాం ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయపు పరిస్థితి మాది.

ఒక శ్రీలంక ఉద్యోగి – మహిళ – సోమయాజుగారిని చూసి చటుక్కున ఆగిపోయింది – కళ్ళు పెద్దవి చేసుకుని. “మీరు – ఆ సినిమాలో” అంటూ.
నేను పరిచయం చేశాను. “శంకరాభరణంలో శంకరశాస్త్రి” అంటూ.
అంతే. మా ఇద్దరినీ తీసుకువెళ్ళి ఎయిర్ పోర్టు మేనేజరుకి పరిచయం చేసింది. వారిద్దరూ మరెవరితోనో మాట్లాడారు. ఫలితం – మా నలుగురికి – నాకు, మా ఆవిడ, సోమయాజులు, మా అబ్బాయికి తాత్కాలిక వీసాలు ఇచ్చి – సాయంకాలం వరకూ కొలంబోలో ఓ హోటల్ లో వసతిని ఇచ్చారు. రోజంతా విశ్రాంతి తీసుకుని – రాత్రి పువ్వుల్లాగ చెన్నై విమానాన్ని ఎక్కాం.
మరో సరదా అయిన సంఘటన. చాలా సంవత్సరాలకిందట అబూదాబీలో ఉన్న మిత్రులు గంటి ప్రసాదరావుగారి దంపతులూ నేనూ, మా ఆవిడా టాంజానియా యాత్రకి బయలుదేరాం. దార్ ఎస్ సలాం అనే రాజధాని నగరం నుంచి కిస్సివానీ అనే అటవీ ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాం. ఊరు దాటుతూండగా ఆడవాళ్ళిద్దరూ అడవిలో వంటకి టమాటలు కావాలన్నారు – ఆఫ్రికాలో అడవిలో ఇబ్బంది పడకుండా నేనూ ప్రసాదరావుగారూ ఓ చిన్న ఊరు బజారు దగ్గర ఆగాం. నాలుగడుగులు వేశామోలేదో చక్కని తెలుగు పలకరింత వినిపించింది: “మారుతీరావుగారూ!” అంటూ. తెలుగువాడు. నన్ను చూసి పొంగిపోయాడు. అడవిలో ఆవకాయలాంటిది తెలుగు పలకరింత. మాతో తిరిగి ఏవేం కొనుక్కోవాలో, ఎక్కడ దొరుకుతాయో చెప్పాడు. “ఎన్నాళ్ళు అడివిలో ఉంటారు? ఎప్పుడు తిరిగిరాక?” తెలుసుకున్నాడు. మా ఫోన్ నంబర్లు తీసుకున్నాడు. మరో అయిదారు రోజుల తర్వాత తిరిగి వచ్చాం. ఆ సాయంకాలం పెళ పెళలాడే పట్టు చీరెలతో, తెలుగు వంటకాలతో దార్ ఎస్ సలాంలో ఓ హోటల్లో చక్కని విందు , సభ, సత్కారం ఏర్పాటు చేశారు. అది మరిచిపోలేని మర్యాద అనుభవం.
అధికారంతో వచ్చే కీర్తి ఎల్లలు దాటదు. అభిమానంతో వచ్చే కీర్తికి ఎల్లలు లేవు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.