Main Menu

Gollapudi columns ~ Kotta Devullu ( కొత్త దేవుళ్ళు)

Topic: Kotta Devullu ( కొత్త దేవుళ్ళు)

Language: Telugu (తెలుగు)

Published on: Oct 26, 2006

Source Credit: koumudi.net


Audio: Kotta Devullu ( కొత్త దేవుళ్ళు)     

ఈ మధ్య ఓ వార్త చదివాను. మీరత్ లో మీనాక్షిపురం అనే గ్రామంలో (నిజానికి యిలాంటి పేరున్న గ్రామం దక్షిణాదిన వుండాలి) సైనీ అనే తెగవారు ఈ దీపావళికి కొత్తరకం దేవుడి బొమ్మలు తయారు చేస్తున్నారట. ఆ బొమ్మలు గణేశ్, లక్ష్మి. (నిజానికి లక్ష్మీ గణపతి విగ్రహం, ఆరాధన ఆంధ్ర దేశంలో ఉభయ గోదావరుల్లో ఎక్కువగా చూశాను నేను. లక్ష్మి తొడమీద కూర్చోబెట్టుకున్న పది చేతుల గణపతి ఓ ప్రత్యేకమైన పూజా ప్రక్రియకి సంకేతం.)

హస్తీంద్రానన మిందు చూడ మరుణ ఛ్ఛాయం త్రినేత్రం- యిలా వివరిస్తుంది ఈ మూర్తిని ధ్యాన శ్లోకం.

సాధారణంగా దేవతా విగ్రహాల్ని మట్టితోనో,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోనో, ఆలయ ప్రతిష్టకయితే శిలతోనో నిర్మిస్తారు. కాని ఈ గ్రామస్థులు కొత్త పద్ధతిలో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, పెరుగు, నెయ్యితో ఈ విగ్రహాలు తయారవుతున్నాయట. ఆవుపేడని ఎండబెట్టి, పొడి చేసి మిగతా సరుకులన్నీ కలిపి ఓ ముద్ద చేస్తారు. ఆ ముద్దని కావలసిన రూపాల్లో, కావలసిన పరిమాణాల్లో అచ్చుల్లో పోస్తారు. ఆ అచ్చులకు రంగులు దిద్దుతారు. ఈ కృషికి గోసంవర్ధన సమితి చేయూత నిస్తోంది.

వయస్సులో పాలిచ్చి, వట్టిపోయిన ఆవుల్ని సాధారణంగా రైతులు పోషించలేక కబేలాలకు తోలేస్తారు. అయితే ఆ ఆవుల వల్ల కూడా ఓ ప్రయోజనాన్ని సిద్ధింప జేయడం, తద్వారా గోహత్యని మానుకోవడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఢిల్లీలో చాలా దుకాణాల్లో వీటి అమ్మకానికి అంగీకరించారట. బొమ్మలో కనిపిస్తున్న లక్ష్మీ దేవిని చూస్తూంటే పనివాడితనంలో, నైపుణ్యంలో ఏ మాత్రమూ లోపం లేదని తెలుస్తోంది.

ఈ వార్త చదవగానే మనస్సులో కలుక్కుమన్న ఆలోచన- దేవుళ్ళ విగ్రహాలని పేడతోనూ, మూత్రంతోనూ తయారు చెయ్యడమా అని. దైవానికి అపూర్వమైన విలువనిచ్చే ఈ జాతి కనిపించే విగ్రహం మూత్రంతో తయారయిందన్న ఆలోచనతో సరిపెట్టుకోగలదా అని. ఐతే పండగలూ, పబ్బాలలో ఏ ప్రాంతాన్నయినా ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించడం సంప్రదాయం కదా? Anti bacterial లక్షణాలు ఆవుపేడలో వున్నాయని మనవాళ్ళు భావించడమే ఇందుకు కారణం. పోనీ, దేవుడి బొమ్మలు కాకపోతే డ్రాయింగ్ రూముల్లో అలంకరించే రకరకాల బొమ్మల్ని తయారు చెయ్యొచ్చుకదా? లేపాక్షి బొమ్మలు ఈ వనరులతో కాకపోయినా తేలికయినకాగితం గుజ్జులాంటి వాటితో తయారయినవే.

ఓ శివ భక్తుడు వాపోయాడు: “ఏమి చేతురా లింగా!” అంటూ. పత్రం, పుష్పం, ఫలం, తోయం- ఏది ముట్టుకున్నాఎంగిలిగానే కనిపిస్తోందన్నాడు. నీటిలో కప్పవుంది. పువ్వుని తుమ్మెద ఎంగిలి చేస్తోంది. పత్రాన్ని పురుగులు తింటున్నాయి. తెలిసి తెలిసి నిన్నెలా పూజించడం అని బాధపడ్డాడు.

మనిషి తనకు యిష్టమయినవి, తాను గొప్పగా భావించేవన్నీ దేవుడికి సమర్పించి ఆనందిస్తాడు. ఆవు పొదుగులో పిండిన పాలు దేవుడికి అతి పవిత్రమైన క్షీరాభిషేకం. న్యాయంగా ఆ పాలు దూడకి చేరాలికదా? పొదుగుని కడిగి పాలు పిండినా ఒకరి సొత్తు మరొకరికి ఇవ్వడం కదా? మనలాగే దేవుడు స్నానం చెయ్యాలి. వస్త్రం కావాలి. యజ్ణోపవీతం కావాలి. చామరం కావాలి. అన్నీ అయాక భోజనం కావాలి. సౌందర్యం గొప్పది. దేవుడు ఊహించలేనంత సౌందర్యవంతుడు. సామర్ధ్యం గొప్పది. భగవంతుడి సామర్ధ్యం అనంతం. మనకి చాలా కోరికలున్నాయ్. వాటన్నిటినీ తీర్చగల మహిమాన్వితుడు దేవుడు. ఆ శక్తి మన ఊహకందనిది. ఆ వెలుగు మనం చూడలేనిది. ఆ మహిమ మన ఆలోచనలకు అందనిది.

సరే. ఇవన్నీ ఎంగిలి. నోటినుంచి వచ్చే “మాట’? ప్రస్తుతి పవిత్రమైనదే కదా? కాని నోరు పరిశుభ్రమయినదని ఎలా చెప్పడం? మాట గొప్పదయినా అది వెలువడేది పంచభూతాత్మకమయిన నోటిలోంచి కదా? ఇవన్నీ మనిషి తన ఆలోచనల పరిధిలో చేసే ఆరాధన. మన ఊహల పొలి మేరల్ని తాకే muse.

ఈ లోపాలు లేని, ఈ ఎల్లలను తెంచి చేయగలిగే ఆరాధన ఏదయినా వుందా? వుంది. ఒక్క భారత దేశమే ఆ plane లో దేవుడిని ఆరాధించడాన్ని ఆచరించి సాధించింది. అది- ధ్యానం. వీటి వేటి అవసరమూ లేని, అక్కరలేని తపస్సు. ఏ రూపంతోనూ ప్రమేయంలేని నిశ్శబ్దం. పంచేంద్రియాలనూ లొంగదీసుకుని ఏకాగ్రతతో సాధించే యోగం.

ఈ మధ్య ఈ యోగానికీ రోగమొచ్చింది. ఏతావాతా ఇది అమెరికా పేటెంటయి కూర్చుంది. కొద్దికాలంలో ఒబామాగారు మన రాముడిని, కృష్ణుడినీ పేటెంట్ చేస్తారేమో! కాళ్ళూ చేతులూ సాగదీసి యిప్పుడు మనవాళ్ళు చేసే కసరత్తు ఈ “యోగా’నికి కేవలం ప్రాధమిక దశ. ఆ నిశ్చల స్థితిలో మనిషి గంటలు, రోజులు, కాలపరిమితిని మరిచిపోయి trance లో ఉండడానికి శరీరాన్ని లొంగదీసుకుని, ఒక దశలో మలుచుకునే భౌతికమైన వ్యాయామం. యోగం యొక్క అంతిమ లక్ష్యం తపస్సు. Meditation. ఏయే చర్యల వల్ల శరీరం మానసికమైన ప్లేన్ లో ఏకాగ్రతకి భంగం కాకుండా ఉంటుందో దానిని యోగులు కనుగొన్నారు. పాటించారు. ఆ ఏకాగ్రతని సాధించారు. (విచిత్రం- దీన్నింకా యోగం అనే పిలవడం నా కాశ్చర్యం. అచిరకాలంలో పేటెంట్ చేసిన అమెరికా యోగాను “మైకేలిజం’ “ఒబామాయిజం’ అని మార్చినా ఆశ్చర్యం లేదు.)

ఎంగిలి, అంటు, మైలతో ప్రమేయంలేని ఓ గొప్ప స్థాయిని సాధించిన సంస్కృతి మనది. మనకి తెలిసిన అతి సమీప గతంలో ఇద్దరు మహనీయులు గుర్తుకు వస్తారు వెంటనే. రమణ మహర్షి, కామకోటి చంద్రశేఖర సరస్వతీ స్వామి. దాదాపు 78 సంవత్సరాల కిందట పాల్ బ్రంటన్ అనే ఫ్రెంచ్ తత్త్వ శాస్త్రజ్ణుడు భారతదేశ మంతా యోగ మహిమాన్వితులను దర్శించాలని పర్యటించాడు. తన అనుభవాలను A Search in Secret India అని గ్రంధంగా ప్రచురించాడు. ఆయన పరమాచార్యని కలిసినప్పుడు “నేను నిజమైన యోగిని దర్శించాలని ఉత్సాహపడుతున్నాను. నేను చూచినవారంతా మాట్లాడేవారే. వారి యోగస్థితి తెలియడంలేదు” అన్నాడట.

పరమాచార్య నవ్వి “మీరు కోరిన చోటికి వెళ్తారు” అన్నారు. ఆ తర్వాత విచిత్రమైన పరిస్థితులలో బ్రంటన్ రమణాశ్రమం చేరి రమణమహర్షిని దర్శించుకున్నారు.

వట్టిపోయిన గోవులనుంచి ప్రయోజనాన్ని రాబట్టడం, ఊహించని వనరులలోంచి దేవతా విగ్రహాల్ని సృష్టించడం హర్షించదగిన కార్యక్రమమే.

బురదలోంచి కలువ లేస్తుంది. కింద పేడ పురుగులు, కప్పలు, క్రిములు ఉంటాయి.కాని వాటి అంటకుండా పవిత్రంగా కలువ కళ్ళు విప్పుతుంది. మహానుభావులయిన ఆదిశంకరుల దగ్గర్నుంచి, వివేకానందుడి వరకూ అంతా మాతృ గర్భ సంజాతులే. శ్రీ కౄష్ణుడు మాత్రం కంసుడి జైలులో దేవకీ దేవి సమక్షంలో చతుర్భుజాలతో స్వయంభువుగా అవతరించాడంటారు. ఈ సంస్కృతికి భాష్యం చెప్పిన ఆచార్యుడాయన. వీటి పరమార్ఢాన్ని విజ్ణులు వివరించాలి.

ప్రతీ నేలబారు విషయానికీ, ప్రతీ అపూర్వమైన ఆలోచనకీ అందమైన లంకెలున్నాయి. వాటిలో కొన్ని సంకేతాలు. కొన్ని స్వయం ప్రకాశితాలు.

ఏమయినా, మీనాక్షిపురం పనివారు తాటిచెట్టుకీ తాత పిలకకీ లంకె సాధ్యమని నిరూపించారు..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.