Main Menu

Gollapudi columns ~ Kukkamoothi Pindelu(కుక్కమూతి పిందెలు)

Topic: Kukkamoothi Pindelu(కుక్కమూతి పిందెలు)

Language: Telugu (తెలుగు)

Published on: May 02, 2011

Kukkamoothi Pindelu(కుక్కమూతి పిందెలు)     

ఈ కాలమ్ కీ సత్యసాయిబాబా దేవుడా? అవతార పురుషుడా? అన్న ప్రశ్నలకీ ఎటువంటి సంబంధంలేదు.

1964 మే 27 సాయంకాలం ఢిల్లీ నుంచి తెలుగువార్తల ప్రసారం ప్రారంభమయింది. “మన ప్రియతమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇకలేరు” అని న్యూస్ రీడర్ చదువుతూంటే అతని గొంతు వణికింది. దుఃఖంతో గొంతు బొంగురుపోయింది. ఆ రీడర్ పేరు రామచంద్రరావు. ఆ ఒక్క కారణానికే అతని ఉద్యోగం పోయింది.

‘వార్త ‘ని చెప్పేటప్పుడు వ్యక్తిగతమయిన – ఇంకాస్త ముందుకు వెళ్ళి – వ్యవస్థాగతమైన ఆవేశానికి స్థానం లేదు. ఇది అతి ముఖ్య సూత్రం.

మొన్న సత్యసాయిబాబా అస్తమించారు. ఒకానొక ఛానల్ ఆ విషయాన్ని ఇలా చెప్పింది. “సాయిబాబా మరణించారు. 96 సంవత్సరాలు బతుకుతానని చెప్పిన బాబా మాట తప్పారు” అని. ఆ ఛానల్ పేరు చెప్పి ఆ పాపం కట్టుకోను. ఇదే సమయంలో అతి బాధ్యతాయుతమైన మర్యాదతో, సంయమనంతో – ఇంకా భక్తితో ఈ టీవీ, హెచ్ ఎం టీవీ, రాజ్ టీవీ (నేను చూసిన ఛానళ్ళు) ఈ వార్తల్ని ప్రసారం చేశాయి. ఆ నాలుగు రోజులూ ప్రసారం చేస్తున్నాయి – అంతే ఉదాత్తంగా.

నేను తీవ్రవాదిని కాను. అతివాదిని కాను. ఛాందసుడిని కాను. ఈ దేశంలో కోట్లాదిమందిలో ఒకడిని. వార్తకీ, వ్యాఖ్యకీ బోలెడంత తేడా ఉంది. రాష్ర్టపతులూ, ప్రధాని, దేశ దేశాల ప్రతినిధులూ, గవర్నర్లు, ముఖ్యమంత్రులూ, ప్రతిపక్షనాయకులూ, ఇటలీ నాయకులూ, 160 దేశాల వారు శ్రద్ధాంజలి ఘటించిన ఒక ‘భారతీయునికి’ ఒక భారతీయ ఛానల్ ఈ దేశంలో చూపించిన మర్యాద ఇది. ఈ ఛానల్ ని మర్యాద చూపమని ఎవరూ దేబిరించలేదు. మీ అమ్మని విమర్శించే హక్కు మీకుంది. అది మీ సంస్కారం. కాని మా అమ్మని, మా దేవుడిని గౌరవించవలసిన బాధ్యత మీకుంది. అది మా హక్కు. ఇది బతిమాలి పుచ్చుకునేది కాదు. వార్తా ప్రసారంలో ప్రాధమిక సూత్రం. వేలాదిమంది సెన్సిటివిటీని గౌరవించవలసిన బాధ్యత అది. బహుశా ఈ ఛానల్స్ నడిపేవారి స్థాయి, సంస్కారం, అవగాహన – ఈ ప్రాధమిక సూత్రాల వరకూ వచ్చి ఉండదు.

You have a right too be wrong when it is a question of opinion. But you have no right to be wrong when it is a question of fact.

ఒక న్యూస్ రీడర్ వదరుబోతుతనం ఇది. గాజులు తొడుక్కున్న భారతదేశం కనుక చెల్లింది. ఎక్కడో డేనిష్ పత్రికలో అల్లా గురించి కార్టూను ప్రచురిస్తే – డెన్మార్క్ ఎక్కడుందో తెలియని వాళ్ళు, ఆ కార్టూన్లు ఏమిటో చూడని వాళ్ళు ప్రపంచంలో ఎన్నో చోట్ల కార్లు, బస్సులు తగలెట్టారు. నేనా కార్టూన్లు చూశాను. అలాంటి పని చెయ్యమని కోరడం లేదు.

ఆత్మవంచనని ఈ జాతి అర్హతగా మెడలో మూర్చ బిళ్ళలాగ కట్టుకుని ఊరేగడాన్ని నిరసిస్తున్నాను. ధర్మానికి ప్రతీకగా పురాణాలు అభివర్ణించిన యమధర్మరాజు చేత లిమ్కా తాగించే సరదా సినిమాని చూసి మనం చంకలు గుద్దుకుంటాం. ఎప్పుడయినా, ఎవరయినా క్రైస్తవ మతాన్ని అవలంభించే ఇన్ని ప్రపంచ దేశాలలో సెంట్ లూక్ గురించో, సెంట్ పీటర్ గురించో ఇలాంటి పారిహాసిక తీశారా? తీస్తే బతికి బట్టకట్ట గలుగుతారా?

మన సంస్కృతిని గురించి మనకి అభిమానం లేదు. ఛానళ్ళను కల్లు దుకాణాల్లాగ నడిపే వ్యాపారస్తుల వదరుబోతుదనాన్ని భరించే దుర్దశ మనకి పట్టింది. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సెన్సిటివిటికి గౌరవం ఇవ్వాలన్న కనీసపు మర్యాద నియమాన్ని పాటించని ఈ ఛానల్స్ని ఈ ప్రభుత్వం ఎందుకు నిలదీయదు? ప్రభుత్వ లాంఛనాలతో గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు స్వయంగా నిలబడి ఈ గొప్ప లాంఛనాన్ని జరిపించిన పెద్దలు “సాయిబాబ మాట తప్పాడు” అని చంకలు గుద్దుకున్న ఛానల్ పరిహాసాన్ని మాధ్యమాల స్వేచ్చగా సరిపెట్టుకుంటారా? మైనారిటీలకు వీరిచ్చే గౌరవం వారే స్వయంగా పూనుకుని గౌరవించిన ఒక మహనీయుని పట్ల జరిగిన బాధ్యతారాహిత్యాన్ని ఎందుకు నిలదీయరు?

మరొక దరిద్రం. ఈ వార్తని రాసేవారికి బొత్తిగా అవగాహన లేమి. బాబాగారు విద్యారంగానికి సేవ చేశారు, అనంతపురానికి నీళ్ళు ఇచ్చారు, తమిళనాడుకి గొట్టాలు వేశారు – అని పదే పదే ఛానళ్ళు చెప్పాయి. ఈ కారణంగానే వారికి తామిచ్చే గౌరవం, ఈ కారణంగానే వారికి జాతి నివాళులర్పిస్తోందని వారి కితాబుల్లో అర్ధమయింది. అయ్యా, ఇవన్నీ అతి చిన్న విషయాలు. నేలబారు సంగతులు. ఒక బిర్లా గారు, ఒక టాటాగారు ఇంతకంటే బాగా, గొప్పగా చెయ్యగలరు. 160 దేశాలలో లక్షల మంది ఈ ప్రయోజనాన్ని పంచుకోలేదు, ఈ నీళ్ళు తాగలేదు, అయినా వారంతా స్పందించారు. ఎందుకని? ఈనాటి ఆధునిక యుగంలో అక్రమాలు, అవినీతి, ఆ వ్యవస్థ పెచ్చు రేగిపోతున్న నేపధ్యంలో సేవాభావం, ప్రేమ అనే రెండు గొప్పగుణాలను దేశాల ఎల్లలు చెరిపి స్వామి ప్రసారం చెయ్యగలిగారు.

నేను పుట్టపుర్తి ఆసుపత్రిలోకి వెళుతూ నా చెప్పుల్ని బయట వదిలేశాను. ఒక ముసలాయన ఆ చెప్పుల్ని భరతుడు పాదుకల్ని పట్టుకున్నట్టు అందుకుని పెట్టాల్సిన స్థలంలో ఉంచుతున్నాడు. ఆయన ఏదో రాష్ర్టంలో ప్రభుత్వంలో గెజిటెడ్ ఆఫీసరు.

స్వామి అద్భుతాలతో మనకి పనిలేదు. కాని 2011 లో ఏకీభావంతో, వినయంతో కుల, మత, ప్రాంత వివక్ష లేని సేవా సైన్యాన్ని తయారుచేశాడాయన. ఈ విజయం ముందు విద్య, నీళ్ళు తృణప్రాయం. విద్య ఇప్పుడు చదువుకునేవారికి. సమభావం, ప్రేమ వయస్సులో ఉన్న సర్వులకూ. ఈ సత్యం దాదాపు అన్ని ఛానల్స్ కీ అర్ధం కాలేదు. ఆశ్చర్యం లేదు.
165 సంవత్సరాల క్రితం ఒకాయన రాముడితో మొరపెట్టుకున్నాడు. “నాదుపై పలికారు నరులు, వేద సన్నుత భవము వేరుచేసి తిననుచు..” అని. ఆధ్యాత్మిక చింతనని పెంచి ఈ లోకపు రీతిని విస్మరించానని నన్నంతా విమర్శిస్తున్నారయ్యా – అని వాపోయాడు. ఆయన పేరు త్యాగరాజస్వామి. ఆధ్యాత్మికానికి విడాకులిచ్చి, నీళ్ళు, గొట్టాలు అని మనకర్ధమయే విలువలకి మాత్రమే పరిమితమైయిపోయే ‘కురచ’ దృక్పధాన్ని పెంచుకోడానికి కేవలం 165 సంవత్సరాలు సరిపోయింది! సత్యసాయిబాబా మరణించాడు, మాట తప్పాడు అని ఈ ఛానల్ ఉవాచ. నిర్యాణం, అస్తమయంలాంటి మాటలు ఈ ఉద్యోగులకు చేతకావు. భేష్.

పోనీ, “స్టాలిన్ చచ్చాడు. లెనిన్ చచ్చాడు” అని చెపుతారా వీరు?
మనకి తెలియని విషయం తెలియదని తెలుసుకోవడం విజ్నానం. మనకి తెలిసిన విషయమే దేశానికంతటికీ తెలిసిన, తెలియాల్సిన విషయం అనుకోవడం మూర్తీభవించిన అజ్ఞానం, వార్తా ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చోటులేని అహంకారం. జులుం.

కోటంరాజు రామారావు, ఎస్.వై. చింతామణి, కుందుర్తి ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావు, నార్లవంటి మహనీయులు జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఈ గొప్ప మాధ్యమం ఈనాటికి ఇలాంటి కుక్క మూతి పిందెల పాలున పడిపోయింది. అది మన దౌర్భాగ్యం.

రేపు తాజ్ మహల్ కూలిపోయిందని ఎవరయినా చెపితే నిజమా కాదా అని పరీక్షించుకునేందుకు పారదర్శకమైన ఛానళ్ళు లేవు. తమ నమ్మకాల్ని అమ్మకాలు చేసుకునే వ్యాపారస్తులకు వృత్తిలో నిజాయితీని నేర్పడం, హంతకుడికి మంగళహారతి పట్టడం లాంటిది.

నేనిదివరకు బాబా గారి గురించి చాలా కాలంస్ రాశాను. చివర ఒక వాక్యం రాయడం రివాజు – “నేను బాబా భక్తుడిని కాను” అని.

ఇప్పుడు బాబా పార్ధివ శరీరంలో లేరు. బహుశా ఇది వారి మీద ఆఖరి కాలం కావచ్చు. ఇది నా ఆఖరి వాక్యం – నేను బాబా భక్తుడిని.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.