Main Menu

Gollapudi columns ~ Laya (లయ )

Topic: Laya (లయ )

Language: Telugu (తెలుగు)

Published on: July 05, 2010

Laya (లయ )     

ఇవాళ్టితో వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్ షిప్పు పోటీలు ముగుస్తాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా – ఈ టెన్నిస్ పోటీలు చూడడానికి టీవీకి అతుక్కు పోవడానికి మరో ముఖ్యమయిన కారణం ఉంది.అది “రోలెక్స్” వాచీ ప్రకటన స్పాట్. (ఇప్పటిది కాదు ఇంతకుముందు చేసింది ఇప్పుడు వేస్తున్నారు) అది అద్బుతం. ప్రపంచ స్థాయి ఆటగాడు రోజర్ ఫెడరర్ ని అంతే ప్రపంచ స్థాయి కెమెరామన్, దర్శకుడు – ప్రపంచ స్థానంలోనే 30 సెకన్ల చిత్రాన్ని నిర్మించాడు. ఇంత కంటే వివరించడానికి నాకు మాటలు చాలవు. మీరు చూడాలి . వెలుగు నీడల్లో ఫెడరర్ బంతిని కొట్టే భంగిమలు ప్రయత్నించినా నిర్ణయించగలిగేవికావు. ఒక మహా ‘కళాకారుడు ‘ (గమనిచండి – ఆటగాడు అనడంలేదు) ఒక తన్మయ దశలో అలవోకగా చేయగలిగేవి. ఆ శరీరం కదలికలో సంగీతం పలుకుతుంది. ఆ సంగీతాన్ని – వెలుగునీడల సమ్మేళనంగా – స్పాట్లో ఆఖరి ఫేడవుట్లో బంధించారు – అద్బుతం.

ఇంత చెప్పాక మరొక కోణాన్ని ఆవిష్కరించడానికే ఈ కాలం. ప్రపంచంలో అతి శక్తివంతమైన, అతి ఉన్నతమైన స్థాయిలో ఏ కళయినా అంత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. లేదా – మరో విధంగా చెప్పాలంటే – ఏ గొప్ప సౌందర్యమయినా అంత శక్తివంతమై తీరాలి. ఆది శంకరుల “సౌందర్య లహరి ” కి మూల సూత్రం ఇదే. అమ్మ ఆది పరాశక్తి. అనిర్వచనీయమయిన మూల శక్తి అది. ఆ కారణానికే అది అనిర్వచనీయమయిన సౌందర్యవంతం . దీనికి ఋజువు సౌందర్య లహరి లేదా ముఖపంచసతి.

ప్రపంచాన్నంతటినీ జయించే ఓ ఆటగాడి – కదలికలోనే ఇంత లయ , సౌందర్యం ఉంటే – ప్రపంచాన్ని సృష్టించిన శివశక్తి ఎంత సౌందర్యవంతం కావాలి? అదొక గొప్ప రిధిం (లయ). దాని పరాకాష్ట – మళ్ళీ అలౌకికమయిన సంగీతం. అందుకే లలిత కళలన్ని శివమయం అన్నారు. ఈ కాలం పరమార్ధం ప్రవచనం కాదు. ఈ గొప్ప అనుభూతికి నేలబారు నమూనాగా ఈ రోలక్స్ ప్రకటనని మీ ముందుంచుతున్నాను. దీనికి శివుడు, గోంగూరా ఎందుకయా అనుకునేవాళ్ళకి నమస్కారం. మరో చిన్న ఉదాహరణ నేను టాంజానియా వెళ్ళినప్పుడు – అడవుల్లో – నా చెయ్యి చాచితే – తగిలేంత దగ్గరగా ఆరు సిం హాలు మా జీపు చుట్టూ పడుకున్నాయి. దూరం నుంచి చూస్తే – మృగరాజు ఠీవి, హుందాతనం వర్ణనాతీతం. దగ్గరికి వచ్చే కొలదీ – ఆ సౌందర్యం భయంకరమయిన ‘శక్తీగా మాత్రమే గుర్తుకువస్తుంది. రెండు విభిన్నమయిన ఎల్లల మధ్య ప్రయాణమిది. ఒక ఎల్ల – సౌందర్యం. మరొక ఎల్ల – శక్తి, ఔన్నత్యం. సిం హం జంతువుని వేటాడే దృశ్యాన్ని ఎన్నిసార్లో డిస్కవరీ ఛానల్ లో చూస్తాం. ఎన్నిసార్లో చూసినా తనివి తీరదు. సిం హం చేస్తున్న హింస మనల్ని ఆకర్షిస్తోందా? కాదో – ఆ క్షణంలో ఒక ప్రాణి చూపే ప్రాధమిక శక్తి యొక్క అపూర్వమయిన సౌందర్యం మనల్ని అక్కడ నిలుపుతుంది.ఆ క్షణంలో హింసని మరిపిస్తుంది. వెంటాడే జంతువుని పట్టుకోవడానికి లంఘించే సిం హం ఆ లంఘనని కేవలం 40 సెకన్లు మాత్రమే నిలపగలదు. జంతువుని ఒడిసి పట్టుకోవటానికి ఏ క్షణంలో ఆ వేగాన్ని సంధించాలో అదీ సృష్టి రహస్యం. అదీ సౌందర్యం…

సెకనులో ఏ నలభయ్యో వంతులోనో తనవేపుకి వచ్చే బంతిని ప్రత్యర్ధి వేపు ఏ స్థానానికి కొట్టాలో నిర్ణయించే జీనియస్సే – ఒక వ్యక్తిని – ప్రేరణని చేసింది. ఇవి రెండూ రెండు వేర్వేరు ఉదాహరనలు.ఒకటి ప్రాధమికం, రెండు సాధనాపూరితం.ఈ రెంటిలోనూ లయ ఉంది సౌందర్యముంది.ఉవ్వెత్తున 40 అడుగులు లేచిన స్సునామీ – ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఆ తరంగం నీడలో ఉంటే – ఒళ్ళు చల్లబడుతుంది. కానీ వీడియోలో చూస్తే ‘అమ్మో ‘ అంటాం. నిజానికి మనస్సు లోపల “ఆహా!” అంటోంది. కారణం – అది ప్రకృతి ప్రాధమిక శక్తి. దూరంగా నిలబడి చూసేవాడికది విస్మయకరం. ఆ శక్తికి లోనయి కొట్టుకు పోయేవాడికి మృత్యువు.

ప్రముఖ దర్శకుడు మృణాళ్ సేన్ చెప్పిన ఓ కథతో కాలం ముగిస్తాను. ఈ కథ మరో ప్రపంచ స్థాయి కళాకారుడు చార్లీ చాప్లిన్ కి అభిమాన కథ. దీని పేరు “రిధిం” (లయ)

రెండు పొరుగు దేశాలు యుద్ధంలో తలపడ్డాయి. పొరుగు దేశం సైన్యాధిపతి ఈ దేశం సైన్యాధిపతికి ఖైదీగా దొరికాడు (బంగ్లా దేశ్ విముక్తికి భారత దేశం జరిపిన పోరాటంలో ఈ సంఘటన యధార్ధంగా జరిగింది). ఇద్దరూ సహాధ్యాయులు. స్నేహితులు. అయితే శత్రునాయకుడికి మరణదండన విధించారు. స్నేహితుడే ఆ శిక్షను అమలు చేయాలి. అయితే శిక్ష రద్దుకీ,క్షమాపణకి, దరకాస్తుపెట్టారు. శిక్ష అమలు నాటికి తీర్పు రాలేదు. ఏ క్షణాన్నైనా తీర్పు రావచ్చని స్నేహితుడు ఎదురుచూస్తున్నాడు. ఈలోగా శిక్ష అమలుకన్నీ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఖైదీని ఎదురుగా నిలబెట్టారు. ఈ స్నేహితుడు – ఒక పక్క ద్వారాన్ని చూస్తూనే ఆర్డర్లు ఇస్తున్నాడు.

ఆరుగురు జవాన్లు ఎదురుగా తుపాకీలతో నిలబడ్డారు. ఆఖరి క్షణాల్లో ఆర్డర్లు ఇస్తున్నాడు.

“ఎటెన్షన్!”

ఆరుగురూ నిటారుగా నిలబడ్డారు.

“గన్స్”

ఆరుగురూ తుపాకులు ఎత్తారు.

“ఎయిం!”

ఆరుగురూ గురి పెట్టారు.

ఇప్పుడు ద్వారం దగ్గర వార్తాహరుడు కనిపించాడు క్షమాపణ లభించింది. స్నేహితుడికి ఆనందం. ఆవేశం.

“స్టాప్” అని కేకే వేశాడు.

ఆరు తుపాకులూ ఒక్కసారి పేలాయి.

అంతే.

ఒక లక్ష్యానికి ఆరుగురు జవాన్లు సిద్ధపడుతున్నారు. నిటారుగా నిలిచి,తుపాకులు ఎత్తి, గురి చూసి తరువాత రావలసిన ఆర్డరేమిటి? షూట్ అని. ఆఖరు ఆర్డర్ ఏమైనా అది ఒక ధ్వనే ఆ క్షణంలో వారి మనస్సులు ఒక లయ కి శృతై ఉన్నాయి. ఆఖరి శబ్దమేదైనా తుపాకులు పేలతాయ్.ఆ క్షణంలో వారి మనసులకి విచక్షణా స్థాయి లేదు. ఒక లయకి సిద్దపడ్డాయి. తుపాకులు పేలాయి.

అంతే.

లయ ప్రాధమిక శక్తి.దానికి రోలక్స్ వ్యాపార ప్రకటన, ఫెడరల్ చిత్రం లోని నేలబారు ఉదాహరణ మనస్సులో ఊహించగలిగితే, భావించగలిగితే శివ శక్తిని లయకారకుడన్నారు! ఇక్కడ ‘లయ’ కి అర్ధం వినాశనము మాత్రమే కాదు, అద్భుతమయిన, అనూహ్యమయిన, అనిర్వచనీయమయిన, శృతిబద్ధ మయిన సౌందర్యం ‘లయ ‘కూడా!

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.