Main Menu

Gollapudi columns ~ Maakode Nalladorathanamu(మాకొద్దీ నల్లదొరతనమూ… )

Topic: Maakode Nalladorathanamu(మాకొద్దీ నల్లదొరతనమూ… )

Language: Telugu (తెలుగు)

Published on: June 11, 2012

Maakode Nalladorathanamu(మాకొద్దీ నల్లదొరతనమూ... )     

విమానయాన శాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ గారు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణాలు చేసేవారందరినీ పార్లమెంటు మెంబర్లుగా గౌరవించాలని యాజమాన్యానికి విన్నవించారు. ఇది చాలా అన్యాయమని నా మనవి. బెర్నార్డ్‌ షా ”ఆండ్రోక్లిస్‌ అండ్‌ లైన్‌” నాటకంలో ననుకుంటాను. ఒకాయన పక్కవాడిని ‘కుక్కా’ అని తిడతాడు. వెంటనడుస్తున్న అతని కుక్క అభ్యంతరం తెలుపుతుంది. ”స్వామీ! ఇది అన్యాయం. నేనేం తప్పు చేశాను?” అని. కుక్కకీ మనిషికీ ఉన్న తేడాని చక్కగా విశ్లేషించిన ఒకే ఒక్క రచయిత మార్క్‌ట్వేన్‌. ”ఆకలి వేస్తున్న కుక్కకి అన్నం పెడితే అది నిన్ను కరవదు. కుక్కకీ మనిషికీ ఉన్న తేడా యిదే” అన్నాడు.

వెనకటికి -నేను పత్రికలో పనిచేస్తున్న రోజులలో జి.కృష్ణగారు మాకు చిత్తూరులో ఎడిషన్‌ ఎడిటరు. ఓ కుర్రాడు నౌఖరు ఉద్యోగానికి వచ్చాడు. ”ఏం చదువుకున్నావు?” అని అడిగారు కృష్ణగారు. కుర్రాడు గర్వంగా ”ఎస్సెల్సీ -పాసయానండి” అన్నాడు. ”పాసయావు కనకే ప్యూన్‌ ఉద్యోగానికి వచ్చావు. ఫెయిలయితే మా ఎడిటర్‌ అయే వాడివి” అన్నారు. ఆయనకీ ఎడిటర్‌గారికీ ఆ రోజుల్లో చుక్కెదురు. ఏమయినా సొంత ఖర్చులతో టిక్కెట్టుకొనుక్కొని, మర్యాదగా ప్రయాణం చేసే ప్రయాణీకుల్ని బొత్తిగా ‘పార్లమెంటు మెంబర్ల’ స్థాయికి దిగజార్చడం చాలా క్రూరమని నేను బల్ల గుద్దుతున్నాను.

ఇంతకీ వాళ్లు చేసిన నేరమేమిటి? భక్త రామదాసు అడిగినట్టు అడుగుతున్నాను. లక్షా డెబ్భైయ్యారు వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి సంవత్సరంపాటు చిరునవ్వుతో జైల్లో గడిపారా? తన నిరపరాధిత్వాన్ని నిరూపించుకోడానికి టీవీ ఛానల్‌ మీద పరువునష్టం దావా వేస్తానని బోరవిరుచుకుని వేల కోట్ల ధనాన్ని ఫలహారం చేసిన క్రీఢాభిరాముడికి దీటుగా నిలబడగలరా? శృంగారానికీ, వ్యాపారానికీ అడ్డుతోవలు మలిచి, అడ్డమయిన కిట్టింపులతో ఒక సరికొత్త ఛానల్‌కే శ్రీకారం చుట్టిన ఓ ముఖ్యమంత్రిగారి ముద్దుల కూతురు సామర్థ్యానికి పొలిమేరల్లోనయినా నిలవగలరా?

కెమెరాల ముందు పోలీసులకీ, ఉద్యోగులకీ చెంపదెబ్బ కొట్టే చేవని వారు అలవరచుకోగలరా? సభల్లో చెప్పుల మర్యాదకి నోచుకోగలరా? పడగ్గదిలో కోట్లు దాచి పద్దెనిమిదేళ్ల తర్వాత జైల్లో విశ్రాంతి తీసుకుంటున్న ‘నిజాయితీపరులు’ 80 ఏళ్ల సుఖ్‌రాంగారి పాటి చెయ్యగలరా? తప్పుడు సంబంధాలతో సంకర సంతానానికి నీరుపోసి పార్లమెంటు దగ్గర్నుంచి, మంత్రిపదవులు, రాజ్‌ భవన్‌ల దాకా ఎగబాకిన ఎన్‌.డి.తివారీలు -90 ఏళ్ల వృద్ధ జంబుకం కాగలరా? అన్నా ఉద్యమం ప్రకారం లోక్‌పాల్‌ బిల్లు చట్టమయితే అందరు పార్లమెంటు సభ్యులూ జైళ్లలోనే ఉంటారన్న స్వస్వరూప జ్ఞానాన్ని పోగుజేసుకున్న లల్లూ ప్రసాద్‌ గారి వంటి మేధావుల వర్గమది. వీళ్లెవరూ తమ సంపాదనతో విమానాలు ఎక్కరు.

మామూలు ప్రయాణీకులు చక్కగా చదువుకొని, తమ సామర్థ్యంతో ఉద్యోగాలు సంపాదించుకుని, వ్యాపారాలు చేసుకుని -టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణం చేసే నేలబారు నిజాయితీపరులు. బంగారు లక్ష్మణ్‌లాగ చేతివాటం చూపించి ప్రస్థుతం జైల్లో సేద తీర్చుకుంటున్న పెద్దమనుషులు కారు. కాలేరు. నాలుగుసార్లు బీహారులో పార్లమెంటుకి ఎన్నికయిన మహమ్మద్‌ సహాబుద్దీన్‌గారు -హత్యలు చేశారు. డబ్బుని కొల్లగొట్టారు. కిడ్నాపులు చేశారు. ఇది నేను చెప్పిన మాట కాదు. న్యాయస్థానం నిర్దారణ చేసుకుని వారికి యావజ్జీవ కారాగార శిక్షని విధించింది. కాని వారెప్పుడూ అనారోగ్యంతో ఆసుపత్రులలోనే ఉంటారు. ఆ మధ్య అమర్‌సింగ్‌ గారూ న్యాయస్థానం పంపగా చుట్టపు చూపుగా జైలుకి వెళ్లారు. గొప్ప నాయకులకి జైలుకి వెళ్లగానే గుండె జబ్బులు, రక్తపు పోటూ వస్తుంది. వెంటనే వారు ఈ దేశంలో కల్లా గొప్ప ఆసుపత్రిలో చేరతారు. తరువాత బెయిల్‌ మీద ఇంటికి, సరే. మనుషుల్ని ఊచకోత కోసిన ఫూలన్‌ దేవిని మనం పార్లమెంటుకి పంపి సత్కరించుకున్నాం. తప్పుడు పనిచేస్తున్న తనని ఫొటో తీసినందున నడిరోడ్డు మీద -మొన్న తిరుపతిలో ఒక ప్రజానాయకుడు పోలీసుల్ని ”ఏమనుకుంటున్నావు నన్ను?” అని నిలదీసి సంస్కారం వున్న నాయకత్వం మనది.

వారికి తప్పనిసరిగా రెండు అక్కరలేదు -సిగ్గు, లజ్జ. సిగ్గు తన ప్రత్యేకతనో, తన లోపాన్నో, తన బలహీనతనో పక్క వ్యక్తి తెలుసుకున్నాడన్న స్పృహతో కలిగే తత్తరపాటు. దీనిలో చిన్న రుచి వుంది. లజ్జ -తన సంస్కార లేమికి, తన అశక్తతకి, తన అసమర్థతకి తలవొంచే గొప్ప సద్గుణం. ఈ రెండూ ఈ తరం నాయకులకి అవసరం లేదని -నెలల తరబడి జైళ్లలో వుంటూ -నేరారోపణ అలా వుండగానే బెయిల్‌ మీద బయటికి వచ్చి -అదే తమ నిర్దోషిత్వానికి విజయంలాగ పండగలు చేసుకునే దృశ్యాలే చెప్తాయి. జైళ్లలోంచి చిరునవ్వులతో, దొంగ నమస్కారాలతో, షోకయిన బట్టలతో, సమాజాన్ని క్షమించగల ఉదాత్తతని నటించే హుందాతో మనకి దర్శనమిచ్చే ఈ నాయకుల్ని చూస్తే మనకి సిగ్గేస్తుంది -ఏండ్రోక్లిస్‌ అండ్‌ లైన్‌లో కుక్కలాగ -యిలాంటి వారా మనకి నాయకులని.

అజిత్‌ సింగు గారూ! మా మీద కోపం వుంటే మరో విధంగా తిట్టండి. పైలట్ల పొట్టకొట్టినట్టు మమ్మల్నీ కొట్టండి. భరిస్తాం. కాని పార్లమెంటు సభ్యుల మర్యాదలకి మమ్మల్ని బలిచేసి బొత్తిగా చులకన, హేళన, అవమానం, చిన్నచూపు చూసే హక్కు మీకు లేదని ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను -ఇవి అడ్డమయిన వాళ్లూ, ప్రతీ అడ్డమయిన కారణాలకీ ప్రభుత్వాన్ని ‘హెచ్చరించే’ రోజులు కనుక.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.