Main Menu

Gollapudi columns ~ Maanavathvamaa! Ekkada Nuvvu?(మానవత్వమా! ఎక్కడ నువ్వు ?)

Topic: Maanavathvamaa! Ekkada Nuvvu?(మానవత్వమా! ఎక్కడ నువ్వు ? )

Language: Telugu (తెలుగు)

Published on: Dec 24, 2012

Maanavathvamaa! Ekkada Nuvvu?(మానవత్వమా! ఎక్కడ నువ్వు ?)     

ఆడవారికి స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు చరుచుకుంటున్న రోజులివి. కాని ఆడవారి స్వేచ్ఛని ఆరోగ్యకరమైన దృష్టితో చూడడం చేతకాని పశువులున్న రోజులు కూడా ఇవే.

వాళ్లు చిన్న కుటుంబాలకు చెందినవాళ్లు. కార్లలో డ్రైవర్లతో తిరిగే స్తోమతు చాలని వాళ్లు. తప్పనిసరిగా బస్సుల్ని నమ్ముకోవలసినవాళ్లు. వాళ్లు పడే కష్టాలు, అవమానాలూ ఇళ్లలో చెప్పుకుంటే ఆ చదువుకొనే అవకాశం పోతుందేమోనని గుండెల్లోనే మంటల్ని దాచుకునేవాళ్లు. జీవితంలో ఏ కాస్త అవకాశాన్నయినా అందిపుచ్చుకుని ఆ మేరకి, తమ, తమ కుటుంబాలకి ఆసరా కావాలనే కలలు కనేవాళ్లు.

ఈ ఈమెయిల్‌ నాకు ఓ అరవైయేళ్ల ముసలాయన పంపిస్తూ -దయచేసి కాలమ్‌ రాయమని అర్థించాడు. మొన్న ఆదివారం ఢిల్లీలో జరిగిన అనర్థం తరువాత రెయిన్‌ ట్రీ ఫిలింస్‌ డైరెక్టర్‌ నిష్తా జైన్‌ ‘ఫేస్‌ బుక్‌’లో రాసిన ఉదంతం ఇది.

”ఢిల్లీ మారిందంటారు. అవును. మారింది. మరింత అధ్వాన్నమయింది. కార్లూ డ్రైవర్లూ నోచుకోని మధ్యతరగతి ఆడపిల్ల నిస్సహాయంగా వీధిన పడింది. ప్రతీరోజూ కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్లే ఆడపిల్లలు రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణం చెయ్యడం తప్పనిసరి. కావాలని దొమ్మీలో నిలబడి, శరీరాలకు రాసుకుంటూ -ఆడపిల్లల పిర్రలూ, తొడలూ నొక్కి, గిల్లి, వేళ్లతో పొడిచి -కోపంగా చూస్తే ‘ఏం చేస్తావన్న’ట్టు ధీమాగా చూస్తూ స్థనాలపై కొట్టే పోకిరీరాయుళ్లు పెచ్చురేగిపోతున్న రోజులివి. వాళ్ల ముఖాలు ఆడపిల్లలకి తెలుసు. వీళ్లేమీ చెయ్యలేరని ఆ దౌర్భాగ్యులకి తెలుసు. ఇది దైనందిన విలాసం. ఆడపిల్లకి దిన దిన గండం. ఆ దౌర్భాగ్యుడు ఆ పనికే ఒరుసుకుంటున్నాడని తెలుసు. తప్పించుకునే మార్గం లేదు. కండక్టర్లకీ తెలుసు. వారూ చిలిపిగా నవ్వుకుంటారు. కొందరు నిస్సహాయంగా తలతిప్పుకుంటారు. చాందినీచౌక్‌, కరోల్‌ భాగ్‌ వంటి చోట్లకి వెళ్లి మతిచెడి ఇంటికి చేరిన సందర్భాలు బోలెడు. కొంత పెద్దదాన్నయాక నామీద చెయ్యేసిన మగాడిని తిప్పికొట్టిన సందర్భాలున్నాయి. ఆ మగాడు సిగ్గుపడకుండా ఈసారి తెలిసేటట్టు స్థనాల మీద బలంగా కొడతాడు. బస్సులో అందరికీ ఇది కనిపిస్తూనే ఉంటుంది. కాని ఆ క్షణాన ఆ పని తనకు జరగలేదని ఊపిరి పీల్చుకుంటారు. ఇది మధ్యతరగతి పలాయనవాదం. ఢిల్లీలో రాత్రి తొమ్మిది దాటాక బస్సుల్లో ఆడపిల్ల ప్రయాణం చేస్తే -ఆమె వ్యభిచారి కిందే లెక్క. ఆమెని ఎవరయినా ఏదయినా చెయ్యవచ్చు. ఇది నేను చెప్తున్నమాట కాదు. తాగిన ఒక మగాడు నాకు చెప్పినమాట. డిటిసి బస్సులో ప్రయాణం చేస్తున్న నా తొడమీద తాగిన మగాడు వచ్చి కూచున్నాడు. బస్సు కండక్టరు చూస్తున్నాడు. ఎదిరించబోయాను. బస్సు కండక్టరు అన్నాడు కదా: ‘తొమ్మిది తర్వాత బయటికి రావడం నీదీ తప్పు’! అని”

ఇవి నిష్తా జైన్‌ మాటలు. ఇదీ మన దేశం. మన నీతి. మన మగతనం. మన మహిళ పరిస్థితి. 23 ఏళ్ల వైద్య డిగ్రీ చదువుతున్న ఆడపిల్ల ఢిల్లీలో ఒక మగాడితో ప్రయాణం చేస్తూంటే నడుస్తున్న బస్సులోనే ఏడుగురు కొట్టి మానభంగం చేసి, అడ్డుపడిన మగాడిని ఇనుప వూచలతో చావబాది నడుస్తున్న బస్సులోంచి బయటికి తోసేసిన గుండెనిబ్బరాన్నిచ్చిన రాజధాని మనది.

బిడ్డని చదివించుకోడానికి ఉపాధి చాలని తల్లీదండ్రీ ఉప్పు, రొట్టె తిని -కడుపుకట్టుకుని చదివించుకుంటున్నారు. ఆ అమ్మాయికి డాక్టరు కావాలని కల. కాని బతుకుమీద ఆశకూడాలేని దశలో పేషెంటు అయింది. తల్లిదండ్రులు బిక్కచచ్చిపోయారు. ”నేనెవరినీ నిందించను. ఇలాంటి ఘోరం మరో ఆడపిల్లకు జరగకూడదు” అన్నాడు ఆమె తండ్రి తడి ఆరిపోయిన కళ్లతో.

దేశమంతా ఒక్కటయి ఈ సంఘటనని గర్హించింది. ”నేను చేసింది పరమ ఘోరం. నన్ను ఉరి తీయండి” అన్నాడట -ఈ ఘోరాన్ని చేసిన ఒక నీచుడు. సోనియాగాంధీ, స్పీకర్‌ మీరాకుమార్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ప్రధాని ఈ సంఘటనని గర్హించారు.

నాకు హింస మీదా, ప్రతీకారం మీదా, పగ మీదా, రక్తపాతం మీదా నమ్మకం లేదు. కాని ఈ దేశంలో ఇలాంటి పశువుల్ని నలుగురిమధ్యా నిలబెట్టి కాల్చి చంపాల్సిన సమయం వచ్చిందని నాకనిపిస్తుంది. సిద్ధాంతాల కోసమో, రాజకీయ కారణాలకో చైనాలో తినామన్‌స్క్వేర్‌ దగ్గర వేలమంది యువకుల్ని చంపి రక్తపు మరకల్ని చెరిపేసింది ప్రభుత్వం. ఇలాంటి వారిని అతి ఉదారంగా ఆ పని చేసి -రక్తపు మరకల్ని అలాగే ఉంచాలని నా ఉద్దేశం.

ఇంత దారుణమైన నైచ్యానికి ఈ దేశంలో అతి భయంకరమైన ‘ఆంక్ష’ లేకపోవడం దయనీయమైన పరిస్థితి.

సోనియాగాంధీ, జయాబచ్చన్‌ వంటి వారి సానుభూతి ”అమ్మా, నాకింకా బతకాలని ఉంది” అని ఆక్రోశించిన ఆ అమ్మాయికి ప్రాణం పోయదు. కాని మరో అమ్మాయికి ఇలాంటి దుస్థితి రాకుండా చూడవలసిన చర్య -మూగగా, నిస్సహాయంగా, నిశ్శబ్దంగా రంపపుకోతని అనుభవిస్తున్న నిష్తా జైన్‌ వంటి ఎందరో ఆడపిల్లల మనసుల్లో ఏ కాస్తో ‘ఆశ’ని నింపుతుంది.

ఈ ఆడపిల్లకి జరిగిన అత్యాచారం కంటే ‘ఉరిశిక్ష’ అమానుషమయినదా? మానవహక్కుల సంఘాల వారు అవసరమైన సమయాల్లో నోరు విప్పరేం! అన్యాయం జరిగిందని గొంతులు చించుకునేవారు, జరగకముందు ఇలాంటి ఘోరాల్ని గర్హించరేం? ఆత్మవంచనకు అద్దం పట్టే ఈ ‘హక్కుల’ హక్కుదారులు ఏ మానవుల గురించి మాట్లాడుతారో ఆ భగవంతుడికే తెలియాలి.

వారందరికీ ఈ 23 ఏళ్ల అమ్మాయి ఫొటో, సామూహిక మానభంగం జరిగిన అమ్మాయిని హోటల్‌కి పిలిచి రేప్‌ చేసిన పోలీసు ఉద్యోగి ఫొటోని, ఈస్ట్‌ ఢిల్లీలో న్యూ అశోక్‌నగర్‌ కాలనీలో నవంబర్‌ 28న 20 ఏళ్ల అమ్మాయిని రేప్‌ చేసిన పొరుగింటి ప్రబుద్ధుడి ఫొటోని, కొన్ని పువ్వుల్ని ఇచ్చి -వాళ్ల కాళ్ల ఫొటోల్ని పేపర్లో వేయించండి. నోరెత్తని వారి మానవీయతకి మురిసిపోయి ఇక్కడి నుంచే మేం దండం పెట్టుకుంటాం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.