Topic: Malli avinitiki peddapita (మళ్ళీ అవినీతికి పెద్దపీట)
Language: Telugu (తెలుగు)
Published on: Mar 17, 2014
Malli avinitiki peddapita(మళ్ళీ అవినీతికి పెద్దపీట )

ఈ దేశంలో రాజకీయ నాయకుడు అన్నిటికీ తెగించి అయినా ఉండాలి లేదా వోటరు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అనయినా అనుకొని ఉండాలి. వోటరు కన్ను కప్పి ఏపనయినా చెయ్యవచ్చుననే కుత్సితపు ధీమాతో ఉండి ఉండాలి. లేదా వోటరుకి మరో గతి లేదన్న అలసత్వమయినా పెంచుకుని ఉండాలి. ఈ వ్యవస్థ బలహీనతల్ని కాచి వడబోసి అయినా ఉండాలి. లేదా ప్రజలు గతాన్ని సుళువుగా మరిచిపోతారులే -అన్న మొండి ధైర్యాన్నయినా పెంచుకుని ఉండాలి. రాజకీయ నాయకుడు సమాజ వంచనని అసిధారా వ్రతంగా సాధించి అయినా ఉండాలి లేదా దక్కిందే దైవ ప్రసాదమని వోటరు సరిపెట్టుకోవడం తప్ప అతనికి మరొక గతి లేదని రహస్యంగా నవ్వుకుంటూనయినా ఉండాలి. అతని కళ్లు మూసుకు పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదన్న ధీమాతోనయినా ఉండాలి. లేదా ప్రజలు గుడ్డివారన్న నమ్మకంతోనయినా ఉండి ఉండాలి. లేకపోతే అవినీతులు చేసి, కోట్లు దోచుకుని, జైళ్లకు వెళ్లి -కోర్టులు వారి అవినీతిని ఎత్తిచూపాక కూడా వారినే ఎన్నికల బరిలోకి దింపడం ఈ పార్టీల గుండెలు తీసిన తెగింపుకీ, ప్రజల ఆవేశాల పట్ల చీమకుట్టనట్టయినా లేని వారి నిర్లక్ష్యానికీ, అహంకారానికీ నిదర్శనం. మీరు నమ్ముతారో నమ్మరో -ఈ అయిదేళ్లలో కేవలం నాలుగుసార్లు పార్టీలు మారి -సమాజ శ్రేయస్సు గురించి మైకుల ముందు మాట్లాడుతూ వోటరు చెవిలో పువ్వులు పెట్టే నాయకమ్మణ్యుల వీరంగాన్ని ఈ మధ్యనే చూశాం.
ఒక్కసారి మళ్లీ బరిలోకి దిగే ఈ నాయకుల నిర్వాకాన్ని తలచుకుని మురిసిపోదాం. ఈ దేశంలో కల్లా భయంకరమైన ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కనీసం నలుగురు ముఖ్యమంత్రులు, పదిమంది ఐయ్యేయస్‌లూ, ఈ దేశాన్ని పాలించిన సైన్యాధిపతులూ -ఎందరో ఉన్నారు. ఈ కుంభకోణం బయటపడి, గందరగోళం జరగగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ వ్యవహారంలో వాటా ఉన్న అశోక్ చవాన్ తన పదవికి 2010 నవంబర్ 9న రాజీనామా చేశారు. ద్రవిడ మున్నేత్ర కజగం నాయకులు ఏ.రాజా గారు కేవలం లక్షా 76 వేల కోట్ల 2జి కుంభకోణానికి మూలపురుషులు. వారు 2011 ఫిబ్రవరి 2న అరెస్టయి 15 నెలలు జైలులో ఉండి బెయిలు మీద బయటికి వచ్చారు. ఒలింపిక్ క్రీడలకు ఈ దేశంలో ప్రతినిధి -సురేష్ కల్మాడీగారు 2010 కామన్వెల్తు క్రీడల కుంభకోణంలో కేవలం 1600 కోట్ల కుంభకోణానికి మూలపురుషులు. వారిని సీబీఐ 2011 ఏప్రిల్ 25న అరెస్టు చేసింది. పదినెలలు జైలులో ఉండి బెయిలు మీద బయటికి వచ్చారు. ఇక రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్‌గారి మేనల్లుడు విజయ సింగ్లా గారు తన మేనమామ ఆశీర్వాదంతో 90 లక్షల ముడుపులు మాత్రమే తీసుకున్నారు. ఈ రైల్‌గేట్ కుంభకోణంలో తన వంతు పాత్రకి గాను బన్సల్‌గారు 2013 మే 10న తన పదవికి రాజీనామా చేశారు. అలనాటి టెలి కమ్యూనికేషన్ల మంత్రి, కరుణానిధిగారి మేనల్లుడి కొడుకు దయానిధి మారన్ తన సొంత యింట్లోనే 323 టెలిఫోన్ కనెక్షన్లతో ఒక టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌నే పెట్టుకున్నారు. వీరికి 2జి కుంభకోణంలో వాటా ఉన్నదని బయటపడడంతో 2011 జూలై 7న తన పదవికి రాజీనామా చేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పగారు అవినీతికి అధ్యక్షుడు. ఒక్క నమూనాని చెప్పుకుందాం. బెంగుళూరు దగ్గర రాచనహళ్లి అనే చోట ఒక ఎకరా స్థలాన్ని 40 లక్షలకి కొని, 2 కోట్లకి అమ్మిన ఘనత వారిది. వారి హయాంలో ఆయన వ్యక్తిగత ఆదాయం 292 శాతం పెరిగిందని అంచనా వేశారు. వీరు 2011 అక్టోబర్ 15న అరెస్టయి 23 రోజుల తర్వాత బెయిల్ మీద బయటపడ్డారు. ఇక ఈ దేశంలో పండి ముదిరిన ముఖ్యమంత్రి కరుణానిధిగారి ముద్దుల కూతురు, వారి సాహితీ వ్యవసాయానికి వారసురాలు కనిమొళి 2జి కుంభకోణంలో తన తల్లి దయాళు అమ్మాళ్ పేరిట 62 శాతం వాటాని ఏర్పాటు చేసుకుని, తనకి 20 శాతం పెట్టుకున్నారు. మే 2011లో అరెస్టయి ఆరు నెలలు జైలులో ఉండి బయటికి వచ్చారు -బెయిలుమీద. స్వాతంత్య్ర పోరాటంలో దేశభక్తులకి కూడా దక్కనంతగా వారికి తీహార్ జైలు బయట వారి పార్టీ పెద్దలు స్వాగతాన్ని పలికారు. అవినీతిని పోషించి, అక్కున చేర్చుకునే గుండెలు తీసిన నాయకత్వం ఈ దేశంలో ఎంతగా పునాదులు వేసుకుందో, నిస్సిగ్గుగా ఎంతగా బరితెగించిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. బొగ్గు కుంభకోణంలో బొగ్గుమంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ బంధుప్రీతిని చూపారని నేరారోపణ జరిగింది. మరి ఆ మంత్రిత్వశాఖ నాయకులు, మన ప్రియతమ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మాటేమిటి? అగస్తా కుంభకోణం బయటపడ్డాక కూడా నిమ్మకు నీరెత్తినట్టున్న మన రక్షణమంత్రి ఏంటోనీ గారి మాటేమిటి? గాస్ కేటాయింపులలో అవినీతి ఆరోపణలు వచ్చిన మన పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ గారికి కర్ణాటకలో చిక్‌బల్లాపూర్ నుంచి పోటీ చెయ్యడానికి టిక్కెట్టుని ఇచ్చారు. అప్పటి ఐపీఎల్ క్రికెట్ కుంభకోణంలో కేరళ ఫ్రాంచయిజ్‌కి ఒకప్పటి తన ప్రేయసి సునందా పుష్కర్‌ని వెనకేసుకు వచ్చినందుకు ఆనాడు శశిధరూర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. వారికిప్పుడు తిరువనంతపురం నుంచి పోటీచేసే అవకాశాన్ని కల్పించారు.
దీనివల్ల అర్థమయే నిజం ఈ దేశంలో ప్రతీ రాజకీయ పార్టీలోనూ తమ తమ స్వార్థానికి గడ్డి కరిచి, వీధిన పడిన అవినీతి భాగోతాలున్నాయి. అవి కోర్టులదాకా వెళ్లాయి. ఆయా ప్రబుద్ధులు జైళ్లలో ఉండి వచ్చారు. అయినా ఏరి కోరి వారికి రాబోయే ఎన్నికలలో సీట్లు ఇచ్చారు. రాజకీయాల్లో పార్టీలు నైతికమయిన బాధ్యతని ఎప్పుడో అటకెక్కించేశాయనడానికి ఇది గొప్ప ఉదాహరణ. అందరికీ ఇప్పుడు సామాన్యమైన రోగం -ఆత్మవంచన. వారు ఇంకా గుర్తించని విషయం -ప్రజలు ఈ భాగోతాలన్నింటినీ గమనిస్తున్నారని. కేవలం ఎన్నికలలో గెలిచే కారణంగానే పోటీలో నిలిచిన ఈ నేరస్థుల్ని ఇంటికి పంపుతారని. కాకపోతే మన దేశం ప్రస్థుతం -ప్రపంచంలో అవినీతిలో కూరుకుపోయిన దేశాలలో 18వ స్థానంలో ఉంది. ఈ పార్టీల పుణ్యమా అని ఆ ఘనతని పెంచే ప్రయత్నాలు ఈ పార్టీలు చేస్తున్నాయి.
పార్టీల అవకాశవాదానికీ, నీతిమాలిన తనానికీ -అతి క్రూరంగా తీర్పు చెప్పడానికి వోటరు ఉవ్విళ్లూరుతున్నాడు. నిన్నకాక మొన్న 25 వేల మెజారిటీతో మూడుసార్లు పదవిలోకి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఏనాడూ పోటీలో నిలవని ఓ అనామకుడి చేతుల్లో ఓడిపోవడమే నిదర్శనం. ఈసారి -మన ఎన్నికలలో మొదటిసారిగా ఏ ఒక్కడినయినా లేక అందరినయినా తిరస్కరించే అవకాశాన్ని -నోటాని -కల్పించా రు. మొదటిసారిగా వోటరు తన విసుగుదలని ప్రత్యక్షంగా చూపే అవకాశం కలగబోతోంది. ఇంతవరకూ బాచన్నను కాదని బూచన్ననీ మరొకసారి బూచన్నను కాదని బాచన్ననీ ఎన్నుకోవడం -ఆయా పార్టీల గొప్పతనం కాదని -వోటరుకి మరో గతిలేకపోవడమని వోటరు ఇప్పుడు నిరూపించబోతున్నాడు. మన ఎన్నికల ఖర్చు అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఖర్చు కంటే ఎక్కువని తెలిసింది. ఈ నాయకమ్మణ్యులు తినే గడ్డికన్నా -వీరికి బుద్ధి చెప్పి ఇంటికి పంపడానికి -ఒక్కసారయినా ఆ ఖర్చు పెట్టడం తప్పుకాదని భావించేవారున్నారు. ఇంతవర కూ పోటీలో నిలబడిన నాయకులలో గతిలేక ఎవరినో ఒకరిని ఎన్నుకోక తప్పని దుస్థితి. ఇప్పుడు ”అయిదేళ్ల లో నాలుగుసార్లు పార్టీలు మార్చిన” నాయకుల గోత్రాలను అతి క్రూరంగా, అతి నిర్ధుష్టంగా, అతి నిర్దాక్షిణ్యంగా, అతి సూటిగా బయటపెట్టే రోజులు వచ్చాయి. వోటరుకి తన వోటు విలువ అర్థమవుతోంది. ఈ పార్టీల ఆత్మవంచన పట్ల అసహ్యం పెరుగుతోంది. విశాఖపట్నంని వాషింగ్టన్‌ని చేసినా, ఆంధ్ర దేశాన్ని భూతల స్వర్గం చేసినా, భారతదేశాన్ని చంద్రమండలంలో నిలిపినా -నీతీ జాతీ, అక్కరలేదని, తామేం చేసినా చెల్లుతుందని, అవినీతి అటకెక్కించి, పాత బురదనే నెత్తిన రుద్దే ఈ పార్టీల ‘గబ్బు’ని పబ్లిగ్గా దుయ్యబెట్టడానికి వోటరు సిద్ధంగా ఉన్నాడు. ఆయా దేశాలలో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి రాజకీయ వ్యవస్థల్ని సమూలంగా కూల్చే సామర్థ్యాన్ని వోటరు చూస్తున్నాడు. అలాంటి రోజు త్వరలో రాబోతోంది. అందుకు నమూనా నిన్న కాక మొన్న రాంలీలా మైదానంలో అన్నా హజారేకి బాసటగా నిలిచిన, మొన్న ఆమ్ ఆద్మీని గెలిపించిన నేలబారు మనిషి స్పందన. ఈ 2014 భారత దేశ చరిత్రలో గుర్తుంచుకునే అధ్యాయం కాబోతోందని ఆశిద్దాం
No comments yet.