Main Menu

Gollapudi columns ~ Manishi – Mahatmudu(మనిషీ – మహాత్ముడూ)

Topic: Manishi – Mahatmudu(మనిషీ – మహాత్ముడూ)

Language: Telugu (తెలుగు)

Published on: Nov 25, 2013

Manishi - Mahatmudu(మనిషీ - మహాత్ముడూ)     

ఈ మధ్య నార్వే, స్వీడన్ దేశాలకు వెళ్ళాను. ఆ దేశాలలో పర్యటించేటపుడు నన్ను ఆకర్షించేది చుట్టూ కనిపించే భవనాలూ, కట్టడాలు కాదు. వాళ్ళ జీవన సరళి, వ్యక్తిత్వ వికాసం, సామాజిక శీలం.

మొదట బ్రిటన్ లో నా అనుభవం. బ్రిటన్ చాలా చిన్నదేశం. మాంచెస్టర్ దగ్గర విగాన్ అనే చిన్న ఊరు. అక్కడికి ఉదయాన్నే 7 గంటల ఆరు నిముషాలకు రైలు వస్తుందని రాశారు. నేను నవ్వుకున్నాను. 7 గంటల ఆరునిముషాలేమిటి? ఏడుంపావు లేదా ఏడుగంటల అయిదు నిముషాలు అనవచ్చుకదా? మనదేశంలో కనీసం గంటన్నరయినా లేటుకాకుండా ఏ రైలు ఎప్పుడు వచ్చి చచ్చింది అనుకుంటూ స్టేషన్ కి వచ్చాను. 7 గంటల 5 నిముషాల 50 సెకన్లకి ప్లాట్ ఫారం చివర ఇంజను కనిపించింది. ఏడుగంటల ఆరు నిముషాలకు మా ముందు రైలు ఆగివుంది. అయ్యా, ఈ చిన్న దేశం గత శతాబ్దంలో కనీసం యాభై ఏడు అతి పెద్ద దేశాలను పాలించింది. ఆ పాలకులు చేసిన ఉపకారాన్ని మించి చేసుకోలేక – ఇప్పటికీ అదే బ్రౌను నిఘంటువునీ, అదే కాటన్ నీటి వనరులనీ వాడుకుంటూ దేశాన్ని కొల్లగొట్టుకుంటున్నాం.

ఇక నార్వేనావికులు ఒకప్పుడు సముద్రం మీదుగా వచ్చి ఇంగ్లండుని ఆక్రమించుకున్నారు. ఇప్పుడున్న ఆంగ్లేయులు నార్వే, ఆంగ్లోశాక్సన్ జాతుల సమ్మిశ్రమని చెప్పుకుంటారు. నార్వేలో జనాభా మన విశాఖ జిల్లా అంత. ఏమిటి వీరి గొప్పతనం? ప్రత్యేకత? మొన్ననే మన దేశంలో మన పార్లమెంటు సభ్యులు ఇద్దరిని మానభంగం చేసి చంపిన వార్తల్ని చదువుకున్నాం. అదీ మన ఘనత.

నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు – 2013లో – ఇవి. నార్వేలో మనదేశంలో టాక్సీల్లాగా సైకిళ్ళను అద్దెకిస్తారు. మంత్రిగారి దగ్గర్నుంచి, పార్లమెంటు సభ్యుడు దాకా అంతా వీపుకి సంచి తగిలించుకుని వెళ్తారు. కొందరయితే బస్సుల్లో వెళ్తారు. మా మిత్రుడి భార్య చెప్పింది. అ మధ్య ఆవిడ రైలుకోసం ప్లాట్ ఫారం మీద నిలబడిందట. ఎదుటి ప్లాట్ ఫారం మీద ఆ దేశపు రాజుకొడుకు, అతని పి.ఏ రైలుకోసం నిలబడి ఉన్నారట. – కేవలం ఇద్దరే. మన దేశంలో పంచాయితీ అధ్యక్షుడి దగ్గరునించి, ఎమ్మెల్యే చుట్టూ నలుగురయిదుగురు చెంచాలు, ఇద్దరు సాయుధ రక్షక భటులూ, నాలుగు కార్లూ, రెండు తుపాకులూ ఉంటాయి. ఆ మధ్య టోల్ గేట్ దగ్గర పేరడిగినందుకు తుపాకీ తీసిన రాజకీయనాయకుడి వీరంగం మనం చూసి తరించాం కదా! (ఇక్కడో ఆసక్తికరమైన పిట్ట కథ. తొలి రోజుల్లో మహానుభావులు, ప్రజానాయకులు పుచ్చలపల్లి సుందరయ్యగారు పార్లమెంటుకి నిక్కరుతో సైకిలు మీద వచ్చేవారట. నెహ్రూగారి దృష్టికి ఆ విషయం వెళ్ళింది. సుందరయ్యగారంటే నెహ్రూగారికి అమితమైన గౌరవం. వారిని పిలిచి సభా మర్యాదకోసమయిన – కనీసం పైజమా వేసుకోమన్నారట! – ఈ విషయం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ గారు నాకు చెప్పారు.)

ఏదీ? పట్నంలో – కాలుష్యం కారణంగా – ఆటోలను ఆపే ప్రయత్నం చేయమనండి. అయిదుగురు మంత్రులు, పది యూనియన్లు, కొన్ని బడుగు వర్గాల పార్టీలు ఎదురు తిరుగుతాయి. రెండు ధర్నాలు జరుగుతాయి. పదిమంది ప్రధానిని కలుస్తారు. మనం మెజారిటీ కుసంస్కారాన్ని, అజ్నానాన్ని కాపాడుకునే హక్కు కోసం మనం పోరాడుతాం. దీని పేరు ప్రజాస్వామ్యం. మరి ఆరోగ్యం? కాలుష్యం? – ప్రభుత్వం ఏం చేస్తోంది? వీరిని ఎందుకు ఎన్నుకున్నాం? మనకి నినాదం కావాలి. ఓటు కావాలి. పదవి కావాలి. సమాజ శ్రేయస్సు? అది ఉపన్యాసాల్లో కావాలి. వాస్తవానికి – ఎవడిక్కావాలి?

ఇక – స్వీడన్ లో ఏ దరఖాస్తులోనూ, ఎక్కడా రెండు అవసరం లేదు. కులం, మతం. అసలు జన జీవన సరళిలో వాటి ప్రసక్తి లేదు. అవి రెండూ వ్యక్తికి వ్యక్తిగతమయిన విషయాలని ప్రభుత్వం నమ్ముతుంది. ఇది అద్భుతం. మన దేశంలో ఆ రెంటినే మూల సూత్రాలుగా మన పార్టీలు, సమీకరణలు, ఓట్లు, నోట్లు, సిగపట్లు … ఇది 2013లో స్వీడన్ వంటి చిన్నదేశం మాట.

ఇక కాలుష్యం. కార్లు. మన దేశంలో రోజూ కొన్నివేల కార్లు రోడ్లమీదకు వస్తున్నాయి. కాలుష్యాన్ని ఆపే ఏర్పాట్లు వాటికి జరుగుతున్నాయా? పక్కన పెట్టండి. ఒక్క సింగపూరులోనే ఒక గడువు దాటాక ఆ కారు రోడ్డుమీద నడవడానికి అనుమతిలేదు. కార్ల వాడకాన్ని స్వీడన్ లో ఎలా నియంత్రించారు? ఎవరయినా, ఎక్కడయినా, వారి వారి సొంతకార్లు వారి ఆఫీసుల్లో ఉంచినా చార్జీలు కట్టాలి. సిటీలోకి వస్తే – వచ్చేటప్పుడూ, వెళ్ళేటప్పుడూ చార్జీలు కట్టాలి. ఇదికాక – రద్దీ సమయాల్లో సిటీలోకి వస్తే మరీ ఎక్కువ చార్జీలు కట్టాలి. ఇది కారుల రద్దీని నియంత్రించడానికి పరోక్షమయిన ఆంక్ష. మనకి? ఇలాంటి ఆంక్షని పెట్టండి. మంత్రిగారికీ, మంత్రిగారి బావమరిదికీ, ఎమ్మెల్యేలకీ, వారి చెంచాలకీ, బడుగు వర్గాలకీ, ప్రత్యేకమయిన మత పెద్దలకీ, వృద్దులకీ, ప్రొఫెసర్లకీ, రాబర్ట్ వదేరాలకీ, సోనియాగాంధీ అనుచరులకీ – ఇదీ మన దరిద్రం. ఈ ఏర్పాటు మినహాయింపులు కోరేదికాదు. సమాజ ఆరోగ్యాన్ని సమూలంగా నాశనం చేసేది – అని ఈ నాయకమ్మణ్యులకి ఎవరు చెప్తారు?

ఇక పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు. స్త్రీలు సంవత్సరాలుగా జుత్తు పీక్కొంటున్నారు. మనం మన తల్లుల్ని గౌరవిస్తాం. పిల్లల్ని నెత్తిన ఎత్తుకుంటాం. కానీ చట్ట సభల్లో మన పెద్దరికమే చెల్లాలి. ఈ నిష్పత్తి చూడండి. స్వీడన్ లో 47 శాతం స్త్రీలు ఉన్నారు. ఫిన్లెండులో 43 శాతం. నార్వేలో 38 శాతం.

మనకి వోక్స్ వాగన్ ఫాక్టరీ డబ్బు తినేసిన మంత్రులూ, టాటా కార్ల ఫాక్టరీని రాష్ట్రంలోంచి తరమేసిన ముఖ్యమంత్రులూ ఉన్నారు – ఏ కారణానికయినా. స్వీడన్ వంటి చిన్న దేశం ప్రపంచ స్థాయిలో నిలిచే అద్భుతమయిన పరిశ్రమల కూడలి. వోల్వో, ఎరిక్ సన్, స్వాన్ స్కా, స్కైప్, ఐకియా, హె అండ్ ఎం, ఎలక్ట్రోలక్స్, భోఫోర్స్ – ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. బోఫోర్స్ అనగానే మనకి కోట్ల కుంభకోణం గుర్తుకు వస్తుంది. మన నాయకుల అవినీతి, ఇప్పటికీ బయటపడని కోట్ల దోపిడీ గుర్తొస్తుంది. కానీ బోఫోర్స్ శతఘ్నులు లేకపోతే అలనాడు కార్గిల్ యుద్దాన్ని మనం జయించలేకపోయేవారమన్న నిజం చాలామంది మనస్సుల్లోనయినా లేదు. 90 డిగ్రీల వాలులో పేలే శతజ్ని ప్రపంచంలో అదొక్కటేనని చాలామందికి తెలీదు.

మనకి అంగారకుడిదాకా ఉపగ్రహాల్ని పంపే మేధస్సుం ది. మానవజాతికి మార్గదర్శకం కాగల సంస్కృతి ఉంది. ప్రపంచాన్ని దిగ్ర్బాంతం చెయ్యగల కళా వైదగ్ద్యం ఉంది. కానీ స్వప్రయోజాన్ని దాటి చూడలేని, చూడడానికి ఇష్టపడని, చూడనివ్వని నీచమయిన పశుత్వం రాజ్యమేలుతోంది. అలాంటి కారణానికే మనం అడుక్కుతింటున్నాం. ఇంగ్లండు వంటి అతి చిన్న దేశాలు మనల్ని శతాబ్దాలుగా బానిసల్ని చేశాయి.

మనకి మహాత్ములున్నారు. కానీ వ్యక్తిగత శీలాన్ని గర్వంగా నిలుపుకోగల, చాటుకోగల ‘మనిషి ‘లేడు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.