Main Menu

Gollapudi columns ~ Maro ‘leader’katha(మరో ‘లీడర్’కథ)

Topic: Maro ‘leader’katha(మరో ‘లీడర్’కథ)

Language: Telugu (తెలుగు)

Published on: Aug 29, 2011

Maro leader katha(మరో లీడర్కథ)     

ఆ మధ్య ‘లీడర్ ‘ సినీమాలో ఓ తమాషా అయిన పాత్ర వేశాను. పాత్ర చిన్నది. రెండు సీన్ల వ్యవహారం. ఏదో తేలికగా సాగిపోయే పాత్ర అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ పాత్రకి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. అంతకు మించి నివ్వెరపోయాను. ఎంతోమంది ఆ పాత్రని మెచ్చుకున్నారు.

కారణం? నేను బాగా నటించడం కాదు. ఆ పాత్రలో కొట్టొచ్చినట్టు కనిపించే నిజం. కుండ బద్దలు కొట్టే లౌక్యం. వెరసి – ఒక సీనియర్ నాయకుని రాజకీయ చాతుర్యానికి మచ్చుతునక. అయితే ఒకప్పుడు గాంధీగారి ఉద్యమానికి మురిసిపోయిన నాయకుడు ఇతను. రాజకీయాలు మరిగి, పండిన ముసలి నక్క. కకలు తీరినవాడు. అవినీతిని నిర్మూలించాలని కంకణం కట్టుకున్న కుర్ర ముఖ్యమంత్రిని నిలదీసి పాఠం చెప్పగల అనుభవం ఉన్నవాడు. శాసన సభలో ‘మమ్మల్ని జైలుకి పంపే చట్టాన్ని మమ్మల్నే చెయ్యమంటావయ్యా? ఎవరయ్యా నీకు చదువు చెప్పిన మేష్టరు?’ అని వెక్కిరిస్తాడు. నీ చట్టంలో శాసన సభ్యుల్ని మినహాయించు – చట్టం పాసయిపోతుందని సలహా ఇస్తాడు. అలాగే చేస్తాడు ముఖ్యమంత్రి. చట్టం నెగ్గుతుంది. ఈ పాత్రలో కుటిల నీతి, దాపరికం లేకుండా చెప్పే నిర్భయత్వం చాలా మందికి నచ్చిందనుకుంటాను.

అలాంటి లీడర్ వ్యవహారమే ప్రస్తుతం ఢిల్లీలో, పార్లమెంటులో జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో నిరాహార దీక్షని చేస్తున్న అన్నా హజారే ‘లీడర్’ సినీమాలోలాగా కుర్ర ముఖ్యమంత్రి కాదు. అయితే రాజకీయ నాయకుడూ కాదు. అద్భుతమైన మానవతావాది. అపూర్వమైన ఆత్మశక్తిగల కర్మయోగి. ఎట్టి పరిస్థితులలోనూ రాజకీయాలు వంటబట్టించుకున్నవాడు కాదు. ఆ లక్షణాలు, ఎత్తుగడలకూ బొత్తిగా దూరం. ఆయన వెనుక నిలిచిన – కొద్దిమంది పెద్దలు – నిజాయితీగా సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించగల ఉద్దండులు. వారూ రాజకీయ నాయకులు కారు. దేశమంతటా ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున సమర్ధిస్తున్న లక్షలాది ప్రజనీకం – అవినీతికి నష్ట పోయినవారు. కొందరు – లేదా చాలామంది అవినీతికి తలలు వంచినవారు. అంటే తప్పనిసరిగా ‘అవినీతి’ లో వాటాపంచుకున్నవారు. వెరసి – ఈ ఉద్యమం బలం – నాయకత్వపు నైతిక బలం. ప్రజల ఆక్రోశం, విసుగు, నిర్వీర్యత. వీరెవరూ రాజకీయ నాయకులు కారు.ఏతావాతా, ఈ బిల్లు చట్టం కావాలంటే ఎక్కడికి పోవాలి? ఎవరు సమర్ధించాలి? ఎవరు చట్టం చేయాలి? రాజకీయ నాయకులు. అక్కడ ఈ పెద్దలకి కాని, ఈ బాధితులకి కానీ స్థానం ఉన్నదా? లేదు.

ఇప్పుడూ ‘లీడర్’ సినిమా. నా పాత్ర మెలిక.

2008 లో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక లెక్కల ప్రకారం 540 సభ్యులున్న పార్లమెంటులో దాదాపు నాలుగోవంతు – అంటే దాదాపు 120 మంది నేరస్థులున్నారు. వీరిలో దొమ్మీలు, దొంగతనంగా మనుషుల్ని రవాణా చేసినవారు, డబ్బుని దోచుకున్నవారూ, మానభంగాలూ, హత్యలూ చేసినవారూ ఉన్నారు. వారంతా కేవలం పాలక వర్గం సభ్యులు కారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభ సభ్యులు – నలుగురు – ఒక కేంద్ర మంత్రి, మరో ముగ్గురు సభ్యులు తీహార్ జైల్లో ఉన్నారు. ఇది ఈ దేశంలోనే చరిత్ర. ఒక రికార్డ్.

ఈ లోకపాల్ బిల్లు ఇంతవరకూ పార్లమెంటులో 1968 నుంచి కనీసం పదిసార్లు ప్రవేశపెట్టారు. ఎవరూ దీన్ని పట్టించుకోలేదు సరికదా సీరియస్ గానయినా తీసుకోలేదు. పదకొండోసారీ ఆ గతే పట్టేది కానీ – ఓ ఉద్యమకారుడు నడుం బిగించాడు. ఓ మారుమూల గ్రామంలో ఓ గుడి వసారాలో ఒకే ఒక్క పరుపు చుట్ట, అన్నం కంచం ఆస్తిగా గల ఓ కటిక పేద – కానీ మానసికంగా అవినీతి పునాదుల్ని కదిలించే దమ్మున్న వీరుడు అండగా నిలిచాడు. విసుగెత్తిన, కస్సుమనే ప్రజానీకం సముద్రమై లేచింది.

ఇప్పుడు బిల్లు పార్లమెంటులో చర్చకు నిలిచింది. ఈ పార్లమెంటు నిజాయితీగా, నిక్కచ్చిగా ఈ బిల్లుని చట్టాన్ని చేస్తే ముందుగా 120 మంది పార్లమెంటు సభ్యులు జైలుకి వెళ్ళడమో, వీధిన పడడమో జరుగుతుంది. చాలామంది గొప్పవాళ్ళ గోత్రాలు బయటకొస్తాయి. ఇది జరిగే పనేనా? అలనాడు కాళిదాసు తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నంత వెర్రిబాగులవాళ్ళా మన నాయకులు? వీరిలో ఘనత వహించిన రాజా భయ్యాలు, లల్లూ ప్రసాద్ లూ, మాయావతులూ, మధుకోడాలు, కరుణానిధులూ, అళగిరులూ, సుప్రీం కోర్టు లెక్కల ప్రకారం జగన్ లూ ఉన్నారు. ఇప్పుడు ‘లీడర్ ‘ సీను పార్లమెంటులో జరగబోతోంది.

ఈ దేశంలో అన్నా హజారే ఉద్యమానికి తలవంచి పార్లమెంటరీ వ్యవస్థని, రాజ్యాంగాన్ని మంటగలపడం సరికాదని సోమనాధ చటర్జీ, హరీశ్ సాల్వే, అరుంధతి రాయ్ వంటి మేధావులు వాపోతున్నారు. ఏ పార్లమెంటరీ వ్యవస్థని? ప్రజాస్వామ్యం పేరిట 120 మంది నేరస్థుల్ని చట్టసభలో నిలిపిన వ్యవస్థనా? వీరా నేరస్థుల్ని ఎండగట్టే చట్టాన్ని చేసేది? లీడర్ లో నా పాత్ర భాషలో ‘ఎవరయ్యా మీకు పాఠం నేర్పింది?’ అనాల్సిన స్థితి. చట్టం చేతకానితనానికి 64 ఏళ్ళుగా నలిగిపోతున్న ప్రజానీకం ఆవేశం ఒక పక్క, డబ్బునీ, కండబలాన్నీ, కులాన్నీ, మైనారిటీ సాకునీ అడ్డం పెట్టుకుని చట్టసభకు చేరిన నాయకమ్మణ్యులు ఒక పక్క. ఏ వ్యవస్థని రక్షించాలి?

మొన్న టీవీలో ఏంకరు – ప్రముఖ న్యాయవేత్త, మాజీ ఎడ్వకేట్ జనరల్ పాలీ నారీమన్ ని ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, ఈ ఉద్యమం పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యన్ని దెబ్బతీస్తోందంటున్నారు. తమరేమంటారు? అని. ఆయన ఒక్కటే అన్నారు” నాన్సెన్స్, ఈ దేశంలో ఒకే ఒక్క పుస్తకానిదే పై చెయ్యి. దాని పేరు రాజ్యాంగం. దానిలో మొదటి రెండు మాటలు: మేం, ప్రజలం..”

ప్రజలకన్న, ప్రజల తిరుగుబాటుకన్నా వ్యవస్థలో దేనికీ బలం లేదు. ఏదీ గొప్పది కాదు. ఇందుకు అడ్డం నిలిచిన వ్యవస్థలు కూలిపోతాయి. ఆనాడు అక్టోబరు విప్లవంలో అదే జరిగింది. అటు మొన్నటి ఇరాన్ లో రాజపాలనని ప్రజలు అలాగే తిప్పికొట్టారు. నిన్న టర్కీ ఆ నిజాన్ని నిరూపించింది. నేడు లిబ్యా ఆ పనే చేస్తోంది.
వేళ్ళతో కూలిపోతున్న వ్యవస్థని కాపాడడం కోసం ఎవరూ పాటుపడనక్కరలేదు. సమాజంలో ఇలాంటి ఉద్యమాలే కొత్త వ్యవస్థల్ని రూపుదిద్దుతాయి. ఈ ఉధ్రుతంలో బలహీనమయిన వ్యవస్థలు నేలమట్టమవుతాయి. ఆవేశం, నిజాయితీ, జీవుని వేదన పెట్టుబడులుగా నిప్పులు చెరిగే ఉద్యమాలు బూజుపట్టిన వ్యవస్థలకి లోబడిసాగవు. సాగితే అవి ఉద్యమాలు కావు. ఉద్యోగాలు.

అయితే –

అద్భుతంగా పెల్లుబికిన గొప్పవెల్లువ ప్రస్థుతం – నేరస్తుల మధ్య, భుజాలు తడువుకునే రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయింది.

చరిత్రలో పదకొండోసారి ఇది అటకెక్కుతుందా, బతికి చట్టమౌతుందా అన్నది సందిగ్ధం. ఈ భయానికి ఒక్కటే కారణం – మహిళల రిజర్వేషన్ బిల్లు.

ఇరవై లక్షల కోట్లను ఇండియా ఎల్లలు దాటించి, ఖత్రోచి వంటి వారి అవినీతికి గొడుగుపట్టి, నోరెత్తి, నేరస్తుల్ని బయటపెట్టే 13 మందిని, కొందరి కుటుంబాలతో సహా దారుణంగా హత్య చేసిన భారత చరిత్రలో ఓ మహానుభావుడి ఆర్తికి, మహా ప్రజా సందోహం ఆవేశానికి ఘనమైన స్వాగతం లభిస్తుందా?
ఇక్కడే మరో ‘లీడర్’ మెలిక.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.