Main Menu

Gollapudi columns ~ Medhavi Astamayam(మేధావి అస్తమయం)

Topic: Medhavi Astamayam(మేధావి అస్తమయం)

Language: Telugu (తెలుగు)

Published on: Apr 29, 2013

Medhavi Astamayam(మేధావి అస్తమయం)     

గొప్ప గాయకుడు, కవి, రచయిత, మిత్రుడు -యివన్నీ నేలబారు విశ్లేషణలు. ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు (పి.బి.శ్రీనివాస్‌)కి యివేవీ సరిపోవు. ఇవన్నీ ఎవరయినా సాధించగలిగినవి. సాధిస్తున్నవీను. ఆయన బ్రతుకు రహస్యం తెలిసిన మనిషి. ఆద్యంతమూ జీవించిన మనిషి. ఆ మధ్య చాలా జబ్బుపడి కోలుకున్నారు. నేను నా నలభైయ్యేళ్ల పరిచయంలో ఏనాడూ ఆయన నిస్పృహతో, నిరాశతో, నిస్సత్తువతో, దైన్యతతో ఉండగా చూడలేదు. ఎప్పుడూ ఆనందంగా -ఎదుటివాడిలో మంచిని గుర్తిస్తూ, కీర్తిస్తూ జీవించిన యోగి. అదీ ఆయన ఆరోగ్య రహస్యం.

ఎప్పుడూ కొత్తదనానికీ, కొత్త ఆలోచనకీ, కొత్త పదానికీ పెద్ద పీట వేసేవారు. గొప్ప స్నేహితుడు. జేబునిండా కలాలు. చేతినిండా పుస్తకాలు. మెదడునిండా ఆలోచనలు. మనసునిండా ఆర్ధ్రత. కారునిండా పుస్తకాల కవిలి కట్టలు. పన్నెండు భాషల్లో ప్రతిభా పాటవాలు. ఆయన గొంతు శ్రుతిబద్ధంగా పలికే రోజుల్లో -ఆయన గొంతు పలకగలిగినంత సుస్వరం, గమకం అనితర సాధ్యం. ఆ రోజుల్లో ఏ కొత్త గజల్‌ రాసినా -రాత్రి ఎంత ఆలస్యమయినా యింటికి వచ్చి పాడి -ఆ రాగంలో స్వారశ్యాన్ని, ఆ భావంలో గడుసుదనాన్నీ వివరించి చెప్పి మరీ యింటికి వెళ్లేవారు. ఆ సందర్భాలలో నేను తరచు అనే మాటని ఆయన చెప్పి చెప్పి మరీ కితకితలు పెట్టినట్టు నవ్వుకొనేవారు. కొత్త పలుకుబడి ఆయనకి ప్రాణం. ”అయ్యా! మీరో కొత్త గజల్‌ గజలీకరించి నన్ను ఆనందాగ్నిలో కాల్చి వేయండి” అనేవాడిని.

సాధారణంగా రాత్రి పదిన్నర దాటాక -ఆయన యిల్లు చేరాక -యిద్దరం పద్యాల్లో, పాటల్లో పలకరించుకునేవాళ్లం. ఆ పాటలన్నీ నాదగ్గర ఉన్నాయి. కక్కుర్తి, అర్జంటు కవితలు. ఒకసారి నీలాంబరిలో నాకు జోలపాట పాడారు. మరో పదిహేనేళ్ల తర్వాత ఆ పాటని నాకు అదే రాగంలో పాడి వినిపించారు! అదీ ఆయన ధారణ.

పాట: (నీలాంబరి)

పల్లవి|| నిదురపో యిక మారుతీ

నీకు చేసెద నే ‘నతి’ (నమస్కారం)

అనుపల్లవి|| కలలలో శ్రీరామచంద్రుని

కనుచు మరియగ నీ మది ||నిదుర||

రామ రూపము కనని నిముసము

నీ మదికి కలిగించు విరసము

స్వప్న మందిరమందు రాముని

ప్రభలు కురియును కౌముది ||నిదుర||

ఇందుకు సమాధానంగా నా షష్ట్యంతం వినదగ్గది:

షష్ట్యంతము:

ప్రతివాది భయంకరునకు అ

ప్రతిహత నిర్భీకర ప్రతిభావంతునకు

మితిలేని మిత్రవరునకు స

న్మతి శ్రీనివాస కుల శ్రేష్టునకున్‌

నామీద ‘శ్రీనివాస మారుతీ వృత్తం’ అనే కొత్త ఛందస్సుని సృష్టించి -రెండు పేజీల పద్యాన్ని రాసి నాకు బహూకరించారు. అదిప్పటికీ నా దగ్గర ఉంది.
ఏదో సన్మానంలో బహూకరించిన టోపీ, ఒక దుశ్శాలువా, చివరి రోజుల్లో వరస తప్పిన అడుగులతో ప్రతీ సాహితీ సమావేశానికీ వచ్చేవారు. ఇప్పుడు జరుగుతున్న నా ”వందేళ్ల కథకి వందనాలు” ధారావాహికకి తన స్పందనని ఆనందంగా రికార్డు చేశారు. నేను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘సురభి’ పత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు -ఆయనమీద ఒక పరిచయ వ్యాసాన్ని రాశాను.

ఎప్పుడూ ఆయన కొలువు ఉడ్‌లాండ్స్‌ హొటల్‌. డ్రైవ్‌ ఇన్‌ మూత పడినప్పుడు న్యూ ఉడ్‌లాండ్స్‌కి మారారు. నలభై అయిదు సంవత్సరాల కిందట హొటల్‌కి దుక్కిపాటివారితో వచ్చినప్పుడూ అక్కడే కనిపించేవారు. ఓసారి ఆలిండియా రేడియోలో తెలుగు సెక్షనుకి వచ్చారు. నేను కనిపించలేదు. ఒక పద్యాన్ని నా టేబిలు మీద ఉంచి వెళ్లిపోయారు.

అనుష్టుప్పు: (అమృతవాహిని)

మీ సీటు నేడు శూన్యంబై

ఓ గొల్లపూడి మారుతీ!

మీకై ప్రతీక్ష సల్పేనే!

వేవేగ రండు ధీనిధీ

పీ.బీ.శ్రీ. 10-7-1977

ఆయన ఖాళీ చేసి వెళ్లిన ఈ ప్రపంచంలో ఎంతమంది మిత్రులు ఎన్ని అనుష్టుప్పులు చెప్తే తనివి తీరుతుంది?

నన్ను మెహదీ హసన్‌కీ, గులాం ఆలీకీ -వెరసి ఉర్దూ కవితకీ, గజల్‌కీ పరిచయం చేసిన ఘనత శ్రీనివాస్‌ గారిదే. నా పక్కన కూర్చుని -ఆనాటి మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన మెహదీ హసన్‌ కచ్చేరీలో -మెల్ల మెల్లగా గజల్‌ మాధుర్యాన్ని నా నరాల్లోకి సంధించిన రసజ్ఞుడు పీబీయస్‌. కొత్త గమకానికి ‘అహా!’ అంటే -దాన్ని గుర్తించే నా రసజ్ఞతకి ‘ఓహో!’అంటూ రుగ్మతని వెయ్యి రెట్లు పెంచగల వైద్యుడు పీబీయస్‌. ఇది సర్వులూ కోరుకునే రోగం. అలాంటి వైద్యుడు అందరికీ దొరకడు. అది నా అదృష్టం.

ఆత్మతృప్తి, ఆనందం, మౌలిక కృషి పట్ల తీరని తృష్ణ, స్నేహశీలత -యివి పెట్టుబడులుగా ఆరోగ్యాన్నీ, జీవితాన్ని జయించిన గొప్ప మిత్రుడు, హితుడూ, శ్రే యాభిలాషి -ఇప్పుడు చెప్పక తప్పదు -గొప్ప గాయకుడు, కవి, బహుభాషా కోవిదుడూ పీబీయస్‌ అనే జీనియస్‌.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.