Main Menu

Gollapudi columns ~ Mexico Mark Pellillu(మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు)

Topic: Mexico Mark Pellillu(మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు)

Language: Telugu (తెలుగు)

Published on: Oct 10, 2011

Mexico Mark Pellillu(మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు)     

ఈ మధ్య మెక్సికోలో కొత్తరకమైన పెళ్లి చట్టాలు అమలులోకి తేవాలని తలపోస్తున్నారు. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని -తీరా ఇద్దరి మధ్యా సంబంధం పొసగక విడిపోవాలని -విడాకులు తీసుకోవాలని తంటాలు పడే నూతన దంపతులు ఎక్కువగా కనిపిస్తున్నారట. వారి సౌకర్యార్థం అసలు పెళ్లిళ్ల లైసెన్సులనే రెండేళ్లకు పరిమితం చెయ్యాలని ఆలోచిస్తున్నారట.

ఇది చాలా సుఖవంతమైన ఏర్పాటుగా నాకు తోస్తుంది. పెళ్లి బాదరబందీ లేకుండా ఈ మధ్య కలిసి బతికే పద్ధతులు వచ్చాయి. అలా బతకడానికి ‘పెళ్లి’ని గుర్తుగా పెట్టుకోవడం వారికి యిష్టం వుండడం లేదు. అలాంటి వారి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణ జరపాలని పెద్దలు ఆలోచిస్తున్నట్టున్నారు.

బరితెగించి, కుండబద్దలు కొట్టినట్టు రాసిన ఆత్మకథ ప్రసిద్ధ హాలీవుడ్‌ తార హెడ్డీ లామర్‌ది. ఆమె సిసిల్‌ బి.డిమిల్లీ దర్శకత్వం వహించిన ‘శాంప్సన్‌ అండ్‌ డలైలా’ లో హీరోయిన్‌. ఆ చిత్రానికి హీరోయిన్‌గా ఖరారు చేసేముందు ఆమె కదలికల్ని, హావభావాలనీ గమనించడానికి డిమిల్లీ ఒక సంవత్సరంపాటు ఆమెని తనతో తిప్పుకున్నాడంటారు. లామర్‌ చాలా అందగత్తె. జీవితంలో కేవలం అయిదుసార్లు మాత్రమే పెళ్లి చేసుకుంది. (ఇలాంటి ఘనత దరిమిలాను ఎలిజబెత్‌ టేలర్‌ సాధించింది). ఆమె తన ఆత్మకథ ‘ఎక్స్‌టసీ అండ్‌ మీ’లో రాసిన ఓ సంఘటన. ఓసారి ఆమెకి ఒకానొక రచయిత మీద మక్కువ కలిగిందట. అతన్ని కారెక్కమంది. ”నీ యిష్టం వచ్చినప్పుడు నీతో రాడానికి నీ మొగుడినేం కాను” అన్నాడట ఆ రచయిత. అతని చొక్కా పుచ్చుకుని కారులో కూలేసి తాత్కాలికంగా పెళ్లి లైసెన్సులు పుచ్చుకునే వూరికి తీసుకుపోయి పెళ్లి చేసేసుకుంది. శని, ఆదివారాలు అతనితో గడిపాక సోమవారం అతనికి విడాకులిచ్చింది. స్థూలంగా ఇదీ కథ.

ఇలాంటి వెసులుబాటు కేవలం అందగత్తెల సొత్తే కాదు -త్వరలో అందరి సొత్తూ కాబోతోంది.

ఈ మధ్య ముగ్గురు నలుగురు ఆడవాళ్లను ”మీ వారేం చేస్తున్నారు?” అని అడిగాను. ”మేం కలిసి ఉండడం లేదండీ” అని ముక్తసరిగా -కాని సిగ్గుపడకుండా, అదేదో నేరంలాగ కాకుండా ధైర్యంగా చెప్పిన సందర్భాలు నాకు తెలుసు. అతి ఘనంగా జరిగిన గొప్పింటి పెళ్లిళ్లు పెటాకులయిన సందర్భాలూ తెలుసు.

కాలం మారిపోతోంది. పెళ్లిళ్లు మునపటిలాగ జరగడం లేదు. సాయంకాలం ప్రారంభమయి అర్ధరాత్రికి ముగిసిపోతున్నాయి. వాళ్ల వైవాహిక జీవితాలూ అంతే క్లుప్తంగా ముగిసిపోతున్నాయి. ‘త్వంజీవ శరదశ్శతమ్‌’ అంటే అర్థం చాలామందికి తెలీదు. తెలిసినవాడికి అది బూతుమాట. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవడం ఎంత బోరు! ఎవడెన్నాళ్లుంటాడో ఎవరికి తెలుసు? అసలు ఈ రోజుల్లో కొన్ని పెళ్లిళ్లే పెద్దలదాకా రావడంలేదు. పెళ్లయిపోయిన చాలారోజులకి పెద్దలకి తెలియజేస్తున్నారు.

ఆ రోజుల్లో అంటే మా రోజుల్లో దిక్కుమాలిన చాదస్తం ఉండేది. ఆడపిల్లని చూసేవాళ్లు ఆ పిల్ల తల్లినీ చూడాలనేవారు -పట్టుగా. కారణం పిల్ల పెరిగి రెండు మూడు పురుళ్లయాక తల్లి రూపునీ, తండ్రి ఆలోచనల్నీ పుణికి పుచ్చుకుంటుంది అనేవారు.

ఈ మధ్య ఎవరో ”ఫలానా ఆయన కూతుర్ని మా అబ్బాయికి చేసుకోవచ్చా?” అని అమెరికానుంచి ఫోన్‌ చేశారు. అమెరికా వెళ్లాక కూడా ఇంకా తల్లిదండ్రులకి ఇంత వెసులుబాటు ఇచ్చిన ఆ అసమర్థుడైన కొడుకు ఎవరా అని నిర్ఘాంతపోయాను.

మా రోజుల్లో పెద్దలెవరయినా కనిపిస్తే ”ఎవరబ్బాయివి బాబూ? మీ ఇంటి పేరేమిటి?” అని అడిగేవారు. చెప్పాక -”ఫలానా వారబ్బాయివా? మీ నాన్నగారు-” అంటూ మురిసిపోయేవారు ఆ అడిగిన పెద్దమనిషి. సంప్రదాయం సత్ప్రవర్తనకి దగ్గరతోవ. నమ్మకమయిన రేపుకి పునాది. పెళ్లి అనే వెండి పళ్లానికి ఆధారమైన గోడ.

పైగా ఆ రోజుల్లో గర్భాదానానికి పెద్దతంతు. ముహూర్తం. చెలంగారు మన పెళ్లిళ్లు ఆ రోజుల్లో ఆడదాన్ని చెరచడంతో ప్రారంభమవుతాయని వాపోయారు. ఇప్పటి యువత ఈ వ్యవహారం చూసి తప్పనిసరిగా నవ్వుతారు. తన వంశాన్ని పరిపుష్టం చేసే జన్యుకణాన్ని -ఆ నిరాకార బీజం తటిల్లతయై గర్బాన్ని చొచ్చుకుపోయినప్పుడు ఆ పిండం శిశువుగా మారే హిరణ్మయత్వం -అంటూ మురిసిపోయారు మిత్రులు, రచయిత వాకాటి పాండురంగరావు గారు.

ఈ కాలంలో గర్భాదానాలు కారు వెనుక సీట్లలో జరిగిపోతున్నాయి. రాధారీ బంగళాల్లో సాగిపోతున్నాయి. దీనికో బోడి ముహూర్తం ఒకటి!

కోరి పెంచుకున్న శారీరక సంబంధానికి ‘ప్రేమ’ అని తప్పుడు గుర్తు పెట్టుకుంటుంది యువత. ప్రేమ అంటే పుచ్చుకోవడం కాదు. యిచ్చుకోవడం -సుఖాన్నీ, స్నేహాన్నీ, సానుభూతినీ, సహజీవనాన్నీ -అన్నిటినీ. తర్వాత వచ్చే అభిప్రాయ బేధాలకూ, అభ్యంతరాలకూ -యిద్దరి మధ్యా కుదరని సమన్వయం మీదే మొగ్గు. పరిష్కారం -విడాకులు.

వ్యవస్థ దీవెన, పెద్దల ఆశీర్వాదం, కుటుంబాల ప్రతిష్టా, ఆయా తరాల సంస్కారం పోవయ్యా, ఎవడిక్కావాలి ఈ ముసలి ఆలోచనలు? గర్భాదానానికి గదులున్నాయి. పెళ్లిళ్లకి కళ్యాణ మంటపాలున్నాయి. విడాకులకి కోర్టులున్నాయి. పుట్టిన బిడ్డలు పెరగడానికి అనాధ శరణాలయాలున్నాయి. మళ్లీ చేసుకోడానికి కావలసినంత మంది చుట్టూ ఉన్నారు.

ఈనాటి పెళ్లిళ్లకీ పెద్దలకీ, వ్యవస్థకీ, కుటుంబ ప్రతిష్టకీ ఏమీ సంబంధం లేదు. మనం గదిలో వాల్‌ పేపరు మార్చుకుంటాం. అడపా తడపా సెల్‌ ఫోనులు మారుస్తాం. కార్లు మారుస్తాం. ఉద్యోగాలు మారుస్తాం. ఇళ్లు మారుస్తాం. తొడుక్కునే బట్టలు మారుస్తాం. జీవిత భాగస్వాముల్ని ఎందుకు మార్చకూడదు?

ఈ ఆలోచనలో మెక్సికో ప్రపంచంలో అందరికంటే ఒకడుగు ముందుకు వేసింది. వాలెంటిన్లు, ఫాదర్స్‌ డేలూ, మదర్స్‌డేలూ దిగుమతి చేసుకుని ఆనందించే మనకి రెండేళ్ల పెళ్లిళ్ల లైసెన్సులు వడ్డించిన విస్తరి.

పెళ్లిళ్ల మంత్రాలు చదివే పురోహితులూ -పెళ్లితంతు మీదాకా వస్తే మంత్రాలు మార్చండి. ”ఈ పెళ్లి మనం మళ్లీ మనస్సు మార్చుకునేదాకా వర్థిల్లుగాక” అని దీవించండి.

కోర్టు ఖర్చులు కలిసొస్తాయి. పిల్లల పెంపకం బెడద లేదు. అన్నిటికీ మించి పెళ్లి అనే బోర్‌ నుంచి ఆటవిడుపుకి ఇది దగ్గరతోవ.

నిన్నకాక మొన్ననే ఓ పెద్దమనిషి నాతో మాట్లాడుతూ -మన ఆర్ష ధర్మంలో సన్యాసం అనే ఆలోచనే లేదు. మన ఋషులందరూ చక్కగా పెళ్లిళ్లు చేసుకున్నారు. గృహస్థాశ్రమమే సనాతన ధర్మం. యాజ్ఞ్యవల్క్య రుషి రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. బౌద్ధం, జైనం నుంచే ఈ సన్యాసి అనే ఆలోచన వచ్చింది. జాతిని పెంపొందించే ఆలోచన, సమాజాన్ని పరిపుష్టం చేయడమే ఈ ధర్మం మూలసూత్రం -అన్నారు. దానికేం? మనకీ ఆర్ష ధర్మం వద్దిప్పుడు. మెక్సికన్‌ ధర్మం చాలు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.