Topic: Miriyala picikari..! (మిరియాల పిచికారీ..!)
Language: Telugu (తెలుగు)
Published on: Jan 13, 2014
Miriyala picikari..! (మిరియాల పిచికారీ..! )

చాలా కష్టపడి ఃపెప్పర్ స్ప్రేఃకి ఈ తెలుగు అనువాదం చేశాను. గత శతాబ్దంలో మన దేశానికి వచ్చిన వ్యాపారస్థులందరూ ఈ సుగంధ ద్రవ్యాలనే రవాణా చేసుకున్నారు తమ తమ దేశాలకి. మన దేశంలో మిరపకాయలు లేవు. కారం లేదు. గ్రీసు వంటి దేశాల నుంచి దరిమిలాను వచ్చాయని చెప్పుకుంటారు. మళ్లీ ఆనాటి మిరియాలకి జాతీయమైన ప్రతిష్టని ఈనాడు పెంచిన ఘనత లగడపాటి రాజగోపాల్‌గారిది.
లోక్‌సభలో మైకులతో కొట్టుకోవడం చూశాం. తిట్టుకోవడం చూశాం. కాగితాలు చింపడం చూశాం. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ శాసనసభలో బట్టలిప్పి, కుర్చీలమీద నిలబడి నినాదాలు చేసే రాష్ట్రీయ లోక్‌దళ్ ఎమ్మెల్యే వీర్‌పాల్ రాఠీ వంటి నాయకుల్ని చూశాం. ఃఃలాగూలు కూడా విప్పి మీరు మగాళ్లని నిరూపించుకోండిఃః అని వాళ్లని ఎగదోసే మంత్రి ఆజమ్ ఖాన్‌వంటి మగాళ్ల పిలుపునీ విన్నాం. ఈ దృశ్యాన్ని చూస్తూ మనసారా ఆనందించి నవ్వుకునే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌గారి సరసతని చూసి ఆనందించాం.
అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ఒక నాయకుడు శృంగారంలో పడ్డారు. ఆయన మీద ఎఫ్‌ఐఆర్ నమోదయింది. అయినా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఈ అలసత్వాన్ని నిరశిస్తూ పీపుల్స్ డిమాక్రటిక్ పార్టీ నాయకులు సయ్యద్ బషీర్ అహమ్మద్‌గారు కేకలు వేశారు చట్టసభలో. వారిని బయటికి పంపమని స్పీకర్ ఆర్డర్ వేశారు. బయటికి తీసుకువెళ్తున్న మార్షల్ చెంప పగలగొట్టారు అహమ్మద్. చట్టసభల్లో జరిగే చర్చలు ప్రత్యక్షంగా చూసే అవకాశం టీవీ ప్రసారాల ద్వారా కల్పించింది ప్రభుత్వం. అయితే ఈ వెసులుబాటుని అవకాశం చేసుకుని నాయకులు తమ వీరంగాన్ని ప్రజలముందు ప్రదర్శించే బాగోతమే మనమిప్పుడు చూస్తున్నది. ప్రస్థుత తరం నాయకులు ముఖ్యంగా రెండు వదిలేశారు -సిగ్గు, శరం. కాగా తాము వాటిని వదిలిపెట్టడానికి వారి వారి కారణాలను ఆవేశంగా ప్రదర్శించే ప్రతిభని మనం చూసి తరిస్తున్నాం.అయితే ఈ బాగోతాలకి తలమానికం మిరియాల పిచ్చికారీ. మన రాజకీయ నాయకులు రకరకాల దౌర్జన్యాలకి సిద్ధపడ్డారు కాని ఈ కొత్త పద్ధతిని గుర్తుపట్టలేకపోయారు. అది వారి అవగాహన లోపం గాని లగడపాటివారి తప్పుకాదు. వారెప్పుడూ ఆత్మరక్షణకి మిరియాల పిచ్చికారీని తన జేబులో ఉంచుకుంటారని వక్కాణించారు. ఆది ఆయుధం కాదని, ఆత్మరక్షణకి ఉపయోగపడే సాధనమని వివరించారు.
తమ కళ్లలో ఏం పడిందో ఊహించలేక తికమకపడే నాయకులు ఆసుపత్రులకు తరలే దృశ్యం చాలా ఉత్కర్ష భరితంగా ఉంది. యుద్ధాలలో సైనికులు చాలా ఆయుధాలు వాడతారు. అవన్నీ శత్రువులకు తెలియాల్సిన పనిలేదు. వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా లేకపోవడం సభ్యుల అసమర్ధతగాని లగడపాటి వారి బాధ్యతారాహిత్యం కాదు. ముందు ముందు పచ్చికారం, చింతపండు పులుసు, కషాయ పిచ్చికారీల వంటివి ఉత్తరప్రదేశ్ సభ్యులో మరెవరో సిద్ధం చేసుకుంటే మనం ఆశ్చర్యపడనక్కరలేదు. సభ్యులు ఒకరి మీద ఒకరు దొంగ దెబ్బ తీయడానికి, తీసే సాధనాలకు ఇది ప్రారంభమని మనం గుర్తిస్తే చాలు. చట్టసభల్లో చేసే ఈ పనులకీ చట్టరీత్యా శిక్షలు ఉండవు. స్పీకర్ ఒక్కరికే ఆ అధికారాలు ఉన్నాయి. అయితే వాటిని ఉపయోగించకుండా స్పీకర్ చేతుల్ని ఆయా పార్టీలే బంధిస్తాయి. కారణం -స్పీకర్ కూడా ఒక దశలో ఆయా పార్టీల మనిషే కనుక. 200 రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని లెక్కచేయక, ముందు చెప్పిన మాటల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ చూపిన అహంకారం, ప్రజా స్పందనని అర్థం చేసుకోని అలక్ష్యం అలాఉండగా -టీవీ ప్రసారాలను ఆపుజేసి, పార్లమెంటు తలుపులను మూసేసి, తమ పార్టీ సభ్యుల్నే మార్షల్స్‌గా నిలిపి, సీమాంధ్ర నాయకుల్ని బర్తరఫ్ చేసి, ఓటింగు అయిందనిపించిన పార్టీ ఘనత ఒకపక్క -మిరియాల పిచ్చుకారీ మరొక పక్క -పార్లమెంటు చరిత్రకి చక్కని ప్రతీకలు.
బాబా సాహెబ్ అంబేద్కర్, మావ్ లంకర్, అనంత శయనం అయ్యంగార్, చవాన్ వంటి గొప్ప రాజకీయవేత్తలు ఈ వ్యవస్థకి ఒక ఒరవడినీ, ఒక ఘనతనీ ప్రోదు చేశారు. కొన్ని అపూర్వమైన నియమాల్ని ముందుచూపుతో నిర్దేశించారు. కాని ఒకనాడు ఇంత పవిత్రమైన ప్రజా ప్రతినిధుల సభల్లోకి మిరియాల పిచ్చికారీలు వస్తాయని, సభ్యులు బట్టలిప్పుకు కుర్చీల మీద నిలబడతారని, ముఖ్యమంత్రులు ఆ దృశ్యాల్ని చూసి ఆనందిస్తారని, ఉద్యోగుల్ని కొట్టే పెద్దమనుషులకు ఈ సభలు అభివృద్ధిని సాధిస్తాయని, తలుపులు బిగించి చట్టాలు చేసే రోజులు వస్తాయని వారు ఊహించి ఉండరు. ఒక్కసారి కళ్లు మూసుకుని జయప్రకాష్ నారాయణ్, వల్లభాయ్ పటేల్, జె.బి.కృపలానీ, లాల్‌బహదూర్ శాస్త్రి మిరియాల పిచ్చికారీ దెబ్బకి కళ్లు నులుపుకుంటూ సభలో నిస్సహాయంగా నిలవడం ఊహించుకుంటే -(దయచేసి ఆర్.కె.లక్ష్మణ్ వంటి ఆర్టిస్టులెవరో ఈ కేరికేచర్ వేసి దేశానికి చూపాలి) ఈ పార్లమెంటు చరిత్ర ఏ స్థాయికి దిగజారిపోయిందో కాస్త అర్థమౌతుంది.
మనిషి సంస్కారం, సభ్యత కేవలం వ్యక్తికి సంబంధించినవికావు. సంస్కారం తనచుట్టూ ఉన్న సమాజం ప్రతిఫలించే విలువ. సభ్యత వ్యక్తి తన విజ్ఞత, పెరుగుదల మేరకు ఏర్పరుచుకునే సంస్కారం. ఈ రెండూ పరస్పర ఆధారాలు. వ్యక్తినుంచి వ్యవస్థకు అందే విలువలు. వీటి పతనానికి మిరియాల పిచ్చికారీ, బట్టలిప్పిన నాయకుల వీరంగం, అధికారుల చెంపపగులగొట్టే నాయకుల కుసంస్కారం మంచి ఉదాహరణలు.
మన నాయకులు మన ఆలోచనా స్థాయినే ప్రతిఫలిస్తారు. చట్టసభల్లో సభ్యుల సంస్కారం కూడా ప్రజల సంస్కారానికి అద్దం పడుతుంది. వేపచెట్టుకి మామిడికాయలు కాయవు. నాయకులు సమాజాన్ని మారాలని కోరుకోవడంలో ఆక్షేపణ లేదు. అయితే ఆ సంస్కరణని ఆశిస్తూ ఒకాయన ఒకప్పుడు ఆమరణ నిరాహారదీక్షని చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. మరొకాయన మిరియాల పిచ్చికారీ జల్లి -రాష్ట్రాన్నీ, వ్యవస్థ సంస్కారాన్నీ నష్టపోయి రాజకీయ సన్యాసం తీసుకున్నారు -అందరికీ క్షమాపణ చెప్తూ. సభ్యతతో ఆలోచనను ఆవిష్కరించలేని అసమర్థత పాశవిక ప్రవృత్తికి దారితీస్తుంది. ఈ దేశంలో చట్ట సభలు ప్రజల అభీష్టాలకు మాత్రమే కాదు, ప్రజల సంస్కారానికీ అద్దం పట్టాలని నాయకులకు ప్రాధమిక పాఠాలు చెప్పవలసిన రోజులొచ్చాయి.
బిక్షాటనకు వెళ్లిన వటువు -బిక్ష యివ్వలేని యిల్లాలి నిస్సహాయతను ఎరిగి ఆమెకు లక్ష్మీకటాక్షాన్ని కల్పించిన అపూర్వమైన సంస్కృతి మనజాతిది. మిరియాల పిచ్చికారీతో పశ్చాత్తాపానికి లోనయి -లక్ష్యాన్నీ, సంస్కారాన్నీ నష్టపోయిన దయనీయత ఈనాటి జాతిది.
No comments yet.