Main Menu

Gollapudi columns ~ Mitrulu Avasarala(మిత్రులు అవసరాల)

Topic: Mitrulu Avasarala(మిత్రులు అవసరాల)

Language: Telugu (తెలుగు)

Published on: Oct 31, 2011

Mitrulu Avasarala(మిత్రులు అవసరాల)     

అవసరాల కాస్త ఆలస్యంగా నా జీవితంలో ప్రవేశించారు. ఆయన రచనలూను. అంతవరకూ ఎక్కడో ప్రవాసంలో ఉంటూ కథలు రాసే రచయితగానే నాకు తెలుసు.
సరసమైన సరదా రచనల రచయిత అని నా మనస్సులోని భావన. అవసరాలని కలిశాక నా ఆలోచనలెన్నింటినో మార్చుకున్నాను. చుట్టూ ఉన్న అస్తవ్యస్త ప్రపంచంలోంచి చాలా రుగ్మతల్ని వడబోసి – వాటిలోంచి ‘సరదా’ని పిండిన రచయిత. ఆయన ఇబ్బందులు నాకు తెలుసు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒదగక తప్పని ఇరకాటాలూ తెలుసు. కానీ ప్రతి చాలా ఛాలెంజ్ నుంచి మొండిగా వెలుగు రేఖని చూడడం అలవాటు చేసుకున్న మనిషి.

చక్కని క్రమశిక్షణ, మర్యాదలు తెలిసిన మనిషి, నాకోసారి తన కథల పుస్తకం ఇవ్వాలన్నారు. నేను వస్తానన్నాను. “నా కథల పుస్తకం ఇవ్వడానికి మీరు రావడమేమిటి? నేనే మీ ఇంటికి వస్తాను. అప్పుడు మా ఇంటికి రండి” అని ఆటోలో వచ్చి నన్ను తీసుకెళ్ళారు.

ఏదయినా మనస్సుకి నచ్చిన పనయితే పసిపిల్లాడిలాగ పొంగిపోయి పండగ చేసే మనిషి. తన జీవితంలో ‘రచన’ని అద్భుతమైన ఆటవిడుపుని చేసుకున్న మనిషి. ఆయన రచనల్లో సాంద్రత వయస్సుతోపాటు చిక్కనయింది.

ఆయనకి దేవుడూ, దెయ్యాల మీద నమ్మకం లేదు. నేను కేవలం పరమార్ధాన్ని నమ్ముకున్న ఓ వైష్ణువుని కథ “సాయంకాలమైంది” నవల రాశాను. ఇండియా టు డే పత్రికకి సమీక్షని రాశారు అవసరాల. బహుశా అందులోంచి పరమార్థాన్ని మినహాయించి ‘పలుకు’ని పట్టుకోవడం ఆయన కత్తి మీద చేసిన సాము అనుకుంటాను. నవ్వుకున్నాను. పైగా నాకు మిత్రులు. చాలా హృద్యంగా, పెద్దరికంతో రాశారు.

మా ఇద్దరికీ భరాగో (భమిడిపాటి రామగోపాలం)ని చూస్తే ఆశ్చర్యమూ, అబ్బురమూ. భరాగోకి ఉన్న అనర్ధాలలో ఏ ఒక్కటి ఉన్నా మేం ఏ మాత్రం ఏమీ చెయ్యలేమనుకునేవాళ్ళం. ఆ కారణానికే – మాకు ఏ చిన్న అవసరం ఎదురయినా మా పక్కన భరాగో పెద్ద గీతలాగా కనిపించేవాడు.
తనకి నచ్చని విషయాల్ని కుండబద్దలు కొట్టేటట్టు చెప్పేవారు. నచ్చిన విషయమయితే పసివాడయిపోయేవారు. ఈ ఒక్క కారణానికే నా ఆత్మకథ చిత్తుప్రతిని ఆ దశలో ఆయనకి చదవడానికి ఇచ్చాను. మరో మిత్రులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు.

ఆ అవకాశం ఇచ్చినందుకే పొంగిపోయారు. ‘గొల్లపూడి మారుతిరావు ఆత్మకథకు మొట్టమొదటి పాఠకుడు కావడం నా అదృష్టం’ అంటూ ఆయనకి సరదా పుడితే కవిత్వం వేపు

మళ్ళిపోతారు:

ఎరగని రంగం ఉందా?

జరగని సన్మానసీమ జగతిని ఉందా?

తిరగని దేశం ఉందా?

పరచిన ఈ అనుభవాల ప్రతిభకు జేజే – అన్నారు.

నేను ‘వందేళ్ళ కథకు వందనాలు’ ధారావాహిక తలపెట్టినప్పటి నుంచి ఆయనకి చెపుతూనే ఉన్నాను. వివరాలు విన్నకొద్దీ పొంగిపోయారు. “చాలా బాగుందండీ. మరెవరూ చెయ్యలేరు” అంటూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. తనకి నచ్చిన వంద కథల జాబితాను పంపిన మొదటి రచయిత అవసరాల.

తీరా విజయదశమి నాడు మొదటి కర్టెన్ రైజర్ ప్రసారమయినప్పుడు – నాకు వచ్చిన మొట్టమొదటి ఫోన్ అవసరాలదే. “మా ఆవిడని కూడా టీవీ ముందుకి లాక్కొచ్చి కూర్చోపెట్టాను” అంటూ పొంగిపోయారు.

నవంబరు 11 న నన్నెవరో సభకి విశాఖపట్నం ఆహ్వానించారు. వెళ్ళడానికి ప్రోత్సాహం ఈ ధారావాహికకి పెద్దల్ని రికార్డు చేయడమే. అయితే షూటింగ్ అడ్డొచ్చి – డిసెంబరుకి ప్రయాణం వాయిదా వేసుకున్నాను – శాశ్వతంగా అవసరాలను నష్టపోతానని తెలియక.

మొన్న – అయిదారు రోజులకిందట హైదరాబాదులో మల్లాది నరసింహ శాస్త్రిగారిని రికార్డు చేస్తున్నాను – వారి తండ్రిగారు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి గురించి. “అవసరాల రామకృష్ణారావుగారట. హైదరాబాదు ఆసుపత్రిలో ఉన్నారట. ఫోన్” అని మా అసిస్టెంటు ఇచ్చారు. అవసరాలేమిటి? హైదరాబాదులో ఏమిటి? మొబైల్ లో నంబరు నొక్కి అంతలో మరో రికార్టింగుకి పరిగెత్తాను.

ఇవాళ ఈ వార్త. అవసరాల ఆఖరి పలకరింత, ఆయన ప్రయత్నించి ఫోన్ చేసినా అందుకోలేకపోయాను.
కొన్ని జ్నాపకాల ఊలుదారాలు అతి సున్నితంగా ఉంటాయి. అయితే ఆ కారణానికే అవి మన్నికగా మనల్ని పెనవేస్తాయి. అవసరాల – మనస్సులోపలి పొరల్ని అల్లుకున్న మన్నికయిన ఊలుదారం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.