Main Menu

Gollapudi columns ~ Moodo Kannu(మూడో కన్ను)

Topic: Moodo Kannu(మూడో కన్ను)

Language: Telugu (తెలుగు)

Published on: July 01, 2013

Moodo Kannu(మూడో కన్ను)     

పర్యావరణం తల్లిలాంటిది. మనజీవితంలో ప్రతీ విషయానికీ పర్యావరణానికీ అతి దగ్గరి సంబంధం వుంది. హాయి అనిపించే చెట్టుగాలి దగ్గర్నుంచి, ఆహారం, పళ్లు, పుష్పాలు, కలప, ఔషదాలు- ఏదయినా, ఏమయినా మనిషి తన ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తే ప్రకృతి అతనికి బాసట అవుతుంది, తోడయి నిలుస్తుంది.

పర్యావరణం ఓర్పుతో నిలిచే ధరిత్రి. మనిషి తన స్వార్ధంతో, అహంకారంతో, దుర్మార్గపు చింతనతో ప్రకృతిని ఎంత దుర్వినియోగం చేస్తున్నా ఓర్పుతో, నిశ్శబ్దంగా తలవొంచుతుంది. అతని ఆలోచనారాహిత్యానికి, అవకాశవాదానికి తలవొంచుకు బలి అవుతుంది.

పర్యావరణం మహంకాళి, ఒక పరిమితి దాటి, మానవ స్వార్ధం కట్టలు తెంచుకుంటే ప్రకృతి నిర్ధాక్షిణ్యంగా మూడోకన్ను విప్పుతుంది. సృష్టిని నేలమట్టం చేస్తుంది. మనిషి స్వార్ధాన్ని పునాదులు లేకుండా పూడ్చిపెడుతుంది.

చాలాసంవత్సరాల కిందట జంటనగరాలలో కనీవినీ ఎరగని వర్షాలు పడ్డాయి. పల్లపు ప్రాంతాలలో ఉన్న కాలనీలు, యిళ్లు వారాల తరబడి నీళ్లలో మునిగి ఉండిపోయాయి. ప్రజలు నానా కష్టాలు పడ్డారు. మైకులు మరిగిన మనుషులు ప్రభుత్వం ఏం చేస్తోందని, యంత్రాంగం తమ గోడు వినిపించుకోవడం లేదని మూలిగారు. సంవత్సరాల పాటు పల్లపు ప్రాంతాలలో నీరు దారులు వెదుక్కొనే స్థలాల్ని ఆక్రమించుకుని, అధికారులూ కుమ్మక్కయి, లంచాలు పుచ్చుకుని అమ్మకాలు జరిపిన కాలనీలు ఇవన్నీ. తెలిసీ కళ్లు మూసుకున్న అధికారులు, డబ్బుతో కళ్లు మూసిన పెట్టుబడిదారులు- ఆనాడు వీరి చేతుల్లో మైకులు లేవు, డబ్బు సంచులే ఉన్నాయి. సమాజ శ్రేయస్సుని ఖాతరు చెయ్యకుండా మన పొట్టనింపుకుంటే ఏమవుతుంది? ఆనాటి అనర్ధం అవుతుంది. చెప్పినా వినేనాధుడు లేడు. ప్రకృతి ఓర్పుగల ధరిత్రి. ప్రకృతి ధర్మాన్ని మంటగలిపితే మానవుడి స్వార్ధానికి అనాటి విలయం సమాధానం.

హిమాలయాలు భౌగోళికంగా తక్కువ వయస్సున్న(geological age) పర్వత శ్రేణి. అంటే భూకంపాలకీ, సహజ వాతావరణ పరిణామాలకీ ఎక్కువగా స్పందించే పర్వత శ్రేణి.మంచుకరిగి కొన్ని వందల అడుగులు కిందకి దూకే మంచునీరు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రకృతి ప్రాధమిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కేదార్ ఒకప్పుడు అతి చిన్న పల్లెటూరు. కొన్ని డజన్ల సాధువులు, రుషులూ, ఏ కొందరో భక్తులు వచ్చి దర్శించుకునే క్షేత్రం. 2010 నాటికి సాలీనా 3.11 కోట్లమంది దర్శిస్తున్నారట. గత ఏడేళ్లలో ఇక్కడికొచ్చే వాహనాల రద్దీ మూడింతలు పెరిగింది. 11 వేల ఎత్తున ఉన్న ఈ ప్రాంతంలో ఏమాత్రమూ అనుభవంలేని జనసమూహం ఉండడానికి ఏయే ఏర్పాట్లు జరిగాయి? వారికి వసతులు కల్పించే పనేమయినా ఆ రాష్ట్రప్రభుత్వం చేస్తోందా? ఏం చెయ్యాలి? ఒక్కసారి తిరుపతిని దర్శిస్తే అర్ధమవుతుంది. సశాస్త్రీయమైన ఎంత infra-structure కావాలి? వీరంతా రంబాదా మార్గం ద్వారానే రావాలి. అసలు ఇలా ఇక్కడికి వచ్చేవారు ఎవరు? వాళ్ల పేర్లేమిటి? అడ్రసులేమిటి? అక్కడ వీరి అలుసు కనుక్కునే ఏర్పాటేదయినా ఉందా? అంటే ఇలాంటి అనర్ధం జరిగితే- వారు బయల్దేరిన కుటుంబాలు మొరబెడితే తప్ప ఎవరు ఎవరో తెలియని అవ్యవస్థ.2013లో ఇంకా మనం ఇంత ప్రాధమికమయిన స్థితిలో ఉన్నామా? సమాధానం వుంది. ఆలోచించే నాధుడు లేడు.

టాంజానియాలో మేం అడవుల్ని చూడడానికి లోనికి వెళ్లేటప్పుడు ప్రవేశద్వారం దగ్గర మా వివరాలు, కార్ల నంబరూ, గైడ్ పేరూ ఇవ్వాలి. అడవిలోకి వెళ్లినవారంతా క్షేమంగా తిరిగి వచ్చారోలేదో వారు గమనిస్తూంటారు. ఇది చాలా ముఖ్యమయిన ఏర్పాటు. క్రూరమృగాల బారిన ఎవరయినా పడితే సహాయమో, సమాచారమో అందే, అందాల్సిన ఏర్పాటు. ఇది ఒక పార్శ్యం.

మందాకిని, అలక్ నందా నదుల మీద జలవిద్యుత్ కేంద్రాలను- దాదాపు 70 ప్రాజెక్టులు చేపట్టారు.(300 డామ్ లు నిర్మించాలని ప్రణాళిక) వాటి నిర్మాణాన్ని- ఒక్కసారి ముక్కుమీద వేలు వేసుకోండి- పాన్ మసాలా అమ్మేవారికీ, సైకిళ్లు, బిస్కత్తుల తయారీవారికి మంజూరు చేశారు! ఇది 2010 కాగ్ రిపోర్టు సారాంశం. పర్యావరణంలోని సాధకబాధకాలేమిటి? భూకంపనలకు ఆటపట్టయిన ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఏ విధంగా జరగాలి? ఇలాంటివి పరిశీలించే బాధ్యతగల సంస్థల ప్రమేయం లేదు-గమనించాలి. మనం ఏ రాతియుగంలో ఉన్నాం! ఏమిటీ అవినీతి? ఎంత దారుణం?

రంబాదా ఒకప్పుడు నడిచే యాత్రికులకు కాస్త సేద తీర్చుకునే చిన్న స్థలం. చిన్న కూడలి. అక్కడ ఇప్పుడు కొన్ని వందల వ్యాపారాలు, కొన్ని వేలమంది ఉంటున్నారు. ఇక కేదార్ లో అక్రమంగా, సరియైన ప్లానింగ్ లేక లేచిన కట్టడాలే దాదాపు అన్నీ. దుకాణాలు, హొటళ్లూ, చిన్న చిన్న వసతిగృహాలు- ఎవరికి వారే ప్రజల విశ్వాసాన్ని పెట్టుబడిగా డబ్బు సంపాదించే అలవాటు మరిగినవారు. యివన్నీ.సంవత్సరాల తరబడి పేరుకుపోయిన అక్రమాలు, అవినీతి- లక్షల మంది విశ్వాసం పెట్టుబడిగా వ్యాపారాలు చేస్తున్న పాపాత్ముల స్వార్ధం పర్యావరణాన్ని ప్రతీ క్షణం కలుషితం చేస్తోంది.

పర్యావరణం లాలించే తల్లి. భరించే ధరిత్రి. కాని ఆ కట్టదాటితే? అదే మొన్న జరిగింది. కేదార్ లో ప్రస్థుతం యిళ్లు లేవు. అక్రమంగా కట్టిన దుకాణాలు లేవు, నడిపిన మనుషులు లేరు, గుర్రాలులేవు,వాటిని నడిపే సైసులు లేరు. వెళ్లిన భక్తులు లేరు, వాళ్లని దోచుకునే పాపాత్ముల జాడలేదు.

ఎప్పుడో ఒకప్పుడు అనర్ధం తప్పదని, తప్పని పనిని తాము చేస్తున్నామని చేసేవారికి తెలుసు. ఇది భయంకరమైన దోపిడీ. అయితే మిన్ను విరిగి ఎప్పుడు మీద పడుతుంది? ఎన్ని లక్షల మంది ఇన్ని సంవత్సరాలుగా ఈ సింహం నోటిలో తలని అనునిత్యం దూరుస్తున్నారని తెలియకుండానే వెళ్లివస్తున్నారు? ఆ సంగతి ఈ దుర్మార్గులకి తెలుసు. ఈ విలయంలో భక్తుల విశ్వాసాలను దుర్వినియోగం చేస్తున్న, చేసిన పాపాత్ముల వాటా పెద్దది.

ఇక మరో దరిద్రం. ఏదో ఛానల్ లో ఈ భీభత్సాన్ని చూపుతూ జేసుదాస్ “ఆటకదా శివా” అనే పాటని వేస్తున్నారు. పాట విని పరుగున టీవీ దగ్గరికి వస్తే దృశ్యమిది. ఇది బొత్తిగా అవగాహనలేని, బాధ్యతారహితమైన, డబ్బు చేసుకునే ఛానళ్ల “మెలోడ్రామా”. ఇంతకన్న ఛానళ్లు గొప్ప పరిశోధన చేసి వెలగబెడతారని మనం అశించడం- ముఖ్యంగా వ్యాపారస్థుల నుంచి-వృధా. బొత్తిగా అవగాహన లేని, అనుభవం చాలని, అధికారాన్ని ప్రలోభపెట్టి కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రబుద్ధులు- నదుల, వరదల, ప్రవాహాల దారుల్ని పూర్తిగా అడ్డగించిన కారణాన- జరిగిన భయంకరమైన అనర్ధమిది –అని ఛానళ్లు సోదాహరణంగా వివరించాలి. ప్రసారమాధ్యమాల కనీస బాధ్యత ఇది. “ఆట కదరా శివా!” అని సొల్లు కబుర్లతో, భయంకర ద్శశ్యాలతో ప్రేక్షకుల్ని రెచ్చగొట్టడం కాదు. కాగా, అత్యవర పరిస్థితులలో రక్షణ చర్యలకు ఎక్కువ ప్రచారం ఇవ్వాలి. రెచ్చగోట్టే ప్రకృతి వైపరీత్యానికి కాదు .ప్రజల్లో భయోత్పాతం కల్పించకూడదు. వీలయినంత నమ్మకం కలిగించాలి. కష్టంలో ఆత్మీయుడి సానుభూతిలాంటిదిది. ఇది ప్రసార మాధ్యమాల కనీస సామాజిక బాధ్యత. అయితే మన మాధ్యమాలు కుక్కగొడుగులు. నెలసరి జీతాలతో పొట్టగడుపుకునే గుమాస్తాలనుంచి ఇంత కర్తవ్య దీక్షని ఆశించడం అన్యాయం. ఆమాటకి వస్తే చానళ్లను నడిపే అధిపతులలో గొప్ప అవగాహనని ఆశించడం కూడా మట్టిలోంచి నూనెని పిండడం లాంటిది.

సంవత్సరాల తరబడి ప్రజల భక్తి విశ్వాసాలను వినియోగించుకుంటున్నదౌర్భాగ్యుల నిర్వాకాన్ని దమ్ముంటే పరిశీలించి చచ్చినవారు పోగా, బతికున్న ప్రబుద్ధుల్ని ఫొటోలతో సహా ప్రజల ముందు నిలబెట్టే పని నిజానికి ఛానళ్లు చెయ్యాలి- చచ్చిన వారి కన్నీటిని వాడుకోవడం కాదు. కన్నీటితో ఆడుకోవడం కాదు. ఈ విషాదం ఇవాళ మరొకరికి జరిగింది కాని, నిన్న మీకు జరిగి ఉండవచ్చు. రేపు నాకు జరగవచ్చు.

బాబూ ఇది శివుని ఆటకాదు, శివుడినీ- తరతరాల ఈ జాతి విశ్వాసాల్ని మదుపుగా శివుడి మీద భక్తిని వాడుకుంటున్న అవకాశవాదుల ఆట అని చెప్పాలి మహప్రభో!

విలయానికి విచక్షణ ఉండదు. నిప్పు కాలుస్తుంది. అందులో ఎండు కట్టెలూ కాలుతాయి. చెయ్యి పెడితే చెయ్యీ కాలుతుంది. అది ప్రకృతి ధర్మం.

అయితే “ధర్మం” అనే బూతుమాటని మనం మరిచిపోయి ఎన్నాళ్లయింది?

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.