Main Menu

Gollapudi columns ~ Mushti Pettanam(ముష్టి పెత్తనం)

Topic: Mushti Pettanam(ముష్టి పెత్తనం)

Language: Telugu (తెలుగు)

Published on: Aug 15, 2011

Mushti Pettanam(ముష్టి పెత్తనం)     

ఒక ముష్టివాడు ఒక ఇంటికి బిచ్చానికి వెళ్ళాడట. ఇంటి కోడలు ఏమీ లేదు వెళ్ళమంది. బిచ్చగాడు బయలుదేరిపోయాడు. వెళుతున్న బిచ్చగాడిని అత్తగారు పిలిచారట. ఏమయ్యా వెళ్ళిపోతున్నావని.

కోడలమ్మగారు వెళ్ళమన్నారండి అన్నాడట బిచ్చగాడు. అత్తగారు చర్రున లేచింది. “అదెవరయ్యా చెప్పడానికి. నువ్వు రా” అన్నది. ఇతను వెళ్ళాడు. అప్పుడు అత్తగారు చెప్పిందట సాధికారికంగా “ఇప్పుడు నేను చెపుతున్నాను. ఏమీలేదు వెళ్ళు” అని.

ఇచ్చినా, పొమ్మన్నా అత్తగారికే చెల్లును – అన్నది సామెత. ఈ దేశానికంతటికీ అలాంటి ఓ అత్తగారుంది. తిట్టినా తిమ్మినా, శిక్షించినా, రక్షించినా, పొమ్మన్నా ఉండమన్నా ఆ అత్తగారికే చెల్లును. ఆ అత్తగారు – సుప్రీం కోర్టు.

ఈ దేశంలో ఎవరూ ఏ విషయంలోనూ మరే కోర్టునీ పట్టించుకోవడం మానేశారు. ఎన్నో కోర్టుల్లో శిక్షలు పడినా, పడకపోయినా, న్యాయం జరిగినా జరగకపోయినా ఆఖరికి అత్తగారిదే ఆఖరి మాట.

ఎవరు చేసిన పనయినా తప్పని కింద కోర్టు చెప్పిందనుకోండి. ఈ రోజుల్లో నేరస్థుడు సిగ్గుపడడం మానేశాడు. “ఆరోపణ జరిగింది కాని శిక్షపడలేదు కదా?” అని బోరవిరుచుకుంటాడు. ఇదివరకు ‘అవినీతిపరుడు’ అన్నందుకే కుమిలి చచ్చేవాళ్ళు. ఇప్పుడిప్పుడు పార్లమెంటులో పవిత్రంగా చట్టాలు చెసే పనిలో మునిగితేలుతున్నారు. నేరం వారిని బాధించడం మానేసింది. సుప్రీం కోర్టు అవినీతికి అంతిమ పరిష్కారం.

మా నాన్నగారు పనిచేసే రోజుల్లో – నా చిన్నతనం మాట – ఆ కంపెనీ మేనేజరు – ఓ బ్రిటిష్ దొరగారు ఉండేవారట. చాలామంచివాడు. తాగుడికి అలవాటు పడి, ఆఫీసు సొమ్ము ఖర్చుచేసేశాడు. సంజాయిషీ చెప్పుకోలేని స్థితికి వచ్చాడు. అయితే తను చేసింది తప్పుకాదని బుకాయించే నిజయితీ చాలని ఆ దొరగారు ఒకరోజు విశాఖప ట్నం బీచ్ కి వెళ్ళి రివాల్వరుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కథని తరచుగా మా నాన్నగారు చెప్పేవారు. ఈ రోజుల్లో రివాల్వరుతో కాల్చిన వాళ్ళే సుప్రీం కోర్టు చెప్పేవరకూ సమాజంలో పెద్దమనుషులుగా ఛలామణీ అయిపోతున్నారు.

ఏతావాతా, నిజాయితీపరుల కాలం ముదిరిపోతోంది కనుక – ఒక్క సుప్రీం కోర్టు తీర్పునే నిజాయితీపరులు శిరసావహిస్తున్నారు కనుక మన దేశంలో ప్రతి రాష్ర్టంలోనూ ఒక్కొక్క సుప్రీం కోర్టుని స్థాపించాలని మనవి చేస్తున్నాను. తమిళనాడు కయితే రెండు చాలవు. ఎందుకంటే డిఎంకే పదవిలో ఉన్నప్పుడు ఏడిఎంకేవారు పరువు నష్టం దావాలు వేస్తారు. గద్దె దిగాక కరుణానిధిగారు ఆ పని చేస్తారు. పైగా ఆయా రాష్ర్టాలలో అయితే వీరికి సరైన న్యాయం జరగదు కనుక (ప్రస్తుతం జయలలితగారి కేసులు కర్ణాటకలో విచారణ జరుగుతున్నట్టు) పొరుగు రాష్ర్టాలలో వీరికి తైనాతిగా మరో సుప్రీం కోర్టు ఉండాలి.

ఈ లెక్కన – మన దేశంలో 28 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలూ ఉన్నాయి కనుక, ప్రతీ రాష్ర్టానికీ రెండేసి చొప్పున 70 సుప్రీం కోర్టులూ, ఇవికాక పొరుగు రాష్ర్టంలో ఈ రాష్ర్ట కేసులకి మరో 35 అదనపు సుప్రీం కోర్టులూ ఉండాలి. ఇంకా ప్రత్యేక రాష్ర్టాల ఉద్యమాలు ఎన్నో రాష్ర్టాలలో జరుగుతున్నాయి కనుక – తెలంగాణా, గూర్ఖాలాండ్, విదర్భా మొదలయిన రాబోయే రాష్ర్టాలకు జరిగిన అన్యాయాల పరిశీలనకు ఇప్పుడే ముందుగా సుప్రీం కోర్టులను ఏర్పాటు చెయ్యడం సబబు. ఆ విధంగా రాష్ట్రాల ఏర్పాటుకు న్యాయస్థానం సముచితమైన సంకేతం కాగలదు.

ఈ దేశంలో పిల్లల పాఠాల పుస్తకాలకు, కాలేజీల్లో సీట్లకు, విడిపోయిన పెళ్ళాలకు మనోవర్తికి, కలిసున్న భార్యాభర్తల విడాకుల సమస్యలకి, ఎమ్మెల్యేల రాజీనామాల సమర్ధనకి, ఆఫీసర్లని ఉద్యోగాలనుంచి తీసెయ్యడానికి, సీనియారిటీలను కాపాడడానికి, జైళ్ళలో టీవీలకి, నేరస్తులకి కంప్యూటర్ అవసరాలకి, పోలిసాఫీసర్ల టోపీల రంగు నిర్ణయించడానికి – అన్నింటికీ, అందరికీ సుప్రీం కోర్టే శరణ్యం. హైకోర్టులు బొత్తిగా మాట చెల్లని నేలబారు ఇంటి కోడళ్ళలాంటివి. ఆఖరి తీర్పు అత్తగారిదే – అనగా సుప్రీం కోర్టుదే.

మరొక్క ముఖ్యమయిన పరిణామం ఈ దేశంలో ప్రబలుతోంది. ఎన్నడూ కనీవినీ ఎరగనంతమంది మహానుభావులు వరసగా జైళ్ళకు తరలిపోతున్నారు. ఇదివరకు జంతువుల్ని చంపినా మనుషుల్ని చంపినా ఎవరికీ ఖాతరు ఉండేది కాదు. ఇప్పుడిప్పుడు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కూతుళ్ళు, పార్లమెంటు సభ్యులు, కార్పొరేట్ అధిపతులు, ఐయ్యేయస్ ఆఫీసర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు – జైళ్ళకి వలస వస్తున్నారు. మరి ఒకరిద్దరు మంత్రులు, ముఖ్యమంత్రుల కొడుకులు రావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మన దేశంలో ఒక అపప్రధ ఉంది. మన చట్టాలు ఎప్పుడో నూట పాతిక సంవత్సరాల కిందట రూపుదిద్దుకుని బూజుపట్టిపోయాయని. కావచ్చుగాక – ఇంత గొప్పవారు తరుచుగా వచ్చిపోయే ఈ జైళ్ళను సంస్కరించుకోవలసిన అవసరం మనకి ఎంతయినా ఉంది. ముందు జైళ్ళ నిబంధనావళిని సవరించుకోవాలని నా ఉద్దేశం. ఇందుకు నా సూచనలు కొన్నింటిని మనవి చేస్తున్నాను.

జైళ్ళలో పప్పూ యాదవ్ లాగ అప్పుడప్పుడు విస్తృతంగా పుట్టిన రోజులు చేసుకునే హాళ్ళు ఏర్పరచాలి. చార్లెస్ శోభరాజుగారిలాగ జైళ్ళలో ఉండగానే ప్రేమించి పెళ్ళిచేసుకునే వాతావరణాన్ని – ఉదా: బృందావనం, విజయా గార్డెన్స్ వంటి విహారోద్యానవనాల్ని ఏర్పరచాలి. చిన్నబార్, ఓ నైట్ క్లబ్ ఉండాలి. అడపా తడపా తాము నిర్దోషులమని బల్లగుద్ది చెప్పడానికి పెద్ద పెద్ద బల్లలతో వారం వారం పత్రికా సమావేశాలకి అవకాశం ఉండాలి. ప్రియదర్శినీ మట్టూ హంతకులు సంతోష్ సింగ్, జెస్సికా లాల్ హంతకుడు మనూశర్మల వంటివారికి తరచుగా జలుబు, దగ్గు, పంటి నొప్పి, వెన్నుపోటు – వంటివి ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరుతూంటారు కనుక – అలాంటి వారి సౌకర్యార్ధం అయిదు నక్షత్రాల స్థాయిలో ఓ ఆసుపత్రి ఏర్పాటు ఉండాలి. ఇక కల్మాడీ, మధూకోడా వంటి పార్లమెంటు సభ్యులు – జైల్లో ఉన్నా దేశ శ్రేయస్సు గురించే కలలు కంటూ పార్లమెంటు సభలలో పాల్గొనాలని తహతహలాడుతూంటారు కనుక – ఒక మినీ పార్లమెంటు గదిని జైలులోనే ఒక పక్క ఏర్పరిచి – అక్కడినుంచే పార్లమెంటు వ్యవహారాలలో పాల్గొనే అవకాశం కల్పించాలి.

అక్కడినుంచే పాల్గొంటూ మన శ్రేయస్సుకి చట్టాలు చేస్తారని మనం ఆశించవచ్చు.

నిరపరాధికి ఏ లేశమయినా అన్యాయం జరగకూడదన్న నూట పాతిక సంవత్సరాల కిందటి ధర్మసూక్ష్మాన్ని అవినీతి పరులు అవకాశంగా చేసుకునే ఈ ‘సిగ్గు ‘లేని సమాజంలో – సుప్రీం కోర్టులూ, జైళ్ళూ – వీధిభాగవతుల మేళాలు కావడంలో ఆశ్చర్యం లేదు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.