Main Menu

Gollapudi columns ~ Musugullo nayakulu (ముసుగుల్లో నాయకులు)

Topic: Musugullo nayakulu (ముసుగుల్లో నాయకులు)

Language: Telugu (తెలుగు)

Published on: Mar 24, 2014

Musugullo nayakulu (ముసుగుల్లో నాయకులు )     

ఈ మధ్య షూటింగుకి రాజమండ్రికి వచ్చాను. అక్కడ ప్రతీ వీధి జంక్షన్‌లోనూ కనిపించిన దృశ్యం నాయకుల విగ్రహాల మీద ముసుగులు. మా మిత్రుడిని అడిగాను -కారణమేమిటని. ఎన్నికల నిబంధనలు -అన్నాడాయన. పాపం, మన నాయకులు -తమ ప్రచారానికి విగ్రహాల్ని ప్రతిష్టించారు. ఎన్నికల సంఘం వారి మీద ముసుగులు దించింది -ప్రతీ వీధిమొగలో వారిని చూస్తే వోటరుకి వారికి ఓటు వేయాలని అనిపిస్తుందేమోనని వారి ఆలోచన అయివుంటుంది. కాని నేనంటాను -మరో విధంగా ఆలోచిస్తే ‘వీరే మా కొంపలు ముంచారు’ అనే హెచ్చరికగా ఉపయోగపడవా? అని..

ఏమైనా ప్రతీ వీధి చివరా, ప్రతీ నాలుగురోడ్ల జంక్షన్‌లో -ఒకటి, రెండు, మూడేసి విగ్రహాలతో తమ నాయకులకు నివాళులర్పించే కృషిలో నాకు గుంటూరు అగ్రస్థానంలో ఉంటుందనిపిస్తుంది. అన్ని విగ్రహాలను నేనే నగరంలోనూ, ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. కాని రాజమండ్రిలో ఆఖరికి వీరేశలింగంవారి విగ్రహానికీ ముసుగు తప్పులేదు. మరి విశాఖపట్నంలో గురజాడకీ ఈ ముసుగు తప్పలేదా? వెళ్లి చూడాలి. ప్రజల కళ్లు కప్పే రాజకీయ నాయకుల ముఖాల మీద ముసుగులు తప్పవేమో! కాని ఈ ఉద్యమకారులేం పాపం చేశారు? ఎన్నికల సంఘానికో, వారి ఆదేశాలను పాటించే ఉద్యోగులకో నాయకులకీ, ఉద్యమకారులకీ తేడా తెలియలేదు. ఆశ్చర్యం లేదు. నాయకులే ఉద్యమాలను మరిచిపోయి చాలారోజులయిపోయింది.

ఒక నాయకుని కృషిని రోడ్డుమీద విగ్రహం ద్వారా చిరస్మరణీయం చెయ్యడం మనిషి ప్రాథమికమైన ఆలోచనకి నిదర్శనం. ఆయా నాయకుల కృషిలో, ఉదాత్తత పెరుగుతున్నకొద్దీ ఈ విగ్రహాల ఆవశ్యకత తగ్గిపోతూంటుంది. ఎందుకంటే వారు నిలిచేది వీధి మొగిలో పోలీసుల్లాగ కాదు. ప్రజల మనస్సుల్లోనే దేవుళ్లుగా. సర్‌ ఆర్దర్‌ కాటన్‌, సి.పి.బ్రౌన్‌, మానవాళి జీవితాలనే విప్లవాత్మకంగా మార్చివేసిన ధామస్‌ ఆల్వా ఎడిసన్‌, గ్రాహంబెల్‌ విగ్రహాలు ఎక్కడున్నాయి? ప్రతిరోజూ విద్యుత్తుని వాడుకునే ఎవరయినా ఎడిసన్‌ని గుర్తు చేసుకుంటున్నారా? నేడు సెల్‌ఫోన్ల ముమ్మరంలో ఉన్న ఎవరయినా గ్రాహం బెల్‌ని గుర్తు చేసుకుంటారా? గుర్తు చేసుకోనంత మాత్రాన వారి ఆశీర్వాదం మానవాళికి దక్కకుండా పోతుందా? నిజమైన, ఉదాత్తమైన, సార్వజనీనమైన సేవ గుర్తింపును ఆశ్రయించదు. గుర్తింపు కేవలం సర్టిఫికెట్‌. సేవ దైవీయం.

చెన్నైలో డి.ఎమ్‌.కె. హయాంలో చాలాసంవత్సరాల కిందట మౌంట్‌ రోడ్‌లో బుహారీ హోటల్‌ దగ్గరి కూడలిలో కరుణానిధి విగ్రహాన్ని పెట్టారు. తర్వాత పాలకులు మారారు. ఒకరాత్రి ఒక లారీ ఆ విగ్రహం ఉన్న దిమ్మను గుద్దేసింది. తర్వాత ఆ విగ్రహం ఏమయిందో ఎవరికీ తెలియదు. కీర్తికి రెక్కలురావడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. ఏమయినా విగ్రహాలను ప్రతిష్టించడంలో మన తెలుగువారు అతి ఉదారులు. మన తిరుపతిలో భారత రత్న ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్టించాం. అన్నమాచార్య కీర్తనలు పాడని తమిళ గాయకులు ఉండరు. మరి తమిళనాడులో ఏ పట్టణంలోనయినా మన అన్నమాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించారా? విశాఖపట్నం బీచిలో ద్రవిడ కజగం పెరియార్‌ విగ్రహం ఉంది. ఏదీ? మన టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని కడలూర్‌లో చూపమనండి. నిన్నకాక మొన్న ఒక తెలంగాణా నాయకులు వక్కాణించారు -ఇంకా తెలంగాణా ఏర్పడలేదు. ప్రభుత్వం అక్కడ పదవిలోకి రాలేదు.

టాంక్‌బండ్‌ మీద ఉన్న సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తామని బల్లగుద్దారు. ఇది తప్పనిసరిగా వారి తెలంగాణా అభిజాత్యానికీ, అభిమానానికీ నిదర్శనం. అయితే ఎవరిని తొలగిస్తారు? నన్నయ్యనా? తిక్కన్ననా? శ్రీనాధుడినా? వీరు సీమాంధ్రకు ప్రతినిధులా? తెలుగు సాహిత్యానికా? తెలుగు జాతికా? కూచిపూడి నృత్యం కృష్ణా జిల్లాకి చెందినది కనుక రేపు ఆ నాట్యాన్ని తెలంగాణాలో బహిష్కరిస్తారా? కృష్ణా జిల్లావాడు కనుక తెలంగాణా గాయకులు క్షేత్రయ్యని, నారాయణ తీర్ధ తరంగాలను పాడరా? శ్రీశ్రీని, విశ్వనాధని కూడా బహిష్కరిస్తారా? పోనీ, సీమాంధ్ర దేశభక్తుడు పింగళి వెంకయ్య రూపొందించాడు కనుక ఇకనుంచీ మన జాతీయ జెండాని ఎగురవేయరా? మరి ఒరిస్సా వాడయినా జయదేవుని అష్టపదులను పాడుతున్నామే! తెలంగాణాలో ఇక పొందూరు ఖద్దరు కట్టుకోరా? కాకినాడ కాజా తినరా? ఆ మధ్య ఎవరో అన్నారు -‘మా తెలుగుతల్లికి’ అన్నపాట సీమాంధ్ర పాటకనుక తెలంగాణాలో పాడమని. మంచిదే. మరో కొత్తపాట, గొప్పపాటకి స్వాగతం. కాని ఈ పాట సీమాంధ్ర రచయిత రాయలేదు. శంకరంబాడి సుందరాచారి నాకు పరమ ఆప్తులు. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్రం ఉన్నరోజుల్లో ఎప్పుడో నా చిన్నతనంలో రాశాడు. ఆయన జన్మస్థలం కంచి. ఇందులో రాణీ రుద్రమని తలచుకుని గర్వపడ్డాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు, రామప్ప శిల్పకళా వైభవం -తెలుగు జాతి అంతా గర్వపడే వైభవానినకి తార్కాణాలు. సంస్కృతికి భౌగోళికమైన ఎల్లలు ఉండనక్కరలేదని ఈ తరం రాజకీయ నాయకుల హ్రస్వ దృష్టికి అర్థంకాదు. వారి ఆలోచనలు, నినాదాలు వోట్లకు పరిమితం. జాతి సంస్కృతీ వైభవానికి కాదు. నిజానికి వారి ఆలోచనలు అంత దూరం పోవు.

ఏమైనా మహానుభావులు రోడ్లమీద బారులు తీర్చిన విగ్రహాలలో కాదు -సమాజానికి చేసిన సేవలో చిరస్మరణీయులవుతారు. రోడ్లమీద విగ్రహాలు -అతి సంకుచితమైన పరిధిలో -సమాజం గుర్తింపుకి అతి పరిమితమయిన నివాళి. విశాఖపట్నం బీచిలో వెళ్తున్నప్పుడల్లా కాకిరెట్టలతో నిస్సహాయంగా నిలబడిన శ్రీకృష్ణదేవరాయలుని చూసి ”అయ్యో, ‘ఆముక్తమాల్యద’ వైభవం ఈ కాకులకి తెలియదే!” అని వాపోతాను. ”కాకి” అనే మాటలో ధ్వనిని ఉద్దేశించే వాడుతున్నాను.

అయితే ఎన్నికల సమయంలో వారి మొహాలు చూసినా, వారిని తల్చుకున్నా, వారి జ్ఞాపకాలు మనసులో కదిలినా ఈ సమాజానికీ, వోటు వేసే మనిషి విచక్షణకీ మేలు జరగదని, కాగా కీడే జరుగుతుందని ఈ రంగంలోనే, ఈ దేశ పాలకులే భావించే వ్యక్తుల విగ్రహాలను మనం అనునిత్యం లక్షలాదిసార్లు రోడ్లమీద చూస్తున్నామా? అంత కీడు తలపెట్టే వ్యక్తుల జ్ఞాపకం మన రోడ్ల మీద కొలువుతీరాయా? ఆయా పార్టీలు మెజారిటీతో పదవుల్లోకి వచ్చినప్పుడు ప్రజల మీద రుద్దిన వారి జిడ్డుకి ఈ విగ్రహాలు తార్కాణమని? నేననడం లేదు. వ్యవస్థ అనుకుంటోంది. అంటోంది. లేకపోతే ఎందుకీ ముసుగులు? నన్ను ఉత్సాహపరిచి, స్ఫూర్తినిచ్చి, సరైన దిశలో నడిపించే నాయకుల జ్ఞాపకాలనైనా రోజూ నడిచే రోడ్లపైన నేను నిలుపుకోగలిగే అదృష్టం ఈ వ్యవస్థ నాకు ఇవ్వలేదా? ఎంత దురదృష్టం? నేలబారు మనిషికి డబ్బు ఇవ్వకండి. పదవులు ఇవ్వకండి. మంచి బతుకు బతికే అవకాశం ఇవ్వకండి. కాని రోడ్డు మధ్య అతనికి మంచి ఆలోచనని కలిగించే దృశ్యాన్ని కూడా మృగ్యం చేసిన ఈ దేశపు రాజకీయ నైచ్యాన్ని -ఈ దేశపు అగ్రసంస్థ -ఎన్నికల కమిషన్‌ గుర్తుపట్టిన నేపథ్యంలో ఏమనుకోవాలి?

నా శ్రేయస్సుకోసం -పొరుగు రాష్ట్రం రాజకీయ నైచ్యాన్ని ఉదహరిస్తాను. తమిళ రాష్ట్రమే కాదు -భారతదేశమంతా గర్వపడే మహానటుడు శివాజీగణేశన్‌. ఆయన కన్నుమూశాక -అప్పటి డిఎంకె ప్రభుత్వం (తొలి రోజుల్లో శివాజీ, కరుణానిధి సినిమాలలో ప్రవేశానికి కలిసి కృషి చేశారు) వారి విగ్రహాన్ని మెరీనా బీచ్‌లో ఉంచాలని నిర్ణయించింది. ఎక్కడ? దేవీప్రసాద్‌ రాయ్‌ చౌదరీ ప్రఖ్యాత గాంధీ విగ్రహానికి దాదాపు పక్కనే. ఇది అసమంజసమని ఎవరో కోర్టుకి వెళ్లారు. కోర్టు ఆ విగ్రహం అక్కడ కాక మరెక్కడయినా ఉంచనుంది. కోర్టు తీర్పు ఇచ్చిన ముందు రోజే రాత్రికి రాత్రి ఆ విగ్రహ ప్రతిష్ట జరిగిపోయింది. ఇప్పుడు తీస్తే విగ్రహం పాడవుతుందంది ప్రభుత్వం. ఇప్పుడు జయలలిత ప్రభుత్వం పదవిలోకి వచ్చింది. ప్రస్థుతం ఆ విగ్రహాన్ని అక్కడినుంచి లేవదీసే ప్రయత్నం. జరుగుతోందని విన్నాను. ఆశ్చర్యం లేదు. మట్టి బొమ్మలకి కూడా రాజకీయపు ముసుగులు వేయక తప్పని దరిద్ర స్థాయి మన రాజకీయాలు వచ్చేశాయి.

అయితే ప్రతీరోజూ వీరేశలింగం విగ్రహం ముందునుంచి వెళ్తున్నప్పుడూ, టాంక్‌బండ్‌ మీద తెలుగు సంస్కృతికి అద్దం పట్టిన మహానుభావులు నాయకుల చేతుల్లో పడ్డందుకు మనసు చివుక్కుమంటుంది. ఇది పాముకాటుకి సిద్ధపడుతూ చీమకాటుకి బాధపడే ఓ పిచ్చివాడి ఆవేదన.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.