Main Menu

Gollapudi columns ~ Naadayogi Jnaanapakaalu (నాదయోగి జ్ఞానపకాలు)

Topic: Naadayogi Jnaanapakaalu (నాదయోగి జ్ఞానపకాలు)

Language: Telugu (తెలుగు)

Published on: Not Available.

Naadayogi Jnaanapakaalu (నాదయోగి జ్ఞానపకాలు )     

‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.

కొందరు గొప్పతనాన్ని భుజకీర్తుల్లాగ అలంకరిం చుకుని ఊరేగుతుంటా రు. మరికొందరు మంచి నీళ్ల సెలలాగ వ్యాపించి, పలకరించిన వారికి దప్పి క తీరుస్తూ, హృదయంలో ‘చెమ్మ’ని ఆర్ద్రంగా పంచు తూ ప్రయాణం చేస్తూం టారు. అలాంటి రెండో కోవకు చెందిన మనుషుల్లో మొదటిస్థానంలో నిలిచేవారు నేదునూరి కృష్ణ మూర్తిగారు.

ఆయన శ్రీపాద పినాకపాణిగారి వద్ద శిష్య రికం చేసేనాటికి (1951) నేను శ్రీపాద వారి అల్లుణ్ణి కాలేదు. పినాకపాణి గారి దగ్గర ఆయన 11 సంవ త్సరాలు గురుకులవాసం చేశారు. నిజానికి పినా కపాణి గారి ఇంట్లో, జీవితంలో ఆయన ఒక భాగమై పోయారు. ఇద్దరూ పాట పాడుకుంటూ విశాఖలో సైకిలు రిక్షా మీద బయలుదేరి, బాలాం బగారు (పినాకపాణిగారి సతీమణి) చెప్పిన ఆరు పనుల్లో తేలికగా రెండు మరచిపోయేవారట. ఏ ‘బెహాగో’, ‘కల్యాణో’ వారి జ్ఞాపకాలకు అడ్డు పడేది. పాణి గారు ఆయనకి కారు డ్రైవింగు కూడా నేర్పారు. పాణి కర్నూలులో పనిచేసే రోజుల్లో రాత్రి వేళల్లో ఇద్దరూ రెండు మంచాల మీద పడుకుని రాగాలలో రవ్వ సంగతులు, కొత్త మలుపులు, సంచారాలు చర్చించుకుంటూంటే టైము తెలిసేది కాదు. రైలు కట్ట దగ్గర పాణిగారి ఇల్లు. తెల్లవారు జామున 3 గంటలకి హైదరాబాదు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ తుంగభద్ర వంతెన మీద వెళ్తూ పెద్ద శబ్దం చేస్తే ఇద్దరూ తుళ్లిపడేవారు. ‘‘అబ్బో! మూడయిపోయిం దండీ!’’ అనుకుని నిద్రలోకి జారేవారు.

పాణిగారికి క్రికెట్ అంటే ఇష్టం. 1958లో ఇండియా-వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్‌కి కారులో హైదరాబాదు వెళ్తూ ‘‘ఈ ఐదు రోజులూ కర్నూలులో ఏం చేస్తారు? మాతో రండి!’’ అంటూ నేదునూరిగారినీ కారెక్కించుకున్నారు (స్టాండర్ట్ 555. ఆ కారు ఇప్పటికీ కర్నూలులో పిల్లల దగ్గర ఉంది). దారి పొడుగునా హైదరాబాదు వరకు సంగీత సాధన. క్రికెట్ గ్రౌండ్‌లో ఒక పక్క క్రికెట్ ఆట. మరొక పక్క క్రికెట్ స్టాండులోనే సంగీత సాధన. పాణిగారి జీవితంలో నేదునూరిగారు ఒక భాగం. నేదునూరి గారి జీవితమే పినాకపాణిగారు. ఆయన పెద్దబ్బా యికి గురువుగారి పేరే పెట్టుకున్నారు. గురువు గారిని తలుచుకుంటే ఆయనకి పరవశం. మనోధర్మానికి పెద్ద పీట వేసి, సంప్రదా యాన్ని అటూ ఇటూ బెసగనివ్వక అచ్చమయిన మేలిమి బంగారంగా నిలిపిన గొప్పతరం సైనికుడు నేదునూరి. సేనాధిపతి పినాకపాణిగారు. అయితే నేదునూరి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ‘నాది గొప్ప సంప్రదాయం’ అనరు. ‘గొప్ప సంప్రదా యం అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తారు.

నేనంటే ఆయనకి అమితమైన గౌరవం, అభిమానం. రాజాలక్ష్మీ ఫౌండేషన్ ప్రత్యేక పురస్కా రాన్ని వారితో పాటే ఆ సంవత్సరం పుచ్చుకు న్నాను. గీతం విశ్వవిద్యాలయం ఆయనకి డాక్టరేట్ ఇచ్చి గౌరవించినప్పుడు కృతజ్ఞతాపూర్వక ప్రసం గం కోసం నా దగ్గరకి వచ్చారు. ఆలోచనలో, అభిప్రాయంలో, నిర్దుష్టమైన నిర్ణయంలో ఆయన ఎంత నిక్కచ్చి మనిషో ఆనాడు చూశాను. వాక్యం లో ఏ అందమైన మాటకీ లొంగరు – అది తన అభిప్రాయమైతే తప్ప. భాష తనదికాని ఆలోచనని అలంకరించకూడదు. ఈ ధోరణి ఆయన సంగీతా నికీ వర్తిస్తుంది. ‘‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. 55 సంవత్సరాలు వరస తప్పకుండా చెన్నైలో జరిగే డిసెంబరు సంగీతోత్సవాలలో మ్యూజిక్ అకాడమీ పిలుపున కచ్చేరీలు చేసి తమిళ రసికులను మెప్పించడం ఒక రికార్డు.

ఆరోగ్యం బాగులేదని తెలిసి ఈ మధ్య వెళ్తే – అంత అనారోగ్యంలోనూ నన్ను గుమ్మందాకా వచ్చి సాగనంపారు, వద్దంటున్నా. నెల రోజుల కిందట వెళ్లినప్పుడు మరీ డీలాపడ్డారు. మాట సరిగా రావడం లేదు. నెమ్మదిగా మంచం మీద కూర్చుంటూ. ‘‘బాధపడుతూ బతకకూడదండీ!’’ అంటూ మంచం మీద వాలారు. నేను చూస్తుండగానే చిన్న నిద్ర పట్టింది. శరీరం ఆయన సంస్కారాన్ని లొంగదీసుకుంటున్న అరుదైన క్షణాలవి. మామూలు కుటుంబంలో పుట్టి, ఏమీ భేషజం లేని అపూర్వమైన విద్వత్తును ఆపోశన పట్టి, ఒక తరానికి మకుటాయమానంగా నిలిచి, సంగీతానికి తనదైన విలాసాన్నీ నిండుదనాన్నీ కల్తీలేని పవిత్రతనూ మప్పిన పెద్ద కన్సర్వేటివ్ నేదునూరి.

– ఆయన జీవన్ముక్తుడు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.