Main Menu

Gollapudi columns ~ Nando Raja Bhavishyathi(నందో రాజా భవిష్యతి !)

Topic: Nando Raja Bhavishyathi(నందో రాజా భవిష్యతి ! )

Language: Telugu (తెలుగు)

Published on: Sep 03, 2012

Nando Raja Bhavishyathi(నందో రాజా భవిష్యతి !)     

ఎంతమందినయినా అడిగాను ఈ లోకోక్తి వెనుక కథేమిటని. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఓ రాజుగారికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి పెద్దకొడుకు. చిన్న భార్యకి చిన్న కొడు కు. అతని పేరు నందుడు. చిన్న భార్యమీద రాజుగారికి మోజు తీరిపోయింది. చిన్న భార్య తమ్ముడు ఏదో నేరం చేశాడు. ఉరిశిక్షని విధించింది న్యాయస్థానం. చిన్న భార్య బాధపడింది. తండ్రి సముదాయించాడు. కొడుక్కి ఉరిశిక్ష వేశారు. అంతేకద? శిక్ష అమలు జరిగేలోగా ఎన్నయినా జరగవచ్చు. ముసిలిరాజు మరణించవచ్చు. పెద్దకొడుకు రాజు అయాక అతనికి మతి చలించవచ్చు. మతిలేనివాడికి రాజ్యాధికారం చెల్లదుకదా? అప్పుడు నందుడే రాజు కావచ్చు. ఇందులో ఉపశమనం ఉంది. ఆశావాది ముందుచూపు ఉంది. అంతకుమించి అవకాశవాది పలాయనవాదం ఉంది.ప్రస్థుతం ఆనవాయితీగా జైళ్లకు వెళ్లివస్తున్న నాయకుల ఆంతరంగిక స్నేహితుడు ఒకాయన ఈ మధ్య తారసపడ్డాడు. మాటల్లో ”ఏమయ్యా, మీ నాయకులు జైల్లోంచి వచ్చినందుకే పండగ చేసుకుంటున్నారు. ముందుందికదా ముసళ్ల పండగ” అన్నాను. ఆయన నవ్వాడు. ”అయ్యా, ఈ దేశంలో ఏ నేరం ఏ దశాబ్దంలో రుజవయింది? ఏ శిక్ష ఎవరికి అమలు జరిగింది? కోట్లు ఖర్చుపెట్టి బెయిల్‌ కొనుగోలు చేసే దేశంలో -కేసు ముగింపుకి రాకుండా సంవత్సరాల తరబడి సాగేటట్టు చూడడం ఏం కష్టం? ఈ మధ్య బొత్తిగా పత్రికలు, ఛానళ్ల గొడవ ఎక్కవయింది కనుక -చుట్టం చూపుగా ఈ మాత్రమయినా జైళ్లకి వెళ్లడం తప్పలేదు. రాజాగారి కేసే తీసుకోండి. లక్ష కోట్లు మాయం చేయగల నాయకునికి మరో 30 సంవత్సరాల దాకా కేసు ఓ కొలిక్కి రాకుండా చూడడం కష్టమా? అప్పటికి ఏ ప్రభుత్వం ఉంటుంది? ఏ చట్టాలుంటాయి? గడ్డి కరిచే ఏ న్యాయాధిపతులుంటారు? నేరం బయటపడినా పదవుల్ని వదలి ఏ నాయకులుంటారు? రాబోయే కాలంలో ఎందరు నందులో!” అన్నాడు. వారి దృష్టిలో జైలు నుంచి బెయుల్‌తో బయటికి రావడం ఒక విధంగా కేసుకి ముగింపు. మళ్లీ కనిమొళి, కల్మాడీ నేరాలు రుజువయి జైళ్లకి వెళ్తారా? ఏ పాతిక సంవత్సరాల మాటో -అధవా జరిగినా. నందో రాజా భవిష్యతి. అప్పటికి కనిమొళి పుత్రరత్నం ముఖ్యమంత్రి కావచ్చు. కల్మాడీ మనుమడు ప్రధాని కావచ్చు. రాజా మేనల్లుడు సీబిఐ అధిపతి కావచ్చు. పరిపాలనలో కాస్త అవినీతి తప్పుకాదనే ఉత్తరప్రదేశ్‌ మంత్రి (ములాయం గారి సోదరుడు) వంటి మహానుభావులు ఈ దేశపు నైతిక వ్యవస్థకి కొమ్ము కాయవచ్చు. తాజా ఉదాహరణ -మన కసాబ్‌గారు. మూడు రోజుల పాటు 166 మందిని చంపి, 238 మందిని గాయపరిచిన దౌర్జన్యకారుడి మీద సంవత్సరాల తరబడి విచారణ సాగింది. అన్ని కోర్టులూ అతనికి ఉరిశిక్ష ఖాయం చేశాయి. నిన్న మరొకసారి సుప్రీం కోర్టు ఖాయం చేసింది. చేసినప్పుడల్లా దేశం ఆనందించింది. ఇది రెండో నందుడి కథ. కేసు విచారణ తేలకపోవడం ఒక దశ. తేలినా శిక్ష అమలు జరగకపోవడం మరో దశ. ఆ మధ్య బ్రిటన్‌లో జరిగిన పేలుళ్లకి నిందితుల్ని అరెస్టు చేశారు. సరిగ్గా మూడే మూడు నెలలలో విచారణ ముగించి శిక్షలు అమలుచేశారు. మన దేశంలో కథ వేరు. 21 సంవత్సరాల కింద జరిగిన రాజీవ్‌గాంధీ హంతకులు ఇంకా జైళ్లలో ఉన్నారు. వీరప్పన్‌ అనుచరులు -సిమోన్‌. జ్ఞానప్రకాశం, మీసెకార్‌ మాదయ్య, బిళ్వేంద్రన్‌ జైలులో ఉన్నారు. అఫ్జల్‌గురు ఉన్నాడు. బబ్బర్‌ కల్సా దౌర్జన్యకారుడు బల్వంత్‌ సింగ్‌ రాజోనా ఉన్నాడు. ఆయన్ని ఈమధ్య -అంటే మార్చి 31, 2012న ఉరి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని సిక్కు వర్గాలు ధర్నా చేశాయి. శిక్ష అమలు జరగలేదు. ఈ దేశంలో అవినీతికి ఇన్ని దశలలో ఇన్ని సౌకర్యాలున్నాయి.రాష్ట్రపతి గారి దగ్గర 26 మంది ఉరిశిక్షలవారు తమని రక్షించమన్న దరఖాస్తులున్నాయి. నలుగురు రాష్ట్రపతులు మారారు. కొత్త రాష్ట్రపతి ఏం చేస్తారు? శిక్షలు అమలు జరపడం ప్రారంభిస్తే ఎక్కడనుంచి ప్రారంభిస్తారు? సీనియారిటీ ప్రకారమా? చావు సీనియారిటీలో ఎవరు ముందు? కసాబ్‌ సాహెబ్‌గారా? అఫ్జల్‌ సాహెబ్‌గారా? ఈ దేశంలో నేలబారు మనిషి విలువ అతి చవక. మొన్న ముంబై పేలుళ్లలో చచ్చిపోయిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షలు ప్రకటించారు ప్రధాని. కసాబ్‌గారి మీద ఇప్పటికి 42 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ప్రభుత్వం! ఏమిటి ఈ నీతి? ఎవరు దీనికి జవాబుదారీ? నాయకుల నిర్లజ్జకీ, నేరస్థుల నిస్సిగ్గుకీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందనడానికి ఇంతకన్న ఉదాహరణలు ఏం కావాలి?

చట్టాన్ని అటెకెక్కించిన అలసత్వం ఒక పక్క.
చట్టాన్ని ఖరీదు చేసే వ్యాపారం మరొక పక్క.
చట్టాన్ని కాలదోషం పట్టించే చాకచక్యం మరొక పక్క.
హంతకుల్ని రక్షించే ఔదార్యం మరొకపక్క.

మన దేశం లో ఎందరో నందులున్నారు. రాష్ట్రానికొక నందుడు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.