Main Menu

Gollapudi columns ~ Neramu-Siksha(నేరము-శిక్ష)

Topic: Neramu-Siksha(నేరము-శిక్ష)

Language: Telugu (తెలుగు)

Published on: Sep 16, 2013

Neramu-Siksha(నేరము-శిక్ష)     

ఆ మధ్య అట్లాంటాలో ఓ మిత్రుడి ఇంట్లో ఉన్నాం నేనూ మా ఆవిడా. ఆయన రచయిత. ఆయన కూతురు చాలా అందమయినది. చురుకయినది. అయితే విపరీతమైన పెంకితనం. కాగా, ఏ కారణం చేతయినా తల్లిదండ్రులు పసిపిల్లల వొంటిమీద చెయ్యి వెయ్యరాదు -అనేది అమెరికాలో పెద్ద నిబంధన. ఆ విషయం స్కూలుకి వెళ్లిన తొలిరోజుల్లోనే పిల్లలకి చెప్తారట -అలాంటిదేదయినా జరిగితే ఫలానా నంబరుకి ఫోన్‌ చెయ్యమని. కనుక పిల్లలకి ఒక మొండి ధైర్యం వస్తుంది. తల్లిదండ్రుల్ని ఏడిపించే చిన్న విశృంఖలత్వమూ అలవడుతుంది. అది తొండ ముదిరినట్టు ముదిరి ఊసరవిల్లి అయితే ఏమవుతుంది? నిన్నటి ‘నిర్భయ’ నేరస్థుడవుతుంది. ఆ పసిపిల్ల పెంకితనం మీద క్రూరమయిన తీర్పుకాదు.

ఇది కేవలం భయం నేర్పని వ్యవస్థ గతిని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. ఈ మిత్రుడు నాతో అన్నమాట గుర్తుంది: ”ఇండియా వచ్చెయ్యాలనుంది. హాయిగా పిల్లల పిర్ర మీద రెండు దెబ్బలు వేసి భయం చెప్పే అవకాశం కోసం” అన్నాడు. మా చిన్నతనంలో చేతిలో బెత్తం లేని ఉపాధ్యాయుడి బొమ్మ ఎప్పుడూ అసమగ్రమే. బెత్తంతో దెబ్బలు తినని చిన్నతనమూ అసమగ్రమే. ఇప్పుడిప్పుడు ఉపాధ్యాయుల్ని పిల్లలే కొడుతున్నారు. ఉపాధ్యాయులూ కసిపెంచుకున్నట్టు పిల్లల్ని శిక్షిస్తున్నారు. గురువుల ఉద్దేశమూ శిష్యుల వినయమూ మూలబడ్డ రోజులివి. దేశంలో -రాష్ట్రాల పోరు, రూపాయి పతనం, ధరల పెరుగుదల, పెట్రోలు ఖరీదుల పెంపు, అవినీతి, మానభంగాల మధ్య అందరికీ తృప్తినిచ్చే విషయం నిన్న జరిగింది. ‘నిర్భయ’ కేసులో నిందితులందరికీ మరణ దండన. ఎక్కడో ఆమ్‌నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ వంటివారు వినా దేశమంతా -నిర్భయ తల్లిదండ్రులతో సహా -తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో రెండు పార్శ్యాలున్నాయి. మొట్టమొదటిసారిగా 9 నెలలలో తీర్పురావడం. రెండు: అందరికీ ఉరిశిక్ష పడడం. ఇందులో చిన్న సబబు ఉంది. మనిషిలో ప్రాధమికమైన విధ్వంసక శక్తి -పశువు. మనిషికి ప్రాథమికమైన బెదిరింపు -భయం. ఈ రెండిటికీ పొంతన ఉంది. మరొకటి కూడా చెప్పుకోవాలి. ఈనాటి మానవునిలో అవకాశవాదానికి దగ్గర తోవ -మానవతా వాదం. ఇంట్లో కూచుని ఉరిశిక్ష రద్దు గురించి మాట్లాడే పెద్దలు -రోడ్డు మీద ప్రయాణం చేసే, మరో పదిహేను రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా ఆరుగురు కళ్లముందే మానభంగం చేసి, ఇనుప ఊచతో ఆమెనీ, ఆమె మిత్రుడినీ చావగొట్టి, ఢిల్లీ నడిరోడ్డుమీద నగ్నంగా శిధిలమయిన అమ్మాయి శరీరాన్ని తోసేసి, లారీ టైర్లతో తొక్కి చంపాలనుకున్న ఆరు పశువుల్ని ఏ మానవతా విలువలకి కట్టుబడి ఈ సభ్య సమాజంలో బతికించుకోవాలో గుండెలు మీద చెయ్యి వేసుకుని చెప్పాలి. మన చట్టాలు, మన న్యాయవ్యవస్థ, ఇలాంటి పెద్దల పుణ్యమా అని ‘మానవత్వం’, ‘నిజాయితీ’, ‘సత్ప్రవర్తన’ వంటివి నవ్వు కునే, సభల్లో నేరస్థులు చట్ట సభలకు ఎన్నిక కావడానికి వాడుకునే ఊతపదాలయాయి. వాటి విలువ ఏమిటో ఒక మంజునాధ్‌ని, ఒద దుర్గాశక్తి నాగ్‌పాల్‌ని, ఒక అశోక్‌ కేమ్కానీ అడిగితే తెలుస్తుంది.

ఉరిశిక్ష రద్దుకావాలనే పెద్దలు అలనాడు రాజీవ్‌ గాంధీతోపాటు, కేవలం తమ విధులను నిర్వర్తిస్తున్న కారణంగా చచ్చిపోయిన 18 కుటుంబాలలో ఎవరినయినా ఒప్పించగలరా? అసలు వారెవరో -ఒక నేరస్థుడి కారణంగా 18 కుటుంబాలు ఎలా కుక్కలు చింపిన విస్తరులయాయో గుర్తుపట్టారా అని అడగాలనిపిస్తుంది.

పట్టపగలు నేరం చేసినా ఈ వ్యవస్థలో నేరం రుజువుకావడానికీ, జైలుకి వెళ్లడానికీ మధ్య కనీసం 20 సంవత్సరాల అంతరం ఉంటుందని తెలిసిన పెద్దలు జైళ్లకి కాక సరాసరి చట్ట సభలకి వెళ్లడం మనం అనునిత్యం చూస్తున్నాం.

మన చట్టాలకు కాలదోషం పట్టినా, ఇప్పటి కాలానికి, ఇప్పటి నేర ధోరణులకూ వర్తించనంతగా పాతబడినా, పాడుబడినా -రుజువయేవరకూ నేరస్థుడిని కేవలం ‘నిందితుడి’గానే పరిగణించాలనే అతి మానవీయమైన వ్యవస్థ -మనకు బ్రిటిష్‌ వ్యవస్థ ఇచ్చిపోయిన వారసత్వం. అతి చిన్న లొసుగు లేకుండా నేరం రుజువయేవరకూ నిందితుడు ఏనాడూ ‘నేరస్థుడు’ కానేరడు అని మన చట్టాలు నిందితులకు బాసటగా నిలిచాయి. కాగా చట్టాల విసులుబాటుని దుర్వినియోగం చేస్తూ, చర్మం మందమెక్కిన నేరస్థులను -మన ‘నిర్భయ’ నిందితులలాంటివారికి ఇలాంటి శిక్షలు -వారి వరకే ఆగవు. అలాంటి నేరాలు చేసేవారికి కనువిప్పో, హెచ్చరికో కాగలవు. అలాకావడం లేదని తెలిసిన ఈ నేరస్థుల డిఫెన్సు లాయరుగారు -”ఈ శిక్ష విధించాక ఈ దేశంలో రాబోయే రెండు నెలలలో ఎక్కడా మానభంగం జరగకపోతే -ఈ శిక్ష కనువిప్పు అయిందని నమ్ముతాను. పైకోర్టుకి అప్పీలు

చెయ్యకుండా మా నిందితులు శిక్షని శిరసావహిస్తారు” అని ఛాలెంజ్‌ విసిరారు. ఆయన తప్పులేదు. ఈ దేశమూ, ఈ వ్యవస్థ అలాంటి నైరాశ్యంలో పడిన కారణంగానే ఈ దేశంలో ఈ తాజా హంతకులు -ఇలాంటి అలసత్వాన్ని ఆసరా చేసుకుని నేరాలు చేస్తూ తప్పించుకుపోవడం మనం చూడడం పరిపాటి అయిపోయింది. ”బాబూ! డిఫెన్స్‌ వారూ! మీరు రైటే. కాని మీలాంటివారి వెన్ను విరవడానికి ఇది ప్రారంభమని మేం నమ్ముతున్నాం” అని నిరూపించాల్సిన సమయం వచ్చింది.

నూటపాతిక మందిని వినోదంగా ఊచకోత కోసిన కసాబ్‌నీ, ‘దమ్ముంటే నన్ను శిక్షించండి’ అని బోరవిరిచిన అఫ్జల్‌గురుని ఎవరికీ చెప్పకుండా ఉరితీయాల్సిన దశలో వ్యవస్థ ఉంది. హత్యలు చేసి ఉరిశిక్ష పడిన నేరస్థులను విడిచిపెట్టాలని రాష్ట్ర శాసనసభలు (దక్షిణాదిన తమిళనాడు, ఉత్తరాదిన జమ్మూకాశ్మీరూ) తీర్మానాలు చేసే దశకి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. హత్య చేసి శిక్షపడిన నేరస్థుడిని రాజకీయ పార్టీల అలజడి కారణంగా బల్వంత్‌ సింగ్‌ రాజోనా ఉరిశిక్షని పంజాబులో అమలు చెయ్యలేని కథ మనం చదువుకున్నాం.

మానవతా వాదులకు ఒక విన్నపం. అట్లాంటాలో మా మిత్రుడు రెండు దెబ్బలు వేయడానికి చేతులు దురద పెడుతున్నాయని వాపోయిన పాప -అతని సొంత కూతురు. (న్యాయవ్యవస్థకి ప్రారంభదశలో ప్రతి నిందితుడూ పసిబిడ్డే!) ఆమెని హింసించడం అతని ఉద్దేశం కాదు. కాని చేసిన తప్పిదానికి శిక్ష ఉం టుందన్న ఆలోచన ఆ మేరకు ఆమెని సంస్కరించగలదని అతని ఆశ. ఆ నిజాన్ని నిరూపించిన తరంలోనే మేష్టారి చేతిలో బెత్తంతోనే మేమంతా పెరిగాం. నేరం ఆ పసిపిల్ల ఆకతాయితనం దగ్గర ఆగితే ఈ సమాజమూ ప్రతి వ్యక్తినీ ఆ పసిపిల్ల స్థాయిలోనే బుజ్జగిస్తుంది. మరణశిక్ష అమలుకి -హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా -అయిదారు దశలు ఉన్న నిజం పెద్దలకి తెలిసే ఉంటుంది. అయితే వ్యవస్థ మానవతా దృక్పథాన్ని ‘అలుసు’గా ఆరుగురు పశువులు ఒక అమాయకురాలయిన అమ్మాయిమీద అత్యాచారం చేస్తే ఈ దేశంలో వారిశిక్షను బహిరంగంగా అమలుజరపాలని నమ్మేవారిలో నేనొకడిని. ఒక చిన్న ఉదాహరణ. దుబాయ్‌ వంటి దేశాలలో దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారని చెప్పడం విన్నాను. చేతుల్లేని వ్యక్తిని ఒక్కడినయినా నేను చూడలేదు. కాని దొంగతనమూ చూడలేదు. ”మీరిక్కడ సూట్‌కేసు వదిలివెళ్తే -అక్కడే ఉంటుంది” అని గర్వంగా, నమ్మకంగా చె ప్పిన తెలుగు మిత్రుల్ని నాకు తెలుసు. ఎందుకని?

”భయం” మనిషిలోని ”పశువుని” అదు పులో పెట్టే ప్రాథమిక శక్తి. వ్యవస్థకి దమ్ముంటే -చేతుల్లేని దొంగలు మనముందు కనిపించరు. చేతుల్ని కాపాడుకోడానికి తాపత్రయపడే దొంగబుద్ధి భయపడుతుంది. ఈ నాలుగు పశువు ల్నీ శిక్షించడం ఆ భయానికి ప్రా రంభం కాగలిగితే చాలామంది ‘నిర్భయ’లు మహాత్ముని మాటల్లో అర్ధరాత్రి క్షేమంగా ఇంటికి నడిచిరాగలరు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.