Main Menu

Gollapudi columns ~ Nijam Nidrapoindhi-2(నిజం నిద్రపోయింది)

Topic: Nijam Nidrapoindhi-2(నిజం నిద్రపోయింది )

Language: Telugu (తెలుగు)

Published on: June 25, 2012

Nijam Nidrapoindhi(నిజం నిద్రపోయింది)     

చాలా సంవత్సరాల కిందటిమాట. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్‌కి 30 లక్షలు అదనంగా స్టాంపు చార్జీలు కట్టాలి. మినహాయింపుని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాను. లాయరుగారు చిరునవ్వు నవ్వుతూ రెండు మూడు సుళువులు చెప్పారు. ఈ చార్జీలు ఎంతకాలం కట్టకుండా వాయిదా వెయ్యాలి? అయిదేళ్లా? ఆరేళ్ల? సుళువులు వున్నాయి. మీ ఫైలు అయిదేళ్లు కనిపించకుండా మాయమయిపోతుంది. అసలు పూర్తిగా కట్టకుండా దాటెయ్యాలా? ఫైలు శాశ్వతంగా మాయమైపోతుంది. ఈ పనులకి సరసమైన ధరలున్నాయి. ఆశ్చర్యపోయాను. గవర్నమెంటు మన గురించే ఆలోచిస్తూ గడపదు. ఫైలు కనిపించకపోతే ఆ వివరాలన్నీ పూర్తిగా నిద్రపోతాయి. ఈ సౌకర్యాలు చేసే అవినీతి ఆయా కార్యాలయాలలో ఉంటుంది. సరసమైన ధరలకు మనం ఆ అవినీతిని కొనుక్కోవచ్చు. నార్లగారూ, శ్రీశ్రీ, ఆరుద్ర దగ్గర్నుంచి నా దాకా -ఆ రోజుల్లో మద్రాసులో మూర్‌ మార్కెట్‌ సెకెండ్‌ హాండ్‌ పుస్తకాల షాపుల్లో తిరగడం అలవాటు. విశ్వవిద్యాలయం ఇంగ్లీషు డిపార్టుమెంటువారు చెప్పలేకపోవచ్చు గాని -క్రిస్టొఫర్‌ ఫ్రై నాటకాలున్నాయా? ఎమిలీ డికిన్సన్‌ పొయిట్రీ ఉందా? ఆ షాపువాడు అలవోకగా తీసి యివ్వగలడు. వారంతా తమిళులు. బి.సీతారామాచార్యులవారి శబ్దరత్నాకరము ఉందా? సుళువుగా తీసి యివ్వగలడు. ఎన్నో అరుదయిన, అమూల్యమైన పుస్తకాలను, సరసమయిన ధరలకి కొనుక్కున్న సందర్భాలున్నాయి. దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ మొదటి ముద్రణ ప్రతి అక్కడ నాకు దొరికింది. ఆ భవనం కొన్ని శతాబ్దాల పాతది. ఆ దుకాణదార్లకు మమ్మల్ని తెలుసు. మాకు వాళ్లని తెలుసు. ”ఏం ముత్తుస్వామీ! కొత్త పుస్తకం…?” అంటే ”మీకోసమే చూస్తున్నాను సార్‌! ఇదిగో ముద్దుపళని ‘రాధికా స్వాంతనం” అని యిచ్చేవాడు. తంజావూరు సరస్వతీ గ్రంథాలయం లాగ ఈ మూర్‌ మార్కెట్టుని జాతీయం చెయ్యాలి అనుకునే వాళ్లం.
మూర్‌ మార్కెట్టుని ఆనుకునే సెంట్రల్‌ స్టేషన్‌ ఉంది. రాను రాను ప్రయాణీకుల రద్దీ పెరిగింది. స్టేషన్‌ సౌకర్యాలు పెంచవలసిన అగత్యం పెరిగింది. మూర్‌ మార్కెట్‌ని అక్కడినుంచి పెకళించాలని ప్రయత్నించారు. వందల దుకాణదారులు గొల్లుమన్నారు. మాలాంటి సాహితీపరులు కస్సుమన్నారు. అన్నివైపులనుంచీ ప్రతిఘటన వచ్చింది. అప్పుడేమయింది? ఓ తెల్లవారు ఝామున మూర్‌ మార్కెట్‌కి నిప్పంటుకుంది. దుకాణదారులకు తెలిసేలోపున లక్షలాది పుస్తకాలు, యితర దుకాణాల సామగ్రి బూడిదపాలయింది. ప్రభుత్వం, రాజకీయ నాయకులు పశ్చాత్తాపం ప్రకటించారు. లారీలతో బుగ్గిని తీసి పారబోశారు. కొత్త రైల్వే భవనాలు వెలిశాయి.

కొన్ని సమస్యల పరిష్కారానికి అగ్నిహోత్రుడు దగ్గర తోవ. నిన్న మహారాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం ‘మంత్రాలయం’లో అగ్నిప్రమాదం అలాంటి చక్కని పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసులో దేశాన్ని నిర్ఘాంతపోయేటట్టు చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు, సైన్యాధిపతులతో కూడిన పెద్ద ఆదర్శ కుంభకోణం ఫైళ్లున్నాయి. ఇంకా ఇంకా రకరకాల కుంభకోణాలు -మనదాకా రానివి ఉండవచ్చు. వాటిని శాశ్వతంగా సమాధి చెయ్యడానికి ‘ఫైళ్ల మాయం’ లాయకీ కానప్పుడు మూక ఉమ్మడి చర్య అవసరం. అదే మంత్రాలయంలో అగ్నిప్రమాదం. అందరికీ ఇద్దరి చావు, వందలాది మంది ప్రాణాలతో బయట పడడమే తెలుస్తోంది కాని ఈ అగ్నిప్రమాదం ముందు ముందు కొన్ని సంవత్సరాల పాటు ‘అవినీతి’ని బూడిద చెయ్యగలదు. అందులో కాలని ఇబ్బంది ఫైళ్లు కూడా ముందు ముందు కొన్ని ఏళ్లపాటు ఆ అగ్నిప్రమాదం పేరిట మాయమయే అవకాశాలున్నాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత. డబ్బు కొద్దీ అవినీతి. ఈ అగ్నిప్రమాదంలో 3.18 కోట్ల పేజీల కాగితాలు, 2.27 లక్షల ఫైళ్లు ఆహుతి అయిపోయాయి. ఇందులో ఎంతమంది గొప్పవాళ్ల గోత్రాలున్నాయో ఆ భగవంతుడికే తెలుసు. ఎంతమంది ఈ శుభపరిణామానికి పండగ చేసుకుంటున్నారో మనకి తెలియదు.
నాలుగు రోజుల కిందటే ఎర్ర చందనాన్ని రవాణా చేస్తున్న ఓ డ్రైవరు శరీరం వొంటి నిండా బులెట్‌ గాయాలతో దొరికిందని మనం పత్రికల్లో చదివాం. డ్రైవరు బతికుంటే ఎంతమంది గుట్లు బయటపెట్టగలడో మనం ఊహించవచ్చు. లోగడ ఇలాగే మాఫియా రహస్యాలు తెలిసిన చాలామంది అన్యాయంగా హత్యలకు గురికావడం విన్నాం. ఇక్కడొక ధర్మ సందేహం. అన్యాయాలు ఎల్లకాలం జరుగుతూంటాయి. దొరికినవాళ్లు దొరుకుతారు. తెలివైనవాళ్లు బయటపడతారు. దొరకకుండా తప్పించుకోదలచినవారు ఇలా కొందరి ప్రాణాలు తీస్తారు. అయితే మనుషుల్ని చంపడం మంచిదా? ఫైళ్లని తగలెయ్యడం మంచిదా అని బేరీజు వేసుకుంటే -గిరీశం అడుగుజాడల్లో -యింప్రిమిస్‌ ఒకటో పద్దు ప్రకారం ఫైళ్లు మాయమవడమే శ్రేయస్కరం అని అనిపిస్తుంది. అవినీతిని ఎలాగూ ఆపలేం కనుక -నీతి ఎలాగూ బుట్టదాఖలు అవుతుంది కనుక మనుషుల్ని నష్టపోవడం కంటే అగ్నిప్రమాదాల్లో ఫైళ్లని నష్టపోవడమే శ్రేయస్కరం.

ఒక్క ఫైలు మాయమయితేనే నాలాంటివాడికి 30 లక్షలు కిట్టుబాటుకాగల నేపథ్యంలో -ఈ అగ్నిప్రమాదం ఎన్ని కోట్ల అవినీతికి ఉపకారమో, ఎందరి పదవులను సుస్థిరంగా కాపాడిందో, ఎందరి కీర్తిప్రతిష్టలకు గొడుగు పట్టిందో, ఎంతమంది సైనిక అధికారుల పించనులకు రక్షణ కల్పించిందో వారికి తెలుసు. ఆ పరమాత్మకి తెలుసు.
అగ్నిహోత్రుడు సర్వనాశనకారి అనే అపప్రద ఉంది. కాని ఎంతోమంది కీర్తులు, పదవులు, ఆస్తులు, జీవితాలు కాపాడే చల్లని చలివేంద్రం. పెద్దమనిషి. నిన్నటి మంత్రాలయం మంటలు అగ్నిప్రమాదం కాదని నా ఉద్దేశం. చాలామందికి ‘అగ్నిప్రమోదం’.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.