Main Menu

Gollapudi columns ~ O Cheema Katha (ఓ చీమ కథ)

Topic: O Cheema Katha (ఓ చీమ కథ)

Language: Telugu (తెలుగు)

Published on: Nov 08, 2010

O Cheema Katha (ఓ చీమ కథ)     

ఈ దేశంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నా రెండు వ్యవస్థలు ఇంకా నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నందుకు ఇంతకాలం తృప్తిగానూ, ధైర్యంగానూ ఉండేది. -న్యాయవ్యవస్థ, సైనిక వ్యవస్థ. అయితే క్రమంగా ఆ తృప్తీ, ధైర్యం కూడా సన్నగిల్లిపోయే రోజులు వచ్చేశాయి. మొన్న శాంతిభూషణ్ వంటి సుప్రీం కోర్టు న్యాయవాది – చాలమంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులే అవినీతికి తాకట్టు పడ్డారని, అందుకు తన దగ్గర రుజువులున్నాయని కోర్టు ధిక్కార చట్టానికి వెరవకుండా కుండ బద్దలు కొట్టినప్పుడు దేశం నివ్వెరపోయింది. ఆయన కొడుకు ప్రశాంత్ భూషణ్ కోర్టుల్లో అవినీతిని దూరం చెయ్యడానికి ఉద్యమాన్ని నడుపుతున్నారు.

ఈ మధ్య ఒక కోర్టు తీర్పు ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత వెలువడిందని చదివాం. న్యాయపరిరక్షణలో ఇది కూడా భయంకరమైన అవినీతే. పదమూడేళ్ళ రుచికని మానభంగం చేసి ఆమె చావుకి కారణమైన నీచుడు, దౌర్భాగ్యుడైన పోలీస్ అధికారి రాధోడ్ పంతొమ్మిది సంవత్సరాలలో పోలీసు శాఖ అధిపతి ఐ రిటైరయ్యాడు. కేవలం ఆ కుటుంబం ఆర్తి కారణంగా , ప్రసార మాధ్యమాల జోక్యమ్ కారణంగా కోర్టుకి వచ్చాడు. న్యాయస్థానం అతను నేరస్థుడని జైలుకి పంపించింది. ఒక అవినీతి పరుడిని పంతొమ్మిది సంవత్సరాలు – ఈ సమాజం చట్టాన్ని రక్షించే అధికారిగా భరించింది. ఇది భయంకరమైన అవినీతి. న్యాయస్థానం చేతకాని తనాన్ని ఇంకా ఇంకా ఇలాంటి నీచులు వాడుకుంటున్నారు. ఒక పసిబిడ్డ చావుకి కారణమైన పోలీసాధికారి ఆదర్శప్రాయం కావల్సిన అత్యున్నత స్థానంలో రాష్ట్రానికి ముఖ్యధికారిగా ఉండడం – నేటి పార్లమెంటులో హంతకులు ఉన్నంత భయంకరం. మరో గుండెలు తీసిన అలుసుకి రెండు ఉదాహరణలు. రాధోడ్ గారు దీపావళి జరుపుకోడానికి జైలునుంచి తాత్కాలికంగా విడుదలని కోరారు. తమలాగే దీపావళిని జరుపుకునే అవకాశం తమ కారణంగా నష్టపోయిన మరో కుటుంబాన్ని గుర్తుచేసింది న్యాయస్థానం. అలాగే కుటుంబంలో ఎవరూ లేరు కనుక పొలానికి నీళ్ళు పెట్తటానికి జైలునుంచి విడుదలని కోరారు ఈ పెద్దమనిషి. అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమా “ఖైదీ కన్నయ్య” వచ్చింది. ఆ సినిమాలో నేరస్థుడిని జైలులో ఉంచకుండా అతని కారణంగా చితికిపోయిన కుటుంబానికి సేవచేసే పనికి నియోగిస్తుంది న్యాయస్థానం. అలా రాధోడ్ గారిని రుచిక కుటుంబం దీపావళిని జరుపుకోడానికి చాకిరీ చెయ్యమని నియోగించాలనేది నా ఉద్దేశం.

మన కళ్ళముందే వందలమంది మారణ హోమంలో పాలుపంచుకున్న అజ్మల్ కసాబ్ సాహెబ్ గారు నిమ్మకు నీరెత్తినట్టు జైల్లో ఉన్నారు. రాజీవ్ గాంధీని చంపి ఉరిశిక్షపడిన నేరస్థులంతా జైల్లో సుఖంగా ఉన్నారు. కేవలం నేరం స్థాయి , ప్రపంచం షాక్ కారణంగా అలనాడు నాధూరాం గోడ్సేని బియంత్ సింగ్ ని ఉరితీశారు. మరి పొరుగు దేశంలో జులికరాలీ భుట్టోగారిని, ఇరాక్ స్ద్దాం హుస్సేన్ గారినీ ఉరితీయడానికి ఎక్కువకాలం పట్తలేదు. ఇది భయంకరమైన అవినీతి.

ఇలా చెబుతూ పోతే పేజీలు చాలవు. ఇక సైనిక వ్యవస్థ. దేశం కోసం ప్రాణాలర్పించే, రాజకీయ వ్యవస్థ ఎంత దయనీయంగా కుళ్ళు చూపినా పల్లెత్తుమాట అనని అద్భుతమైన , కమిటెడ్ వ్యవస్థ. మనదేశంలో ఐ.క్యు ఖాన్ లు లేనందుకు, దేశాన్ని తాకట్టుపెట్టే వాళ్ళని వెనకేసుకొచ్చే ముష్రాఫ్ లు లేనందుకు మనం గర్వపడాలి.

అయితే ఈ మధ్య ముంబైలో ఆదర్శాహౌసింగ్ సొసైటీ ఆ గర్వాన్ని అణగదొక్కింది. ఇందులో చాలామంది సైనికాధికారులు ’తిలాపాపం తలా పిడికెడు ’ పంచుకున్నారు. కౌల్ అనే సైనికాధికారిని ముంబైలోనే ఉంచి, ఆ సొసైటీ వ్యవహారాలు చూడడానికి అవకాశాన్ని కల్పించారు. కౌల్ గారు అందరికీ పంపకాలు చేశారు. ఇందులో ప్రస్థుత సైన్యాధిపతి దీపక్ కపూర్ కూడా ఉన్నారు. అసలు ఈ సొసైటీ ముఖ్యోద్దేశం కార్గిల్ లో ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు గృహవసతి కల్పించడం. కాని మహారాష్ట్ర నాయకులంతా ఈ ఫ్లాట్లను పంచుకున్నారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్, షిండే, అశోక్ చవాన్, ఆర్.ఆర్.పాటిల్..మీ ఇష్టం , అందరూ ఈ పాపాన్ని పంచుకున్నారు.

నిప్పుంటేకాని పొగరాదన్నారు. చవాన్ గారు పొగరాగానే రాజీనామా చేశారు. నిప్పు కోసం ఇక మనం వెదకనక్కరలేదని తాత్పర్యం. చాలామంది సైన్యాధికారులు సొసైటీలో తమ సభ్యత్వాన్ని వదులుకున్నారు. చావుని ఎదిరించి నిలబడే వీరులు – నిజంగా అవినీతి లేకపోతే అభియోగాన్ని ఎదిరించి ఎందుకు నిలబడడం లేదు? అయ్యా, ఈ అవినీతిలో నిప్పు ఎన్ని కుంపట్ల పుణ్యమో!

ఇది దేశానికి భయంకరమైన దుస్థితి. సైనిక, న్యాయ వ్యవస్థల నైతిక పతనం – మనల్ని లోతు తెలియని అగాధం లోకి తోసేయడం.

ఒక చిన్న ’చీమ’ కథ గుర్తుకొస్తోంది..

శ్రీరాముడు చీమమీద కాలు వేశాడట. చీమ నిస్సహాయంగా , నిశ్శబ్దంగా బాధపడింది. గ్రహించిన శ్రీరాముడు చీమని అడిగాడట స్పందించలేదేమని. చీమ చెప్పిందట ” స్వామీ ఈ లోకంలో ఎవరికి బాధ కలిగినా నిన్ను తలుచుకుంటూ ’రామా..రామా.’ అంటాం. కాని రాముడే నన్ను బాధిస్తే ఎవరితో చెప్పుకోను..” అని.

మన కి ప్రస్థుతం ఈ చీమ గతే పట్టింది..!

***

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.