Main Menu

Gollapudi columns ~ O Gontu- O Garjana (ఓ గొంతు – ఓ గర్జన)

Topic: O Gontu- O Garjana(ఓ గొంతు – ఓ గర్జన)

Language: Telugu (తెలుగు)

Published on: Jan 06, 2014

O Gontu- O Garjana(ఓ గొంతు - ఓ గర్జన)     

అరవై ఐదు సంవత్సరాలు కుళ్ళి, అహంకారంతో, స్వార్థంతో నేరచరిత్రతో గుండెలు దీసిన ధైర్యంతో చట్టాల్నీ, చట్టసభల్నీ కైవశం చేసుకుని దేశాన్ని దోచుకుతింటున్న పాలక వ్యవస్థలో కేవలం 9 నెలల్లో రూపు దిద్దుకుని –ప్రజల మద్దతుని సాధించి, మైనారిటీ వోటుతో మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో నిలబడిన- ఏనాడూ నిలబడాలని,నిలబడతానని ఊహించని ఓ సాదా సీదా నేలబారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గొంతు విప్పితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది.’మేము పార్టీ రాజకీయాలు నడపడానికి ఇక్కడికి రాలేదు. ఆ పని మాది కాదు. మా జీవితాల్లో మేమెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చేస్తామని అనుకోలేదు. మేము సాదాసీదా నేలబారు మనుషులం. మాకు స్టేటస్‌ లేదు, అక్కడ కూర్చున్న ‘వందన’ ఓ ఇల్లాలు.ఆమె వెనుక కూర్చున్న అఖిలేష్‌ సివిల్‌ పరీక్షలు రాయడానికి ఢిల్లీ వచ్చాడు.ఆ వెనుక కూర్చున్న ధర్మేంద్ర సింగ్‌ కోలీ చెల్లెలు హత్యగావించబడింది. ఈ 28 మంది ఇలా వచ్చిన వారే. వీళ్ళు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చిందో ఆ అసెంబ్లీ ఆలోచించాలి. ఈ దేశంలో నేలబారు పౌరుడికి ఏం కావాలి? కడుపుకి పట్టెడన్నం కావాలి. పిల్లలకి చదువు కావాలి.రోగం వస్తే నయం చేసే వైద్యం కావాలి. ఉండానికి చిన్న ఇల్లు కావాలి. తాగే నీరు కావాలి. కరెంట్‌ కావాలి. తనూ,తన కుటుంబమూ, పిల్లలూ క్షేమంగా ఉండే వాతావరణం కావాలి. తనకి న్యాయం చేసే వ్యవస్థ కావాలి. ఈ 65 సంవత్సరాలలో ఈ కనీస అవసరాలు ఈ నేలబారు మనిషికి దక్కలేదు. ఎందుకు? ఈ చిన్న సౌకర్యాలు ఎందుకు అందలేదు? నిన్ననే ఢిల్లీలో చలికి తట్టుకోలేక ఇద్దరు చనిపోయారని విన్నాం. ఎందుకిలా జరిగింది? గత 65 సంవత్సరాలుగా ప్రభుత్వం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తోంది. అయినా ఈ అనర్ధాలు జరుగుతున్నాయి. ఆ డబ్బుంతా ఏమయింది? ఆ డబ్బు సజావుగా ఖర్చు అయి ఉంటే ఈ పాటికి నేలబారు మనిషి కనీసపు అవసరాలు తీరేవి. కాని ఆ డబ్బు రాజకీయ వ్యవస్థ చేతుల్లోకి పోతోంది. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకు పోయింది. రాజకీయాల్లో నేర చరిత్ర స్థిరపడింది. ఇవాళ చదువులెందుకు పాడయాయి? కారణం– రాజకీయ వ్యవస్తలో అవినీతి, ఆరోగ్యరంగం అధోగతిలో ఉంది. కారణం– రాజకీయ వ్యవస్థలో అవినీతి. విద్యుచ్ఛక్తి సమస్యలు, నీటి సమస్యలు, రోడ్ల సమస్యలు, రవాణా సమస్యలు. కారణం- రాజకీయ వ్యవస్థలో అవినీతి. ఇవాళ అందరం ఏకమయి ఈ రాజకీయ వ్యవస్థని మార్చాలి.రెండేళ్ళ కిందట నేలబారు మనిషి రోడ్డు మీదకు వచ్చి అవినీతిని ఖండిస్తూ చట్టాన్ని చేయమని కోరాడు.కాని రాజకీయ నాయకులు– మీకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి మీరే చట్టాలు చేయండి–అని అన్నారు. నేలబారు మనిషి పేదవాడు, గతిలేని వాడు. ఎలా పోటీ చేస్తాడని అనుకున్నాడు రాజకీయ నాయకుడు. మాకు ధనబలం ఉంది, భుజబలం ఉంది– ఈ నేలబారు మనిషికి ఎంత ధైర్యం అనుకున్నాడు. అది రాజకీయ నాయకుల పెద్ద పొరపాటు. వాళ్ళు మరిచి పోయిన నిజం ఒకటుంది. నేలబారు మనిషి పొలంలో పని చేస్తాడు. రాజకీయ నాయకుడు కాదు.నేలబారు మనిషి నూలు నేస్తాడు. రాజకీయనాయకుడు కాదు.నేలబారు మనిషి రాళ్ళు మోస్తాడు, రాజకీయ నాయకుడు కాదు.నేలబారు మనిషి టాక్సీ నడుపుతాడు. రాజకీయనాయకుడు కాదు. నేలబారు మనిషి చంద్రమండలానికి వెళ్తాడు. రాజకీయనాయకుడు కాదు. నేలబారు మనిషి పరిశోధనలు చేస్తాడు. రాజకీయనాయకుడు కాదు. రాజకీయ నాయకులు ఏమీ చేయరని తెలుసుకున్నాక నేలబారు మనిషి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డాడు. రాజకీయవాతావరణాన్ని ప్రక్షాళితం చేయడమే నేలబారు మనిషి లక్ష్యం. కానీ, అతని దగ్గర డబ్బులేదు. నల్లధనం తీసుకోలేడు.కానీ, నిజాయితీతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. పోటీ ప్రారంభమయింది. కొన్ని నెలల క్రింద ప్రారంభమైన పార్టీ 28 సీట్లు గెలుస్తుందని ఎవరు కలగన్నారు? రాజకీయనాయకులు నవ్వారు.వెక్కిరించారు. మీ తరం కాదన్నారు. అయితే, ఒక సామెత ఉంది. మనిషికి ఎవరూ తోడు లేనప్పుడు దేవుడు తోడుగా నిలుస్తాడని. దేవుడు నిజాన్ని సమర్ధిస్తాడు. నిజాయితీని సమర్ధిస్తాడు. డిసెంబర్‌ నాలుగు, ఎనిమిది తారీఖుల మధ్య ఓ మ్యాజిక్‌ జరిగింది. నేలబారు మనిషి (ఆమ్‌ ఆద్మీ) ఎన్నికల్లో గెలిచాడు. ఇప్పుడీ పోరాటం ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం. వ్యవస్థకి చికిత్స చేయడం.

మరొక్క విషయం. మన దేశంలో మహానాయకులు రోడ్డు మీద వెళితే కార్ల మీద ఎర్ర దీపాలు వెలుగుతాయి.రోడ్ల మీద ట్రాఫిక్‌ నిలిచి పోతుంది. ఎందుకంటే, వారి సమయం విలువైనది. వృధా కాకూడదు.– అంటారు. నేను గత ఆరేడు రోజులుగా రోడ్ల మీద వెళ్తున్నాను. ట్రాఫిక్‌ దీపాల దగ్గర అందరిలాగే ఆగుతున్నాను. నా సమయం ఏమీ వృధా కాలేదు. ఈ మర్యాద వారి రక్షణకన్నారు. కానీ దేవుడి దీవెన ఉన్నంత కాలం మనిషి బతుకుతాడు.అది లేకపోతే పోతాడు.ఈ విఐపి సంస్కృతికి ముగింపు రాయాలన్నదే మా లక్ష్యం. అవినీతిని నిర్మూలించే చట్టాలు రావాలి. రోడ్డు మీద దీపం పోయిందంటే, కొత్తది వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటారు.రోడ్లని మాత్రం పదే పదే తవ్విపోస్తుంటారు. రోడ్ల పనిలో డబ్బు జేబుల్లోకి పోతుంది. అదీ కారణం.

నేలబారు మనిషి దీనిని ఆపబోతున్నాడు. చలవ గదుల్లో డబ్బు ఎలా పంచాలో నిర్ణయించే రోజులు పోయాయి. డబ్బు ఎలా ఖర్చు కావాలో నేలబారు మనిషి చెప్తాడు.మనం స్వాతంత్య్ర సమరం చేసింది బ్రిటిష్‌ వారి స్థానంలో మన నాయకుల్ని కూర్చోబెట్టడానికి కాదు.మన అవసరాలకు వీళ్ళ ఇళ్ళు చుట్టూ తిరగడానికి కాదు. మేం ఢిల్లీని మారుస్తాం. దేశాన్ని మారుస్తాం.

మేం మీ సమర్ధన కోసం ఇక్కడి నిలబడలేదు. మామీద నమ్మకం సడలితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాం.నేనిక్కడ మీ ఓటు కోసం నిలబడలేదు. నా ప్రభుత్వాన్ని నిలుపుకోవనాలన్నది నా లక్ష్యం కాదు, మొదటిసారిగా ఈ దేశంలో ఓ నేలబారు మనిషి పాలనలో నిజాయితీ కావాలని ధైర్యంగా డిమాండ్‌ చేసి నిలబడ్డాడు. ఈ ప్రయత్నంలో ఈ శాసనసభలో ఎంత మంది ఓ నేలబారు మనిషితో భుజం కలిపి నిలబడతారో తేల్చుకోండి.’ఈ నేలబారు మనిషి గొంతు ఈ సమాజానికి శుభసూచకం. విశాఖపట్నంలో ఓ 60 ఏళ్ళ ఉద్యోగి –అతను తెలుగు వాడు– అరవింద్‌ కేజ్రీవాల్‌కి అతనెవరో తెలిసే అవకాశం లేదు. ఉదయాన్నే బ్యాంకుకు వెళ్ళి పదివేల రూపాయిల చెక్కుని పంపాడట– తాను ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్టు తెలియజేస్తూ నాకు ఉదయమే గర్వంగా ఫోన్‌ చేసి చెప్పాడు.ఈ దేశాన్ని ఈ అవకాశవాదుల నుంచి, ఈ రాబందుల నుంచి కాపాడటానికి ఇంకా వేళ మించి పోలేదని విశ్వాసం, ధైర్యం పుంజుకునే సమయమిది. నేలబారు మనిషి- అతను ఎవరయినా పదవిని చేపట్టి తన జీవితాన్ని తాను నిర్దేశించుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడాలన్నదే ప్రజాస్వామ్య ఉద్దేశం. లక్ష్యం. కానీ ఆ పవిత్రమైన లక్ష్యాన్ని డబ్బు, పదవి,జులుం, అవకాశవాదం అటకెక్కించింది. అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు– మామూలు మనిషి ఆ అవినీతిని ఆసరా చేసుకుని తన దినం గడుపుకోవాలని చూస్తాడు. అది అతని నిస్సహాయత. ఆ దయనీయ స్థిలో ఒక్క కేజ్రీవాల్‌ తటస్థపడితే సమాజగతే మారిపోతుంది.మరిచి పోవద్దు. ఈ దేశ స్వాతంత్య్రానికి ఓ అర్థరాత్రి దక్షిణాఫ్రికాలో ఓ మారుమూల స్టేషన్లో ఓ వ్యక్తికి జరిగిన అవమానం మొదటి పునాది రాయి వేసింది. ఆ వ్యక్తి పేరు మహాత్మా గాంధీ.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.