Main Menu

Gollapudi columns ~ Oka Neram Oka Nirupana(ఒక నేరం ఒక నిరూపణ)

Topic: Oka Neram Oka Nirupana(ఒక నేరం ఒక నిరూపణ)

Language: Telugu (తెలుగు)

Published on: Dec 23, 2013

Oka Neram Oka Nirupana(ఒక నేరం ఒక నిరూపణ)     

ఈ మధ్య మన దేశంలో రెండు అపురూపమైన సంఘటనలు జరిగాయి. శంకర రామన్‌ హత్యకేసులో అరెష్టయి నూరు రోజులు జైలులో ఉన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ స్వామి మీద నేరం రుజువు చేయలేకపోయారని పుదుచ్చేరి కోర్టు కేసు కొట్టివేసింది.

ఆయనతోపాటు అభియోగం మోపిన 23 మందినీ కోర్టు నిరపరాధులని పేర్కొంది. నిజానికి 24 మంది మీద కేసు పెట్టారు. మరి 24వ ముద్దాయి ఎవరు? కదిరవానన్‌ అనే ముద్దాయి. ఆయన్ని ఆరేళ్ల కిందట నరికి చంపారు. శంకరరామన్‌ని కూడా నరికి చంపారు. (ఈ నేరంలో పద్ధతి ఒకే నేరస్థుడి పట్ల వేలుచూపిస్తోందా?) ఇప్పుడు కంచి స్వామిని అరెస్టు చేయించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఆయనకి క్షమాపణ చెప్పాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. నేను 33 సంవత్సరాలుగా ఈ కాలమ్‌ రాస్తున్నాను. నాకు సీనియర్‌ మాలతీ చందూర్‌ వెళ్లిపోయారు కనుక -ఈ రచనలో నేనే బతికున్న సీనియర్‌ని. ఈ మాట చెప్పడానికి కారణం ఈ కాలమ్‌ చరిత్రలో అంత ఆవేశంగా నేను కాలమ్‌ రాసిన గుర్తులేదు. ఈ సందర్భంలో ఆ కాలమ్‌ని మళ్లీ పాఠకులు చదవడం న్యాయమని నాకనిపిస్తోంది. ఈ దేశంలో హత్యలు చేసిన సినీతారలు జైళ్లకు వెళ్లకుండా కోట్లు ఖర్చుచేసి ఆసుపత్రులనుంచి ఇళ్లకు వెళ్తారు.

సల్మాన్‌ ఖాన్‌ అమ్మాయిలతో అడవులకు వెళ్లి చెయ్యకూడని పనులు చేసి, చంపకూడని పక్షుల్ని చంపితే -ఆయన ఒకరోజు జైలుదాకా వెళ్లడాన్ని పత్రికలు నెత్తిన పెట్టుకుని -అదేదో ఈ దేశానికి పట్టిన అనర్థం లాగ మోశాయి. లల్లూ ప్రసాద్‌ అనే గడ్డితిన్న రాజకీయ నాయకుడు జైల్లో ఉంటే జైలులో వారి జీవితం ఎలా సాగుతోందో పాత్రికేయులు మనకి కథలుగా చెప్పి మనల్ని ధన్యుల్ని చేశారు. జగన్మోహనరెడ్డిగారి జైలు జీవితాన్ని మనకి పత్రికలు అద్భుతంగా అభివర్ణించాయి. నిజాయితీని అటకెక్కించి, ఆసక్తిని అమ్మకానికి జర్నలిజం పెట్టి చాలాకాలమయింది. అదీ మన దౌర్భాగ్యం. జయేంద్ర సరస్వతి అరెస్టు రోజున పత్రికలు గొంతు చించుకోలేదు. కంచిస్వామి తలవొంచుకుని ఆనాడు జైలుకి వెళ్లి నూరురోజులు ఉన్నారు. ఇది మన పొరుగు ముఖ్యమంత్రిగారి నిర్వాకం. ఆ రోజు చాలామంది భోజనాలు చెయ్యలేదు. ఈ దేశంలో మరో ముఖ్యమంత్రి కరుణానిధి, ఆమె కొడుకులూ, కూతుళ్లూ, మేనళ్లుళ్లూ దేశాన్ని దోచుకుతింటున్నారని, ఆయన పదవిలో ఉంచిన మంత్రి లక్షా డెబ్బై కోట్లని పంచాడని రుజువులొచ్చినా -ఈ ముఖ్యమంత్రి ఏమీ చెయ్యలేకపోయింది. కంచి స్వామిని విమానంలో తీసుకువెళ్లి జైలులో ఉంచారు. ఈ దేశంలో రాజకీయ నాయకుల బలం, జులుంకీ -2000 సంవత్సరాల చరిత్ర ఉన్న స్వామి చూపిన ధర్మ నిరతికీ వ్యత్యాసం చెప్పకపోయినా తెలుస్తూనే ఉంటుంది. ఇవాళ ఈ కాలమ్‌ రాయడానికి కారణం -ఒక పొరుగు రాష్ట్రపు న్యాయస్థానం స్వామి నిరపరాధిగా తీర్పు ఇవ్వడం.

పాఠకులకు గుర్తుంటే స్వామి నేరాన్ని నిరూపించే సాక్ష్యాన్ని అలనాడు ఇచ్చిన రవి సుబ్రహ్మణ్యాన్ని ఆనాడు అరెస్టు చెయ్యలేదు -అప్రూవర్‌ అయిన కారణానికి. అలనాడు అప్రూవర్‌ బురఖా జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి. సరిగ్గా అయిదు సంవత్సరాల తర్వాత రవి సుబ్రహ్మణ్యం -తన కథని మార్చేశాడు. ఇప్పుడిక నూరురోజుల స్వామి జైలు శిక్షకి ఎవరు సమాధానం చెప్తారు? శిక్ష అనుభవింపజేశాక నిర్దోషిత్వాన్ని తీర్పుగా చెప్పడం ఈ దేశపు న్యాయస్థానాలకి తీరని మచ్చ.

పదిమంది నేరస్థుల్ని విడిచిపెట్టినా ఒక్క నిర్దోషికి అన్యాయం జరగరాదన్న బ్రిటిష్‌ న్యాయవ్యవస్థ సూత్రాన్ని మన న్యాయ వ్యవస్థ అటకెక్కించి చాలారోజులయింది. నిన్ననే మాజీ అటార్నీ జనరల్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ రంకు గురించీ, ఆ మహానుభావుడిని పత్రికలు నేరస్థుడని దుయ్యపట్టడాన్ని ఖండిస్తూ -ఒక వ్యక్తిమీద అభియోగం నేరనిరూపణ కాదు. అప్పటి అరెస్టు కేవలం అతను సాక్ష్యాధారాలను, పరిశోధనను వక్రీకరించకుండా నియంత్రించే ప్రక్రియేనన్నారు. భేష్‌. ఆ ప్రక్రియను కంచి స్వామి విషయంలో నూరురోజులు పొడిగించారు. జైలుకి పంపితే అభ్యంతరం చెప్పని స్వామి న్యాయ విచారణను గల్లంతు చేయగల సమర్థుడా? ఆ ముఖ్యమంత్రి, ఆనాటి న్యాయస్థానం పెద్దలు చెప్పాలి. అధికారం నిస్సహాయుడి చేతులు ఎలా విరగదీస్తుందో ఆనాటి సంఘటన రుజువు చేసింది. అదొక్కటే కారణంగా ఆ ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నికలలో ఇంటికి పంపించారు.

మతం సమాజంలో జీవన సరళిని నిర్దేశించే మార్గసూచిగా అనాదిగా ఎందరో మహానుభావులు ప్రతిపాదిస్తూ వచ్చారు. ప్రవక్తలు -శంకరాచార్య, రామానుజులు, గురునానక్‌, రామకృష్ణ పరమహంస, అరవిందుల వంటివారంతా ఆయా కాలాలకు అనుగుణంగా మతాన్ని, వారి మార్గాల్ని సవరిస్తూ, నిర్దేశిస్తూ వచ్చారు. కేవలం మనిషి జీవనాన్ని సజావుగా తీర్చిదిద్దేదే మతం. కాని మన దేశంలో మతం రాజకీయాలలోకి పాకింది. విశ్వాసం ఒక సామూహిక మూర్ఖత్వంగా, మెజారిటీగా, హక్కుగా, అవకాశంగా మారింది. అది దురదృష్టం. ఆసారాం బాపూలు, నిత్యానంద స్వామి వంటి స్వాములు ప్రజల విశ్వాసాలను తప్పుతోవలు పట్టించే అవకాశవాదులయి -ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు.

రాజకీయాలలో కూడా ఈ భ్రష్టతని మరింత ఎక్కువగా ప్రతిదినం చూస్తున్నాం. ఒకప్పుడు ఈ దేశంలో అవినీతిని త్రవ్వి బయటపెట్టడంలో సవాలుగా నిలిచిన తెహల్కా అధిపతి -బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని నిరూపించాడు. 2000 నాటి క్రికెట్‌ మాచ్‌ ఫిక్సింగు గూడుపుఠాణీ, బంగారు లక్ష్మణ్‌ కేసు వంటివి అనూహ్యమైన సాధనలు. అయితే తన కూతురు వయస్సున్న, తన కూతురు స్నేహితురాలితో జరిపిన ముచ్చట ఒక గొప్ప వ్యవస్థకి గొడ్డలిపెట్టు. ఈ రెండు సంఘటనలూ ఒకే వారంలో జరగడమే ఈ రెంటినీ కలిపి ఉదహరించడానికి కారణం. వ్యవస్థలోనూ, చరిత్రలోనూ ఏ విధంగానూ పొంతనలేని సంఘటనలివి. కంచిస్వామి నిర్దోషిత్వం ఈ దేశంలో కోట్లాది మందికి ఊరట మాత్రమే కాదు. వారి విశ్వాసాలకు మళ్లీ మదింపు.

అరెస్టు వెనుక రాజకీయ దురుద్దేశాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు తవ్వి ప్రయోజనం లేదు. కా ని ఆనాడు కంచిస్వామి పట్ల, ఆయన నిర్దోషిత్వం పట్లా అనేకమందికి గల నమ్మకాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత సాధికారికమైన వ్యవస్థ సమర్థించడం ఒక గొప్ప ఊరట. అవమానానికి నీతి తలవొంచుతుంది. అవినీతి రెచ్చిపోతుంది. ధర్మం తను నమ్మిన దారిలో సజావుగా ప్ర యాణం చేస్తుంది. ఆధర్మం అడ్డుపడి పగబడుతుంది. కంచిస్వామి కథ ముగింపు ఈ నిజాన్నే నిరూపిస్తోంది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.