Main Menu

Gollapudi columns ~ ‘Padma’ Trayam(‘పద్మ ‘త్రయం)

Topic: ‘Padma’ Trayam(‘పద్మ ‘త్రయం)

Language: Telugu (తెలుగు)

Published on: Jan 31, 2011

Padma Trayam('పద్మ 'త్రయం)     

ఒకరు పద్మశ్రీ. మరొకరు పద్మ భూషణ్. ఇంకొకరు పద్మవిభూషణ్ . ఆటా పాటా నటనలకు పెద్ద పీట – వి.వి.యస్. లక్ష్మణ్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, అక్కినేని నాగేశ్వరరావు.
లక్ష్మణ్ అంతర్జాతీయంగా ప్రసిద్ధుడు. మిగతా ఇద్దరూ తొలిదశలో పద్మశ్రీ. తరువాత పద్మభూషణ్. ఇప్పుడు అక్కినేనికి మరొక ఉన్నత గౌరవం – పద్మవిభూషణ్. జీవితమంతా దేశం గుర్తించి సత్కరించే ఉద్ధతికి నిదర్శనాలు.

లక్ష్మణ్ అలుపెరగని వీరుడు. ఊహించని సందర్భాలలో ఆశలు వదులుకున్న ఆటల్లో, ఊహించనంత ఎత్తున నిలిచి, ఊహించని విజయాలని దేశానికి సమకూర్చిన ధీరుడు. విన్ స్టన్ క్రికెట్ ఆల్మనాక్ల్ లో చోటు చేసుకున్నవాడు. 2001 కలకత్తాలో ఆస్ట్రేలియా మాచ్ లో 201 పరుగులు ప్రపంచం నివ్వెరపోయి చూసిన చరిత్ర. కలకత్తాలో 143 పరుగులతో దక్షిణాఫ్రికా జట్టుని విజయానికి అవతలి గడపలోనే నిలిపి దేశాన్ని పులకితం చేసిన సందర్భం. కష్టాల్లో టీంని ఆదుకునే ఆపద్భాంధవుడూ. చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు! వ్యక్తిగతంగా తెలిసినవారికి – అతి సాధువు. దేశాన్నీ, తన టీంనీ ముందు నిలిపి దాని నీడలో గర్వంగా ఒదిగి నిలబడే దేశభక్తుడు. అన్నిటికన్నా ముఖ్యం – ఆటలో సర్వులకూ ఆనందాన్ని పంచే ‘కళాకారుడు ‘. అందుకూ ఈ కాలం లో చోటు. అతని పెళ్ళి శుభాకాంక్షలు పంపాను. వి.వి.యస్. లక్ష్మణ్ కేరాఫ్ హైదరాబాద్ – అంటూ. అందాయి. ఫోన్లో గొంతు వినగానే ఒకే ప్రశ్న – ‘బాగున్నారా? ‘ అంటూ.

ఈ తెలుగు తేజాన్ని గురించి ప్రముఖ బౌలర్ బ్రెట్ లీ అన్నమాటలు తెలుగులో రాయాలని ఉంది కాని, వాటి రుచిని చెడగొట్టడం ఇష్టం లేదు If you get Dravid, great. If you get Sachin, brilliant. If you get Laxman, it is a miracle. అని తన కెప్టెన్ స్టీవ్ వాతో అన్నాడు.

తెలుగువారి గొప్పతనాన్ని గుర్తించడం, గుర్తించేటట్టు చేయడం తెలుగు ప్రభుత్వాలకు రివాజు కాదు. ఆ విధంగా ఈ పద్మశ్రీకి అరుదైన విలువ ఉంది.
ఇక బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్. ఆయన ఇంటింటి పరిమళం. మాధుర్యం. ఆయన పద్మభూషణ్ కి తమిళనాడు కారణం అని విని “అమ్మయ్య. నా ఆలోచన తప్పుకాదు” అని నిట్టూర్చాను. తెలుగు పాటకి 164 సంవత్సరాలుగా – అంటే త్యాగరాజు కాలం నుంచీ, శ్యామా శాస్త్రి కాలం నుంచీ, బాలూ కాలం వరకూ నెత్తిన పెట్టుకున్న ఘనత తమిళులదే. మొన్న పి.సుశీల గారి పద్మ భూషణ్ కీ వారే కారణ. మనం గానగంధర్వుడని చంకలు గుద్దుకునే గాయకుడిని తమిళులు పద్మభూషణుడిని చేశారు. ఆనవాయితీ చెడిపోలేదు.

ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో భాషలలో కవిత్వాన్నీ, సంగీతాన్నీ (తెలుగు, ఇంగ్లీషు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ, ఉర్దూ) సుసంపన్నం చేసిన, చేస్తున్న పి.బి.శ్రీనివాస్ ఇంకా పద్మశ్రీ కయినా నోచుకోలేదని తెలుగు ప్రభుత్వానికి గుర్తున్నదా?

ఏమయినా ఆనవాయితీ ప్రకారం అపురూప గాయకుడికి జరిగిన సత్కారం ప్రతి తెలుగువాడికీ గర్వకారణం.
ఇక అక్కినేని. ఏడు దశాబ్దాల పాటు ఎన్నో తరాల ప్రేక్షకుల్ని అలరించిన అద్భుత నటుడు – అక్కినేనిని సత్కరించడానికి కొత్త ‘అభిజ్న’లను వెదుక్కోవాలి. రఘుపతి వెంకయ్య, కళాప్రపూర్ణ, కాళిదాస్ సమ్మాన్, దాదా సాహెబ్ ఫాల్కే, ఎన్.ట్.ఆర్. సత్కారం. అమ్మయ్య – ఇప్పుడు పద్మవిభూషణ్ ఉన్నది.

కళలో, జీవితంలో అనూహ్యమైన క్రమశిక్షణ passion నీ నిలుపుకున్న కళాకారుడు అక్కినేని. ఈ మధ్యనే నేను సంపాదకత్వం వహించే ‘సురభి ‘లో ఆయన గురించి వ్యాసం రాయడానికి రెండు రోజులు ఆయనతో గడిపాను. వారిపట్ల నా అభిమానం 65 ఏళ్ళు పాతది. వారితో నా సాంగత్యం 47 ఏళ్ళ పాతది. వ్యక్తిగా జీవించడంలో సత్శీలానికి ప్రాముఖ్యాన్నిచ్చి, దాని సరసనే కళని నిలిపిన అతి అరుదయిన కళాకారుడు అక్కినేని. ఈ రోజుల్లో హీరోలు నటనకి ఏ నాలుగో స్థానాన్నో ఇచ్చే నేపధ్యంలో ఆయన తలమానికంగా నిలుస్తారు. ఆ నాలుగు స్థానాలేమిటి? – వ్యాపారం, వ్యాపారం, అమ్మకం, గ్లామర్. ఆ తర్వాతే బతికి బట్టకడితే – నటన. “నటన ఎవడిక్కావాలి పోవయ్యా?” అని నేటి హీరోలు

ఈసడించినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ మాట ఒక దేవదాసు, ఒక కాళిదాసు, ఒక విప్రనారాయణ, ఓ సీతారామయ్యగారిని అనమనండి చూద్దాం.
‘నటుడి’కి ఉండాల్సిన లక్షణాలేమీటో – ముందు తరాలు బేరీజు వేసుకోడానికయినా మనకి ఒక ‘కొలబద్ద’ కావాలి. అదృష్టవశాత్తూ మనకి ఉంది. దాని పేరు పద్మవిభూషణ్ అక్కినేని..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.