Main Menu

Gollapudi columns ~ Rendu Neeralu – Rendu Nyaayalu (రెండు నేరాలు – రెండు న్యాయాలు)

Topic: Rendu Neeralu – Rendu Nyaayalu (రెండు నేరాలు – రెండు న్యాయాలు)

Language: Telugu (తెలుగు)

Published on: Oct 05, 2009

Source Credit: koumudi.net

Audio: Rendu Neeralu - Rendu Nyaayalu (రెండు నేరాలు - రెండు న్యాయాలు)     

రెండు ఆసక్తికరమైన సంఘటనలు ఈ మధ్య జరిగాయి. రెండింటికీ చిన్న పోలిక వుంది. పెద్ద వైరుధ్యముంది. రెండింటిలోనూ నేరం నుంచి పరారి వుంది. సమర్దన వుంది. చెప్పరాని క్లేశముంది. అర్దంలేని ఆత్మవంచన వుంది.

అలనాడు రాజీవ్ గాంధీ మారణహోమానికి జరిగిన గూడుపుఠాణీలో భాగమయి, మారణహోమాన్ని సాధించి, నేరస్థుడితోనే కడుపుచేయించుకుని పిల్లని కన్న నేరస్థురాలు- నళిని- 18 సంవత్సరాల తర్వాత చట్టం ప్రకారం తన యావజ్జీవకారాగార శిక్ష ముగిసిందికనుక విడుదలవడం తన హక్కని- ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తున్న తమిళనాడు ప్రభుత్వం అలసత్వానికి నిరసనగా జైల్లో నిరాహార దీక్ష చేసింది.

31 సంవత్సరాల కిందట అమెరికాలో 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశానని ఒప్పుకున్న గొప్ప నటుడు, దర్శకుడు రొమాన్ పొలాన్ స్కీ- ఈ మధ్య స్విట్జర్లాండు జూరిక్ ఫిలిం ఫెస్టివల్ లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోడానికి వచ్చినప్పుడు అరెస్టయాడు. రేప్ జరిగినప్పుడు అతని వయస్సు 44 సంవత్సరాలు. రేప్ అయినపిల్లకి యిప్పుడు 44 సంవత్సరాలు.

ప్రపంచం అంతా ఒకటయి సానుభూతిని చూపిన సందర్భం – రాజకుమారుడులాంటి రాజీవ్ గాంధీ మారణహోమం. మరికొన్నాళ్ళకి ఆయన నిర్దుష్టంగా ప్రధాని అవుతాడని అందరికీ తెలుసు. తమ రాజకీయ విప్లవంలో పెద్ద పొరపాటు రాజీవ్ గాంధీని హత్య చెయ్యడమేనని శ్రీలంక పులుల సిద్ధాంత వేత్త ఆంటన్ బాలసింగం అనర్ధం జరిగిన ఒకటిన్నర దశాబ్దాల తర్వాత ఆన్నాడు.

నేరాన్ని కోర్టులో ఒప్పుకున్న రొమాన్ పొలాన్ స్కీ అనారోగ్యంకారణంగా మూడు రోజులు వెసులుబాటుని సంపాదించి అమెరికా దాటేశాడు. రోజ్ మెరీ బేబీ, ది పియానిస్ట్ వంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించాడు. పియానిస్ట్ కి ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ లభించినా అమెరికా వెళ్ళలేదు. కాన్ చల చిత్రోత్సవంలో బహుమతిని అందుకున్నాడు.

నళిని కూతురు- 18 ఏళ్ళ అమ్మాయి శ్రీ లంకలో పెరుగుతోంది. భారతీయ చట్టం ప్రకారం విధించిన శిక్షను అనుభవించాను కనుక స్వేఛ్ఛ పొందే హక్కు తనకు ఉందని నళిని వాదన. ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. ఒక నాయకుని హత్యలో భాగస్వామి కనుక ఆమెకి న్యాయస్థానం ఉరిశిక్షని విధించింది.అయితే సోనియా గాంధీ అనే దయార్ధ్ర హృదయిని- అప్పుడామె గర్భవతి కనుక- తన భర్తని చంపినా ఆమెకి శిక్ష తగ్గించాలని విజ్ణప్తిని చేసింది. తత్కారణంగా ఉరిశిక్ష యావజ్జీవ కారాగారశిక్ష అయింది.

భారత దేశపు న్యాయ శాస్త్రం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష అంటే 18 ఏళ్ళు. జైల్లో క్రమశిక్షణ పాటిస్తే శిక్షని తగ్గించే సంప్రదాయం కూడా వుంది.

అయితే ఇలాంటి సౌకర్యాలు అమెరికాలో లేవు. 1968 లో మానవ హక్కుల కోసం పోరాటం సాగించిన అద్భుతమైన ఉద్యమకారుడు మార్టిన్ లూధర్ కింగ్ ని హత్య చేసినందుకు జేమ్స్ ఎర్ల్ రే అనే నేరస్థుడికి న్యాయస్థానం 99 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.(నిజానికి ఎర్ల్ రే నేరస్థుడు కాడని, నిజాన్ని కప్పి పుచ్చే కుట్రలో యితన్ని సాకుగా వాడారని ఒక ప్రతీతి ఉంది. నల్లజాతివారి మీద అమెరికాలో జరిగే ఏ నేరం కూడా యితమిత్ధమని తేలదు. కెనెడీని చంపిన లీ హార్వీ ఆస్వాల్డ్ నోరిప్పే లోగానే చచ్చిపోయాడు. రాబర్ట్ కెనెడీని చంపిన హంతకుడు నోరిప్పలేదు. తమ అక్కసు తెర్చుకోవడం, చరిత్ర పుటల్ని మూయడం తెల్ల నేరస్థులకి వెన్నతో పెట్టిన విద్య) విచిత్రమేమిటంటే సోనియా గాంధీలాగే ఎర్ల్ రే శిక్షను రద్దు చేయాలని మార్టిన్ లూధర్ సతీమణి కొరెట్టా స్కాట్ కింగ్ అప్పట్ల్ ఉద్యమం జరిపారు.

ఒక మహానుభావుడిని చంపిన ఒక మామూలు నేరస్థురాలు. ఓ మామూలు అమ్మాయి మీద అత్యాచారం జరిపిన ఓ మహానుభావుడు. శిక్ష అనుభవించి స్వేఛ్ఛ తన హక్కని వాదించే నేరస్థురాలు.శిక్షని తప్పించుకుని- గొప్ప కళాఖండాల్ని సృష్టించి- తీరా దొరికిపోయిన నేరస్థుడు- రెండూ రెండు రకాలయిన ఉదాహరణలు.

నేను రొమాన్ పొలాన్ స్కీని చూసాను- దాదాపు 40 ఏళ్ళ క్రితం బెంగులూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో. ఆయన “కుల్ డి శాక్”సినీమా చూసి దిగ్భ్రాంతుడునయాను. చాలా అందమయిన నటుడు పొలాన్ స్కీ. నాలాగే పొడుగయిన ముక్కు. ఆయన నటించిన చిత్రమూ చూసాను. ఆయన పత్రికా సమావేశంలో పాల్గొన్నాను.

ఈ రెండు సంఘటనలలోనూ సామాన్య గుణం ఒకటి వుంది. 18 సంవత్సరాలు గడిచాక తన నేరానికి ప్రక్షాలన జరిగి, తాను పవిత్రురాలయి, పదిమందిలాగ బతికే అవకాసాన్ని సంపాదించుకున్నానని నళీని ఉద్దేశం. ఉద్దేశమే కాదు- తన హక్కు అని ఆమె వాదన.

30 ఏళ్ళు గడిచినా, ప్రపంచాన్ని మెప్పించే కళాఖండాల్ని సృష్టించినా చేసిన పాపానికి నిష్కుతి శిక్షని అనుభవించడమేనని న్యాయవ్యవస్థ- ముఖ్యంగా అమెరికా న్యాయవ్యవస్థ ఉద్దేశం.

నళిని చేసిన అద్భుతమైన చర్య కారణంగా -కేవలం రాజీవ్ గాంధీ మాత్రమే కాక మరో 18 మంది దారుణంగా మరణించారు. తమిళ పులుల కక్షతో ఏ విధంగానూ సంబంధం లేని ఈ అనామకుల అనవసర, అనూహ్యమయిన మరణం కాలం గడుస్తున్న కొద్దీ ఆయా కుటుంబాల్ని మరింత దారుణంగా తయారు చేస్తాయి.

కాలం నేరానికి కాల దోషం పట్టిస్తుందని నేరస్థుడి వాదనయితే- కాలం గడుస్తున్నకొద్దీ నష్టపోయిన వారి దీన, హీన స్థితి మరింత దుర్బరమూ దయనీయమూ అవుతుంది. రాజీవ్ గాంధీ మారణహోమంనాడు ఆయనకు దగ్గర్లో ఉన్న పాపానికి చచ్చిపోయిన ఏలుమలై కొడుకు తండ్రి వుంటే డాక్టరయేవాడేమో! తండ్రి పోవడం వల్ల తల్లి వంటపని చేసుకుని కొడుకుని గుమాస్తాగా చేయగలిగిందేమో! ఈ దారుణాన్ని ఆ కుటుంబం జీవితాంతం మర్చిపోలేదు. ఇది ఒక కుటుంబం కధ అయితే మనకు తెలీని 18 కధలున్నాయి. వారేనాటికీ హంతకుల్ని క్షమించలేరు.

అలాగే రొమాన్ పొలాన్ స్కీ నేరాన్ని- నష్టపోయిన ఈనాటి 44 ఏళ్ళ స్త్రీ మానసిక స్థితితో, ఆమె కోల్పోయిన మనశ్శాంతితో బేరీజు వెయ్యాలి.

నేరాలు క్షణికాలు. ఆకస్మికాలు. కాని వాటి పర్యవసానాలు శాశ్వతం, పరివ్యాప్తం, సమగ్రం. నేరం ఒకరికి జ్ణాపకం. మరొకరికి వెంటాడే పీడకల.

నళినికీ, పొలాన్ స్కీకీ వారి దుశ్చర్యల పర్య్వసానాన్ని నిర్దారించే, నిర్నయించే హక్కులేదు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.