Main Menu

Gollapudi columns ~ S. Varalakshmi Asthamayam ( ఎస్.వరలక్ష్మి అస్తమయం )

Topic: S. Varalakshmi Asthamayam (ఎస్.వరలక్ష్మి అస్తమయం)

Language: Telugu (తెలుగు)

Published on: Sep 28, 2009

Source Credit: koumudi.net

Audio: S. Varalakshmi Asthamayam (ఎస్.వరలక్ష్మి అస్తమయం)     

“బాలరాజు’ సినీమాని నా తొమ్మిదో యేట మా అమ్మ వొడిలో కూర్చుని చూశాను విశాఖపట్నం మంగరాజుగారి పూర్ణా హాలులో. అది ఎస్.వరలక్ష్మిగారి మొదటి సినీమా. ఆ రోజుల్లో సినీమా అంటే ఓ వింత ప్రపంచంలోకి తొంగి చూడడం లాంటిది. నటీనటులు ఏ గంధర్వ లోకం నుంచో దిగివచ్చినట్టు అబ్బురంగా వుండేది. విభ్రమంతో, చొంగలు కారుతూ ప్రేక్షకులు చూసేవారు. వారిలో ఓ తొమ్మిదేళ్ళ కుర్రాడూ ఉన్నాడు.

మరో పద్నాలుగేళ్ళ తర్వాత ప్రారంభమయి- దాదాపు బాలరాజులో పనిచేసిన అందరితోనూ సాహచర్యం లభించింది నాకు. అది జీవితం అల్లిన అందమయిన పడుగు పేకల జవుళి. నా రేడియో ఉద్యోగంలో ఒక పాట నన్నెప్పుడూ వెన్నాడుతూండేది. బాలాంత్రపు రజినీకాంతరావుగారి రచన. వరలక్ష్మిగారి గొంతు. “ఊపరె ఊపరె ఉయ్యాల, చిన్నారి పొన్నారి ఉయ్యాల’’- అదీ. ఎన్నిసార్లు విన్నానో! నేనూ నా ధోరణిలో పాడుకునేవాడిని.

నాకంటె వరలక్ష్మిగారు 14 సంవత్సరాలు పెద్ద. జీవితంలో వైచిత్రి ఏమిటంటే మేమిద్దరం భార్యాభర్తలుగా కనీసం మూడు చిత్రాలు చేసిన గుర్తు. “శ్రీవారు’లో తొలి సన్నివేశం మరీ రుచికరమైనది. నేను భార్యా విధేయుడిని. ఓ భక్తురాలు శ్లోకాలు చదువుతోంది. పూజ అయాక “ఏవండీ’ అని గావుకేక పెట్టింది. రెండు కాళ్ళు భయంభయంగా వచ్చాయి. మెట్లున్న చిన్న వేదిక మీదకు ఎక్కమంది. శ్రమ లేకుండా భర్త కాళ్ళకి నమస్కరించి తరించింది ఆ పతివ్రతా రత్నం. ఆమె వరలక్ష్మి. నేను భర్త. అదీ సినీమాలో మా యిద్దరి పరిచయం.

ఆవిడకి రేడియో పాటని గుర్తు చేశాను. కాని జ్ణాపకం రాలేదు. ఎప్పటి పాట! 40 ఏళ్ళు పైన గడిచిపోయాయి. జీవితంలో ఎన్నో అనుభూతులు ముసురుకున్నాయి. సాహిత్యం గుర్తు చేశాను. నా ధోరణిలో పాడి వినిపించాను. అందుకుని మెల్లగా అన్నారు. ఇలాంటి సందర్బం కలిసివస్తుందని ఊహించనివాడిని. పొంగిపోయాను. షాట్ కీ షాట్ కీ మధ్య ఆవిడని బతిమాలి పద్యాలో పాటలో పాడించుకునేవాడిని. మూడ్ వున్నప్పుడు పాడేవారు.

గాయనీమణులు సుశీల, జానకి,చిత్ర పద్యం చదివినా, పాటపాడినా మధురంగా వుంటుంది. సందేహం లేదు. కాని వరలక్ష్మమ్మగారు పద్యం చదివితే అందులో నాటకీయత ఉట్టిపడే గమకం తెలుస్తూంటుంది. ఈ గుణం కొంతలో కొంత పి.లీల గొంతులో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ బేస్, రేంజ్ ఆమెకే ప్రత్యేకం. ఇంతకు మించి నేనేం చెప్పినా మిత్రులు వి.ఏ.కె.రంగారావుగారు నా మీదకి దూకుతారు. ఉత్తరమయినా రాస్తారు. లేదా ఇంటికొచ్చి తగాదా పెట్టుకుంటారు.

నేను నటించే సినీమాలో కలిసేటప్పటికి ఆమె జీవితంలో చాలాభాగం గడిచిపోయింది. ఏదో పిలిచారు కనుక- వేసే వేషాలు. లేదా ఎంతో కొంత ఆదాయం కలిసివస్తుందనో. షూటింగ్ కి ఆమె యింటికి వెళ్ళి కారెక్కించుకునేవాడిని. “నా జీవితమే పెద్ద సినీమా మారుతీరావుగారూ” అనేవారావిడ. నా కంటె సీనియర్ కనుక, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కనుక ఆ జీవన విషాదాన్ని కావాలనే తాకేవాడిని కాదు.

రావుగోపాలరావుగారింట్లో వారి శ్రీమతి దేవీ నవరాత్రుల పూజలు జరిపేవారు. అక్కడికి వరలక్ష్మిగారు వచ్చినప్పుడు మా ఆవిడ కలుసుకుంది. కాంభోజిలో దీక్షితార్ కీర్తన్ “మరకతవల్లీం” అద్భుతంగా పాడారట. “నేను మీ ఫాన్ నమ్మా” అని మా ఆవిడ మురిసిపోతే “నేను మీ ఆయన ఫాన్ ని” అన్నారట. ఈ మాటని పదే పదే గుర్తు చేసుకుని గర్వపడుతూంటుంది మా ఆవిడ.

ఒకప్పుడు త్యాగరాజ భాగవతార్ తో, శివాజీతో, ఎన్టీ ఆర్ తో ఆమె నటన, పాడిన పాటలు చిరస్మరణీయాలు. 1947 లో పలనాటి యుద్ధంలో మాంచాల, 1954 నాటి సతీ సక్కూబాయి, 1957 నాటి సతీ సావిత్రి, మహామంత్రి తిమ్మరసు, వీరపాండ్య కట్టబొమ్మన్, వేంకటేశ్వర మహాత్మ్యం వంటి చిత్రాలతో తెలుగు, తమిళ, కర్ణాటక దేశాలలో అపూర్వమైన ఖ్యాతిని ఆర్జించారు. ఈ తరం నటీమణులకు- ఆమాటకి వస్తే- నటులకు కూడా అర్ధంకాని గొప్ప screen presence ఆమెది. అది ఒక aura. ,

కీర్తికి కూడా ఒకొక్కప్పుడు కాలదోషం పడుతుంది. ఒక చిన్న సందర్భం గుర్తొస్తుంది. ఓసారి షూటింగ్ నుంచి ఇంటికి వస్తున్నాం. ఉన్నట్టుండి తేనాంపేట జంక్షన్ దగ్గర కారుని నిలిపేశాడు పోలీసు. కారు తప్పుతోవలో వచ్చింది. డ్రైవర్ ని పోలీసు నిలదీస్తున్నాడు. కారులో వరలక్ష్మమ్మగారు కనిపిస్తూనేవున్నారు. ఆమె తమిళనాడులో ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించిన విదుషీమణి. ఆవిడ సమాధాన పరచబోతున్నారు. కాని పోలీసు డైవర్ తోనే మాట్లాడుతున్నాడు. రెండు గజాల దూరంలో వున్న వ్యక్తిని విస్మరించడం, గుర్తు పట్టనట్టు మాట్లాడడం మహానుభావులకీ, పోలీసులకే సాధ్యం. కాకపోతే ఆమె ప్రఖ్యాతిని తెలియని కుర్ర వయస్సువాడయినా అయి వుండాలి. ఉన్నట్టుండి వరలక్ష్మిగారు పదిరూపాయల నోటు తీసి పోలీస్ చేతిలో పెట్టారు. అంతే. బంజరులో పచ్చదనంలాగ అతని ముఖం మీద చిరునవ్వు మొలిచింది. కారు కదిలింది. ,

కీర్తిది దుర్మార్గమయిన రుచి. నిరుపరాయ్ కీ, ఐశ్వర్యారాయ్ కీ కాలం ఆ రుచిని వేర్వేరుగా పలకరిస్తుంది. కాని డబ్బు రుచి ఏనాటికీ మారాదు.

ఆ మధ్య వరలక్ష్మమ్మగారు అయ్యప్పస్వామి గుడి దగ్గర యింటికి మారారని విన్నాను. వై.జి.మహేంద్ర ఏదో సభలో ఆనాటి నటీమణులందరినీ ఒక వేదిక మీద కలిపాడు. వరలక్ష్మమ్మగారిని కలుసుకొందామని ఫోన్ చేశాను. ఎవరో తమిళం మాత్రమే తెలిసిన గొంతు ఫోన్ ఎత్తింది. నా గురించి చెప్పాను. ఆవిడ ఆరోగ్యం బాగులేదన్న విషయం తెలిసింది. ఎప్పుడు కలవొచ్చు? సమాధానం నా కర్ధం కాలేదు. నా “తెలుగు పరపతి’ ఆ తమిళ గొంతుకి అందలేదు.

నా చిన్నతనంలోనే వెండి తెరమీద బంగారు పంటలు పండించిన ఓ విలక్షణమయిన నటీమణి, గొంతులో నాటకరంగపు హుందానీ, మాధుర్యాన్నీ నిలుపుకున్న నటీమణి బతికుండగానే ఈ తరానికి దూరమయింది. 22 సెప్టెంబరున కేవలం జ్ణాపక మయిపోయింది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.