Main Menu

Gollapudi columns ~ Samasyaki Shashtipoorthi (సమస్యకి షష్టిపూర్తి)

Topic: Samasyaki Shashtipoorthi (సమస్యకి షష్టిపూర్తి)

Language: Telugu (తెలుగు)

Published on: Oct 04, 2010

Samasyaki Shashtipoorthi (సమస్యకి షష్టిపూర్తి)     

చిన్నప్పుడు – క్లాసులోఇద్దరు కుర్రాళ్ళం దెబ్బలాడుకునేవాళ్ళం. దెబ్బలాటకు మా కారణాలు మాకుండేవి. మేం ఆశించే న్యాయమూ మా మనస్సులో ఉండేది. ఈలోగా మేష్టారు వచ్చేవారు. దెబ్బలాటకి కారణం అడిగేవారు. అంతా విని ఇద్దరికీ మొట్టికాయ వేసి – ఇలా చేయండనేవారు. అంతే. చచ్చినట్టు అలాగే చేసేవాళ్ళం. ఇక తగాదాలేదు. దానికి అప్పీలు లేదు. కారణం – మా మేష్టారుదే అంతిమ తీర్పు. ఎందుకంటే ఆయన మేష్టారు కనుక. మొట్టికాయ చక్కని ప్రతిఫలం.

అవకాశం ఉన్నప్పుడు – సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవడం – సంస్కారానికి సంబంధించిన విషయం. ఇచ్చిపుచ్చుకోవడంలో హెచ్చుతగ్గుల్ని సవరించుకోవడం ఔదార్యానికీ, విచక్షణకీ సంబంధించిన విషయం. మేం తేల్చుకోం, మీరేం చెప్పినా శిరసావహిస్తామనడం – మేష్టారి మొట్టికాయకి సిద్దపడడం. తిరుగులేని, ఎదిరించలేని, ఎదురు చెప్పలేని అధికారానికి లొంగడానికి ‘సంస్కారం ‘ ప్రమేయం లేదు. పోలీసువాడి లాఠీకి తలవొంచిన నేరస్థుడికి ‘గెలుపు’ ప్రసక్తిలేదు. అలాంటిది నిన్నటి అలహాబాదు తీర్పు.

ఇందులో రెండు గొప్పతనాలున్నాయి.’తీర్పు’ ఏదయినా శిరసావహిస్తామని అన్ని మతాలవారూ అంగీకరించారు. సామరస్యంగా పరిష్కరించుకుంటారా అంటే అన్ని మతాలవారూ వ్యతిరేకించారు. అందరూ తీర్పే కావాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. తీరా తీర్పు వచ్చాక – మేష్టారి మొట్టికాయలాగ – అందరూ తలోవైపుకి చూస్తూ – తలతడువుకున్నారు. అవకాశం ఉంది కనుక సుప్రీం కోర్టుకి వెళతామన్నారు. దీనికి ‘పెద్ద’ మనస్సు అక్కర లేదు.

ఒవైసీగారు 60 సంవత్సరాల వివాదాన్ని చక్కని మాటల్లో వివరించారు. ‘మా హక్కు కోసం మేం పోరాడుతాం. రేపు సుప్రీం కోర్టు ఆ స్థలమంతా రామ జన్మభూమికి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం’ అన్నారు. అంటే – దె బ్బలాటని మేం ఆపం. మరో మేష్టారి మొట్టికాయకి మేం సిద్ధం – అని దాని తాత్పర్యం.

“మీరు ఎవరితో పోరాటం చేస్తున్నారు? తీరా చేసి సాధించేదేమిటి?” అని జావేద్ అఖ్తర్ అనే మితవాది ప్రశ్నించారు. దానికి సజావయైన సమాధానం లేదు.

ఏతావాతా, నిన్నటి అలహాబాదు తీర్పువల్ల ఎవరూ పూర్తిగా తృప్తిచెందలేదు. ఎవరూ పూర్తిగా అసంతృప్తీ వెందలేదు (ఒవైసీ లాంటివారు తప్ప). ఫలితం – దేశంలో ఎక్కడా అలజడులు జరగలేదు. దౌర్జన్యాలు జరగలేదు. హింస చెలరేగలేదు. దీనికి ‘మానసిక పరిపక్వత’ అని నేటి తరం రాజకీయ నాయకులు పేరు పెట్టారు కాని – 2.77 ఎకరాల్లో రాముడు ఉండాలా, అల్లా ఉండాలా అని కొట్టుకు చావడం కంటే ముఖ్యమైనవీ, అవసరమయినవీ, తేల్చుకోవలసినవీ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చాలా ఉన్నాయని ప్రజలు భావించడం. ఏమయినా అది మొదటి సత్ఫలితం.

ఇలాంటి తీర్పు ఇచ్చే హక్కు ఈ న్యాయస్థానానికి లేదని కొందరు గొప్పన్యాయవేత్తలు జుత్తు పీక్కొన్నా – అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తులు ముగ్గురూ – కేవలం చట్టాన్ని, 500 సంవత్సరాల చారిత్రక, భూగర్భ పరిశోధనలనీ, మీర్ బక్షీ చేసిన బాబ్రీ మసీదు నిర్మాణం, షియా ముస్లి నిర్మించిన మసీదుని సున్నీ వక్ఫ్ బోర్డ్ హక్కని వాదించడాన్ని – ఇలాంటి వన్నీ పరిగణలోకి తీసుకున్నా – వీటన్నిటినీ అధిగమించి, కేవలం చట్టాన్ని మాత్రమే కాక, 2010లో ఈనాటి సమాజ శ్రేయసునీ, అవసరమైన మత సామరస్యాన్నీ దృష్టిలో పెట్టుకుని సాహసోపేతమయిన, అతి వాస్తవికమయిన మార్గాంతరాన్ని సూచించారు.

ఈ పని చేసింది ‘మేష్టారు’ అయినా – ఆ పైన మరో పెద్ద మేష్టారు ఉన్నారు కనుక – ఈ తీర్పు విన్నాక – దేశంలో ఎందరో పెద్దలు, నాయకులు – సామరస్యంగా పరిష్కరించుకోడానికి ఇది చక్కని ప్రాతిపదిక అన్నా – అందరూ సుప్రీం కోర్టుకి ఎక్కడానికి సిద్ధపడుతున్నారు.

కాలం, జీవన విధానం – మారుతున్న తరాల దృక్పధంలో మార్పును తెచ్చాయి. ఈ తీర్పు అందరూ భయపడినట్టు ఆందోళనకి దారి తీయలేదు. కొందరు ఆనందించినా – మొట్టికాయకు సిధ్ధపడిన కుర్రాళ్ళలాగ కొందరు, తేలుకుట్టిన దొంగల్లాగ కొందరు దిక్కులు చూస్తునారు.

రేపు ‘పెద్ద మేష్టారు’ ఇంతకంటే గొప్ప తీర్పు చెపుతాడని కాదు. రెండు కారణాలకి రెండు మతాలవారికీ ఆ తీర్పు తృప్తినిస్తుంది. 1. అంతకన్న మరో గత్యంతరం లేదు కనుక. 2. ఆ పైన మరే మాష్టారూ లేరు కనుక.

రాజకీయ నాయకులులకీ, మత ఛాందసులకి ‘సామరస్యం’ అన్నది బూతుమాట. కాని గుడులూ, మసీదులూ తమతమ విశ్వాసాలకి అద్దం పడుతున్నా – తమ మానాన తాము జీవనాన్ని గడుపుకునే సామాన్య ప్రజానీకానికి ఇది చద్దిమూట

***

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.