Main Menu

Gollapudi columns ~ Sangeetaniki Ellalunnayi(సంగీతానికి ఎల్లలున్నాయి)

Topic: Sangeetaniki Ellalunnayi(సంగీతానికి ఎల్లలున్నాయి)

Language: Telugu (తెలుగు)

Published on: Sep 02, 2013

Sangeetaniki Ellalunnayi(సంగీతానికి ఎల్లలున్నాయి)     

ఇద్దర్ని దర్శించుకోడానికే నేనూ, మా ఆవిడా చాలా సంవత్సరాల క్రితం వారణాశి వెళ్లాం. కాశీవిశ్వేశ్వరుడిని, భారత రత్న ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ని. ఇద్దరిముందూ సాష్టాంగపడి నమస్కారాలు చేశాం. బిస్మిల్లాఖాన్‌ కి అత్యంత శ్రద్ధాభక్తులతో శాలువా కప్పాను. లలిత కళలకీ ముస్లింలకీ అవినాభావ సంబంధం. చిత్రకళ, కవిత్వం, సంగీతం, అభిరుచి, అందం -అన్నింటిలోనూ వారికి ప్రథమ తాంబూలం. అది వారి గొప్ప అదృష్టం. సమాజంలో అందరికీ గొప్ప అవకాశం.

కాగా, ముస్లిం ఛాందసుల దృష్టిలో మతంలో వీటిలో వేటికీ స్థానం లేదంటారు. ఇది ఆశ్చర్యకరం. అనూహ్యం. కె.అసిఫ్‌ ”మొగల్‌ -ఏ-ఆజమ్‌”, యూసఫ్‌ఖాన్‌ (దిలీప్‌కుమార్‌) సలీం, నౌషాద్‌ సంగీతం, బడే గులాం ఆలీఖాన్‌ తుమ్రీ -వీటన్నింటిలోనూ దేవుడు లేకపోతే -ఆయన ఎక్కడ దాగొన్నట్టు!

మహ్మద్‌ రఫీ గొంతులో లేకుండా ఈ దేవుడు ఎలా తప్పించుకుంటాడు? తలత్‌ మహమ్మద్‌ గజల్‌లో, మీర్జాగాలిబ్‌ సాహిత్యంలో, ఉమర్‌ ఖయ్యాం సూఫీ తత్వంలో, మెహదీ హసన్‌ పాటలో, గులాం ఆలీ గొంతులో, బేగం అఖ్తర్‌ ఖయాల్‌లో, అల్లావుద్దీన్‌ ఖాన్‌ దాద్రాలో, నర్గీస్‌ సౌందర్యపు ఠీవిలో -వీటన్నిటిలో కనిపించని దేవుడు ఏం చేస్తున్నట్టు? బిస్మిల్లా ఖాన్‌కి నేనెవరో తెలీదు. తెలిసే అవకాశం లేదు. తెలియాల్సిన అవసరమూ లేదు. నేను పద్మభూషణ్‌ పినాకపాణిగారి అన్నగారి అల్లుడినని -ఆయనకి అర్థమయే గొప్పతనాన్ని ఎరువు తెచ్చుకుంటే ఆయన తెల్లమొహం వేశారు. బహుశా ఆయన పినాకపాణి పేరు కూడా వినలేదేమో! ఇంకా విశేషమేమిటంటే గంట తర్వాత నేను శలవు తీసుకోడానికి లేస్తే -కాస్త సిగ్గుపడుతూ ‘మీ పేరేమిట’ని అడిగారు! లౌకికమయిన గుర్తులు ఆయన మనస్సు పరిధివరకూ కూడా పోలేదు!

వారింటినుంచి కాశీవిశ్వనాధుడి ఆలయం కూతవేటుదూరం. స్వామిని ఎప్పడయినా దర్శించుకుంటారా? అని అడిగాను. ”ప్రతిరోజూ పలకరిస్తాను” అన్నారు. ‘ఎలా?’ అని నా ప్రశ్న. వెంటనే ఆ వృద్ధాప్యంలోనే ఆలాపన ప్రారంభించారు. ‘ఏ రాగం?’ అన్నాను. బిలావల్‌ అన్నారు. అంటే కర్ణాటక సంగీతంలో శంకరాభరణం! ఆ మధ్య మా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ బహుమతి పురస్కార సభకి ప్రపంచ ప్రఖ్యాత సరోద్‌ విద్వాంసులు పద్మ విభూషణ్‌ ఉస్తాద్‌ అంజాద్‌ ఆలీ ఖాన్‌ని ఆహ్వానించాం. అలాంటి మహానుభావుల సమక్షంలో నిలిచినందుకే వొళ్లు పులకరిస్తుంది. ఇంకా మరిచిపోలేని సంఘటన ఏమిటంటే -ఆనాడు ఆయన కారు దిగగానే వెళ్లి పాదాభివందనం చెయ్యబోయాను. అంతే. వెంటనే ఆయన వొంగి నాకు పాదాభివందనం చేశారు. (ఫొటో చూడండి).

పాండిత్యం అఖండమయిన తేజస్సు. వినయం దాని మొదటి లక్షణం. ఆర్ధ్రత దాని స్వరూపం. నాకు కళ్లనీళ్లు తిరిగాయి. ఆయనకీ తిరిగాయి. ఎక్కడిదీ మత మౌఢ్యం? ఇంత సంపదని భగవంతుడు వారికిస్తే దాన్ని రాజకీయ కారణాలకి అటకెక్కించి మూర్ఖత్వం ఎంత దయనీయం? రేపు కాశ్మీరులో మొట్టమొదటిసారిగా జర్మన్‌ రాయబార కార్యాలయం నేతృత్వంలో ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు రూబిన్‌ మెహతా నిర్వహిస్తున్న బెర్లిన్‌ ఫిల్‌హార్మోనిక్‌ వాద్యసమ్మేళనాన్ని కాశ్మీర్‌ వేర్పాటువాదులు వ్యతిరేకిస్తున్నారు. ఈ సంగీతోత్సవం జరగడానికి వీల్లేదని అడ్డుపడుతున్నారట. కేవలం రాజకీయాల కారణంగా తమ మతంలో సంగీతానికి తావులేదని వీరి వాదన. ”బాబూ! ఈ సృష్టిలో ముస్లింలు లేకపోతే సంగీతంలో ఓ సింహభాగం లేనట్టే” అని ఈ రాజకీయవాదులకి చెప్పాలని నాకనిపిస్తుంది. నామట్టుకు -వీలయితే జుబిన్‌ మెహతా ప్రదర్శనకి పరాయి దేశానికయినా వెళ్లి హాజరుకావాలని అనిపిస్తుంది. రేపు సెప్టెంబరు 5న కేవలం నసీరుద్దిన్‌ షా నాటకం ‘డియర్‌ లయర్‌’ చూడడానికి బెంగుళూరు వెళ్తున్నాను -20 వేలు ఖర్చుపెట్టి. అది నాకు ఆనందం. కొన్ని సంవత్సరాలపాటు కేవలం నాటకాలు చూడడానికే లండన్‌ వెళ్లివచ్చేవాడిని. అది నా అదృష్టం. నేను జర్మనీలో కొలోన్‌ అనే పట్టణానికి వెళ్లాను. న్యాయంగా కొలోన్‌ని ఎవరూ గుర్తుంచుకోనక్కరలేదు. విశాఖ జిల్లాలో ఎలమంచిలి ఎవరిక్కావాలి? -న్యాయంగా. కాని కావాలి బాబూ! కావాలి. కారణం -150 ఏళ్ల కిందట అక్కడ గురజాడ అప్పారావుగారు పుట్టారు. అలాగే కొలోన్‌లో ఒక చిన్న వీధిలో ప్రపంచానికి కొత్త గానానికి మార్గదర్శకుడైన ఒక మహానుభావులు తన జీవితమంతా గడిపాడు. ఆయన బితోవెన్‌. నేను ఆ చిన్న ఇంటికి వెళ్లి మేడమీద గదిలో ఆయన ప్రపంచాన్ని మత్తెక్కించిన సింఫొనీలను సృష్టించిన పియానో ముందు నిలబడి పులకించాను. జీవితంలో విధివైపరీత్యమేమిటంటే -ఆయన సింఫొనీలను ప్రపంచమంతా విని తన్మయులయేనాటికి ఆయన ఏమీ వినలేని చెవిటివాడయాడు! తలుచుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

రేపు కాశ్మీర్‌లో దాల్‌ సరస్సు సమీపంలో జబర్వాన్‌లో జుబిన్‌ మెహతా వాద్యాలతో బితోవెన్‌ ఐదవ సింఫొనీ, బ్రక్నన్‌ ఎనిమిదవ సింఫొనీని వాయిస్తూ కాశ్మీర్‌ లోయలో సంగీత వైభవాన్ని సృష్టిస్తున్నప్పుడు -దశాబ్దాలుగా స్పర్ధలతో, వైషమ్యాలతో, హత్యలతో, కావేషాలతో అతలాకుతలమయిన కాశ్మీర్‌ సేదతీరదా అని అస్మదాదుల ఆలోచన. రాజకీయం మనస్సుల్లో, పరిసరాల్లో, జిల్లాల్లో, ఇళ్లల్లో క్రూరంగా ఎల్లలను నిర్దేశిస్తుంది. కళ వాటితో ప్రమేయం లేని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అయితే జుబిన్‌ మెహతా సంగీత ప్రదర్శనని తిరస్కరించిన మరొక సందర్భం ఉంది. అది 1981లో ఇజ్రేల్‌లో జరిగింది. ఇజ్రేల్‌ రాజధాని తెల్‌ అవివ్‌లో రిచర్డ్‌ వాగ్నర్‌ 19వ శతాబ్దపు సంగీత సృష్టిని ఆవిష్కరిస్తున్నప్పుడు -ఒకప్పుడు నాజీలు ఆ సంగీతాన్ని ఆహ్వానించిన కారణంగా, యాంటీ సెమిటిజమ్‌ పేరిట యూదులు వ్యతిరేకించారు. ఇది రెండవసారి.

రాజకీయాలు కారణంగా కాశ్మీర్‌ అస్తవ్యస్థమయే తరుణంలో -ప్రయత్నిస్తే మరో స్థాయిలో ఒక కళ -సంగీతం అద్భుతమైన సామరస్యానికి తలుపులు తెరవగలదని జుబిన్‌ మెహతా -ఒక సాయంకాలం నిరూపించే సదవకాశాన్ని ముస్లిం ఛాందసులు దుర్వినియోగం చేసుకోరని ఆశిద్దాం. రాజకీయాలూ, స్పర్దలూ సంబంధాలను ప్రయోజనాలకు ముడిపెడతాయి. కాని కళలూ, సంగీతమూ ప్రయోజనాలను మరిపించి సంబంధాలను మరింత సుసంపన్నం చేస్తాయి. ఆలోచన మనుషుల మధ్య అసహ్యకరమైన గీతలు గీస్తుంది. కళ మనసు స్థాయిలో ఆ గీతల్ని చెరిపేసి -అలౌకికమైన స్థాయిలో నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించి అద్భుతమైన సామరస్యానికి తలుపులు తెరుస్తుంది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.