Main Menu

Gollapudi columns ~ Sarikotta Devudi Katha(సరికొత్త దేవుడి కథ)

Topic: Sarikotta Devudi Katha(సరికొత్త దేవుడి కథ)

Language: Telugu (తెలుగు)

Published on: Oct 14, 2013

Sarikotta Devudi Katha(సరికొత్త దేవుడి కథ)     

మా పెద్దబ్బాయి చెన్నెలో ట్రావెల్స్‌ సంస్థని నడుపుతాడు. ప్రతీ రెండు మూడేళ్లకీ పాతబడిన, మరమ్మత్తుకి వచ్చిన కార్లని అమ్మి కొత్త కార్లని కొంటూంటాడు. కాని ఎన్ని ఏళ్ళయినా మార్చని, అమ్మని ఓ పాతకారుండేది. నాకు అర్థం కాలేదు. ”అన్నీ అమ్ముతున్నావు. దీన్ని ఎందుకు అమ్మవు?” అన్నాను. మా అబ్బాయి నవ్వాడు. గర్వంగా సమాధానం చెప్పాడు. చెన్నైలో చీపాక్‌ గ్రౌండుకి ఒకసారి సచిన్‌ టెండూల్కర్‌ ఆ కారులో వెళ్లాడట. అది ఒక గొప్ప అనుభవానికి గుర్తు. ఈ కారు ఒక జ్ఞాపిక. అదీ 41 సంవత్సరాలుగా క్రికెట్‌ని ఆరాధిస్తున్న ఓ భక్తుడి తాదాత్మ్యం.

41 సంవత్సరాలు సచిన్‌ వయస్సు కాదు. మా అబ్బాయి క్రికెట్‌తో ముడిపడిన వయస్సు. నేను హైదరాబాద్‌లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు మా అబ్బాయి పుట్టాడు. నా పని డ్యూటీ ఆఫీసర్‌. అది 1963. వెస్టిండీస్‌ జట్టు హైదరాబాద్‌ ఫతే మైదాన్‌ స్టేడియంలో టెస్టు మాచ్‌ ఆడుతోంది. మా రేడియోకి వందలాది ఫోన్లు వచ్చేవి -క్రికెట్‌ స్కోర్‌ అడుగుతూ.

నాకు ఆటంటే బొత్తిగా అవగాహన ఉండేదికాదు. ఆసక్తీ లేదు. పక్కన ఉన్నవాళ్లని అడిగేవాడిని. 1963 లో ఫతేమైదాన్‌ గ్రౌండులో భారత వెస్టిండీస్‌ మధ్య జరిగిన చరిత్రాత్మకమైన క్రికెట్‌ ఆటని రేడియో ప్రత్యక్ష ప్రసారం జరిగే బాక్స్‌లో ఉండి చూసిన అవకాశం నాది. కాని అది అవకాశమని అప్పుడు తెలీదు. గారీ సోబర్స్‌, డెస్మండ్‌ హేన్స్‌, వెస్లీ హాల్‌, జయసింహ మొదలయినవారు ఆడిన సందర్భం. ఆనాటి వెస్టిండీస్‌ జట్టులో అందరిలోకీ కుర్ర ఆటగాడు క్లైవ్‌ లాయడ్‌! ఒక పెద్ద పోలీసు ఆఫీసర్‌ నారాయణ స్వామి ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. నాతో పనిచేసిన గోపాల కృష్ణ మరార్‌ నాకు జయసింహని పరిచయం చేస్తే యధాలాపంగా తలూపాను. మరి క్రికెట్‌ మీద ఆసక్తి ఎలా కలిగింది? పదేళ్ల మా పెద్దబ్బాయి 30 రూపాయల గేలరీ టిక్కెట్టు కోసం రాత్రంతా చెన్నైలో చీపాక్‌ పేవ్‌మెంటు మీద జాగారం చేసినప్పుడు నేనూ మా ఆవిడా తెల్లవారుఝామున వెళ్లాం కంగారుగా.

30 రూపాయల టిక్కెట్టుతో గర్వంగా ఎదురయాడు మా అబ్బాయి. ఉదయమే 5 గంటలకి అన్నం వండి, చిన్న డబ్బా సర్ది బస్సు దగ్గర దింపి వచ్చేది మా ఆవిడ. గేలరీలో తొమ్మిదిన్నర దాకా నిద్రపోయేవాడట. ఎంపైర్లు వస్తున్నప్పుడు ప్రేక్షకుల హాహాకారాలతో లేచేవాడు. తర్వాత ఆట. అదిగో, అప్పుడూ -మా అబ్బాయి కారణంగా క్రికెట్‌ మీద ఆసక్తి కలిగింది. ఆ ఆటలో జి.ఆర్‌.విశ్వనాథ్‌ 97 పరుగులు చిరస్మరణీయం. క్లైవ్‌ లాయిడ్‌ ఇంటర్వ్యూకి రేడియోకి వచ్చినప్పుడు మా అబ్బాయిని తీసుకెళ్లాను. మరొకసారి ఓ హిందీ నిర్మాత ఇంట్లో సునీల్‌ గవాస్కర్‌, చేతన్‌ చౌహాన్‌ లను కలవడానికి తీసుకెళ్లాను. అవి మా అబ్బాయి జీవితంలో గొప్ప క్షణాలు. తర్వాత నాకూ. సంవత్సరాల తర్వాత కేవలం సచిన్‌ ఆటని చూడడానికి, సాయంకాలం నాతోపాటు వెస్టెండులో ‘మౌస్‌ ట్రాప్‌’ చూసే ఒప్పందం మీద మేమిద్దరం ఇంగ్లండు వెళ్లాం. అది 20 జూన్‌ 1996. ఆ రోజుల్లో మా పక్క సచిన్‌ మామగారు (అంజలి తండ్రి) కూర్చునేవారు. ఆ ఆటలో చిరస్మరణీయమైన సంఘటన సౌరవ్‌ గంగూలీ మొదటి టెస్టు కావడం. అతని సెంచరీ. 40 సంవత్సరాల కిందట -ఓ మహారాష్ట్ర మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మూడో కొడుకుకి వాళ్ల నాన్న తన అభిమాన సంగీత దర్శకుడు సచిన్‌ దేవ్‌ బర్మన్‌ -పేరు పెట్టుకున్నారు. సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌. అల్లరి చిల్లరగా ప్రవర్తించే ఆకతాయి కుర్రాడిని అన్న అజిత్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ అనే మేష్టారికి అప్పగించారు. కుర్రాడిలో అల్లరి ఏకాగ్రత అయి, నైపుణ్యమయి, అసాధారణమయిన ప్రజ్ఞగా రూపుదిద్దారు అచ్రేకర్‌. మరో రెండు గుణాలు సచిన్‌కు వారసత్వంగా వచ్చాయి -వినయం, వివాదాలకు చోటివ్వని ప్రవర్తన.

అకుంఠితమైన దేశభక్తుడు. 1999 ప్రపంచ కప్పులో ఆయన తండ్రి పోయినప్పుడు -మరోకారణానికి భారతదేశం క్రుంగిపోయింది. సచిన్‌ లేని జట్టుతో ఆడాలని. తండ్రి అంత్యక్రియలకి ఇండియా వచ్చి, వెంటనే బ్రిస్టల్‌లో ప్రపంచకప్పు ఆటకి తిరిగి వచ్చాడు. ఆనాడు కీన్యాతో ఆటలో 101 బంతులకి 140 పరుగులు చేసిన ప్రదర్శనకి -రెండు కారణాలకి ప్రపంచం ఆనందంతో నివాళు లర్పించింది. ఏమిటీ 26 ఏళ్ల కుర్రాడి కర్తవ్యదీక్ష? ఏమిటి ఈ నైపుణ్యం? ఎక్కడ దాచాడు తన వ్యక్తిగత విషాదాన్ని? మాతృదేశం మీద, తన కర్తవ్యం మీదా ఎంత ప్రగాఢమైన ఏకాగ్రత? భారతీయులంతా సచిన్‌కి మనస్సులో నివాళులర్పించారు. నేనూ ఆనందంతో ఉప్పొంగిపోయాను. కొద్ది రోజుల క్రితమే కన్నుమూసిన తండ్రికి ఆ సెంచరీని ఆ కుర్రాడు అంకితమిచ్చాడు. ఒక ఆటలో ఎవరూ ఊహించనంత గొప్పగా 136 పరుగులు చేశాడు. కాని తన జట్టు ఓడిపోయింది. అయితే సచిన్‌ ‘మాన్‌ ఆఫ్‌ ది మాచ్‌’గా నిలిచాడు. కాని ఆ బహుమతిని పుచ్చుకోడానికి మనస్కరించలేదు. బహుమతిని పుచ్చుకోలేదు. తన జట్టుతో ‘అపజయం’నే పంచుకున్నాడు! షార్జాలో ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ని గడగడలాడిస్తూ షార్జాలో 131 బంతులకి 142 పరుగులు చేసిన అద్భుతం క్రికెట్‌ అభిమానుల కలల పంట. ఆ తర్వాత సచిన్‌ టెండూల్కర్‌ తన కలలను చెడగొట్టాడని షేన్‌ వార్న్‌ చెప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. ఇవన్నీ చరిత్రలు. ఇవాళ -ప్రపంచం విస్తుపోయేలాగ -క్రికెట్‌ ఆటలో ఉన్న అన్ని రికార్డులనూ ఛేదించిన సచిన్‌ ఆటనుంచి నిష్క్రమించడం -ఓ చరిత్రకి తెరదించడం.ఆ మధ్య ఏదో ఛానల్‌లో కిషోర్‌ బిమానీని ఓ ఏంకర్‌ ఇంటర్వ్యూ చేస్తోంది. ”అందరూ సచిన్‌ దేవుడులాంటి వాడంటారు…’ అని ఏదో చెప్పబోయింది. బిమానీ ఆపాడు. ”మాకు సచిన్‌ దేవుడు లాంటివాడు కాదు. దేవుడే! అన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మేథ్యూ హేడెన్‌ అన్నాడు: ”నేను దేవుడిని కళ్లారా చూశాను. అతను ఇండియా జట్టులో నాలుగో స్థానంలో క్రికెట్‌ ఆడుతున్నాడు” అని. సచిన్‌ ఆడుతున్నప్పుడు ఈ దేశంలో ఉపవాసాలు చేసినవారున్నారు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా, వేసుకొన్న బట్టలు మార్చుకోకుండా, గెడ్డం చేసుకోకుండా కూర్చోవడం వల్ల సచిన్‌ గొప్పగా ఆడగలడనే విశ్వాసం పెంచుకున్నవారిని నాకు తెలుసు.

ఒక ఆటముగిశాక ఎవరో సచిన్‌ని ఆటోగ్రాఫ్‌ అడిగారట. ఆయన సంతకం చేస్తున్నాడు. దూరంగా ఉన్న సునీల్‌ గవాస్కర్‌ పక్క ఆయనతో అన్నాడట: ”వెళ్లి సచిన్‌తో చెప్పు -అక్షరాలు సరిగ్గా చూసుకోమని. ముందు ముందు ఆ కాగితం పఠమై, జ్ఞాపిక అయి, ఓ దేవుడికి గుర్తుగా కోట్ల విలువ చేస్తుంది”.సంవత్సరం కిందట ఆర్నాడ్‌ గోస్వామి ఓ ఇంటర్వ్యూలో సచిన్‌ని అడిగాడు: ”జావేద్‌ మియదాద్‌ వంటివారు మీరు ఆటలో అగ్రస్థానంలో ఉన్నప్పుడే రిటైరవాలంటున్నారు. మీరేమంటారు?” అని. సచిన్‌ సమాధానం ఇది: ”ఆటలో రాణిస్తున్నప్పుడు తప్పుకోవడం స్వార్థం. అప్పుడే ఆటకీ, మన జట్టుకీ -వెరసి దేశానికి సేవ చేసే అవకాశం ఉంది. బాధ్యత వహించడానికీ, నావంతు కృషి చెయ్యడానికీ అదే తరుణం” అని.

ఓ గొప్ప వ్యక్తి, గొప్ప వినయ సంపన్నుడు, గొప్ప ఆటగాడు, గొప్ప దేశభక్తుడు చేసే ఆలోచనలో నిస్వార్థమైన కోణమిది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఓ భయంకరమైన విషాద సమయంలో -జాతిపిత కన్నుమూసినప్పుడు ఓ మాట అన్నారు: ”రాబోయే తరాలు ఈ భూమిమీద ఇలాంటి వ్యక్తి రక్తమాంసాలతో తిరిగారా అని ముక్కు మీద వేలు వేసుకుంటారు”. సచిన్‌ ఆట విరమణ క్రికెట్‌ ప్రపంచానికి పెద్ద విషాదం. రాబోయే తరాలు ఈ 24 ఏళ్ల క్రీడా చరిత్రని, సాధించిన 40 ఏళ్ల క్రీడాకారునీ, అతని విజయాలనీ తలచుకుని దాదాపు అంతగానూ ముక్కుమీద వేలేసుకుంటారు. 2011 లో బెంగుళూరులో ఇంగ్లండుతో జరిగిన ఆటలో ఒక అభిమాని ఓ బోర్డుని పట్టుకున్నాడు: ”నేను దేవుడిని చూసేవరకూ సచిన్‌తో సరిపెట్టుకుంటాను” (నా అనువాదం నాకేనచ్చలేదు. ఇదీ వాక్యం:.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.