Main Menu

Gollapudi columns ~ Seejaru Pellalu (సీజరు పెళ్ళాలు)

Topic: Seejaru Pellalu (సీజరు పెళ్ళాలు)

Language: Telugu (తెలుగు)

Published on: Not Available

Source Credit: koumudi.net

Audio: Seejaru Pellalu (సీజరు పెళ్ళాలు)     

ఎప్పుడయినా, ఎక్కడయినా- పెద్ద రాజకీయనాయకుడి అవినీతి బయటపడిందనుకోండి. ఆయన సమాధానానికి మీరు ఎదురుచూడ నక్కరలేదు. ఒకే ఒక్క వాక్యం చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడూ వినిపిస్తుంది: “ఇది ప్రతిపక్షాలు నా మీద చేసిన కుట్ర”.

ఆ తర్వాత వారి నిజాయితీ, సేవలను మనకి వెల్లడిస్తారు.”నేను ౩౦ ఏళ్ళుగా రాజకీయాల్లో సేవ చేస్తున్నాను. 16 ఏళ్ళు కేంద్ర మంత్రిగా గౌరవాన్ని సాధించాను. 3 సార్లు గవర్నరుగా ఉన్నాను. రెండేళ్ళు ఫలానా కమిటీ చైర్మన్ గా వున్నాను”- యిలా సాగుతుంది-ఆవేశంగా.

నాధూరామ్ గోడ్సే కూడా మహాత్మా గాంధీ మీద తుపాకీ పేల్చేవరకూ ఈ దేశాన్ని పదిమందిలాగ ప్రేమించే దేశభక్తుడే. నేరస్తుడిలో నేరానికి ముందున్న గొప్పతనం వారి నేరానికి మద్దతు నివ్వదు. “నేను 30 ఏళ్ళు ఘనత వహించిన భర్తని. ఇవాళే మా ఆవిడ పీకకోశాను”- అన్నది సాకు అవుతుందేకాని సమర్ధనగా చెల్లదు. “అవును. నేనే చేశాను బాబూ. మరెప్పుడూ చెయ్యనని లెంపలు వేసుకుంటున్నాను. నాకే శిక్ష విధించాలో నిర్ణయించండి” అని యింతవరకూ ఏ రాజకీయనాయకుడూ అనలేదు!

ఆ మాటకి వస్తే అమెరికా శ్వేత భవనంలొ మోనికా లెవెన్ స్కీతో రంకు నడిపిన అద్యక్షులవారే- ఓ పక్క లెవెన్ స్కీ తన ప్రేమాయణాన్ని సరదాగా పత్రికలకి విప్పి చెప్తూంటే- తను నిర్ధోషినని కమిటీ ముందుకి వచ్చారు. విశేషమేమిటంటే దేశం వారి నిర్ధోషిత్వాన్ని అంగీకరించింది.

ప్రస్థుతం అలాంటి వినోదం – ఈ దేశంలో వెనుకబడినవారి హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్- కేంద్ర మంత్రి స్థాయిని అనుభవిస్తున్న బూటా సింగ్ గారి విషయంలో జరిగింది. మహారాష్ట్రలో రామారావు పాటిల్ అనే ఆయన వెనుకబడిన వారి పట్ల అన్యాయం చేశారు. అందుకు విచారణ జరపాల్సిన బాధ్యత బూటా సింగుగారిది. వారి మీద శిక్ష పడకుండా తప్పించడానికి బూటా సింగ్ గారి సుపుత్రుడు శరభ్ జిత్ సింగ్ గారు కోటి రూపాయలు అడిగాడు. రామారావు పాటిల్ అనే ముద్దాయి యిచ్చాడు. ఎలాగ? అంత మొత్తం చేతులు మారాలంటే మద్యవర్తులు ఉండాలి కదా? ఏతావాతా అందరూ దొరికారు. అరెస్టయారు.

సంప్రదాయం ప్రకారమే “ఇది నా శత్రువుల కుట్ర” అన్నారు బూటా సింగ్ గారు.

“కారణం దేవుడికే తెలియాలి” అన్నారు దైవభక్తులు, 400 కేజీల బరువైన వారి సుపుత్రులు శరబ్ జిత్ సింగ్ గారు. ఇలాంటప్పుడు వారికి దేవుడే గుర్తొస్తాడు.

లోగడ యిలాగే మాయావతిగారి మీద కేసులు పెట్టినప్పుడు వారూ శత్రువుల కుట్రగానే పేర్కొన్నారు. అప్పుడెప్పుడో జయలలితగారూ ఈ మాటే వాక్రుచ్చారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ నిజాయితీపరులు, సేవాతత్పరులయిన నాయకుల మీద యిలాంటి కుట్రలు పన్నుతూంటాయని మనం గ్రహించాలి.

అయితే మన దేశంలో ఓ సుఖం వుంది. నాయకుల మీద నేరాలు ఏనాటికీ రుజువుకావు. ఏనాయకుడూ ఏనేరానికీ, ఎప్పుడూ జైలుకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఇలా జరిగినప్పుడు ఆ నాయకుడేం చేస్తాడు? ప్రజల ముందుకు వెళ్ళి తన నిజాయితీని వొలకబోస్తాడు. పార్లమెంటుకి ఎన్నికవుతాడు. నేరస్థులకి చలివేంద్రం లాంటిది పార్లమెంటు.

ఈ దేశంలో ఎల్.కె.అధ్వానీగారి మీద కేసులున్నాయి. ఒకప్పుడు పీ.వీ.నరసింహారావుగారిమీద కేసులున్నాయి. మాయావతిగారి మీద కేసులున్నాయి. నరేంద్ర మోడీగారిమీద కేసులున్నాయి. జయలలిత మీద కేసులున్నాయి. బాల ధాకరేగారిమీద కేసులున్నాయి. రాజ్ ధాకరేగారిమీద కేసులున్నాయ్. ఎన్టీఆర్ మీద కేసులుండేవి. అయినా యీ జాబితాలో- అంతా ప్రధాని, ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఆయా పార్టీల నాయకులుగా గౌరవంగా కాలక్షేపం చేస్తున్నారు.

ఆమాటకి వస్తే – ఈ దేశంలో ఉరిశిక్షలు పడిన నేరస్థులకే దిక్కు లేదు. అప్జల్ గురు హాయిగా జైల్లో జీవిస్తున్నారు. చార్లెస్ శోభరాజ్ ఆ మధ్య జైల్లోనే పెళ్ళి చేసుకుని సుఖంగా సంసార జీవితాన్ని సాగిస్తున్నాడు. పప్పూ యాదవ్ జైల్లోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నాడు.

విదేశాలలో ఈ సుఖం లేదు. జపాన్ ప్రధాని జైలుకి వెళ్ళారు. అమెరికా నిక్సన్ గారు పదవీ భ్రష్టులయారు. పాకిస్థాన్ లో అయితే పదవిలో ఉన్న నాయకులు అవినీతి నాయకులకి టిక్కెట్లు కొని పరాయి దేశాలకి పంపిస్తారు. కాని మన దేశంలో శిలా విగ్రహాలను నిర్మించుకుంటూ హాయిగా పుట్టిన రోజుల జరుపుకొంటూంటారు.

గట్టిగా ఏ అవినీతయినా బయట పడితే – ఇది నా శత్రువుల కుట్ర అన్న పాత పాట వుండనే వుంది.

కారణం ఏమిటి? ఈ దేశంలో న్యాయవ్యవస్థ చేవచచ్చి ఈడిగిల పడుతోంది. అవినీతి బలగాన్ని పెంచుకుని గొంతు చించుకుంటోంది. అవకాశవాదం పార్లమెంటులో తలదాచుకుంటోంది. నీతిని గూండాయిజం నోరుమూయిస్తోంది. మెజారిటీ వీధిన పడి ఎప్పటికప్పుడు తన పబ్బం గడుపుకొంటోంది. పరాయి రాష్ట్రాలవారి పళ్ళు రాలగొట్టిన రాజ్ ధాకరే గారిమీద ముంబై ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ కేసులుంటే ఆయన మాత్రం హాయిగా యింట్లోనే స్వేఛ్ఛగా కాలం గడుపుతున్నారు.

ఈ దేశంలో నేరాలు ఓ పట్టాన రుజువుకావు. రుజువయినా శిక్షలు అమలుజరగవు. జరగలేదని గొంతు చించుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అన్యాయం గొంతుచించుకుంటుంది. అధికారం ధన వ్యామోహానికి లాలూచీ పడుతుంది.

అచిరకాలంలో బూటా సింగుగారి తనయుడు పార్లమెంటుకి పోటీ చేసి గెలుస్తాడనడంలొ నాకెట్టి సందేహమూ లేదు. రాజకీయ నయకుడిని డబ్బిచ్చి కొనవచ్చునన్న సూత్రాన్ని ఎరిగిన ముద్దాయి రామారావు పాటిల్ మహారాష్ట్రలో మరో మన్నికయిన నాయకుడవుతాడు.

సీజరు పెళ్ళాం నేరం చెయ్యదు- అన్నది పాత సూక్తి. ఎవరు పెళ్ళామో, ఎందరు పెళ్ళాలో, ఎవరు సీజరో- నేరాలేమిటో- అసలవి నేరాలో కావో, ఏ పెళ్ళానికి ఏ నేరం వర్తిస్తుందో- ఏ పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని ఏ శత్రువులు ఏ సీజరుని నాశనం చెయ్యాలని కుట్ర పన్నుతున్నారో- అయ్యా, యిది పెద్ద ఊబి. దీని వల్ల- చదివించే పేపర్లకీ, కాలాన్ని అమ్ముకునే ఛానళ్ళకె కావలసినంత – గడ్డి !!

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.