Main Menu

Gollapudi columns ~ Sense of Humor(సెన్సాఫ్ హ్యూమర్)

Topic: Sense of Humor(సెన్సాఫ్ హ్యూమర్)

Language: Telugu (తెలుగు)

Published on: Aug 08, 2011

Sense of Humor(సెన్సాఫ్ హ్యూమర్)     

ఇది తెలుగు కాలం కనుక ఇంగ్లీషులో మొదలెడతాను. సెన్సాఫ్ హ్యూమర్ అంటే కష్టాన్నీ, నష్టాన్నీ చూసి కడుపారా నవ్వుకోవడం. మనకి ఆ అలవాటు బొత్తిగా తక్కువంటాను. స్థాళీపులాకన్యాయంగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు.

ఆ మధ్య పేపర్లో ఓ వార్త చూశాను. తమిళనాడులో ఎక్కడో ఓ కుర్రాడు ఓ కక్కుర్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కోర్టు ఆ కుర్రాడిని జైల్లో పెట్టింది. తీరా విచారణ జరుపుతూ బెయిల్ ఇవ్వడానికి 1200 రూపాయలు కట్టమంది. వెనకటికి ఓ పూర్వసువాసిని ‘మా ఆయనే ఉంటే మంగలి ఎందుకు బాబూ’ అన్నదట. ’నా దగ్గర అంత డబ్బుంటే దొంగతనం ఎందుకు చేస్తాను బాబూ?!’ అన్నాడట ఆ కుర్రాడు. కట్టని కారణంగా జైల్లోనే ఇరుక్కున్నాడు. కేసుని పట్టించుకునే నాధుడు లేడు. అలా ఎన్నాళ్ళు? కాదు. ఎన్నేళ్ళు? ఏడు సంవత్సరాలు. ఈ మధ్య ఎవరో జైలు రికార్డులు తిరగేస్తూ వీడిని గమనించి అవతలికి పొమ్మన్నారు. స్థూలంగా ఇదీ కథ.

మనకి సరదాగా నవ్వుకోవడం తెలీదంటాను మరొక్కసారి. ఈ కుర్రాడిని ఆ రోజుల్లోనే – మా తూర్పు భాషలో – ఓ టెంకిజెల్ల కొట్టి పొమ్మంటే ఈ దేశానికి ఒక మేలు జరిగేది. వాడు తన కళకి మెరుగులు దిద్దుకుని – చూసీ చూడనట్టు వదిలేసే వ్యవస్థ అలుసు చూసుకుని – పెరిగి పెద్దవాడయి ఏ రాజువో, కల్మాడీవో – అదీ ఇదీ కాకపోతే – మధుకోడాలాగానో, షీలా దీక్షిత్ మేడం లాగానో ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయేవాడు. ఇప్పుడు వ్యవస్థ వాడిని ఏడేళ్ళు మేపి, పోషించింది. వాడు చేసిన నేరం పెద్దదా? వ్యవస్థ చేసిన నేరం పెద్దదా?
నవ్వుకోండి బాబూ! నవ్వుకోండి.

నిన్న ఏలూరులో రవి అనే ఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు గారు కేవలం ముప్పై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని వార్త. ఇది చాలా నీరసమైన పనిగా నేను భావిస్తాను. ఆయనింకా తన వృత్తిలో పరిణతిని సాధించలేదని మనం జాలిపడాలి. ఆయన్ని వీధిన పెట్టడం అన్యాయం. ఆయన్ని వెంటనే ఢిల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికో, కామన్వెల్త్ క్రీడల కార్యాలయంలోనో తర్ఫీదు ఇప్పించాలి. ఇంత పలచగా ప్రారంభమయిన కృషే రేపు పుష్పించి ఫలితాల నివ్వగలదని అదే పేపరులో, అదే పేజీలో టోకు అవినీతి వార్తలు మనకు చెపుతున్నాయి. ఇంకా గొప్ప అవినీతిని తట్టుకునే శక్తి మనకున్నదని రవిగారికి తెలియజెయ్యాలంటాను. మరొక్కసారి మనకి సెన్సాఫ్ హ్యూమర్ బొత్తిగా లేదంటాను.

మరొక కథ. ప్రకాష్ ఝూ అనే చిత్ర దర్శకుడు ఈ మధ్య “అరక్షణ్” అనే హిందీ సినీమా తీశాడు. అందులో అమితాబ్ బచ్చన్, సైఫ్ ఆలీఖాన్, దీపికా పదుకునే వంటి హేమాహేమీలు నటించారు. ఇదీ కథ. నిజాయితీపరుడైన ఓ ప్రిన్సిపాల్. అంతే నిజాయితీ, పట్టుదల ఉన్న ఓ కుర్రాడు. కథ ప్రేమ వ్యవహారంతో ప్రారంభమయి, ముదిరి – ఆ మధ్య సుప్రీం కోర్టు ‘రిజర్వేషన్ల’ మీద ఇచ్చిన తీర్పు చుట్టూ తిరుగుతుందట. పెద్ద నాటకీయత, తిరుగుబాటు, సంఘర్షణ కలబోసిన ఈ చిత్రం కొందరికి అప్పుడే ఇబ్బంది కలిగిస్తోందట. సినిమా ఇంకా రిలీజు కాలేదు. రిజర్వేషన్ల గురించి కథ నడిచిన కారణంగా ‘రిజర్వేషన్ల’ ప్రయోజనం పొందేవారికి ఇబ్బందిగా ఉన్నదేమో. ఏమయినా ఉత్తర ప్రదేశ్ లో ఈ సినిమా విడుదలను నిషేధించింది అక్కడి రాష్ర్ట ప్రభుత్వం. విశేషమేమంటే అక్కడ ముఖ్యమంత్రి ఓ దళిత నాయకురాలు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ర్టాలు అభ్యంతరం చెప్పలేదు.
మన దేశంలో నారదుడు బఫూన్ గా, ధర్మదేవత అయిన యముడు లేకి హాస్యనటుడిగా తీసిన చిత్రాలను చూసి తరించే ప్రేక్షకులున్న ఈ కర్మభూమిలో ఇంకా ఇలాంటి వెనుకబడిన వారున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఓ గొప్ప వాగ్గేయకారుడి చిత్రంలో బ్రాహ్మణులు పేడ ముద్దలు తింటూ మంత్రాల్ని వర్ణించే హాస్యాన్ని ఆశ్వాదించిన రసజ్నులు మనవారు. పౌరాణిక పాత్రల్ని భ్రష్టు పట్టిస్తే బహుమతులిచ్చే ఉదారులు మనవారు. కేవలం సినీమాని చూసి నవ్వుకోవడం తెలియకపోవడం దురదృష్టకరం.

ఈ మధ్యనే అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న భారతీయ చిత్రకారుడు హుస్సేన్ సాహెబ్ గారు పరదేశంలో కన్నుమూశారు. ఆయన్ని మనదేశానికి రప్పించి, వారి చిత్రాల్ని నెత్తికి ఎత్తుకోలేదని చాలామంది పెద్దలు బాధపడ్డారు. ఈ మధ్యనే వారు చిత్రించిన చిత్రాల్ని నాకో మిత్రులు పంపారు. చూసి నా జన్మధన్యమయిందని తరిచాను. వారు దుర్గాదేవిని బట్టలిప్పి నిలబెట్టారు. కానీ ముస్లిం ప్రవక్త కూతురు ఫతిమాను పూర్తి దుస్తులతో అలంకరించారు. విఘ్నేశ్వరుడి నెత్తిమీద బట్టలిప్పుజుని కూర్చున్న లక్ష్మీదేవిని అద్భుతంగా రచించారు. తన తల్లిని పవిత్రంగా బట్టలతో చిత్రించారు. స్థనాలు వేలాడేసుకుని వీణని కాళ్ళ దగ్గర పెట్టుకున్న సరస్వతీ దేవిని రూపొందించారు. మదర్ థెరెస్సాను పసిబిడ్డను ఎత్తుకున్న దేవతగా చిత్రించారు. పార్వతీదేవి గుడ్డలిప్పుకుని ఎలకపిల్లలాంటి విఘ్నేశ్వరుడిని ఎత్తుకున్నట్టు రచించారు. తన కూతురిని అందంగా బట్టల్తో, టోపీతో చిత్రించారు.

ద్రౌపది బట్టలిప్పుకుని నిలుస్తుంది. ముస్లిం యువతి పువ్వుల చీరె కట్టుకుని సభ్యతతో దర్శనమిస్తుంది. బట్టల్లేని హనుమంతుడినీ, రావణుడి తొడమీద బట్టలిప్పుకుని కూర్చున్న సీతనీ, బట్టల్లేని భారతమాతనీ..

ఒకరోజు కాదు, ఒక దశలో కాదు – పోనీ, ఆ దశలో ఆయన మనస్థాపంతో ఉన్నారని సరిపెట్టుకోడానికి – ఇవన్నీ ఆయన జీవితకాలంలో పరుచుకున్న అపూర్వమయిన కళారూపాలు. పరమ పవిత్రమైన పండరీ పురక్షేత్రంలో జన్మించిన ఈ కళాకారుడి భారతీయ సంస్కృతి వైభవం అవగాహనకిగాను ఒక పద్మశ్రీ పద్మభూషణ్, పద్మవిభూషణ్ కాక ఇంకా భారతరత్న ఇచ్చి సత్కరించకుండా దేశం వదిలి వెళ్ళిపోయేటట్టు చేశాం. మరొక్కసారి. మనకి నవ్వుకునే పెద్ద మనస్సు లేదు.

మన దేశంలో చట్టం, వ్యక్తి నీతి, సినీమా కళ, సామాజిక బాధ్యత, అభిరుచి – క్రమంగా భ్రష్టు పట్టిపోతున్నాయి.

ఒక్కటే మార్గం. తలపంకించి సరదాగా నవ్వుకునే సెన్సాఫ్ హ్యూమర్ ని పెంపొందించుకోవాలి.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.