Main Menu

Gollapudi columns ~ Story of new lion (కొత్త సింహం కధ)

Topic: Story of new lion (కొత్త సింహం కధ)

Language: Telugu (తెలుగు)

Published on: Dec 28, 2009, Andhra Prabha(ఆంధ్రప్రభ) Newspaper

Source Credit: koumudi.net

Audio: Story of new lion (కొత్త సింహం కధ)     

వెనకటికి ఒకాయన బెర్నార్డ్ షా నాటకాల్లో నీకు నచ్చిందేమిటని నాటకాల అభిమానిని అడిగాడట.

“ఆండ్రోకిస్ అండ్ ది లైన్” అన్నాడట అభిమాని.

“అందులో నీకు నచ్చిన పాత్ర?”

తడువుకోకుండా సమాధానం చెప్పాడట అభిమాని “సింహం” అని.

మా పెద్దబ్బాయి కిందటివారం చైనా వెళ్ళాడు. ఎందుకు? అక్కడి చలిని అనుభవించాలని. తీరా వచ్చాక పైన చెప్పిన నాటకాల అభిమానిలాగ- అతనికి నచ్చిన విషయాలు- చక్రవర్తుల కోట (ఫర్ బిడెన్ సిటీ),ప్రపంచ అద్భుతాల్లో ఒకటయిన చైనా గోడ- 600 సంవత్సరాల క్రితం 8852 కిలోమీటర్ల రాతిగోడ- ఇవేమీ కాదు. విచిత్రంగా ప్రభుత్వ పాలన గురించి, ప్రభుత్వ చర్యల గురించి, అసలు రాజకీయాల గురించి ప్రజలు ఎవరూ నోరెత్తకుండా జీవించడం.

“మీ గవర్నమెంట్ సంగతేమిటి?” తనతో వచ్చిన చైనా గైడ్ని అడిగాడట.

ఆమె సమాధానం- భుజాలెగరేసి పెదాలు నొక్కుకుందట.

“ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు? “

అదే సమాధానం.

బీజింగ్ లో తినామిన్ స్క్వేర్ మరో అద్భుతం. అంతకుమించి 1989 లో విద్యార్ధి ఆంధోళనను ప్రభుత్వం అణచివేసిన తీరు ఇంకా నిశ్చేష్టకరం. గైడ్ ని అడిగాడట- ఆ విషయం గురించి. నాకేమీ తెలియదంది ఆ అమ్మాయి. దాదాపు 2000 మంది విశ్వవిద్యాలయం విద్యార్ధులు తమ 7 డిమాండ్లను తీర్చాలంటూ ఆంధోళనకి దిగారు. ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. తినామిన్ స్క్వేర్ లోకి టాంకులు వచ్చాయ్. 2000 మంది యువతమీద బాంబుల వర్షాన్ని కురిపించాయి. రక్తం ఏరులయిపారింది. ఈ వార్తని చైనా పేపర్లు చెప్పలేదు. చైనా ప్రజలు మాట్లాడలేదు. 20 సంవత్సరాల తర్వాత చైనా గైడ్ పెదవి విప్పలేదు. అప్పుడు చైనాలో వున్న విదేశీ వార్తా సంస్థలు తమ దేశాల్లో చెప్పుకున్నాయి. వారి వారి దేశాల్లో వారి ప్రజలు ముక్కుల మీద వేళ్ళేసుకున్నారు. తర్వాత- ఒక్కసారి- ఒక్కసారి కూడా- ఎవరూ ఎలాంటి ప్రతిఘటనా జరపలేదు.

చైనాలో వంద కిలోల బంగారంతో నడిరాత్రి ప్రయాణం చేసినా ఏమీ భయం లేదు. ఎవరయినా నేరం చేసి పట్టుబడ్డాడా? కేవలం మూడు రోజులే విచారణ. శిక్ష- టాంక్ ముందు అతన్ని నిలబెట్టడం. ఎవరయినా ప్రతిఘటిస్తున్నారా? అతన్నీనిలబెట్టండి టాంకుల ముందు. “ఎనీబడీ?”!!

విప్లవానికి గుర్తు- 20 ఏళ్ళ కుర్రాడు కాలేజీ సంచీతో టాంక్ కి ఎదురుగా నిలబడిన దృశ్యాన్ని నేను మరిచిపోలేను- అన్నారు అమితాబ్ బచ్చన్ ఒకసారి.

క్రమశిక్షణని సాధించడానికి రెండే మార్గాలు. 1. అద్భుతమైన సంస్కారం. 2. భయం.

ఈ మధ్య మరో అనధికారికమైన కధని కిందటివారమే సింగపూర్ వెళ్ళినప్పుడు విన్నాను. మలేషియాలో భయంకరమైన మాఫియా(గూండా) శక్తులు ఉండేవట. చాలా దారుణంగా దోచుకునేవారట. ప్రభుత్వం వారి అరాచకాన్ని అరికట్టలేక- వారిని రహస్యంగా పిలిచి “బాబూ! మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడానికి ఏం చెయ్యమంటారు?” అని అడిగిందట. “మాకంటూ ఒక ప్రాంతాన్నిచ్చెయ్యండి” అన్నదట మాఫియా. ఆ విధంగా సింగపూర్ వారికి దక్కింది. దౌర్జన్యకారుల మధ్య ఉన్న క్రమశిక్షణ అనూహ్యం. తప్పు చేస్తే ప్రాణానికే ముప్పు అని అందరికీ తెలుసు కనుక. ఆ భయంలోంచి, వారి క్రమశిక్షణలోంచి- ఒక నీతి, ఒక సంప్రదాయం ఏర్పడి ప్రస్థుత పాలనా వ్యవస్థకు పునాది అయిందట. ఈ కధని ఓ తెలుగు మిత్రుడు నన్ను చాంగీ విమానాశ్రయంలో దింపుతూ చెప్పాడు.

ఈ కధ ఏ చరిత్ర పుస్తకానికీ ఎక్కదు. బహుశా యిది కధే కావచ్చు. అయితే ఆలోచిస్తే- ఈ కధకి కాళ్ళూ చేతులూ ఉన్నాయి.

మా అబ్బాయిని చైనాలో ఆనందపరిచిన ఈ కట్టుబాటు నన్ను భయపెట్టింది. కాని ఈ నిరంకుశత్వం విలువ తెలిసివచ్చే అరాచకం మొన్ననే మనదేశంలో వెలుగులోకి వచ్చింది.

హర్యానాలో రుచిక అనే 14 ఏళ్ళ అమ్మాయిని ఓ ఇనస్పెక్టర్ జనరల్ మానభంగం చేశాడు. ఆ పిల్ల ఆ పరాభవాన్ని తట్టుకోలేక, కుమిలి మరో రెండేళ్ళకి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు కోర్టులో 19 సంవత్సరాలు నడిచింది. ఈ 19 సంవత్సరాలూ ఈ ఆఫీసరుగారు సుఖంగా నిమ్మకు నీరెత్తినట్టు గడిపారు. అంతేకాదు తన అధికారబలంతో కేసును మలుపులు తిప్పి వీలయినంత సాగదీశారు. ఆ కుటుంబాన్ని ముప్పతిప్పలూ పెట్టి గతిలేక ఊరు వదిలి వెళ్ళిపోయేటట్టు చేశారు.. 19 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం వారికి కేవలం వెయ్యి రూపాయల జరిమానా, వారి వయస్సును దృష్టిలో వుంచుకుని 6 నెలలు జైలు శిక్షని విధించింది. చిరునవ్వుతో ఈ ఆఫీసరుగారు బెయిల్ కి కోర్టుని ఆశ్రయించారు. ఘనత వహించిన న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇదీ మనదేశంలో చట్టాలు, న్యాయస్థానాల నిర్వాకం.

తినామన్ స్క్వేర్ లొ టాంకులు ఎంత త్వరగా ఈ ఆఫీసర్ల మీదా, ఈ వ్యవస్థమీదా గురి పెడితే అంత ఉపకారం జరుగుతుందనిపించింది. 19 సంవత్సరాలు అదనంగా ఆ ఆఫీసరుకి బతికే అవకాశం కల్పించి, చట్టం ఈ దేశంలో గాజులు తొడుక్కుందని కొన్ని వందల సార్లు నిరూపణ అవుతున్న నేపధ్యంలో మా అబ్బాయి ఆనందానికి అర్ధం కనిపించింది.

న్యాయానికి చట్టం గంతలు కట్టి కాలదోషం పట్టిస్తోంది ఒకచోట. ప్రతిఘటన పేరెత్తకుండా ప్రజల్లో “భయా”న్ని ప్రతిష్టించడం మరొక చోట. ఆలోచనలూ, ఆవేశమూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిస్సహాయతతో రక్తం మరుగుతోంది. ఏమిటి కర్తవ్యం? సమాధానాన్ని ఆచరణలో పెట్టింది చైనా.

ఊహించలేని నైతిక పతనానికి ఒక్కొక్కపుడు “భయం” కూడా పరిష్కారమంటోంది మన పొరుగు దేశం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.