Main Menu

Gollapudi columns ~ Taliban Deshbakti(తాలిబన్ దేశభక్తి)

Topic: Taliban Deshbakti(తాలిబన్ దేశభక్తి)

Language: Telugu (తెలుగు)

Published on: Dec 02, 2013

Taliban Deshbakti(తాలిబన్ దేశభక్తి)     

నాకెప్పుడూ తాలిబన్ల మీద అమితమైన గౌరవం ఉంది. ఈ మాట వ్యంగ్యంగానో, వెక్కిరింతగానో అనడం లేదు. అజ్ఞానమో, సుజ్ఞానమో, ప్రాథమికమో, పాశవికమో -తాము నమ్మిన నిజాన్ని -మాయాబజారులో సియెస్సార్ మాటల్లో ‘సిగ్గులేకుండా’ ప్రదర్శించగల నిజాయితీ వారికుంది. వారి విశ్వాసాలు మధ్యధరా సంస్కృతి కాలంలోనే ఆగిపోయి ఉండవచ్చు. వారి ఆచరణలు రాతియుగం నాటివి కావచ్చు. కాని అందుకు వారు సిగ్గుపడరు. ఆడపిల్లలు చదువుకోరాదు. ఎందరు పెళ్లాలను మగాళ్లు పెళ్లిచేసుకున్నా -వారికి పెళ్లాలయి, పిల్లల్ని కంటూనే బతకాలి అని వారు నమ్ముతారు. వారి మతాన్ని, వారి జాతిని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్న ఒసామా బిన్ లాడెన్ కూడా నలుగురు పెళ్లాల్ని పెళ్లి చేసుకొని పద్నాలుగుమంది పిల్లల్ని కన్నాడు. మలాలా అనే అమ్మాయి దొంగతనంగా చదువుకోవాలనుకొంది. ఆ అమ్మాయిని నిర్ధాక్షిణ్యంగా కాల్చేశారు. తమ మతానికి వ్యతిరేకమైన బుద్ధుని విగ్రహాలను -భామియన్ బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. తమని ఎదిరించినవారిని ఆత్మత్యాగం చేసుకుని అయినా చంపుతారు. ఇవన్నీ ఒక యెత్తు. ఈ మధ్య ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు సచిన్ తెండూల్కర్ ఆట నుంచి రిటైరయాడు. ప్రపంచమంతా ఆయన్ని తలకెత్తుకుని ప్రశంసించారు. పాకిస్థాన్ పత్రికలు కూడా తెండూల్కర్‌ని ఆకాశానికి ఎత్తేశాయి. ఇది తాలిబన్‌కి బొత్తిగా నచ్చని విషయం. ఎందుకు? ఇది దేశ భక్తికి సంబంధించిన విషయం కనుక. పాకిస్థాన్‌లో బహిష్కరించిన తెహరీక్ -ఏ -తాలిబన్ సంస్థ ప్రతినిధి షహీదుల్లా షహీద్ ఏకే 47 తుపాకీని ధరించి ఒక సందేశాన్ని పాకిస్థాన్ మాధ్యమాలను వీడియో ద్వారా హెచ్చరించాడు. ”ఈ మధ్య క్రికెట్ ఆటనుంచి రిటైరయిన ఒక ఆటగాడిని -సచిన్ తెండూల్కర్‌ని పాకిస్థాన్ మాధ్యమాలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతను ఇండియన్. మరి మన పాకిస్థాన్ ఆటగాడు మిస్బా -ఉల్ -హక్‌ని దుయ్యపడుతున్నాయి. ఇది మరీ విచారకరం. తెండూల్కర్ ఎంత గొప్పవాడయినా అతను ఇండియన్ కనుక పొగడడానికి వీలులేదు. మన మిస్బా ఎంత దరిద్రంగా ఆడినా మనవాడు, మన పాకిస్థానీవాడు కనుక పొగడండి -అంటూ వీడియో సందేశమిచ్చారు. మాధ్యమాలు వారి తాఖీదుల్ని పాటించకపోతే? చేతిలో ఆయుధం వారికి హెచ్చరిక. మనం హిరణ్యకశిపుడిని దుర్మార్గుడుగా దుయ్యపడతాం. ప్రహ్లాదుడిని మహాత్ముడని నెత్తికెత్తుకుంటాం. ఏనాడయినా -తన విశ్వాసాన్ని -ఆఖరి ఊపిరివరకూ మార్చుకోని నిర్దుష్టమయిన స్థైర్యం కల వ్యక్తిగా హిరణ్యకశిపుడిని పొగిడామా? ఇది విచక్షణ కాదా?

దలైలామా దేవుని అవతారం టిబెటన్లకి. కాని చైనా ప్రభుత్వానికి ఆయనొక పొరుగు దేశపు పాలకుడు. ఆయన్ని పొమ్మనలేక పొగపెట్టారు. నేను దిన పత్రికలో నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. రాయ్‌టర్ అనే బ్రిటిష్ వార్తాసంస్థ -ఆనాటి కాంగోలో స్వాతంత్య్ర పోరాట శక్తుల్ని విప్లవ శక్తులని పేర్కొనేది. కాని మేము ‘జాతీయ దళాలు’ అని అనువదించేవారం. బ్రిటిష్ వారికి కాంగో ప్రజల పోరాటం తిరుగుబాటు. కాని ఆ దేశీయులకి జీవన్మరణ సమస్య. తమది స్వాతంత్య్రపోరాటం. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి గాంధీ తిరుగుబాటు దారుడు. మనకి మహాత్ముడు. ఇండియన్ తెండూల్కర్ గొప్పవాడయినా నిషిద్ధం. మిస్బా ఉల్ హక్ మరుగుజ్జు అయినా ఆదరణీయం. సగటు ప్రతిభని అపూర్వమైన ప్రతిభగా ‘సాగదీసే’ పని ఎవరు చెయ్యగలరు? చేతిలో తుపాకీ ఉన్నవారే చెయ్యగలరు.

రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి గొప్ప కథ ఒకటి -ఆరు సారాకథల్లో ఉంది. ఇద్దరు దొంగసారా వ్యాపారులు -విశాఖలో. ఇద్దరూ అవినీతితో ఒకరినొకరు పోటీపడుతూ రహస్య వ్యాపారం చేస్తున్నారు. ఒకరంటే ఒకరికి పడదు. బద్ధ శత్రువులు. అందులో ఒకడు మహా శివభక్తుడు. వాడికో ఉంపుడుకత్తె కూడా ఉంది. ఒకానొక సందర్భంలో ఈ భక్తుడి శత్రువుని ఎవరో ఓ హోటల్లో చంపేశారు. న్యాయంగా ఇతనికి ఆటవిడుపు కలగాలికదా? కాని వాడు మహాశివరాత్రినాడు చచ్చిపోయాడు. కనుక కైలాసానికి వెళ్లిపోతాడని జుత్తుపీక్కొన్నాడు. అదీ కథ.

చాలా సంవత్సరాల కిందట ‘మాన్ ఫ్రైడే’ అనే చిత్రాన్ని చూశాను. ప్రఖ్యాత నవలా రచయిత డేనియల్ డెఫో రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రమిది. 1719 నాటి నవల అది. ఈ రెండు వందల సంవత్సరాలలో ఈ రచన ఎన్నో ప్రక్రియలలో తలమానికమయి నిలిచింది. కార్టూన్లు, సినీమాలు, టీవీ రూపకాలు -ఒకటేమిటి? కారణం? వొంటిరంగు కారణంగా, తెల్లవాడయిన కారణానికి మరొకరిమీద అధికారాన్ని చెలాయించే పెత్తనాన్ని అతి ప్రాథమికంగా ప్రశ్నించే గొప్ప రచన ఇది. ఒకానొక ద్వీపంలో ఒక ఓడ చిక్కుకుని ఆగిపోతుంది. గొప్ప శ్రీమంతుడు -రాబిన్సన్ క్రూసో అనే నావికుడు ఏకాకిగా మిగిలిపోయాడు. అతని దగ్గర తుపాకులు ఉన్నాయి. బంగారం ఉంది. కాని ఆ ద్వీపం నుంచి బయటపడే మార్గం లేదు. ఆటవికుడిలాగ జీవిస్తున్నాడు. ఒకసారి -ఆ రోజు ఫ్రైడే -ఒక పడవ అటుకొట్టుకు వచ్చింది. ఒక నల్లవాడు అక్కడ ఇరుక్కున్నాడు. అతను ఫ్రైడేనాడు ‘దొరికాడు’ కనుక అతనికి ఫ్రైడే అని పేరుపెట్టాడు. సమాజంలో స్థిరపడిపోయిన ఎన్నో విషయాలని అతి ప్రాథమికంగా ఈ నల్లమనిషి ద్వారా ప్రశ్నించాడు రచయిత. ఇలా మనం ఎప్పుడూ ఆలోచించం. నిజానికి కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం వెదకం. ఉదాహరణకి క్రూసో ఫ్రైడేతో ”నేను నీ యజమానిని” అన్నాడు. ”అంటే?” అనడిగాడు నల్లవాడు. ”నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి?” అన్నాడు. ”ఎందుకు?” మళ్లీ ప్రశ్న. రాబిన్సన్ క్రూసోకి వెంటనే సమాధానం దొరకలేదు. తన చేతిలో తుపాకీ ఉంది. దాన్ని చూశాడు. వెంటనే అన్నాడు ”నాచేతిలో తుపాకీ ఉంది కనుక”. తుపాకీతో ఎప్పుడయినా ఎవరినయినా నాశనం చెయ్యగలగడమే అతని శక్తి. పెద్దరికానికి కారణం. ”మనిద్దరం కుస్తీ పడదాం” అన్నాడు. ”అంటే?” ఎలా చెప్పాలో తెలియలేదు క్రూసోకి. ”ఒకరినొకరు కొట్టుకోవడం”. ”ఎందుకు?” మళ్లీ ప్రశ్న. సమాధానానికి వెతుక్కున్నాడు. ”అదొక క్రీడ” అన్నాడు. ”క్రీడ అంటే?” ఎంత గొప్ప ప్రశ్న! ”ఎదుటివాడి వినోదానికి ఒకరినొకరు హింసించుకోవడం”. ఇంతకంటే మానవ వికారాన్ని ప్రశ్నించే ఆయుధం లేదు 1719 నాటి రచన. 2013లో తాలిబన్‌లు సరిగ్గా అదే జులుంని నిరూపిస్తున్నారు. రచయిత కాలం కంటే ముందుంటాడనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? తెండూల్కర్ గొప్పతనంతో తాలిబన్లకేమీ తగాదాలేదు. ఆయన్ని ప్రపంచమంతా పొగిడితే నిజానికి వారికి అభ్యంతరం లేదు. కాని పాకిస్థాన్‌లో శత్రుదేశం ఆటగాడిని నెత్తికెత్తుకోవడం వారికి నచ్చని విషయం. మీకు మరీ మోజుగా ఉంటే మన మిస్బా -ఉల్ -హక్‌ని పొగడండి. అతనంత గొప్ప ఆటగాడు కాదా? ‘కొంచెం’ పొగడండి. తెండూల్కర్‌ని అస్సలు పొగడకండి. తద్వారా కొన్నాళ్లకయినా మన మిస్బా మీ పుణ్యమా అని తెండూల్కర్ స్థాయికి ‘సాగదీసి’ నట్టవుతుంది. మన చేతిలో తుపాకీ ఉండాలికాని -మలాలా చదువుని ఆపగలం, బుద్ధుని విగ్రహాలను నాశనం చెయ్యగలం, తెండూల్కర్ గొప్పతనాన్ని అటకెక్కించగలం, మన పాకిస్థాన్ ఆటగాడు మిస్బాని ఆకాశంలో నిలబెట్టగలం. అదీ తాలిబన్ల విశ్వాసం.

ఒకజాతి సంస్కృతిని, విశ్వాసాలనీ, వైదగ్ద్యాన్ని, వైభవాన్ని, ప్రతిభనీ -కేవలం అధికారంతో, కేవలం తుపాకీతో, కేవలం దౌర్జన్యంతో సాధించవచ్చని నమ్మే వ్యవస్థ ఇంత ప్రాథమికంగా ఆలోచించగలగడం, ఈ 2013లో ఇంతగా బరితెగించి ఆలోచించగలగడం -విడ్డూరంగా కనిపించవచ్చు. కొండొకచో నవ్వు పుట్టించవచ్చు. కాని పొరుగు దేశంలో అది వాస్తవమని మరిచిపోకూడదు. తుపాకీని చూపించి ఈ సిద్ధాంతాన్ని నేర్పుతున్నారని మరిచిపోకూడదు. మానవ చరిత్ర ఇన్నివేల సంవత్సరాలలో ఏమయినా నేర్చుకుందా? నాగరికత పేరిట అధ:పాతాళానికి కృంగడం అద్భుతంగా ప్రాక్టీసు చేస్తోంది. ప్రపంచ చరిత్రలో గొప్ప శక్తి ఏది? ఈ ప్రశ్నకీ సమాధానం ఉంది. పక్కవాడిని నాశనం చెయ్యగల శక్తి, ఉద్దేశ్యం, అవకాశం అవసరం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.