Main Menu

Gollapudi columns ~ Telugu Burada (తెలుగు బురద )

Topic: Telugu Burada (తెలుగు బురద )

Language: Telugu (తెలుగు)

Published on: June 04, 2012

Telugu Burada(తెలుగు బురద )     

తెలుగు బురద

తెలుగు అధికార భాష అయిన రోజులివి. మన నాయకులు తెలుగుని అందలం ఎక్కిస్తున్న రోజులివి. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉంది. చాలామంది నాయకులకే సరైన తెలుగు రాదు. అందువల్ల వారు అప్పుడప్పుడు పప్పులో కాలు వేయడం, తప్పులో కాలు వేయడం జరుగుతూంటుంది.

కిరణ్‌ కుమార్‌ రెడ్డిగారితో నాకేమీ తగాదా లేదు. ఆయన ఆలోచనలు ఆరోగ్యకరమైనవే. కానీ చెప్పే ధోరణిలో ఇబ్బంది ఉంది. దానిని ప్రతిపక్షాలూ, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ గారూ అపార్థం చేసుకుంటున్నారని నా ఉద్దేశం. కిరణ్‌కుమార్‌ రెడ్డిగారు వెంటనే నన్ను ఆయన తరఫు తెలుగు లాయరుగా నియమించుకోవాలని సూచిస్తున్నాను.
మన నాయకులు -తెలుగును వారి వారి ప్రాంతీయ భాషలలో గుప్పిస్తారు. ‘చెయ్యటాకి’, ‘చేస్తేగినా’, ‘సేత్తారంటూ’, ‘చెప్పిండు’, ‘చేయించినారంటేనే’, ‘ఇంగ, గిట్ల జేస్తే, చెప్పరబ్బ మీరు’, ఏం చెప్పినావ్‌’, ‘ఏమి అట్లంటవ్‌’ -యివన్నీ తెలుగు ప్రాంతీయ భాష సౌందర్యాలు. ఇక భాష సరిగా రానివారు అర్థం లేని, అక్కరలేని ఊతపదాలను వాడడం మనం వింటూంటాం. ‘ఇక అసలు విషయానికొస్తే’, ‘అదేవిధంగా’, ‘నేను మనవి చేస్తున్నాను’, ‘ఇక ప్రధానంగా’, ‘మరి ఇప్పుడు పెట్రోలు గురించి చెప్పాలంటే’, -ఇలా సాగుతాయి. మధ్య మధ్య ‘సమాజ సేవ’, ‘నీతివంతమైన పాలన’, ‘దేశానికి అంకితం’, ‘సమాజ కళ్యాణం’ వంటి బూతు మాటలు వినిపిస్తూంటాయి.

కిరణ్‌కుమార్‌ రెడ్డిగారు చిత్తూరు మండలం భాషని విరివిగా వాడతారు. వారు తెలుగు స్కూల్లో చదువుకోలేదేమో నాకు తెలీదు. ఆయన సహృదయతతో సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే ప్రతి వోటరూ పదివోట్లు వేయాలని అన్నారు. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కోడి గుడ్డుమీద వెంట్రుకలు ఏరుతున్న పనిగా నేను భావిస్తాను. ఏ ముఖ్యమంత్రీ, ఏ బహిరంగ సభలోనూ, ఏ వోటరునీ -అయ్యా, మీరెలాగయినా ఒక్కొక్కరూ పదేసి వోట్లు గుద్దెయ్యమని చెప్పరు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అస్సలు చెప్పరు -ఆయన ఏనాడూ మంత్రి కాలేదు కనుక. ఒక్కొక్కరూ కనీసం పదిమందిచేత వోటు వేయించాలని వారి తాత్పర్యం.

మన నాయకుల సమస్యలు -ప్రధానంగా తెలుగు సమస్యలు. ‘అధికార’ తెలుగుని కాస్సేపు పక్కనపెట్టి వీరందరికీ ‘అర్థమయే’ తెలుగు మాట్లాడే క్లాసులు నడపాలని నా మనవి.

రాయలసీమ కవి తిక్కన ”అన్నా ఫల్గుణ” అని ధర్మరాజు తన తమ్ముడు అర్జునుని పిలిస్తే దాన్ని తప్పుగా భావించేవారుంటారు. కానీ ఆ ప్రాంతంలో ‘అన్న’ అనే పిలుపు ఏకోదరుడి వరుసకాదని, కేవలం గౌరవ వాచకమని తెలియజెప్పాలి. అలాగే నెల్లూరు నాయకులు ‘దొబ్బ’ మంటే బాధపడేవారుండవచ్చు. కానీ ఆ మాటకు గ్రంథసమ్మతం ఉన్నదని నచ్చజెప్పాలి.

భాష భావాన్ని అందించే సాధనం. అపార్థాన్ని సంధించే ఆయుధంగా -ఉద్దేశం వల్లకాక, ఉద్ధతి లోపం వల్ల జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి భాషలో వారు రచనలు చేసుకుని, ఎవరి సినీమాలు వారు తీసుకుని, ఎవరి ధోరణిలో వారు తిట్టుకుని తిమ్ముకుని, ఎవరి భుజాలు వారు చరుచుకుంటే ఎవరికీ గొడవలేదు. ఇష్టమున్నవారు చదువుతారు, కష్టమున్నవారు చదవరు. చూడరు. వినరు. కానీ శ్రీకాకుళం నాయకులు ప్రజలకు చేసిన వాగ్దానం అదిలాబాద్‌ పౌరునికి అందాలంటే -ఏదో మధ్యేమార్గం ఉండాలి. ముఖ్యమంత్రిగారి ఉద్దేశం భన్వర్‌లాల్‌ గారికి ‘అభ్యంతరంగా’ పరిణమిస్తే ఆ నేరం వారు సరిగ్గా చెప్పలేని ‘తెలుగు’ది కాని -నాయకులది కాదని నా నమ్మకం.
అందువల్ల ఎన్నికలలో పోటీ చేసే నాయకులకు -ఆస్తి ఎంతవుంది? రెండో పెళ్లాం ఉన్నదా? ఎప్పడయినా జైలుకి వెళ్లారా? ఎవరి పీకయినా కోశారా? -యిలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదకడంతోపాటు -అందరికీ అర్థమయే, ఎవరికీ అభ్యంతరం లేని తెలుగు ఎంతవరకూ వచ్చునో తెలుసుకోవడం కూడా అవసరం. అలాగే ఎన్నికల కమిషన్‌ -రాబోయే ఎన్నికలలో పోటీచేసే నాయకులకు తెలుగులో క్రాష్‌ కోర్స్‌ నడపాలని నా ఉద్దేశం. అయితే ఆ కోర్సులు ఎవరు నిర్వహిస్తారు? ఇది పెద్ద సమస్య అయే ప్రమాదం ఉంది కనుక ముందు జాగ్రత్తగా -ఇద్దరు వెనుకబడిన పెద్దలు, ఒక ముందుపడిన పెద్ద, మరొక మహిళా పెద్ద, మరొక అంగవైకల్యం గల పెద్ద, మరొక తెలుగు వచ్చిన పరాయి భాష పెద్ద, మరొక వెనుకబడినవారిలో ముందు పడిన పెద్ద, ఒక గిరిజన పెద్ద, ఒక క్రిస్టియన్‌, ఒక ముస్లిం, ఒక హిందీ పెద్ద -ఉండాలని ప్రతిపాదిస్తున్నాను.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.