Main Menu

Gollapudi columns ~ Thappudu Mata (తప్పు(డు)మాట )

Topic: Thappudu Mata (తప్పు(డు)మాట )

Language: Telugu (తెలుగు)

Published on: July 02, 2012

Thappudu Mata(తప్పు(డు)మాట )     

ప్రజాస్వామ్యం పెద్ద గాడిద అన్నాడొకాయన. ఈ మాట అక్కసుతో, నిష్టూరంగా, కాస్త అన్యాయంగానూ అన్న మాటగా నాకనిపిస్తుంది. మరి ఎందుకన్నాడాయన?
ప్రజాస్వామ్యంలో ఒక సుఖం ఉంది. ఏ పనిచెయ్యడానికయినా, ఎవరికయినా హక్కు ఉంది. అర్హతలతో పనిలేదు. “అందరికీ అన్నీ తెలుసు. అదే మన అజ్నానం” అనంది మరో అన్యాయమైన శ్రీశ్రీ ఉవాచగా మనం సరిపెట్టుకోవచ్చు. నిన్న రాష్ట్ర పతి ఎన్నికల నామినేషన్ల కథని తీసుకుందాం. తన 34వ ఏట పార్లమెంటులో ప్రవేశించింది లగాయతు దాదాపు 40 సంవత్సరాలపై చిలుకు రాజకీయ రంగంలో పండి ముదిరిన ఒకాయన పేరుని రాష్ట్ర పతి పదవికి ప్రతిపాదించారు. తూర్పు భారతానికి సంబంధించిన మరొకాయన గిరిజనాభివృద్ధికి కంకణం కట్టుకుని, పార్లమెంటు స్పీకర్ గా పనిచేసిన నాయకుని పేరుని మరికొందరు ప్రతిపాదించారు. ఎన్నికల ఫలితం మాట ఎలా ఉన్నా ఆ పదవికి రాణింపు తేగల అనుభవం, దక్షత ఉన్న పెద్దలు వీరు. ఎన్నికలో పోలికలెందుకు? కావలసింది మెజారిటీ కదా? – తేల్చుకోవలసింది బలబలాలు కదా?

ఈ రెండూ సరే. రాష్ట్రపతి పదవికి ఒక పాన్ షాప్ వాలా, ఒక టీకొట్టు వ్యాపారీ తమ పేర్లు ఇచ్చారు. అందరికీ అన్నీ అయే హక్కు ఈ దేశంలో ఉంది. అదే ప్రజాస్వామ్యం. ఇదిదేశపు మొట్టమొదటి పౌరుడి ఎన్నికకు జరిగిన తతంగం. ఇక రాష్ట్రశాసన సభలకూ, పార్లమెంటుకీ పోటీ చేసే రకరకాల అభ్యర్ధుల అద్భుతాలు, అనూహ్యాలు. హరికథలు చెప్పేవారూ, నాటకాలు వేసేవారూ, టీవీ సీరియల్స్ లో ప్రాచుర్యాన్ని సంపాదించి వాటిని వోట్లుగా తర్జుమా చేసుకునేవారూ, హత్యలు చేసేవారూ, దోపిడీలు చేసేవారూ, ఖూనీలు చేసినవారూ, డబ్బిచ్చి వోట్లను కొనుక్కునే స్థోమత గలవారూ – మీ ఇష్టం.

జైలుకెళ్ళడం ఈ పోటీకి ఆంక్ష అయితే జైళ్ళలోంచే పోటీ చేసేవారూ, జైళ్ళలోంచే తమ నీతిని చాటేవారూ మనకు దర్శనమిస్తారు.

అలనాడు అక్కరలేని చదువులు చదువుకున్న మోహందాస్ కరంచంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, చక్రవర్తి రాజగోపాలాచారి, ఎన్.జి.రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టేర్ అంబేద్కర్ – వీ రంతా లాయర్లు. కొందరు బారిష్టర్లు. ఈ దేశపు ఔన్నత్యానికి, దాస్య శృంఖలాల విముక్తికీ పాటుపడినవారు. న్యాయ పట్టాలతో వ్యాపారాన్ని పరాయి పాలకుల్తో పోరాటాన్ని సాగించడానికి వదులుకున్నవారు.

మొన్న సంవత్సరం పాటు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన ఏ.రాజాగారు జైలునుంచి వచ్చాక మొదటిసారి ఊటీకి వెళ్ళారు. వారికి అక్కడ ఒక దేశాన్ని జయించి వచ్చినంత వీరస్వాగతం లభించింది. ఆయన్ని ఎండీటీవి ప్రతినిధి శ్రీనివాసన్ జైన్ ఏదో అడగబోయారు. “నేను లాయర్ని. నువ్వేం అడుగుతున్నావో తెలుసు” అంటూ అతన్ని ఖండించి నిష్క్రమించారు రాజాగారు. ఈ మంత్రిగారు తమ లాయరు పట్టాని ఈ దేశాన్ని దోచుకోడానికి వినియోగించారు. పైన చెప్పిన లాయర్లు ఈ తాజా రాజా దగ్గర నేర్చుకోవలసింది చాలావుంది.

అవనీతి పనులు చేసి, కోర్టులు ఇంకా వారి నేరాల పట్ల తీర్పు ఇవ్వకముందే – చిరునవ్వులు చిందిస్తూ – కెమెరాలకీ, ప్రజలకీ నమస్కారాలు పెట్టే ధోరణిని “సోషలైజ్డ్ ఏంటీ సోషల్” ధోరణిగా మనస్తత్వ శాస్త్ర వేత్తలు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రి సైకియాట్రీ ప్రొఫెసరుగారు “పెద్ద నేరాలు చేసే ఈ ‘పెద్దరికం’ నేరస్థులు – ఈ రాజకీయ నాయకులు – ప్రజలలో తమ ఇమేజ్ ని కాపాడుకోవడం అవసరం. వాళ్ళు సాధారణంగా పశ్చాత్తాపం, గిల్ట్ మీద ‘ముందు జాగ్రత్తా అనే ముసుగు కప్పుతారు” అన్నారు. ఒక పక్క కోర్టుల సమక్షంలో వారి నేరాలు ఏకరువు అవుతున్నా – వీరు నవ్వుతూ తిరగడంలో అంతరార్ధం ఏమిటి? నిజంగా నేరాలు చెయ్యలేదా? చేస్తే అంత ధైర్యమూ, నిబ్బరమూ ఎలాగ సాధ్యం? అనే సందిగ్ధం ప్రజల మనస్సులో కలిగితే చాలు. ఆ మేరకు వారి నేర చరిత్ర పల్చబడుతుంది. చేశారా అన్న సందిగ్ధం – చేశారన్న తీర్పు (ఈ దేశంలో ఏ 18 సంవత్సరాల తర్వాతి మాట!) వాళ్ళకి కొంగు బంగారమౌతుంది. వీళ్ళకి భావవ్యక్తీకరణలో ఆరితేరిన ‘నిబ్బరం’ ఒక ఆటో పైలెట్ లాగ పనిచేస్తుంది – అన్నారు మరో క్లినికల్ సైకాలజిస్టు సీమా హింగోరనీ.

ఏమైనా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న విసులుబాటు. ఈ ప్రజాస్వామ్యం పేర – సామూహిక హత్యలు చేసిన ఫూలన్ దేవి- ఈ దేశపు అత్యున్నత సభలో సభ్యురాలు.
ఏతావాతా, ఈ దేశంలో అందరికీ అన్నీ అయే హక్కులున్నాయి – టీ కొట్టువాలాతో సహా. దానిపేరే ప్రజాస్వామ్యం. టీకొట్టు వ్యాపారి రాష్ట్రపతి కావడం – కాగలగడం – ఒక గొప్ప సదవకాశం. మహద్భాగ్యం. ఇది ఈ దేశ సామాజిక ప్రగతిలో సర్వులకూ వాటాని కల్పించాలన్న జిజ్నాసువుల ఉదాత్తమయిన కల. కానీ రాష్ట్రపతి భవనాన్ని టీ దుకాణం చేయగలవారు చాలామంది ప్రస్తుతం ఎన్నికవుతున్నారు.

అందుకేనేమో – ఆ పెద్దమనిషి ఎవరో “ప్రజాస్వామ్యం పెద్ద గాడిద” అని వాపోయాడు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.