Main Menu

Gollapudi columns ~ The Beautiful Game ( ది బ్యూటిఫుల్ గేమ్)

Topic: The Beautiful Game ( ది బ్యూటిఫుల్ గేమ్)

Language: Telugu (తెలుగు)

Published on: June 23, 2014

The Beautiful Game ( ది బ్యూటిఫుల్ గేమ్)     

ప్రపంచంలో మన ప్రాంతాలలో క్రికెట్ ఒక జీవన విధానం. అదిలేని జీవితాన్ని మనం ఈ రోజుల్లో ఊహించలేం. క్రికెట్ కి ప్రత్యేకమైన ఛానళ్లు, ప్రత్యేకమైన అభిమానులూ, దానికి మాత్రమే సంబంధించిన అవినీతులూ ఈ దేశంలో వెల్లివిరుస్తున్నాయి. కాని మన దేశానికి అంతగా అర్ధంకాని, ప్రపంచ దేశాలలో ఊహించలేని ప్రాముఖ్యం ఉన్న ఆట -బంతి ఆట. ఒకే ఉదాహరణ. ప్రపంచంలో 104 దేశాలలో క్రికెట్ ఆట మోజు ఉంది. మొన్న ముగిసిన ఐపిఎల్ 7 ని ప్రపంచంలో 225 మిలియన్ల ప్రేక్షకులు చూశారు. బంతి ఆట పిచ్చి 209 దేశాల సొంతం. ఒక్క ప్రపంచ కప్పునే ప్రపంచంలో దాదాపు 3.2 బిలియన్లు చూస్తున్నారు. ఇది ఒక చిన్ననమూనా. ఆయా దేశాలలో బంతి ఆట కేవలం ఆటకాదు. వారి జీవిత లక్ష్యం. జీవితం. చాలా సంవత్సరాల కిందట నేను నార్త్ లండన్ నుంచి పికడిల్లీకి మెట్రోపాలిటన్ రైలులో వస్తున్నాను. దారిలో వెంబ్లీ ఫుట్ బాల్ స్టేడియం స్టేషన్ దాటాలి. ఆ రోజు ప్రపంచ కప్పులో హాలెండు గెలిచింది. రైలంతా కాషాయరంగు వ్యాపించేసింది (అది హాలెండు యూనిఫారం). అక్కడి నుంచి పికడిల్లీకి సాధారణంగా 20 నిముషాలు ప్రయాణం. ఆ రోజు 3 గంటలు మాత్రమే సాగింది. నేనూ, మా ఆవిడా, మా అబ్బాయి ఇటలీ వెళ్లాం. నేపుల్స్ లో ఓ పెద్ద భవంతి ముందు మా డ్రైవరు కారాపేశాడు. “ఇదేమిటో తెలుసా ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు దిగో మారిడోనా ఇల్లు” అన్నాడు. మెడిటెరేనియన్ సముద్రానికి ఎదురుగా అందమైన భవనం. మా ఆవిడ అడిగింది: “నేపుల్స్ చూశాక ప్రాణం వదిలినా పరవాలేదు. (సీ నేపుల్స్ అండ్ డై) అని ఎందుకంటార”ని. డ్రైవరు తన గొంతుని మరింత ఊరించి -మరో రెండడుగులు పెరిగి చెప్పాడు: “ఇక్కడ మారిడోనా ఉంటున్నాడు కనుక!”

చాలా సంవత్సరాల కిందట -కలకత్తా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఓ చిత్రాన్ని ప్రదర్శించారు -ఎస్కేప్ టు విక్టరీ, రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల ఖైదీలను నాజీ ప్రభుత్వం జైలులో ఉంచింది. అందులో ప్రపంచంలో ఉన్న గొప్ప బంతి ఆటగాళ్లందరూ ఉన్నారు. జర్మన్ ఆఫీసరు ఒకరున్నారు. ఆయన బంతి ఆట అభిమాని. నాజీల తరపు ఆటగాళ్లకీ, మిత్రరాజ్యాల ఆటగాళ్లకీ ఒక బంతి ఆట పోటీ ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన వచ్చింది అతనికి. వెంటనే ఏర్పాట్లు చేశాడు. ఒక పక్క ఆట, మరొక పక్క జైలులోంచి తప్పించుకునే ప్రయత్నమూ కథ. మిత్రరాజ్యాలు ఆటలో గెలిచి -దొంగతనంగా కాక, ప్రేక్షకుల హాహాకారాల మధ్య సైనికుల కళ్లముందే స్వేచ్ఛని సంపాదించుకోవడం కథ. ప్రపంచంలో అప్పటి గొప్ప బంతి ఆటగాళ్లందరూ పీలే, బాబీ మూర్, దేనా, మైక్ సమ్మర్ బీ మొదలైనవారంతా ఉన్నారు. అదొక గొప్ప చిత్రం. ఆటనీ, సినీకళనీ మేళవించిన ప్రయోగం. పెద్ద హిట్. ఈనాటి నేపథ్యంలో రొమారియో, జిదానే, రొనాల్డో రొనాల్డినో, జొహాన్ క్రుఫ్, మెస్సీ, నేమర్ -ఇవన్నీ అభిమానుల్ని ఉర్రూతలూగించే పేర్లు. వీళ్ల సాధనలు, ఈ ఆట చరిత్ర రాయాలంటే ఈ ప్రపంచకప్పులో ఎన్ని ఆటలున్నాయో అన్ని వ్యాసాలు రాసినా చాలదు.

1958లో తన 17వ యేట స్వీడన్ ప్రపంచ కప్పు ఫైనల్ పోటీలలో పీలే చేసిన మొదటి గోల్ ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో గొప్పదిగా చెప్పుకుంటారు. అలాగే 1970 లో వార్తా ప్రసారాలు ప్రారంభమయాయి. ఆ సంవత్సరం పీలే చేసిన 100వ గోల్ ని ప్రపంచమంతా మొదటిసారి చూసి-గోల్ నీ, ప్రసారాన్నీ చిరస్థాయిగా మనస్సులలో నిలుపుకుంది. 1986లో మెరడోనా చేసిన గోల్ ఇప్పటికీ వివాదాస్పదంగా అభిమానులు చెప్పుకుంటారు. కాని ఆనాటికి అది చరిత్ర. “నిజానికి బంతికి నీ చెయ్యి తగిలిందాలేదా” అని పత్రికల వాళ్లు అడిగినప్పుడు, మారొడోనా నవ్వి “ఆ గోల్ లో దేవుడి చెయ్యి ఉంది” అన్నాడు! ధామస్ ముల్లర్ పోర్చుగల్ ని అతిక్రూరంగా ఈ ఆటలో హాట్ ట్రిక్ తో 4-0 స్కోరుతో ఓడించిన ఆట చిరస్మరణీయం. ఇంతవరకూ బంతి ఆటలో మరెవరూ హాట్ ట్రిక్ చెయ్యలేకపోయారు. 2006లో ఇంగ్లండు ఆటగాడు పీటర్ క్రోచ్ గోల్ చేశాక చేసిన డాన్స్ ఇంతవరకూ కనీవినీ ఎరగలేదెవరూ. ఇప్పటికీ దానిగురించి చెప్పుకుంటారు. అలాగే 1958లో స్వీడన్ లో ఫ్రాన్స్ ఆటగాడు ఫాంటేన్ చేసిన 13 గోల్స్ ఇప్పటికీ ప్రపంచ రికార్డు. పీలే గొప్ప ఆటగాడు. గొప్ప మాటగాడు కాదు. రొమారియో అనే గొప్ప ఆటగాడు పీలే గురించి ఓ మాట అన్నాడు. పీలే నోరిప్పక పోతే గొప్ప కవి-అని. నిజానికి తమ ఆటతో తమ తమ క్రీడలలో కవిత్వాన్ని తలపించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. టెన్నిస్ లో రోజర్ ఫెడరర్. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ బీ పీలే, మారడోనా బంతి ఆటలో. ఇంకో విషాద సంఘటన కూడా మరిచిపోలేనిది. కొలంబియా ఆటగాడు ఆండ్రీ ఎస్కోబార్ పొరపాటున తన టీంకే గోలుని చేసేశాడు. ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఇది ఆటలో అనుకోని సంఘటన. ఆ కారణానికి ఒక అభిమాని ఆయన్ని పిస్తోలుతో కాల్చి చంపాడు. ఆనాడు ఆటలో జరిగిన విడ్డూరానికి యూరోపులో ఎందరో జూదగాళ్ల ముఠాలు కొన్ని కోట్లు నష్టపోయారట. ఆ కోపానికి వారే ఆ హత్య చేయించారని చెప్పుకున్నారు.

ఇండియాకు సంబంధించిన ఓ వీర అభిమానుల కథ. ఆయన పేరు -పన్నాలాల్ ఛటర్జీ. వయస్సు 81. ఆయన భార్య చైతాలీ. వయస్సు 72. వీరి వ్యాపారం చీరెలు అమ్మడం. వీరిద్దరి నెలసరి ఆదాయం 7500 రూపాయలు. గత 36 సంవత్సరాలుగా ప్రపంచ కప్పు ఏ దేశంలో జరిగినా వీరు విధిగా వెళ్లిచూస్తారు. ఈ సంవత్సరం 9వ సారి బ్రెజిల్ లో ఉన్నారు. నాలుగేళ్ల పాటు ఈ ప్రయాణానికి డబ్బు కూడదీసుకుంటారు. ఆదా చేస్తారు. ఎప్పుడైనా అనారోగ్యం, అనుకోని పండగలు, పెళ్లిళ్లూ వస్తే-ఖర్చయిన డబ్బుని భర్తీ చేయడానికి ఓ నెల చేప తినడం మానుకుంటారు. వీరు 1986 లో దేవుడు చెయ్యికలిపిన మారడోనా గోల్ చూశారు. పీలేని కలిశారు.

బ్రెజిల్ బంతి ఆటకి ప్రాణం. ఈ దేశం నుంచే పీలే, రోనాల్డో, రోనాల్డిన్హో, కాకా, జికో వంటి గొప్ప ఆటగాళ్లు వచ్చారు. ఆటకి ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చారు. బ్రెజిల్ భాషలో బంతి ఆటని “ది బ్యూటిపుల్ గేమ్” అని పిలుస్తారు. 13 జూన్ నుంచి నెలరోజులపాటు బ్రెజిల్ లో జరిగే ఈ ప్రపంచ కప్పు పోటీలు -భారతీయులకు ఆనందాన్ని ఇవ్వడం మాట ఎలావున్నా నిద్రలేకుండా చేస్తాయి. ఆట తెల్లవారుఝామున ఒకటిన్నరకు ప్రారంభమయి తెల్లవార్లూ జరుగుతుంది. ఉదయాన్నే కళ్లు ఎర్రగా వాచినట్టున్న వారిని ఈ రోజుల్లో చూస్తే వారిని బంతి ఆట అభిమానులుగా మనం గుర్తుపట్టవచ్చు.

మొన్న టీవీలో ఇంగ్లండు ఆటగాడు రాబీ ఫొలర్ ఏదో టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. వెంటనే తెరమీద ఒక అభిమాని ట్వీట్ పంపాడు. “ఇండియాలో గాడ్ ని తెరమీద చూస్తానని నేనూహించలేదు” అని. ఈ 33 రోజుల్లో ఎంతమంది దేవుళ్లు రూపుదిద్దుకుంటారో, మరెంత మంది పతనమవుతారో తెలీదు.

ఏమైనా ఇండియాకూ ఈ ఆటలో వాటా దక్కింది. మన ప్రధాని నరేంద్రమోడీని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోసెఫ్ ఆట ఫైనల్స్ కి ఆహ్వానించారు. బంతి ఆట పిచ్చి కలకాలం వర్థిల్లుగాక!

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.